పోలియో రహిత దేశంగా భారత్ | Current Affairs for Competitive Guidance | Sakshi
Sakshi News home page

పోలియో రహిత దేశంగా భారత్

Published Thu, Jan 23 2014 4:17 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Current Affairs for Competitive Guidance

 ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు

 


 జాతీయం
 అగ్ని-4 విజయవంతం
 అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న ఒడిశా వీలర్ ఐలాండ్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఈ క్షిపణి ప్రయోగించిన 20 నిమిషాల్లోనే విజయవంతంగా ఛేదించింది. దీంతో సైన్యానికి అప్పగించేందుకు వీలుగా క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైందని డీఆర్‌డీఓ ప్రకటించింది. ఈ క్షిపణి 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే 850 కిలోమీటర్లు పైకి వెళ్లి తిరిగి వాతావర ణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది.


 
 ఐక్యరాజ్య సమితి ప్రాజెక్టుగా చిలక సరస్సు
 ఒడిశాలోని చిలక సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, పక్షుల వలస కొనసాగింపునకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యునెటైడ్ నేషన్స్ ఆఫ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపిక చేసింది. చిలక సరస్సుతో కలిపి ఎనిమిది ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో చిలక ప్రాంతం ఒక్కటే యూఎన్ ప్రాజెక్టుకు ఎంపికవడం విశేషం. ఈ ప్రాజెక్టు కింద చిలక అభివృద్ధి ప్రాజెక్టుకు సహాయం చేస్తారు. సరికొత్త పర్యాటక కార్యక్రమాలు, జీవనోపాధి చర్యలు చేపట్టడం ద్వారా వలస పక్షుల పరిరక్షణకు అభివృద్ధి వ్యూహాలు చేపడతారు.


 
 జైనులకు మైనారిటీ హోదా
 జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ 2014 జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దేశంలో వీరి జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. వీరిలో అత్యధికంగా 10 శాతం మంది ముంబైలోనే ఉన్నారు. ఇప్పటివరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు.


 
 బెంగళూరులో ద్విచక్ర అంబులెన్సు సేవలు
 క్షతగాత్రులు, అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించాల్సిన రోగుల కోసం బెంగళూరులో సరికొత్త అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో ఆసుపత్రులకు చేరేలా కర్ణాటక ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బెంగళూరులో ఓ వైద్యుడు తన ద్విచక్ర వాహనానికి ప్రాథమిక చికిత్స సామాగ్రి పెట్టెతో ప్రమాదాలు జరిగిన చోటుకే వెళ్లి వైద్యం చేసేవారు. ఆ వైద్యుని స్ఫూర్తితోనే ద్విచక్ర అంబులెన్సులు ప్రవేశపెట్టడానికి నిర్ణయించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు.
 
 
 అంతర్జాతీయం
 దక్షిణకొరియా అధ్యక్షురాలు భారత పర్యటన
 దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గున్ హే భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా 2014, జనవరి 16న ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణరంగం వంటి అంశాలపై ఆమె చర్చలు జరిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లతో గున్ హే సమావేశ మయ్యారు. రాజస్థాన్‌లో కొరియా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అవకాశాలను ఆమె స్వాగతించారు. కొరియన్ జాతీయులకు టూరిస్ట్ వీసా జారీచేసే భారత నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. ఒడిశాలో రూ.52,000 కోట్లతో దక్షిణ కొరియా నిర్మించే పోస్కో ఉక్కుకర్మాగారానికి పర్యావరణ అనుమతి లభించడం పట్ల గున్ హే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో వర్గీకృత సైనిక సమాచార రక్షణ, సైబర్‌స్పేస్ అంశాలున్నాయి.
 


మడగాస్కర్ అధ్యక్షుడిగా హెరీ రాజోనారి మాంపియానినా
 మడగాస్కర్ దేశ అధ్యక్షునిగా ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి హెరీ రాజోనారి మాంపియానినా ఎన్నికయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే క్రమంలో జరిగిన ఎన్నికల అనంతరం హెరీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. 2009లో రాజోయిలీనా అధికారం చేజిక్కించుకున్నాక నాలుగేళ్లకు గత డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. నాటి అధికార మార్పిడిలో రాజోయిలీనా ప్రత్యర్థి మార్క్ రాలో మనన దేశం విడిచి పారి పోయి దక్షిణాఫ్రికాలో ఆశ్రయం పొందారు.


 
పోలియో రహిత దేశంగా భారత్
 భారత్‌ను పోలియో రహిత దేశంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ 2014, జనవరి 13న ప్రకటించారు. దేశంలో గత మూడేళ్లలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. చివరిగా 2011, జనవరి 13న పశ్చిమబెంగాల్‌లో ఓ కేసు నమోదైంది. 2009లో 741గా ఉన్న కేసుల సంఖ్య 210 నాటికి 42కు, 2011లో ఒక్క కేసుకి తగ్గాయి.


 
 తులసిలో జన్యుమార్పిడి
 తులసిలో ఔషధ గుణాలను మరింతగా పెంచేందుకు అమెరికా పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆ మొక్కలో జన్యుమార్పిడికి శ్రీకారం చుట్టారు. ఈ బృందానికి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త మన తెలుగు వాడైన చంద్రకాంత్ ఈమని నేతృత్వం వహిస్తున్నారు. ఈయన తన విద్యార్థులతో కలిసి తులసిలో యూజెనాల్ అనే పదార్థం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను నియంత్రించడంలో యూజెనాల్ పాత్ర ఎంతో కీలకం.


 
 దాతల సదస్సులో సిరియాకు 2.4 బిలియన్ డాలర్ల సాయం
 అంతర్యుద్ధంతో నలిగిపోతున్న సిరియాకు కువైట్‌లో 2014, జనవరి 17న జరిగిన దాతల సదస్సులో వివిధ దేశాలు 2.4 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించాయి. మానవతా దృక్పథంతో 6.5 బిలియన్ డాలర్లు సమకూర్చాలని ఐక్యరాజ్యసమితి ఈ సదస్సు నిర్వహించింది. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో 70 దేశాలు, 24 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన కువైట్ అత్యధికం గా 5 వందల మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది.


 
 ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్-పాక్ అంగీకారం
 ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకువచ్చి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారత్,పాకిస్థాన్‌ల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది.
 
 
 
 న్యూస్‌మేకర్స్
 నటి సుచిత్రా సేన్ మృతి
 అలనాటి అందాల నటి సుచిత్రా సేన్ (82) కోల్‌కతాలో 2014, జనవరి 17న మరణించారు. ఆమె బెంగాలీ, హిందీ భాషల్లో 60 సినిమాల్లో నటించారు. అగ్ని పరీక్ష, ఆంధీ, సాత్‌పాకే బంధా, మసాఫిర్, బొంబాయ్ కాబబా, దేవదాస్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దేవదాస్‌లో నటనకు ఉత్తమ జాతీయ నటి అవార్డు ఆమెకు లభించింది. 1963లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 1972లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం, 2005లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సుచిత్రాసేన్ అందుకున్నారు.


 
 కేంద్రమంత్రి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి
 కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) న్యూఢిల్లీలో 2014 జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సునంద పుష్కర్‌ను థరూర్ 2010 ఆగస్టులో వివాహమాడారు.


 
 ఆధ్యాత్మిక గురువు బుర్హానుద్దీన్ మృతి
 దావూద్ బోహ్రా ముస్లిమ్‌మతపెద్ద సేడ్నా బుర్హానుద్దీన్ (99) ముంబాయిలో 2014 జనవరి 17న మరణించారు. ఈయన ప్రపంచ వ్యాప్త దావూదీ బోహ్రా మతానికి 52వ దాయ్ అల్-మల్తక్. జోర్డాన్ ప్రభుత్వం స్టార్ ఆఫ్ జోర్డాన్, ఈజిప్ట్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది నైలీ వంటి అత్యున్నత పౌరపురస్కారాలతో ఆయనను సత్కరించాయి.   అనేక సంస్థలు డాక్టరేట్ బహుకరించాయి. ఇదిలా ఉండగా ఇయన అంత్యక్రియల సందర్భంగా జనవరి 18న ముంబైలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృత్యు వాతపడ్డారు.


 
 కవి నామ్‌దేవ్ ఢసాల్ మృతి
 ప్రముఖ మరాఠి కవి, దళిత ఉద్యమనేత పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్ (64) ముంబయిలో 2014, జనవరి 16న కన్నుమూశారు. నామ్‌దేవ్ తొలి కవితా సంకలనం గోల్‌పెథా 1973లో ప్రచురితమయింది. ఆయన 1972లో దళిత్ పాంథర్స్‌అనే ర్యాడికల్ సంస్థను స్థాపించారు. దళిత్ పాంథర్స్ ముంబయిలో శివసేనను సిద్ధాంత పరంగాను, బహిరంగం గాను విభేదించింది. మహిళలతో పాటు కులాలకు అతీతంగా దోపిడికి గురైన వారందరూ దళితులేనంటూ దళిత్ పాంథర్స్ నిర్వచించింది.


 
 
 రాష్ట్రీయం
 అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో భవనానికి ఎదురుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జనవరి 20న ఆవిష్కరించారు.


 
 ఎన్‌పీఏ తొలి మహిళా డెరైక్టర్‌గా అరుణా బహుగుణ
 సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ) 28వ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణా బహుగుణ (56)ను కేంద్ర ప్రభుత్వం 2014, జనవరి 20న నియమించింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్‌ిపీఏలో ఐపీఎస్‌కు ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు. 68 ఏళ్ల చరిత్ర గల ఎన్‌పీఏకి తొలి మహిళా డెరైక్టర్ బహుగుణ కావడం విశేషం. ఈమె 1979 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి.


 
 అవార్డులు
 ఓల్గాకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం
 ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పోపూరి. లలిత కుమారి (ఓల్గా) లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీరామారావు, హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి రోజున తెలుగు సాహిత్య రంగంలో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు.


 
 రాష్ట్ర వ్యవసాయశాఖకు కృషికర్మాన్ అవార్డు
 కేంద్ర వ్యవసాయశాఖ అందించే కృషికర్మాన్ అవార్డు 2012-2013 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు లభించింది. చిరు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించినందుకు ఈ అవార్డు రాష్ట్ర వ్యవసాయశాఖకు దక్కింది. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
 రాష్ట్రంలో రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్క జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల పంటల సాగు, దిగుబడి పెంచి నందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ అవార్డుకు ఎంపికైంది. గత ఏడాది రాష్ట్రంలో చిరుధాన్యాల పంటలు 13.39 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. 53.69 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.


 
 71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
 71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను లాస్ ఏంజిలిస్‌లో 2014 జనవరి 12న ప్రదానం చేశారు.
 ఉత్తమ చిత్రం (డ్రామా):
 12 ఇయర్స్ ఆఫ్ స్లేవ్
 ఉత్తమ చిత్రం(మ్యూజికల్ కామెడీ): అమెరికన్ హజిల్
 ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్సో క్యూరోన్ (చిత్రం-గ్రావిటీ)
 ఉత్తమ నటుడు (డ్రామా):
 మ్యూథ్యూస్ మ్యాక్ కొనాగే (చిత్రం-డల్లాస్ బయ్యర్స్ క్లబ్
 ఉత్తమ నటి (డ్రామా):
 కేట్ బ్లాంచెట్ (చిత్రం: బ్లూ జాన్)
 ఉత్తమ నటుడు (మ్యూజికల్ కామెడీ): లియోనార్డో డి క్యాప్రియో (చిత్రం-డి వోల్పో ఆఫ్ వాల్‌స్ట్రీట్)
 ఉత్తమ నటి (మ్యూజికల్ కామెడీ):
 అమీ ఆడమ్స్ (చిత్రం-అమెరికన్ హజిల్)
 ఉత్తమ విదేశీ భాషాచిత్రం: దిగ్రేట్ బ్యూటీ (ఇటలీ )
 
 జైపూర్ సాహిత్య ఉత్సవాలు
 ఏడో జైపూర్ సాహిత్య ఉత్సవాలు జైపూర్‌లో 2014 జనవరి 17నుంచి 21 వరకు జరిగాయి. ఇది ఆసియాలో కెల్లా అతిపెద్ద వార్షిక సాహితీ ఉత్సవం.
 ఈ ఉత్సవాల్లో 14 భాషలకు చెందిన రెండు లక్షల మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలు అమర్త్యసేన్, హారోల్డ్ వార్ముస్‌తో పాటు 240 మంది ప్రసంగించారు.


 
 క్రీడలు
 అంజూజార్జికి  ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం
 2005 మొనాకో ప్రపంచ అథ్లెటిక్స్ పైనల్లో లాంగ్ జంపర్ అంజూబాబి జార్జికి ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం దక్కింది. అప్పట్లో తొలి స్థానంలో నిలిచిన రష్యాకు చెందిన అథ్లెట్ తత్యానా కొటోవా డోపింగ్ పరీక్షలో పట్టుబడటంతో రెండో స్థానంలో నిలిచిన అంజూబాబి జార్జికి అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య స్వర్ణం ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా అంజూ ఘనత సాధించింది.
 


 అభిజిత్‌కు గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్
 పార్శ్వనాథ్ గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెం ట్ టైటిల్‌ను అభిజిత్‌గుప్తా గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో 2014 జనవరి16న ముగిసిన పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన ఎల్డర్ గాసనోవ్‌ను ఓడించి అభిజిత్ విజేతగా నిలిచాడు.


 
 హాకీ వరల్డ్ లీగ్ విజేత నెదర్లాండ్
 న్యూఢిల్లీ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్ పోటీల్లో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 18న ఏకపక్షంగా సాగిన అంతిమపోరులో ఈ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో భారత్ ఆరో స్థాన ంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement