నచ్చిన కోర్సులో ప్రవేశానికైనా, మెచ్చిన కొలువును అందుకోవడానికైనా పోటీ పరీక్షతో సమరానికి సిద్ధపడాల్సిందే! సరైన సన్నద్ధతనే అస్త్రంగా చేసుకొని, మెరుగైన ‘స్కోర్’ను గురిచూసి కొట్టినప్పుడే విజయం సొంతమవుతుంది. ప్రస్తుత పోటీ పరీక్షల్లోని ప్రశ్నలు చాలా వరకు సమకాలీన అంశాల ఆధారంగానే ఇస్తున్నందున కరెంట్ అఫైర్స్ విభాగానికి ప్రాధాన్యం పెరిగిన తరుణంలో దీనిపై స్పెషల్ ఫోకస్..
దేశంలో నిర్వహించే దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలకు (కరెంట్ అఫైర్స్) ప్రాధాన్యం ఉంటోంది. జనరల్ స్టడీస్ లేదా జనరల్ అవేర్‌నెస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ కీలకమైన విభాగం. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఈ విభాగంపై పట్టు సాధించాల్సిందే! సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షలు; గ్రూప్-1, గ్రూప్-2, ఇతర ఏపీపీఎస్సీ పరీక్షలు; డీఎస్సీ; ఎసై్స; కానిస్టేబుల్; ఐబీపీఎస్; వీఆర్‌వో- వీఆర్‌ఏ; సా్‌టఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పరీక్షల్లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. కేవలం ఉద్యోగ నియామకాల పరీక్షల్లోనే కాకుండా.. క్లాట్, మ్యాట్, సీమ్యాట్ వంటి కోర్సుల ప్రవేశ పరీక్షల్లోనూ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి.
నిత్య నూతనంగా
మన చుట్టూ నిత్యం జరిగే విషయాలే కరెంట్ అఫైర్స్. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ఏ మూల ఏ సంఘటన జరిగినా అది ప్రపంచం మొత్తంమీద ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతుంది. జాతి వివక్షపై పోరాటం చేసి, నల్లజాతి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన నెల్సన్ మండేలా 2013, డిసెంబర్ 5న మరణించారు. ఆయన దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, అన్ని దేశాల ప్రజలను ప్రభావితం చేసిన మహా మనిషి. ఇలాంటి వర్తమాన వ్యవహారాల ఆధారంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఏదైనా ఒక ముఖ్య సంఘటన చోటుచేసుకున్నప్పుడు దాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కచ్చితమైన సమాధానం రాసేందుకు వీలవుతుంది.
ఉదాహరణకు మండేలా గురించి చదివేటప్పుడు ఈ కింది అంశాలను తప్పకుండా గుర్తించాలి.
మండేలా దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు. జాతి వివక్షపై అలుపెరుగని పోరాటం చేసినందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండేలాను జైలుకు పంపింది. ఆయన రాబెన్ దీవి జైల్లో 27 ఏళ్లు గడిపారు.
శ్వేతజాతి ప్రభుత్వంపై అంతర్జాతీయ ఆంక్షల ఫలితంగా 1990, ఫిబ్రవరి 11న మండేలాను జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎఫ్.డబ్ల్యూ.డి. క్లార్క్.. మండేలా పార్టీ ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’పై నిషేధాన్ని ఎత్తివేశారు. 1990లో భారత్.. మండేలాకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.
1993లో మండేలా, ఎఫ్.డబ్ల్యూ.డి.క్లార్క్‌కు సంయుక్తం గా నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడయ్యారు. దేశాన్ని 1999 వరకు పరిపాలించారు.
మండేలా ఆత్మకథ.. ‘లాంగ్ వాక్ టు ఫ్రీడం’. ఐక్యరాజ్య సమితి మండేలా జన్మదినమైన జూలై 18ని నెల్సన్ మండేలా దినోత్సవంగా ప్రకటించింది.
ఆకాశమే హద్దు
కరెంట్ అఫైర్స్‌కు నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా, దాన్నుంచి ప్రశ్న రావొచ్చు. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే రోజూ వార్తా పత్రికలు చదవడం తప్పనిసరి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లను ఎంపిక చేసుకొని,చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పోటీ పరీక్షలను బట్టి కరెంట్ అఫైర్స్ ప్రశ్నల సరళి, క్లిష్టత మారుతుంది. అయితే ప్రధానంగా ఈ కింది విభాగాల సమకాలీన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు.
వాణిజ్య వ్యవహారాలు.
సైన్స్ అండ్ టెక్నాలజీ.
పర్యావరణం. వార్తల్లో వ్యక్తులు.
రాజకీయ సంఘటనలు.
భౌగోళిక ప్రాధాన్య ప్రదేశాలు.
రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు.
క్రీడల సమాచారం.
దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు; అంతర్జాతీయ సదస్సులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరిధి ఆధారంగా ప్రిపరేషన్
పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని,దానికి అనుగుణంగా సిద్ధంకావాలి. ఇందుకోసం గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, వాటి క్లిష్టతను పరిశీలించాలి. బ్యాంకు పరీక్షల్లో ఎక్కువగా బ్యాంకింగ్, ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వాల వార్షిక బడ్జెట్‌లు, ఆర్థిక సర్వేలు, ప్రభుత్వ పథకాలు, ఆర్‌బీఐ ప్రకటించే పాలసీ రేట్లు, పంచవర్ష ప్రణాళికలు, వివిధ కమిషన్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు రాష్ట్రస్థాయి సంఘటనలను కూడా చదవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాలు, పురస్కారాలు వంటి వాటిని చదవాలి.
కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధిస్తే సివిల్స్, గ్రూప్-1 పరీక్షల్లో ఎస్సే పేపర్‌లో మంచి మార్కులు సాధించవచ్చు. సాధారణంగా ఎస్సే పేపర్‌లో వచ్చే ప్రశ్నలు ఎక్కువగా వర్తమాన అంశాలకు సంబంధించినవే ఉంటాయి. ప్రస్తుతానికి చూస్తే యూరోజోన్ సంక్షోభం, చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నిర్భయ సంఘటన నేపథ్యంలో దేశంలో మహిళల భద్రత వంటి అంశాలపై ఎస్సే పేపర్‌లో ప్రశ్నలు రావొచ్చు.
అభ్యర్థి ఎదుర్కొనే పోటీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ కరెంట్ అఫైర్స్‌కు సిద్ధమవుతున్నప్పుడు కేవలం బిట్లకే పరిమితం కాకూడదు. అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. దీనివల్ల ఇంటర్వ్యూలోనూ మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.
1
వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించేందుకు తప్పకుండా వార్తా పత్రికలను చదవాలి. దీనికోసం కనీసం గంట సమయాన్ని కేటాయించాలి.
2
పత్రికలను చదివేటప్పుడు ముఖ్యాంశాలతో సొంతంగా నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీన్ని ప్రతి వారం తప్పనిసరిగా పునశ్చరణ (రివిజన్) చేయాలి. ఇంటర్నెట్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
3
సబ్జెక్టు నిపుణులు, పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి సలహా మేరకు మార్కెట్లో లభించే ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను చదవాలి.
4
అభ్యర్థి రాసే పోటీ పరీక్షకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన పత్రికలు, మేగజైన్‌ను చదవాలి (ఉదాహరణకు బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యేవారు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్‌ను చదివితే మంచిది).
ఎన్. విజయేందర్ రెడ్డి
జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
దినపత్రికలను చదవడం ప్రధానం
ఏపీపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేందుకు జనరల్ స్టడీస్ పేపర్ కీలకమైంది. ఇందులో 30-35 వరకు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. ఎన్ని పనులున్నప్పటికీ రోజువారీ ప్రిపరేషన్ టైంటేబుల్‌లో గంటన్నర సమయాన్ని కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించాలి. రెండు ప్రామాణిక దినపత్రికలను ఎడిటోరియల్స్‌తో సహా చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఒక మేగజైన్‌ను చదవటం వల్ల కొంత అదనపు సమాచారం లభిస్తుంది. పరీక్షకు నెల రోజుల ముందు ప్రచురణ సంస్థలు విడుదల చేసే కరెంట్ అఫైర్స్ పుస్తకాలు మెరుగైన పునశ్చరణకు par ఉపకరిస్తాయి.ఙ- ఎస్. భానుమూర్తి,
ఏసీటీవో, విజయనగరం.
విజయ సారథికి ‘వర్తమానం’!
Published Thu, Jan 2 2014 1:12 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement