పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం | Current Affairs for Competitive Guidance | Sakshi
Sakshi News home page

పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం

Published Thu, Jan 16 2014 2:44 PM | Last Updated on Mon, Aug 20 2018 8:31 PM

Current Affairs for Competitive Guidance

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు

 
 జాతీయం
 
 పన్నెండో ప్రవాసీ భారతీయ దివస్
 12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7నుంచి 9 వరకు జరిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధ రంగాల్లో సేవలందించిన 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులందుకున్న వారిలో మహాత్మా గాంధీ మనుమరాలు, దక్షిణాఫ్రికా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఇలాగాంధీ, భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్ లీసా మారియా సింగ్, ఫిజిలోని రామకృష్ణ మిషన్, వర్గీస్, వాసుదేవన్‌చంచ్లానీ, వికాస్ చంద్ర, సన్యాల్ తదితరులున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మలేసియా సహజవనరులు, పర్యావరణ మంత్రి దాతు సెరి జి. పళనివేల్ హాజరయ్యారు.
 
 పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
 అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వి -2 క్షిపణిని భారత్ జనవరి 7న ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. 2003లో పృథ్విని సైన్యంలో ప్రవేశపెట్టారు.
 
 అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్
 ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన ప్లాట్‌ఫామ్ నెంబర్-1 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీని పొడవు 1,355.40 మీటర్లు. ఈ విషయూన్ని నార్త్ ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ఏకే ఆటల్ జనవరి 9న వెల్లడించారు.
 
 జాతీయ యువ విధానానికి కేంద్రం ఆమోదం
 జాతీయ యువజన విధానాన్ని (నేషనల్ యూత్ పాలసీ-ఎన్‌వైపీ) జనవరి 9న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్‌వైపీ-2003 స్థానంలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్య, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమ స్థాపన, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రీడలు, సామాజిక విలువలను పెంపొందించడం, సామాజిక భాగస్వామ్యం, రాజకీయాలు, ప్రభుత్వాల్లో పాలుపంచుకోవడం, సమ్మిళత సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ విధానం దృష్టి సారిస్తుంది. దేశంలోని 15-29 ఏళ్ల యువతకు ఈ విధానం వర్తిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరు దేశ జనాభాలో 27.5 శాతం ఉన్నారు.
 
 మహిళా ఉద్యోగినులకు ఎస్‌బీఐ కానుక
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మహిళా ఉద్యోగులకు రెండేళ్ల సెలవును తీసుకోవడానికి అవకాశం కల్పించింది. భార్యలేని లేదా విడాకులు తీసుకున్న పురుషులకూ ఈ వెసులుబాటు కల్పించింది. పిల్లల చదువు, తల్లిదండ్రులు, అత్తమామల ఆరోగ్యసంరక్షణ వంటి ఎలాంటి అవసరాలకైనా రెండేళ్లపాటు సెలవులు తీసుకోవచ్చని ఎస్‌బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు.
 
 కౌమార ఆరోగ్యం కోసం కేంద్రం కొత్త పథకం
 కౌమారదశలో ఆరోగ్య, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10-19 ఏళ్ల లోపు వారికోసం కేంద్రం కొత్తపథకాన్ని ఆరంభించింది. దీనికి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే) అని నామకరణం చేసింది. పథకం కింద దేశంలోని 34.3 కోట్ల మంది కౌమార బాలబాలికలకు పోషకాహారం, ప్రత్యుత్పత్తి అవ గాహన, శారీరక, మానసిక ఆరోగ్యం, లైంగిక వేధింపులు, అసాంక్రమిక వ్యాధులతోపాటు జీవనశైలిసమస్య లాంటి పలు అంశాల్లో సాయపడుతుంది.
 
 విదేశీ మదుపుదారులకు వెసులుబాటు
 విదేశీ మదుపుదారులు భారత్‌లో షేర్లు లేదా రుణ పథకాలలో తాము పెట్టిన పెట్టుబడులను విక్రయించి నిష్ర్కమించే అవకాశం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ విదేశీప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయంతో దేశంలోకి మరింత ఎక్కువగా ఎఫ్‌డీఐ నిధులు రావడానికి తోడ్పడుతుందని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఎఫ్‌డీఐ ఒప్పందాలలో ఇక మీదట ఐచ్ఛికంతో కూడిన షరతులు ఉంటాయి. ఇందులో కనీస లాకిన్ కాలంతోపాటు ప్రతిఫలాలపై ఎటువంటి హామీ లేకపోవడం వంటివాటికి చోటు కల్పించారు.
 
 పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు : సుప్రీం
 పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతి పొందడానికి ఆ ఉద్యోగికి తగిన అర్హతలున్నాయని నిర్ధారించినపుడు తప్పనిసరిగా కల్పించాలని జస్టిస్ ఎ.కె. పట్నాయక్, జస్టిస్ జె.ఎస్. ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మేజర్ జనరల్ హెచ్ ఎం సింగ్‌కు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి పదోన్నతినివ్వాలంటూ సదరు ఎంపిక బోర్డు చేసిన సిఫారసును మంత్రివర్గం నియమించిన కమిటీ తోసిపుచ్చడంపై ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
 
 దేవయాని బహిష్కరణ
 అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయానిని జనవరి 10న బహిష్కరించింది. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిందిగా దేవయాని చేసిన విజ్ఞప్తిని అమెరికా కోర్టు తోసిపుచ్చుతూ నేరాభియోగం మోపింది. అయితే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయాల్సిందిగా అమెరికా కోరడం... అందుకు భారత్ నిరాకరించడంతో ఆమెను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయాని న్యూయార్క్ నుంచి భారత్‌కు వచ్చేశారు. ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ అమెరికా దౌత్యవేత్త ఒకర్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
 
 జాన్ ఐపేకు భారత్‌గౌరవ్ పురస్కారం
 బహ్రెయిన్‌లో ఉన్న ప్రవాస భారతీయుడు జాన్‌ఐపే (63) ప్రతిష్ఠాత్మక భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ ప్రకటించింది. నాలుగుదశాబ్దాల పాటు బహ్రెయిన్‌లో నివశిస్తున్న ఐపే...14 ఏళ్లుగా ప్రవాస భారతీయుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తీరుకు ఈ అవార్డు వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును మదర్‌థెరిసా, క్రికెటర్ గవాస్కర్, నటులు షమ్మీకపూర్, రాజేశ్‌ఖన్నా, దేవానంద్ అందుకున్నారు.


 
 అంతర్జాతీయం
 
 ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్‌గా యెలెన్
 అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్ గా జానెట్ యెలెన్ (67) నియామకానికి సెనెట్ జనవరి 7న ఆమోదం తెలిపింది. వందేళ్ల చరిత్ర కలిగి ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సెంట్రల్ బ్యాంక్‌కు అధిపతిగా నియమితులైన తొలి మహిళ యెలెన్. ఈమె ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్‌ై ఛెర్మన్‌గా ఉన్న బెన్‌బెర్నాంకీ జనవరి 31న పదవీ విరమణ అనంతరం యెలెన్ ఆస్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
 
 పాక్ బాలుడికి అంతర్జాతీయ సాహస అవార్డు
 తన ప్రాణాలొడ్డి పాఠశాలలోని వేల మంది విద్యార్థులను కాపాడిన 14 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఐత్‌జాజ్ హసన్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అంతర్జాతీయ సాహస అవార్డును ప్రకటించింది. అలాగే పాక్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత సాహస అవార్డుల్లో ఒకటైన సితారా ఎ సుజాత్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.జనవరి 6న పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్యా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో మానవబాంబుతో ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని హసన్ అడ్డుకున్నాడు. ఆ పేలుడులో ఇద్దరూ చనిపోయారు.
 
 భారతీయ శాస్త్రవేత్తకు అధ్యయన నిధి
 అమెరికాలోని భారత సంతతి నాడీశాస్త్రవేత్త ఖలీల్జ్రాక్‌కు అక్కడి జాతీయ ఫౌండేషన్ సుమారు రూ. 5.21కోట్లు (866.90 డాలర్లు) మంజూరు చేసింది. వయసుతోపాటు వచ్చే వినికిడి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగ పడేలా మెదడు చర్యా విధానంపై రజాక్ కొద్దికాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వీటిని కొనసాగించేందుకు ఐదేళ్లకుగాను ఈ మొత్తం నిధిని రజాక్‌కు బహుకరించారు.
 
 ప్రపంచ ప్రశంసనీయుడు బిల్‌గేట్స్
 మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయ వ్యక్తిగా నిలిచారు. భారత్ సహా 13 దేశాల్లో సర్వే జరిపి 30 మందితో రూపొందించిన ఈ జాబితాలో బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోస్థానం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐదోస్థానం, నరేంద్రమోడీ ఏడో స్థానం, అమితాబ్‌బచ్చన్ తొమ్మిది, అబ్దుల్‌కలామ్ పది, అన్నాహజారే 14వ, కేజ్రీవాల్ 18వ, రతన్‌టాటా 30వ స్థానం పొందారు. ఈ మేరకు ద టైమ్స్ కోసం ‘యుగోవ్’ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఆరాధనీయ వ్యక్తుల జాబితా రూపొందించింది.
 
 బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా ప్రవూణం
 బంగ్లాదేశ్ ప్రధానవుంత్రిగా షేక్ హసీనా (అవామీలీగ్ పార్టీ) జనవరి 12న ప్రవూణ స్వీకారం చేశారు. హసీనా ప్రధాని పదవిని చేపట్టడం ఇది వరుసగా రెండోసారి, మొత్తం మీద వుూడోసారి. గత వారం పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్ 232 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అవామీలీగ్ మిత్ర పక్షమైన జతియా పార్టీ 33 స్థానాలను కైవసం చేసుకుంది.
 
 షెరాన్ కన్నుమూత
 ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎరియల్ షెరాన్ (85) జనవరి 11న మరణించారు. ఈయన 2001లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైయ్యారు. వివాదాస్పద విధానాలతో ‘ది బుల్డోజర్’గా చరిత్రకెక్కాడు. ఇజ్రాయిలీలు ఈయన్ను ‘మిస్టర్ సెక్యూరిటీ’గా పిలుస్తారు. భారత్‌ను సందర్శించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని షెరాన్. ఈయన 2003 లో భారత పర్యటనకు వచ్చారు.
 
 భూమిలాంటి గ్రహం
 భూమికి 200 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహాన్ని గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. కెప్లర్ వ్యోమనౌక ద్వారా కనుగొన్న ఈ గ్రహానికి కెఓఐ-314గా పేరు పెట్టారు. హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడిన ఈ గ్రహం భూమికి సమానమైన ద్రవ్యరాశితోనూ, భూమి కన్నా 60 శాగతం అధిక వ్యాసంతోనూ ఉంది. 104 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఈ గ్రహంలో జీవం ఉనికి ఉండటానికి అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
 
 
  రాష్ట్రీయం
 
 విశాఖ ఉక్కుకు మరో కీర్తి
 నవరత్న హోదాగల విశాఖఉక్కు (రాష్ట్రీయఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ -ఆర్‌ఐఎన్‌ఎల్) సిగలో మరో కలికితురాయి వచ్చిచేరింది. వర్క్ ప్లేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచి 5ఎస్ ధ్రువీకరణపత్రం సాధించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ రంగంలో ఈ ధ్రువీకరణ పొం దిన తొలి పరిశ్రమగా విశాఖ ఉక్కు ఘనత దక్కించుకుంది.
 
 ఆర్టీసీకి మూడు జాతీయ పురస్కారాలు
 ఏపీఎస్‌ఆర్టీసీకి మూడు పురస్కారాలు లభించాయి. అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్),అర్బన్ సర్వీసుల్లో అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్), భద్రత అంశాల్లో అతి తక్కువ ప్రమాదాలు కలిగి ఉండటంతో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) న్యూఢిల్లీ నుంచి పురస్కారాలు దక్కించుకుంది. ఇంధన పొదుపులో ఇప్పటికి 39వసారి ఆర్టీసీ అవార్డును గెలుచుకుంది.
 
 రాష్ట్రంలో గేమ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన
 గేమింగ్ యానిమేషన్ మీడియాఎంటర్‌టైన్‌మెంట్ (గేమ్) ప్రాజెక్టుకు హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గ్‌లో జనవరి 8న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో గేమింగ్, యానిమేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, యానిమేషన్ వెబ్ డిజైనింగ్, ఇ- ఎడ్యుకేషన్,ఇ-లెర్నింగ్, పీసీ, మొబైల్ గేమింగ్, కాన్సోల్ గేమింగ్,ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమింగ్‌లకు సదుపాయాలు కల్పిస్తారు. 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 350 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇటువంటి పార్క్‌ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి.
 
 అంజలీదేవి మృతి
 అలనాటి సినీనటి అంజలీదేవి (86) జనవరి 13న చెన్నైలో కన్ను ముశారు. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. తెలుగులో 350కి పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ, అనార్కలి, సువర్ణసుందరి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.
 
 
 క్రీడలు
 నేషన్ కప్ బాక్సింగ్‌లో నిఖత్‌కు స్వర్ణం
 ఆంధ్రప్రదేశ్ యువబాక్సింగ్ కెరటం నిఖత్ జరీన్ నేషన్స్ కప్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచింది. 51 కిలోల విభాగం ఫైనల్లో పాల్టో సెవా ఎక్తరీనా (రష్యా)ను ఓడించింది. నిఖిత్ కెరీర్‌లో ఇది నాలుగో అంతర్జాతీయ పతకం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ ప్రస్తుతం ప్లస్ టూ చదువుతోంది.
 
 నేషనల్ టేబుల్‌టెన్నిస్ టోర్నీ
 జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టైటిళ్లను పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కి చెందిన పురుషుల, మహిళ జట్లు గెలుచుకున్నాయి. పాట్నాలో జనవరి 9న ముగిసినపోటీల్లో పురుషుల టీమ్ ఫైనల్లో పశ్చిమబెంగాల్‌ను, మహిళల జట్టు ఉత్తర బెంగాల్‌ను ఓడించాయి.
 
 ఫెడరేషన్ కప్ బాస్కెట్ బాల్
 28వ ఫెడరేషన్ కప్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌నుఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, మహిళల టైటిల్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకున్నాయి. అహ్మదాబాద్‌లో జనవరి 9న ముగిసిన పోటీల్లో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకును ఓడించి ఓఎన్‌జీసీ పురుషుల టైటిల్ కైవసం చేసుకోగా-మహారాష్ట్రను ఓడించి ఛత్తీస్‌గఢ్ మహిళల టైటిల్‌ను గెలుచుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement