ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
జాతీయం
లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
అత్యున్నత స్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు -2011కు పార్లమెంట్ డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 17న, లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదించాయి. ఈ బిల్లు ప్రకారం కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తారు. లోక్‌పాల్ ఏర్పాటైన ఏడాదిలోగా రాష్ట్రాలు లోకాయుక్తలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది.
ప్రధానమంత్రి (కొన్ని పరిమితులు మినహా), మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్‌తోపాటు గరిష్టంగా ఎనిమిదిమంది సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం ఐదేళ్లు లేదా 75 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారు. వీరిని ప్రధానమంత్రి, స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీ నియమిస్తుంది.
సీఐసీగా బాధ్యతలు స్వీకరించిన సుష్మాసింగ్
కేంద్ర నూతన ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సుష్మాసింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 19న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధూ పదవీ కాలం ముగియడంతో ఆమె స్థానంలో సుష్మా సింగ్‌ను ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర న్యాయ శాఖ మంత్రితో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది.
సుష్మాసింగ్ 2009, సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల్లో కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కాకుండా మరో ఎనిమిదిమంది సమాచార కమిషనర్లు ఉన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదులను సీఐసీ పరిష్కరిస్తారు. ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రజలు కోరిన సమాచారంపై ఈ అప్పీళ్లు, ఫిర్యాదులు ఉంటాయి.
వైమానిక దళంలో ప్రవేశానికి ఎల్‌సీఏ తేజస్‌కు అనుమతి
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) ‘తేజస్’ను వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రాథమిక అనుమతి లభించింది. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో డిసెంబర్ 20న తేజస్‌ను వాయుసేనకు అప్పగించేందుకుగాను ‘రిలీజ్ టు సర్వీస్’ ధ్రువపత్రాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌ఏకే బ్రౌనేకు రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అందజేశారు.
ఈ అత్యాధునిక తేలికపాటి యుద్ధ విమానాన్ని మిగ్-21 స్థానంలో ప్రవేశపెడతారు. తద్వారా స్వదేశీయంగా ఎల్‌సీఏలను తయారుచేయగలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. 2014 చివరినాటికి తేజస్‌కు తుది నిర్వహణ అనుమతి (ఎఫ్‌వోసీ) లభిస్తుంది. దీనికోసం రక్షణ శాఖ 1983లో రూ.560 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే ఈ వ్యయం ఇప్పటికే రూ.25,000 కోట్లకు చేరుకుంది.
అగ్ని -3 క్షిపణి పరీక్ష విజయవంతం
వినియోగ పరీక్షల్లో భాగంగా అణు సామర్థ్యం గల అగ్ని-3 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ డిసెంబర్ 23న ఒడిశా తీరంలో వీలర్ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి 3,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.
బరువు 48.3 టన్నులు. ఎత్తు 16.7 మీటర్లు, వ్యాసం 1.8 మీటర్లు. ఇది 1.5 టన్నుల బరువు ఉన్న సంప్రదాయ, సంప్రదాయేతర ఆయుధాలను మోసుకుపోగలదు. 2006, జూలైలో జరిపిన మొదటి పరీక్ష విఫలమైంది. తర్వాత 2007, 2008, 2010 పరీక్షలు విజయవంతమయ్యాయి. 1983లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా అగ్ని సిరీస్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు.
ప్రముఖ జర్నలిస్టు ప్రాణ్ చోప్రా మృతి
ప్రముఖ పాత్రికేయుడు, ద స్టేట్స్‌మన్ తొలి ఎడిటర్ ప్రాణ్ చోప్రా (92) డిసెంబర్ 22న కన్నుమూశారు. 1921లో లాహోర్‌లో జన్మించిన ఆయన 1941లో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు. చైనా, వియత్నాంలలో 1940లలో ఆల్ ఇండియా రేడియోకు ప్రతినిధిగా పనిచేశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో రాసిన ‘ఇఫ్ అయామ్ అసాసినేటెడ్ (నేను హత్యకు గురైతే)’ పుస్తకానికి ప్రాణ్ ముందుమాట రాశారు. ప్రాణ్ రాసిన పలు పుస్తకాలు కూడా ప్రసిద్ధి పొందాయి.
మణిపూర్ గవర్నర్‌గా వీకే దుగ్గల్
కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి వీకే దుగ్గల్(68) డిసెంబర్ 23న మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూలైలో ఖాళీ అయిన మణిపూర్ గవర్నర్ స్థానంలో దుగ్గల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు దుగ్గల్ ఢిల్లీ మునిసిపల్ కమిషనర్‌గా, కేంద్ర జలవనరుల శాఖలో కార్యదర్శిగా, పలు కమిషన్లలో సభ్యుడిగా విశేష సేవలందించారు. తెలంగాణపై ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో దుగ్గల్ సభ్య కార్యదర్శిగా ప్రముఖ పాత్ర పోషించారు.
కిషన్‌గంగ నదీజలాలపై భారత్‌కు ఊరట
కిషన్‌గంగ నదీ జలాలను జమ్మూకాశ్మీర్‌లో విద్యుదుత్పాదన కోసం మళ్లించేందుకు భారత్‌కు గల హక్కును హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోర్టు సమర్థించింది. ఈ విషయంలో పాకిస్థాన్ అభ్యంతరాలను కొట్టివేసింది. ఈ మేరకు భారత్ - పాక్‌ల మధ్యవర్తిత్వం కేసులో డిసెంబర్ 20న తుది తీర్పు ఇచ్చింది. కిషన్‌గంగ జలవిద్యుత్ ప్రాజెక్టు దిగువకు కిషన్‌గంగ/నీలం నదిలోకి కనీసం 9 క్యూమెక్‌ల (సెకనుకు క్యూబిక్ మీటర్లు) నీటిని భారత్ నిరంతరం వదిలిపెట్టాలని కూడా ఈ తీర్పులో నిర్ణయించింది.
అంతర్జాతీయం
చిలీ అధ్యక్షురాలిగా మిచెల్ బాషెలెట్
చిలీ అధ్యక్షురాలిగా సోషలిస్టు పార్టీ నాయకురాలు మిచెల్ బాషెలెట్ డిసెంబర్ 15న ఎన్నికయ్యారు. దేశంలో సామాజిక అసమానతలు తగ్గించేందుకు భారీస్థాయిలో పన్ను, విద్యా సంస్కరణలు తీసుకొస్తానని ఆమె వాగ్దానం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు 62 శాతం ఓటర్ల మద్దతు లభించింది. 1989లో తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం మొదలైన తర్వాత అధ్యక్ష అభ్యర్థికి ఇంత భారీ మద్దతు లభించడం ఇదే తొలిసారి.
ఎకే 47 సృష్టికర్త కలష్నికోవ్ మృతి
ఎకే-47 ఆటోమేటిక్ రైఫిల్ సృష్టికర్త మిఖైల్ కలష్నికోవ్ (94) రష్యాలోని ఉద్ముర్షియాలో డిసెంబర్ 23న మరణించారు. ఆయన 1947లో ఆ రైఫిల్‌ను రూపొందించడంతో ఎకే 47గా పేరు పెట్టారు. ఈ అత్యాధునిక ఆయుధాన్ని రూపొందించినందుకు కలష్నికోవ్‌కు ప్రతిష్టాత్మకమైన ‘హీరో ఆఫ్ రష్యా’ ప్రైజ్ లభించింది. 100 మిలియన్లకుపైగా ఈ రైఫిల్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయాయి. వీటిని ఇరాక్, అప్ఘానిస్థాన్, సోమాలియా వంటి పోరాట ప్రాంతాల్లో వాడుతున్నారు.
కృత్రిమ గుండెను అమర్చిన ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు
75 సంవత్సరాల వ్యక్తికి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తొలిసారిగా కృత్రిమ గుండెను విజయవంతంగా డిసెంబర్ 20న అమర్చారు. ఫ్రాన్స్‌కు చెందిన బయోమెడికల్ సంస్థ కార్మట్ ఈ కృత్రిమ గుండెను రూపొందించింది. లిథూయం ఐయాన్ బ్యాటరీలు ఉపయోగించిన గుండెను డచ్‌కు చెందిన యూరోపియన్ ఏరోనాటిక్స్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ అభివృద్ధి చేసింది.
ఈ గుండె రోగికి ఐదేళ్ల అదనపు జీవితాన్నిస్తుంది. దీని బరువు దాదాపు కిలోగ్రాము ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన మనిషి గుండెకంటే మూడింతలు ఎక్కువ. ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన డా.అలైన్ కార్పెంటైర్ ఈ గుండె అభివృద్ధికి 25 ఏళ్లపాటు కృషి చేశారు. గతంలో రూపొందించిన కృత్రిమ గుండెలను ఆపరేషన్ సమయంలో తాత్కాలిక అవసరాలకు మాత్రమే ఉపయోగించేవారు.
మూడోసారి జర్మనీ చాన్సలర్‌గా మెర్కెల్
జర్మనీ చాన్సలర్‌గా ఏంజెలా మెర్కెల్ డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చాన్సలర్‌గా ఎన్నికవడం ఇది మూడోసారి. ఆమె నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన సంప్రదాయ క్రిస్టియన్ డెమోక్రాట్స్ యూనియున్ (సీడీయూ) పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రతిపక్ష సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌పీడీ)తో కలిసి ఒప్పందం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రీయం
కాత్యాయని విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం - స్త్రీల అస్తిత్వ సాహిత్యం, కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథానికిగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన 22 భాషలకు చెందిన రచయితల పేర్లను డిసెంబర్ 18న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. అవార్డును 2014, మార్చి 11న గ్రహీతలకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద జ్ఞాపిక, ప్రశంసపత్రం, రూ. లక్ష నగదు బహూకరిస్తారు.
పెప్సికో బేవరేజ్ సంస్థకు సీఎం శంకుస్థాపన
చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో రూ.1200 కోట్లతో పెప్సికో సంస్థ ఏర్పాటుచేసే శీతల పానీయాల పరిశ్రమకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 21న హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో మూడు దఫాలుగా పెప్సీకో సంస్థ పెట్టుబడులు పెడుతుంది. రోజుకు 3.6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం సంతరించుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలో పెప్సికో సంస్థ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో శ్రీ సిటీలో నెలకొల్పే పరిశ్రమ అతిపెద్దది కానుంది.
వంశధార నుంచి శ్రీకాకుళంకు 8 టీఎంసీల నీటికి అనుమతి
శ్రీకాకుళంలో కాట్రగడ్డ వద్ద వంశధార నది నీటిని వాడుకొనేందుకు మళ్లింపు కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు వంశధార ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈ అడ్డుగోడ (సైడ్ వీయర్) నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఒడిశా చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ డిసెంబర్ 17న తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 8 టీఎంసీల నీటిని అదనంగా వాడుకోవడానికి తద్వారా 50 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలవుతుంది. వంశధార ఒడిశాలో జన్మించి ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్లు, ఒడిశా - ఆంధ్ర సరిహద్దులో 29 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 82 కి.మీ ప్రవహిస్తోంది. ఈ నదీ జలాలను సమానంగా పంచుకోవాలని ఇరు రాష్ట్రాల మధ్య 1962, సెప్టెంబర్ 30న ఒప్పందం కుదిరింది.
క్రీడలు
కపిల్‌దేవ్‌కు కల్నల్ సి.కె.నాయుడు అవార్డు
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను 2013 సంవత్సరానికి సి.కె.నాయుడు జీవిత కాల సాఫల్య పురస్కారానికి బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద ప్రశంస పత్రం, రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు. కపిల్ 1978- 94 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 5,000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పారు.
మొత్తం 131 టెస్టులు ఆడి 5248 పరుగులు చేసి, 434 వికెట్లు తీశారు. 225 వన్డేల్లో 253 వికెట్లు తీసి, 3,783 పరుగులు చేశారు. తన కెప్టెన్సీలో 1983లో తొలిసారి భారత్‌కు ప్రపంచ్‌కప్‌ను సాధించి పెట్టారు. కల్నల్ సి.కె. నాయుడు అవార్డు 2010లో సలీం దురానీకి, 2011లో అజిత్ వాడేకర్‌కు, 2012లో సునీల్ గవాస్కర్‌కు లభించింది.
అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా ధోని రికార్డు
భారత్ తరపున 50 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి ఎంఎస్ ధోని రికార్డు నెలకొల్పాడు. డిసెంబర్ 18న జోహన్నెస్‌బర్గ్‌లో మొదలైన తొలి టెస్టు అతనికి 50వది. ఇంతకు ముందు ఈ రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. గంగూలీ మొత్తం 49 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.
ఏఐఎఫ్‌ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు 2007, 2011లో కూడా ఛెత్రికి దక్కింది. అవార్డు కింద రూ. 2 లక్షలు, ట్రోఫీ బహూకరిస్తారు. ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బెంబెమ్ దేవి ఎంపికైంది.
శ్రీకాంత్, సింధులకు జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టైటిల్స్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో డిసెంబర్ 23న ముగిసింది.
విజేతలు:
పురుషుల సింగిల్స్: ఈ టైటిల్‌ను కె.శ్రీకాంత్ గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో గురుసాయిదత్‌ను ఓడించాడు.
మహిళల సింగిల్స్: ఈ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకుంది. ఫైనల్స్‌లో రీతూపర్ణదాస్‌ను ఓడించింది. సింధుకు ఇది రెండో మహిళల టైటిల్.
పురుషుల డబుల్స్: ప్రణవ్ చోప్రా, అక్షయ్ దివాల్కర్ గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో సుమీత్ రెడ్డి, మనూ అత్రిలను ఓడించారు.
మహిళల డబుల్స్: గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి, ప్రద్న్యా గాద్రెలను ఓడించారు. జ్వాలకిది 14వ జాతీయ డబుల్స్ టైటిల్.
మిక్స్‌డ్ డబుల్స్: అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ జోడి.. తరుణ్, అశ్విని జోడిని ఓడించి టైటిల్ గెలుచుకున్నారు.