
డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటే?
ప్రాథమిక హక్కుల వర్గీకరణ
భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ప్రధానంగా ఏడు రకాలుగా వర్గీకరించారు.
సమానత్వపు హక్కు (ప్రకరణలు 14–18)
వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 19–22)
పీడనాన్ని నిరోధించే హక్కు
(ప్రకరణలు 23, 24)
మత స్వాతంత్య్రపు హక్కు
(ప్రకరణలు 25–28)
సాంస్కృతిక, విద్యా హక్కులు
(ప్రకరణలు 29–30)
ఆస్తి హక్కు (ప్రకరణ 31)
రాజ్యాంగ పరిహార హక్కు (ఆర్టికల్ 32)
ప్రత్యేక వివరణ:
ప్రాథమిక హక్కుల్లో అత్యంత వివాదాస్పద మైన ఆస్తిహక్కు (ప్రకరణ 31)ని, అలాగే ఆస్తి సంపాదన విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 19(1)(ఎఫ్)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి 12వ భాగంలోని ‘300–ఎ’లో చేర్చారు. ప్రస్తుతం ఆస్తిహక్కు రాజ్యాంగబద్ధ హక్కు మాత్రమే. అలాగే చట్టబద్ధ హక్కుగా కూడా పరిగణిస్తున్నారు.
ప్రకరణ–12: రాజ్యం–నిర్వచనం–ప్రాముఖ్యత
ప్రాథమిక హక్కులను మౌలికంగా రాజ్య నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపర్చారు. రాజ్యం అనే పదాన్ని రాజ్యాంగంలో చాలా చోట్ల ప్రయోగించారు. అయితే రాజ్యానికి విస్తృత నిర్వచనాన్ని మాత్రం ప్రకరణ–12లో పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులను రాజ్యం/ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించినందున ఏ సంస్థలు రాజ్యం పరిధిలోకి వస్తాయో స్పష్టంగా నిర్వచించకపోతే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా వాటిపై న్యాయ స్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. అందువల్ల విస్తృత నిర్వచనం అవసరం.
రాజ్యం అంటే..
ఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్ర, రాష్ట్ర శాసన సభలు
బి) స్థానిక ప్రభుత్వాలు.. అంటే మునిసిపాలిటీ లు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు
సి) ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ, చట్టేతర సంస్థలైన ఎల్‌ఐసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ మొదలైనవి.
డి) న్యాయ వ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో పేర్కొంది. అలాగే ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలూ రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
ప్రత్యేక వివరణ:
పైన పేర్కొన్న వాటితోపాటు మరే ఇతర సంస్థలు రాజ్యం పరిధిలోకి వస్తాయనే అంశాన్ని సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో పేర్కొంది.
అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీబ్ (1981)
ఈ వివాదంలో.. ఒక సంస్థను రాజ్యం అనే నిర్వచనంలోకి చేర్చడానికి కింది ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి.
సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలి,
సంస్థపై సంపూర్ణ పరిపాలన నియంత్రణ ప్రభుత్వానికి ఉండాలి.
సంస్థ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి.
న్యాయస్థానాలు రాజ్య నిర్వచన
పరిధిలోకి వస్తాయి – సుప్రీంకోర్టు తీర్పులు
ఎ.ఆర్. అంతులే వర్సెస్ ఆర్.ఎస్.నాయక్ (1988)
న్యాయస్థానాల కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకి వస్తాయని సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొంది. దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్రకరణ–145, 146 ప్రకారం సుప్రీంకోర్టు సొంతంగా నియమ నిబంధనలను రూపొందించుకోవచ్చు. అలాగే తన సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా ఉంటుంది. ఈ చర్యలు కార్యనిర్వాహకపరమైనవి. వీటి వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. అందువల్ల న్యాయశాఖ.. కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే రాజ్యం పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.
మినహాయింపులు
సహకార సంఘాలు, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా(బీసీసీఐ), ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ పాలన, ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్యం పరిధిలోకి రావు.
ప్రకరణ–13 చట్ట నిర్వచనం,
ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు
– న్యాయ సమీక్షాధికారం
ప్రకరణ–13(1) ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే అవి చెల్లవు.
ప్రకరణ–13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను హరించే/పరిమితం చేసే చట్టాలు, ఆదేశాలు చెల్లవు.
ప్రకరణ–13(3)లోని చట్టం నిర్వచనంలోకి
కింది అంశాలు వస్తాయి..
కేంద్ర, రాష్ట్ర శాసన సభల శాసనాలు.
రాష్ట్రపతి, గవర్నర్లు జారీ చేసిన ఆదేశాలు, ఆర్డినెన్సులు.
ప్రభుత్వ నియమ నిబంధనలు, ప్రకటనలు
ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత కల్పించిన ప్రజల ఆచార వ్యవహారాలు.
ప్రత్యేక వివరణ:
1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణలను నిబంధన 13లో పేర్కొన్న చట్టం నిర్వచన పరిధి నుంచి మినహాయించారు. ఈ అంశాన్ని గోలక్‌నాథ్ కేసు(1967)లో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు చేశారు. కానీ సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసులో ఈ సవరణ చెల్లదని తీర్పు చెప్పింది. అందువల్ల రాజ్యాంగ సవరణ కూడా చట్ట నిర్వచన పరిధిలోకి వస్తుంది.
న్యాయ సమీక్షాధికారం
సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం ఉన్నట్లు ప్రకరణ–13లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే న్యాయ సమీక్ష అనే పద ప్రయోగం లేదు. ఏదైనా చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అది చెల్లదు. అలా చెల్లుబాటు కాకుండా తీర్పు చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఈ నిబంధన ద్వారా సంక్రమించింది. అందువల్ల న్యాయ సమీక్షాధికారం అనేది మౌలిక నిర్మాణంలో అంతర్భాగమవుతుంది. దీన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉండదు. న్యాయ సమీక్షాధికారాన్ని లాటిన్ పరిభాషలో కింది విధంగా పేర్కొంటారు.
ఏదైనా చట్టం తన పరిధి దాటి ఉంటే దాన్ని "Ultra Vires" అంటారు.
(Ultra=Beyond, Vires=Limits)
"Null and Void" A…sôæ Not Valid లేదా చట్టం చెల్లుబాటు కాదు అని అర్థం.
సూచన:
న్యాయ సమీక్ష అధికారం గురించి సుప్రీంకోర్టు చాప్టర్‌లో మరింత వివరంగా పేర్కొన్నారు.
నిబంధన–13లో పొందుపర్చిన చట్ట నిర్వచనం పరిధి, పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారాల గురించి సుప్రీంకోర్టు కొన్ని న్యాయ సూత్రాలను ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలు..
డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటి
(Doctrine of Severability)
పార్లమెంట్ చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు నిబంధన 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చట్టాలు చెల్లవు. అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా ఏ భాగమైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధమో చట్టంలోని ఆ భాగం మాత్రమే రద్దవుతుంది. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన అంశాలను చట్టం నుంచి వేరు చేయడానికి వీలుకాకపోతే, అప్పుడు మొత్తం చట్టం రద్దవుతుంది. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు.
డాక్ట్రిన్ ఆఫ్ వైవర్
(Doctrine of Waiver)
రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపర్చిన హక్కులను ప్రభుత్వాలు అమలుచేయాలి. ఏ పౌరుడూ తన హక్కులను వదులుకోవడానికి వీల్లేదు. అమలుచేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాన్ని మినహాయించడానికీ వీల్లేదు. పౌరులు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా; అవగాహన ఉన్నా లేకపోయినా తమ హక్కులను వదులుకోవడానికి కోర్టులు అనుమతించవు. ఈ సూత్రాన్నే డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటారు.
ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు 1959లో బసేశ్వర్‌నాథ్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌ట్యాక్స్ కేసులో ప్రస్తావించింది. అయితే ఈ సూత్రం భారత్‌లో పరిమితంగానే వర్తిస్తుంది.
డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్
(Doctrine of Eclipse)
రాజ్యాంగం అమల్లోకి రాకముందు అమల్లో ఉన్న చట్టాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తే వాటి చెల్లుబాటు విషయంలో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని వినియోగిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని పూర్తిగా కొట్టేయకుండా అమలును మాత్రమే నిలిపేస్తారు. అంటే వాటికి తాత్కాలిక గ్రహణం పడుతుంది. అనంతర చట్టం ద్వారా వివాదాస్పద అంశాన్ని తొలగిస్తే చట్టాలు అమల్లోకి వస్తాయి. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని మొత్తానికి రద్దు చేస్తారు. ఈ విధమైన ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు.
బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వివాదం(1955)లో సుప్రీంకోర్టు పై సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంది.
దీప్‌చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వివాదం(1959)లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది రాజ్యాంగం అమల్లోకి రాక ముందు ఉన్న చట్టాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు(1974)లో సుప్రీంకోర్టు భిన్న తీర్పును ప్రకటించింది. ఈ సూత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.