ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, గ్లోబలైజేషన్.. ప్రపంచాన్ని ఓ చిన్న గ్రామంగా మార్చేస్తూ ఎన్నో కొత్త కొలువులను యువత ముందుంచుతున్నాయి. ఇలాంటి వాటిలో ‘భాష’తో సంబంధమున్న ఉద్యోగాలూ ఉన్నాయి. ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వారికి కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయ వేతనాలతో స్వాగతం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవడంతో పాటు ఉన్నత జీవితానికి బాటలు వేసుకునేందుకు ఉపయోగపడే విదేశీ భాషల కోర్సులు, కెరీర్‌పై స్పెషల్ ఫోకస్..
విదేశీ మార్కెట్లోకి ప్రవేశించి వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసే భారతీయ కంపెనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదే విధంగా అనేక విదేశీ కంపెనీలు భారత్ లో అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు, ప్రాజెక్టుల అప్పగింత వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విదేశీ భాషా నైపుణ్యాలున్న వారు అవసరమవుతున్నారు. విదేశాల్లో చదువుకొని అక్కడే కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్న వారూ అధికమయ్యారు. ఇలాంటి వారు కూడా ఫారెన్ లాంగ్వేజ్‌లను నేర్చుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలు విదేశీ భాషలకు సంబంధించి వివిధ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి.
డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు:
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్‌లు విదేశీ భాషా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ రకాల కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఉదాహరణకు గోవా యూనివర్సిటీ ఫ్రెంచ్‌లో పీహెచ్‌డీని ఆఫర్ చేస్తోంది. కురుక్షేత్ర యూనివర్సిటీ ఫ్రెంచ్, జర్మన్‌లో డిప్లొమాను అందిస్తోంది. ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన అర్హతలతో కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
డిమాండ్ ఉన్న భాషలు:
విద్య, వ్యాపార రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ భాషా నైపుణ్యాలున్న వారి అవసరం పెరుగుతోంది. ప్రధానంగా ఇంగ్లిషేతర దేశాల భాష తెలిసిన వారికి కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలుంటున్నాయి. దీంతో జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, జపనీస్, స్పానిష్, కొరియన్ కోర్సుల్లో చేరుతున్న ఔత్సాహికులు ఎక్కువయ్యారు.
ఇఫ్లూ కేరాఫ్ లాంగ్వేజ్ స్కిల్స్:
హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్‌ను కలిగిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి.. విదేశీ భాషల కోర్సుల నిర్వహణలో మంచి పేరుంది. ఇది వివిధ స్థాయిల్లో విదేశీ భాషల కోర్సులను అందుబాటులో ఉంచుతుంది. జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్ వంటి భాషల కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఏ, ఎంఏ స్థాయిలో కోర్సులను అందిస్తోంది. రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో పీహెచ్‌డీ కూడా ఉంది.
వెబ్‌సైట్: www.efluniversity.ac.in
కోర్సులో బోధించే అంశాలు:
విద్యార్థులు చేరిన భాషకు సంబంధించిన వ్యాకరణం, ఫొనెటిక్స్, సాహిత్యం వంటి అంశాలను బోధిస్తారు. ట్రాన్స్‌లేషన్ (థియరీ, ప్రాక్టీస్), జనరల్ లింగ్విస్టిక్స్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇఫ్లూ వంటి యూనివర్సిటీలు విదేశాల నుంచి సంబంధిత భాషా నిపుణులను ఇక్కడకు ఆహ్వానించి వారితో ఏడాదిలో కొద్ది రోజుల పాటు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి ఏర్పాటు వల్ల విద్యార్థులు తాము నేర్చుకుంటున్న భాష యాక్సెంట్, ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిని తెలుసుకునేందుకు వీలవుతుంది. సాధారణంగా డిగ్రీ స్థాయి కోర్సుల్లో మొదటి ఏడాది ఇంగ్లిష్‌లో బోధన ఉంటుంది.
ఉద్యోగాలు అందుబాటులో ఉండే విభాగాలు:
విదేశీ భాషల కోర్సులను దిగ్విజయంగా పూర్తి చేసినవారు వివిధ విభాగాల్లో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
అవి:
ఎగుమతి, దిగుమతి సంస్థలు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు
పర్యాటక, ఆతిథ్య రంగ సంస్థలు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా.
రాయబార కార్యాలయాలు.
సాయుధ దళాలు, నిఘా సంస్థలు.
కాల్ సెంటర్లు; విద్య, పరిశోధన సంస్థలు.
హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌స్టిట్యూట్స్.
ఏయే ఉద్యోగాలుంటాయి?:
విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. అవి:
డిప్లొమాటిక్ సర్వీస్ ప్రొఫెషనల్.
ఫారెన్ లాంగ్వేజ్ ట్రైనర్.
ట్రాన్స్‌లేటర్ (ఎంఎన్‌సీలు/ప్రభుత్వ సంస్థలు).
రీసెర్చ్ అసోసియేట్.
ఇంటర్‌ప్రెటర్, టూరిస్ట్ గైడ్.
ఎయిర్ హోస్టెస్, అటెండెంట్ (హోటళ్లు).
ఫ్రీలాన్స్ రైటర్, ట్రాన్స్‌లేటర్, ఇంటర్‌ప్రెటర్.
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్.
వేతనాలు:
ట్రాన్స్‌లేటర్లు, ఇంటర్‌ప్రెటర్లుగా విధులు నిర్వహించే వారికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు ఆర్జిస్తుంటారు. అనుభవం, పనితీరు బట్టి ఈ మొత్తం పెరుగుతుంది. ట్రాన్స్‌లేటర్లకు పదాల సంఖ్యను బట్టి డబ్బు ముడుతుంది. భాషను బట్టి పదానికి 60 పైసలు నుంచి రూ.5 రూపాయల వరకు అందుతుంది. ఇంటర్‌ప్రెటర్లకు గంటలను బట్టి ఆదాయం లభిస్తుంది. వీరికి గంటకు రూ.800 వరకు చెల్లిస్తున్నారు. బోధన వృత్తిలో స్థిరపడ్డ వారికి ప్రారంభంలో రూ.20 వేలకు పైగా వేతనం లభిస్తుంది. కార్పొరేట్ కంపెనీలు, వైద్యం, టూరిజం తదితర రంగాల్లో స్థిరపడిన వారికి ప్రారంభంలోనే రూ.20 వేలు వేతనం ఉంటుంది.
క్యాంపస్ నియామకాలు:
ఈ-సెర్వ్, వరల్డ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, విప్రో, ఒరాకిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, టాటా కన్సల్టెన్సీ, థామ్సన్, రాయిటర్స్ వంటి సంస్థలు క్యాంపస్ నియామకాల ద్వారా విదేశీ భాషలు తెలిసిన వారిని నియమించుకుంటున్నాయి.
విదేశీ భాష- కెరీర్ ఫోకస్
విదేశీ భాషల నైపుణ్యాలను పెంపొందించుకున్న వారికి విస్తృత అవకాశాలు ఉంటాయి. వీరు ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్‌ప్రెటింగ్, లాంగ్వేజ్ టీచింగ్ వంటి విభాగాల్లో స్థిరపడొచ్చు.
ట్రాన్స్‌లేటర్స్:
విదేశీ భాష కోర్సులను పూర్తిచేసిన వారిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్‌లేషన్. ట్రాన్స్‌లేటర్లు ఒక భాషలో ఉన్న సమాచారాన్ని వేరొక భాషలోకి అనువదిస్తారు. ఇప్పుడు వివిధ బహుళ జాతి కంపెనీలు భారత్‌లో అడుగుపెడుతుండటం, ఇక్కడి కంపెనీలు విదేశీ కంపెనీలతో జాయింట్ వెంచర్స్‌ను ఏర్పాటు చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు, వ్యాపార నివేదికలు, ఒప్పంద పత్రాలు వంటి వాటిని తర్జుమా చేసేందుకు ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు.
విదేశీ వ్యవహారాలు, ఎగుమతులు-దిగుమతులు, వ్యాపారం, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుంది. వివిధ దేశాల నుంచి అనేక ప్రాజెక్టులు ఇక్కడి ఐటీ కంపెనీలకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రాజెక్టులను పూర్తిచేసే క్రమంలో వివిధ దశల్లో ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. భాషపై పట్టుండి, ఆత్మ విశ్వాసం ఉన్నవారు సొంతంగా ట్రాన్స్‌లేషన్ సేవల సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇంటర్‌ప్రెటర్స్:
ఒకరి మాటలను అనువదించి మరొకరికి అప్పటికప్పుడు వినిపించడమే ఇంటర్‌ప్రెటర్స్ పని. ఈ వృత్తిలో రాణించాలంటే మంచి లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్‌ప్రెటింగ్ సవాళ్లతో కూడుకున్న వృత్తి. అయినా ఆకర్షణీయ వేతనాలు వస్తుండటం ఇందులో ప్లస్ పాయింట్. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో పాటు యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యూఎన్‌ఓ), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్‌ప్రెటర్స్ అవసరం ఉంటుంది. సదస్సులు, ఒక దేశ వాణిజ్య బృందం మరొక దేశంలో పర్యటించే సమయంలోనూ ఈ నిపుణుల అవసరం ఏర్పడుతుంది.
ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ రంగాల్లోనూ విదేశీ భాష నిపుణుల అవసరం ఉంటోంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో విమానయాన, పర్యాటక, ఆతిథ్య సంస్థలు ఉద్యోగ నియామకాల్లో విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్:
విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి మరో ఉపాధి వేదికగా బోధన రంగం ఉంటోంది. ప్రస్తుతం దేశంలోని పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విదేశీ భాషల కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాషా నైపుణ్యాలున్న వారు బోధన రంగంలో అవకాశాలను అందుకోవచ్చు. ఉన్నత విద్యను పూర్తిచేస్తే విశ్వవిద్యాలయాల్లో సైతం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు.
సొంత కాళ్లపై నిలబడొచ్చు:
విదేశీ భాషల్లో పట్టు సాధించినా, పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారు ఫ్రీలాన్సింగ్ ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా పుస్తక ప్రచురణ విభాగంలో వీరికి అవకాశాలు పుష్కలం. సొంతంగా భాష శిక్షణ కేంద్రాలను, ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్‌ప్రెటింగ్ సేవల సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. మరికొంత మందికి ఉపాధి చూపించవచ్చు. వారాలు, నెలల ప్రాతిపదికన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని పని చేయొచ్చు.
విదేశీ భాషల కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ: ఎంఏ-అరబిక్; ఎంఏ-జపనీస్; ఎంఏ-పర్షియన్; ఎంఫిల్-పర్షియన్.
వెబ్‌సైట్: www.du.ac.in
గోవా యూనివర్సిటీ: బీఏ-ఫ్రెంచ్; ఎంఏ-పోర్చుగీస్; ఎంఏ-ఫ్రెంచ్; పీహెచ్‌డీ-ఫ్రెంచ్.
వెబ్‌సైట్: www.unigoa.ac.in
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా: సర్టిఫికెట్- అరబిక్/ చైనీస్/ఫ్రెంచ్/జర్మన్/స్పానిష్/రష్యన్. ఎంఏ-రష్యన్; పీహెచ్‌డీ-రష్యన్; బీఏ (హానర్స్)-రష్యన్.
అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్ తదితర భాషల్లో డిప్లొమా కోర్సులు.
వెబ్‌సైట్: www.caluniv.ac.in
యూనివర్సిటీ ఆఫ్ ముంబై: రష్యన్, జర్మన్‌లో ఐదేళ్ల కాల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ (బీఏ అండ్ ఎంఏ)ను ఆఫర్ చేస్తోంది.
జర్మన్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు, రష్యన్‌లో సర్టిఫికెట్ కోర్సు, జర్మన్‌లో సర్టిఫికెట్ కోర్సు.
పర్షియన్, అరబిక్, ఇటాలియన్‌లో సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.mu.ac.in
గురునానక్ దేవ్ యూనివర్సిటీ: ఫ్రెంచ్, రష్యన్‌లో డిప్లొమా కోర్సు; ఫ్రెంచ్, రష్యన్, జర్మన్, జపనీస్‌లో సర్టిఫికెట్ కోర్సు; ఫ్రెంచ్, రష్యన్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా.
వెబ్‌సైట్: www.gndu.ac.in
ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులతో అదనపు ప్రయోజనం
విదేశీ భాషలకు సంబంధించి ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ)తో పాటు వివిధ విశ్వవిద్యాలయాలు సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, బీఏ, ఎంఏ, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత కెరీర్ అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎంఎన్‌సీలు, దౌత్య సంబంధ విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందనడంలో సందేహం లేదు. ఉదాహరణకు టూరిజం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థితో పోలిస్తే అదే కోర్సుతో పాటు ఓ విదేశీ భాష నేర్చుకున్న అభ్యర్థి మంచి కొలువులో స్థిరపడే అవకాశముంది. అదే విధంగా ఐటీ, లా, ఫైనాన్స్, సేల్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు ఫారెన్ లాంగ్వేజ్‌లను కూడా నేర్చుకొని ఉన్నత స్థానాలను అందుకోవచ్చు. నాతో పాటు బీఏ స్పానిష్ పూర్తి చేసిన 30 మందిలో 20 మంది బెంగళూరు, లూథియానా వంటి చోట్ల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
నేను, మరో తొమ్మిది మంది ఉన్నత విద్య (ఎంఏ స్పానిష్)దిశగా అడుగులేశాం. మాస్టర్ డిగ్రీ, నెట్ అర్హతలతో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో కొలువులను సొంతం చేసుకోవచ్చు. ఒరాకిల్, హెచ్‌పీ వంటి సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యను పూర్తిచేసిన వారు సొంతంగా ఫారెన్ లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.
- స్నేహా మెరిన్,
ఎంఏ (స్పానిష్), ఫైనలియర్, ఇఫ్లూ.