డెయిరీ సైన్స్‌తో కొలువుల వెల్లువ
అప్‌కమింగ్ కెరీర్: మానవుడికి ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారం.. పాలు. పాలకు, పాల ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. భారత్‌లో క్షీర విప్లవంతో పాడి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ రికార్డుకెక్కింది. మనదేశంలో డెయిరీ రంగంలో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు ఈ పరిశ్రమ కల్పతరువుగా మారిందని చెప్పొచ్చు.
సూపర్‌వైజర్/ప్లాంట్ మేనేజర్
భారత్‌లో డెయిరీ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ భారీ పరిశ్రమగా అవతరించింది. దీనికి ప్రభుత్వాల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డెయిరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ప్రొక్యూర్‌మెంట్, ప్యాకేజింగ్, స్టోరేజీ, క్వాలిటీ కంట్రోల్, ట్రాన్స్‌పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డెవలప్‌మెంట్, పరిశోధన-అభివృద్ధి(ఆర్ అండ్ డీ) వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం పాడి పరిశ్రమ ఆధునికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ రంగంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో డెయిరీ సైన్స్ కోర్సులను అభ్యసించినవారికి డిమాండ్ నెలకొంది. డెయిరీలు నిపుణులను నియమించుకుంటున్నాయి. వీటిలో సూపర్‌వైజర్, ప్లాంట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. డెయిరీ సైన్స్/టెక్నాలజీ కోర్సులను చదివినవారు ఆసక్తి ఉంటే సొంతంగా డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఔత్సాహికులకు ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తోంది.
మార్పులు తెలుసుకోవాలి
పాడి పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తి ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి. మార్కెట్ అవసరాలను అంచనా వేసే నేర్పు ఉండాలి. ఈ రంగంలో ఒడిదుడుకులు, ఇతరుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి, పట్టుదల, సహనం అలవర్చుకోవాలి.
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, డెయిరీ ఇంజనీరింగ్ కోర్సుల్లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరొచ్చు. తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా అభ్యసిస్తే ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
వేతనాలు: పాడి పరిశ్రమలో సూపర్‌వైజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. తర్వాత పనితీరును బట్టి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వేతనం లభిస్తుంది. సహకార విభాగంలో ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో) నెలకు రూ.45 వేల నుంచి రూ.50 వేలు పొందొచ్చు.
డెయిరీ సైన్స్/టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
1. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.angrau.ac.in
2. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.ignou.ac.in
3. డెయిరీ సైన్స్ కాలేజీ-బెంగళూరు
వెబ్‌సైట్: www.kvafsu.kar.nic.in
4. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
వెబ్‌సైట్: www.ndri.res.in
వంద శాతం అవకాశాలు!
‘‘డెయిరీ టెక్నాలజీ కోర్సులను అభ్యసించిన విద్యార్థులకు డెయిరీ పరిశ్రమల్లో విస్తృత అవకాశాలున్నాయి. కోర్సు చివరి సంవత్సరంలోనే కంపెనీలు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. డెయిరీ టెక్నీషియన్, డెయిరీ ఫామ్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, మేనేజర్, డెయిరీ టెక్నాలజిస్ట్ తదితర హోదాల్లో విధుల్లో చేర్చుకుంటున్నాయి. అభ్యర్థి ప్రతిభ, సంస్థను బట్టి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీలో కోర్సులనభ్యసించిన వారికి 100 శాతం ఉద్యోగాలు లభించాయి. కనీస వేతనం రూ. 18,000. విదేశీ కంపెనీలు సైతం కొందరు విద్యార్థులకు భారీ వేతనాలతో నియమించుకున్నాయి. డెయిరీ టెక్నాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివిన వారు విదేశాల్లోనూ మంచి అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు’’
- డా. ఐ.శంకర రెడ్డి, అసోసియేట్ డీన్,
కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి