గేట్- 2014 టాపర్ల మనోగతాలు | GATE-2014 Toppers experience | Sakshi
Sakshi News home page

గేట్- 2014 టాపర్ల మనోగతాలు

Published Thu, Apr 3 2014 3:54 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

GATE-2014 Toppers experience

ఆటోమొబైల్స్‌పై ఆసక్తితో మెకానికల్ ఇంజనీరింగ్  ప్రవేశం. అదే విభాగంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడం అత్యున్నత విద్యతోనే సాధ్యం. ఇందుకు సాధనం.. గేట్‌లో మెరుగైన ర్యాంకు. దీన్ని గుర్తించి, ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించి..  ఆశించిన లక్ష్యం సాధించిన గేట్ మెకానికల్ అయిదో ర్యాంకర్, ఆంధ్రా వర్సిటీ కాలేజ్ ఆఫ్  ఇంజనీరింగ్‌లో బీటెక్ మెకానికల్ చివరి సంవత్సరం  విద్యార్థి అల్లూరి సునీల్ వర్మ సక్సెస్ స్టోరీ..
 
 శాస్త్రవేత్త కావాలన్నదే నా లక్ష్యం ఆర్‌ఎంపీ వైద్యుని కుమారుడు..  పదో తరగతి వరకు మారుమూల పల్లెలోనే విద్యాభ్యాసం.. అయినా పదిలో  మండల టాపర్‌గా నిలిచి, బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు దక్కించుకున్నాడు. ఇప్పుడు గేట్-2014లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాడుతాడూరి నవీన్..
 
 గేట్ మెకానికల్ 5వ ర్యాంకు:  ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌తో మేనేజ్‌మెంట్‌లోనూ ఉన్నతవిద్యను అభ్యసించొచ్చు. కానీ అకడెమిక్స్‌కు అనుగుణమైన విభాగాల్లో ఉన్నత విద్య పూర్తి చేసినప్పుడే సార్థకత. అందుకే మొదట్నుంచీ ఇంజనీరింగ్‌లోనే కెరీర్‌కోసం దృష్టి సారించాను. ఫలితంగా మనం అకడెమిక్స్‌లో చదివిన అంశాలను క్షేత్రస్థాయిలో అన్వయం చేసేందుకు అవకాశం లభిస్తుంది. వృత్తి పరంగానూ సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనికితోడు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ పట్ల నెలకొన్న ఆసక్తి కూడా ఈ విభాగంలో అడుగుపెట్టేందుకు దోహదం చేసింది. అందుకే ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ఇతర బ్రాంచ్‌లలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మెకానికల్ బ్రాంచ్‌లోనే చేరాను.
 
 అకడెమిక్స్.. గేట్ సిలబస్ సమన్వయంతో:

గేట్ ప్రిపరేషన్ కోసం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నుంచి పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. అకడెమిక్ సిలబస్‌ను గేట్ సిలబస్‌తో సమన్వయం చేసుకుని ప్రిపరేషన్ సాగించాను. అభ్యర్థుల కోణంలో గేట్ పరంగా లభించే ప్రయోజనం.. అకడెమిక్ సిలబస్‌లోని అంశాల నుంచే గేట్‌లో ప్రశ్నలు ఉంటాయి. దీంతో అకడెమిక్స్‌లో పట్టు సాధిస్తే గేట్‌లో విజయం సులువైనట్లే. ఇదే వ్యూహం అనుసరించి.. బీటెక్ అకడెమిక్స్‌తో సమాంతరంగా రోజుకు రెండు గంటలు.. పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు చొప్పున చదివాను. గేట్ సిలబస్‌లోని అంశాలపై ముందుగా స్పష్టత ఏర్పరచుకోవాలి. అప్పుడు ప్రిపరేషన్ పరంగా సమయం ఆదా అవడంతోపాటు ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
 
 ఆన్‌లైన్ టెస్ట్‌లు.. అదనపు ప్రయోజనం:
 గేట్‌లో విజయానికి ఉపకరించే మరో ముఖ్య సాధనం ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరవ్వడం. ఈ ఏడాది నుంచి గేట్ అన్ని సబ్జెక్ట్‌లకు ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించడం మొదలైంది. ఈ నేపథ్యంలో మాక్-ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరవ్వడం కూడా ఎంతో ఉపయోగపడింది. ఎంట్రన్స్ తేదీకి ముందు నెల రోజుల సమయాన్ని పూర్తిగా రివిజన్‌కు కేటాయించాను. ఇలా ప్రతి దశలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ ర్యాంకు సాధించగలిగాను. వాస్తవానికి వందలోపు ర్యాంకు వస్తుందని ఊహించాను కానీ టాప్-10లో నిలవడం అనిర్వచనీయ ఆనందాన్ని కలిగిస్తోంది.
 
 ఐఐఎస్‌సీ బెంగళూరు లేదా ఐఐటీ-ముంబై:
 ప్రస్తుత ర్యాంకుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) లేదా ఐఐటీ-ముంబైలలో మెషీన్ డిజైన్ స్పెషలైజేషన్‌లో ప్రవేశం పొందాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇదే విభాగంలో ఆర్ అండ్ డీలో కెరీర్ లక్ష్యంగా ఎంచుకున్నాను. ఈ ఆశయంతోనే.. ఎల్ అండ్ టీ, విప్రో సంస్థల్లో క్యాంపస్ సెలక్షన్స్ లభించినా వదులుకుని గేట్ కోసం ఉపక్రమించాను.
 
 కచ్చితత్వంతో చదవాలి:
 గేట్ ప్రిపరేషన్ పరంగా ఔత్సాహికులకు ఇచ్చే సలహా.. ఎంత చదివామనే దానికంటే చదివిన అంశాలను ఎంత బాగా ఒంటబట్టించుకున్నామన్నదే ప్రధానమని గుర్తించాలి. ముఖ్యంగా నెగెటివ్ మార్కింగ్ ఉన్న గేట్‌లో ఇది కీలకం. చాలా మంది విద్యార్థులు మొత్తం సిలబస్‌ను పూర్తి చేయాలని.. అప్పుడే సత్ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. దీనివల్ల అందుబాటులో ఉన్న సమయంలో అన్ని అంశాలు పూర్తి చేయలేక చివరి నిమిషంలో మానసిక ఆందోళనకు గురవుతారు.
 
  కానీ సిలబస్‌లో 80 నుంచి 85 శాతం అంశాలను కచ్చితత్వంతో పూర్తిచేస్తే సరిపోతుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో బీటెక్‌లో రెండో ఏడాది చివరి నుంచి లేదా మూడో ఏడాది నుంచి గేట్ కోసం ఉపక్రమిస్తే సత్ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా గేట్ ఆన్‌లైన్ స్లాట్ సమయం కూడా ఒక నెలరోజుల ముందే తెలుస్తుంది. ఆ సమయంలోనే మాక్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరైతే మానసికంగా సంసిద్ధత లభిస్తుంది.

 గేట్ ఈసీఈ 8వ ర్యాంకు
 మా స్వస్థలం కరీంనగర్ జిల్లా, కమలాపూర్ మండలంలోని శనిగరం. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. 2008లో పదో తరగతిలో 545 మార్కులతో మండల టాపర్‌గా నిలిచాను. ఫలితంగా ఆ ఏడాదే మొదలైన ఏపీ ట్రిపుల్ ఐటీల్లో బాసర క్యాంపస్‌లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశం లభించింది. మొదటి రెండేళ్లు అందరికీ ఉమ్మడిగా ఉండే పీయూసీ (ఎంబైపీసీ) చదివాను. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ పరికరాలపై నాకు చాలా ఆసక్తి. దాంతో వాటి పనితీరు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌ను ఎంచుకున్నాను.
 
 స్ఫూర్తి నింపిన మాటలు:
 బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మా బ్యాచ్ ప్రారంభమైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపస్‌కు వచ్చారు. ఆ సందర్భంగా..‘‘మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని కూడా నెలకొల్పాం. తొలుత ఒక్కో క్యాంపస్‌కు వేయి సీట్లు మాత్రమే అనుకున్నప్పటికీ.. మీలాంటి విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల సీట్లకు పెంచాం. మీరంతా పెద్ద చదువులు చదువుకొని ప్రయోజకులు అయినప్పుడే మా ఆశలు నెరవేరుతాయి’’ అంటూ ఆయన ఉద్విగ్నంగా మాట్లాడారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఆ స్ఫూర్తి పట్టుదలగా చదవడానికి సహకరించింది.
 
 గేట్ లక్ష్యంగా:
 ట్రిపుల్ ఐటీలలోని ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో చేరిన రెండో ఏడాది నాకు గేట్ గురించి తెలిసింది. గేట్ ప్రాధాన్యాన్ని వివరించడంలో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల పాత్ర ఎంతో ఉంది. అందులో రాణించేందుకు అవసరమైన మెటీరియల్‌ను సైతం అందుబాటులో ఉంచారు. అప్పటికే ఎలక్ట్రానిక్స్ అంటే సహజమైన ఆసక్తి ఉండటంతో ఉన్నత విద్య దిశగా ‘గేట్’ను లక్ష్యంగా ఎంచుకున్నాను.
 
 బీటెక్+గేట్.. సమాంతర ప్రిపరేషన్:
 గేట్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదవడం ప్రారంభించాను. ఒకవైపు బీటెక్ కోర్సు సబ్జెక్టులు చదువుతూనే గేట్‌కు ప్రిపేర్ కావడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. బీటెక్‌లో కోర్ సబ్జెక్టులను మొదట్నుంచీ లోతుగా అధ్యయనం చేయడం ఎంతో లాభించింది. మరోవైపు.. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించిన వీడియో లెక్చర్స్‌ను అందించేవారు. ఇది కూడా ఎంతో ఉపయోగపడింది. ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ విభాగాల విషయంలో కొంత ఇబ్బందిపడ్డాను. లేకుంటే మరిన్ని మార్కులు వచ్చేవి.
 
 మాక్ టెస్ట్‌లతో మరింత పదును:
 గేట్ పరీక్షపై అవగాహన కోసం 2013 వేసవి సెలవు ల్లో రెండు నెలలు శిక్షణ తీసుకున్నాను. ఆ సందర్భం గా నిర్వహించిన మాక్ టెస్ట్‌లు బాగా ఉపయోగపడ్డాయి. వీటివల్ల పరీక్షలో ప్రశ్నలు అడిగే తీరు, వాటి క్లిష్టత తదితర అంశాలపై అవగాహన వచ్చింది.
 
 లోతుగా అధ్యయనం:
 గేట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్ష అంటే చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతారు. ఈ క్రమంలో మార్కెట్లో లభించే ప్రతి మెటీరియల్‌ను చదవాలని, లేదంటే విఫలమవుతామనే అపోహలో ఉంటారు. బీటెక్ తొలి ఏడాది నుంచే సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేస్తే మంచి ర్యాంకు సాధించడం సులభమే. రోజుకు నాలుగైదు గంటల ప్రిపరేషన్‌తో బీటెక్ సబ్జెక్ట్‌లు, గేట్ ప్రిపరేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి, గేట్‌కు అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈ విషయంలో సీనియర్లు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. నేను ఇదే ఫార్ములా అనుసరించాను.
 
 శాస్త్రవేత్త.. నా లక్ష్యం:
 ప్రస్తుత గేట్ ర్యాంకుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరులో మైక్రో ఎలక్ట్రానిక్స్ చదవాలని భావిస్తున్నాను. అది పూర్తయ్యాక డీఆర్‌డీఓలో సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడమే లక్ష్యం. ఇది వ్యక్తిగత సంతృప్తిని ఇవ్వడంతోపాటు సమాజానికి సేవ చేసేందుకు కూడా దోహదపడుతుంది.
 
 నా సలహా:
 భవిష్యత్తులో గేట్ రాసే విద్యార్థులకు ఒకటే సలహా.. బీటెక్‌లోని ప్రతి సబ్జెక్టును కాన్సెప్ట్స్ ఆధారితంగా చదవండి. కాన్సెప్ట్‌లపై అవగాహన పొందుతూ పాత ప్రశ్న పత్రాలను బాగా ప్రాక్టీస్ చేయండి. తద్వారా ఓ వైపు బీటెక్, మరోవైపు గేట్ రెండు గమ్యాలు ఒకే సమయంలో చేరుకోవచ్చు.
 
 అకడమిక్ నేపథ్యం:
    పదో తరగతి: 545 మార్కులు (2008లో)
  ట్రిపుల్ ఐటీలో పీయూసీ:
 2010లో 95.7శాతం (ఎంబైపీసీ).
     {పస్తుతం బీటెక్ ఈసీఈ చివరి సెమిస్టర్. ఇప్పటి వరకు 90.6 శాతం మార్కులు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement