మూడు సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశం? | Indian geography | Sakshi
Sakshi News home page

మూడు సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశం?

Published Mon, Dec 19 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

మూడు సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశం?

మూడు సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశం?

భారతదేశ తీర మైదానాలు దక్కన్‌ పీఠభూమికి ఇరువైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వెంబడి వివిధ వెడల్పుల్లో తీర మైదానాలున్నాయి. ఇవి రెండు రకాలు.. అవి..
పశ్చిమ తీర మైదానం
తూర్పు తీర మైదానం

పశ్చిమ తీర మైదానం
ఈ మైదానం దక్కన్‌ పీఠభూమికి పశ్చిమం వైపున, అరేబియా సముద్రం మధ్య వ్యాపించి ఉంది. ఈ మైదానం సన్నగా, అసమానంగా అక్కడక్కడా కొండలున్న భూభాగంతో గుజరాత్‌ తీరంలోని ‘రాణా ఆఫ్‌ కచ్‌’ నుంచి దక్షిణాన ‘కన్యాకుమారి’ వరకు విస్తరించి ఉంది.
ఈ మైదానాలు ఇరుగ్గా, తక్కువ వెడల్పుతో ఉంటాయి (10–25 కి.మీ).
ఈ మైదానాల్లో డెల్టాలు, కయ్యలు మాత్రమే ఉన్నాయి.
గమనిక: నదులు తమతోపాటు తెచ్చిన ఒండ్రు మట్టిని వాటి ముఖద్వారం వద్ద నిక్షేపించకుండా సముద్రంలో కలిస్తే ఆ ప్రాంతాలను కయ్యలు అంటారు.
పశ్చిమ తీర రేఖ సచ్ఛిద్రంగా రంపపు పళ్ల నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ మైదానంపై భ్రంశాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ మైదానం సహజ ఓడ రేవులకు ప్రసిద్ధి చెందింది.
పశ్చిమ కనుమల పశ్చిమ వాలు ఎక్కువగా ఉండటం, పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య దూరం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ డెల్టాలు లేవు.
పశ్చిమ తీర మైదానాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి..

1. గుజరాత్‌ మైదానం
ఇది గుజరాత్‌లోని ‘రాణా ఆఫ్‌ కచ్‌’ నుంచి ‘డామన్‌’ వరకు విస్తరించి ఉంది. ఇక్కడున్న తీరాన్ని గుజరాత్‌ తీరం/కాండ్లా తీరం/ కథియవార్‌ తీరం/గిర్నార్‌ తీరం అని పిలుస్తారు.
ఈ మైదానం అటుపోట్లకు ప్రసిద్ధి.
ఈ తీర మైదానంలో ప్రవహించే నదులు– నర్మద, తపతి, సబర్మతి.
ఈ మైదాన తీరంలో ‘గిర్‌నార్‌’ కొండలున్నాయి. ఈ కొండల్లో ఎత్తయిన శిఖరం – గిర్‌ శిఖరం.
గిర్‌నార్‌ కొండల్లో ‘గిర్‌ నేషనల్‌ పార్క్‌’ (జునాగఢ్‌ – గుజరాత్‌) ఉంది.

2. కొంకణ్‌ మైదానం
ఈ మైదానం డామన్‌ నుంచి గోవా వరకు విస్తరించి ఉంది. ఇది మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఉంది.
ఈ తీర మైదానం బసాల్ట్‌ నేలలకు ప్రసిద్ధి. దీన్ని కొంకణ్‌ తీరం అని కూడా పిలుస్తారు.
3. కర్ణాటక మైదానం
ఇది ‘గోవా’ నుంచి కన్ననూర్‌ వరకు విస్తరించి ఉంది. దీన్ని కెనరా తీరం అని కూడా పిలుస్తారు.
ఈ మైదానం గుండా శరావతి, నేత్రావతి నదులు ప్రవహిస్తున్నాయి.
ఈ మైదానంలో ప్రవహించే శరావతి నదిపై దేశంలోకెల్లా అతి ఎత్తయిన జలపాతం జోగ్‌(జర్సొప్పా) ఉంది. దీని ఎత్తు సుమారు 275 మీ.
ఈ తీర మైదానం కయ్యలకు ప్రసిద్ధి.

4. కేరళ మైదానం
ఈ మైదానం కన్ననూర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. దీన్ని మలబార్‌ తీరం అని కూడా పిలుస్తారు.
మలబార్‌ తీరం ఉప్పునీటి సరస్సులకు ప్రసిద్ధి. వీటినే లాగూన్‌లు (వృష్ట జలాలు) అంటారు.
ఇక్కడ ఉన్న లాగూన్‌లు– అష్టముడి, వెంబనాడ్‌.
ఇక్కడి లాగూన్‌లను స్థానికంగా కాయల్‌ అని పిలుస్తారు. ఈ కాయల్‌ను వెనుక జలాలు అంటారు.
దేశంలో పొడవైన లాగూన్, సరస్సు – చిల్కా సరస్సు (ఒడిశా)
దేశంలో అత్యధికంగా లాగూన్లు విస్తరించి ఉన్న మైదానం – మలబార్‌ తీరం
ఈ మైదానంలో ప్రవహించే నదులు –పెరియార్, పంబ, భద్రావతి మొదలైనవి.
దేశంలో పశ్చిమ, తూర్పు తీరాల పొడవు – 6,100 కి.మీ
దేశంలో అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం – గుజరాత్‌ (1,054 కి.మీ.) రెండోది ఆంధ్రప్రదేశ్‌ (974 కి.మీ.)

తూర్పు తీర మైదానం
ఈ మైదానం దక్కన్‌ పీఠభూమికి తూర్పున, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది.
ఈ మైదానం పశ్చిమ తీర మైదానంలా కాకుండా బల్లపరుపుగా ఉండి ఎక్కువ వెడల్పుతో (సుమారు 120 కి.మీ) ఉంది.
ఈ మైదానం దక్షిణాన కన్యాకుమారి నుంచి ఈశాన్యంగా సువర్ణ రేఖ నది మీదుగా గంగానది ముఖ ద్వారం వరకు (సుమారు 1,800 కి.మీ పొడవున) విస్తరించి ఉంది.
తూర్పు తీరంలో మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులతో ఏర్పడిన డెల్టాలున్నాయి.
గమనిక: నదులు తమతోపాటు తెచ్చిన ఒండ్రు మట్టిని నది ముఖద్వారం వద్ద నిక్షేపంæచేసి, సముద్రంలో కలిసే ప్రాంతాన్ని డెల్టా అంటారు.

ఈ తీరంలోని డెల్టాలు దక్షిణ భారతదేశ ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి.
తూర్పు తీరంలో పొడవైన తీరం ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.
తూర్పు తీర మైదానం విశాలమైన బీచ్‌లతో ఉంది.
విరూపకారక బలాల వల్ల బంగాళాఖాతం.. ఖండ భూభాగం నుంచి క్రమంగా తిరోగమిస్తోంది.
తూర్పు తీరంలోని హుగ్లీ నది ముఖద్వారం వద్ద, సముద్రంలోని ఖండ భాగాలు తిరోగమనం చెందడం వల్ల న్యూమూరో దీవులు ఆవిర్భవించాయి.
ఒకప్పుడు కొల్లేరు సరస్సు తూర్పు మైదానంలో కృష్ణ–గోదావరి నదీ డెల్టాల మధ్య ఉప్పు నీటి సరస్సుగా ఉండేది. అనంతరం బంగాళాఖాతం క్రమంగా ఖండ భూభాగం నుంచి తిరోగమించడంతో కొల్లేరు సరస్సు ప్రస్తుతం తీరానికి దూరంగా ఖండ భూభాగంపై మంచినీటి సరస్సుగా ఆవిర్భవించింది.తూర్పు తీర మైదానాన్ని వివిధ మైదానాలుగా విభజించవచ్చు. అవి..

1. తమిళనాడు మైదానం
దీన్ని కోరమాండల్‌ తీరం అని కూడా అంటారు. ఇది కన్యాకుమారి నుంచి పులికాట్‌ సరస్సు వరకు వ్యాపించి ఉంది.
ఈ మైదానంలో ప్రవహించే నది – కావేరి.
దీన్ని ప్రాచీన కాలంలో చోళ మండలం అని పిలిచేవారు.
పులికాట్‌ సరస్సుకు సమీపంలోనే శ్రీహరి కోట ద్వీపం ఉంది.    ఇక్కడే సతీష్‌ ధావన్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రం (షార్‌) ఉంది.
పులికాట్‌ సరస్సును ఆనుకొని నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఉంది.

గమనిక:
మనదేశంలో మూడు సముద్రాల తీర రేఖ కలిగిన రాష్ట్రం – తమిళనాడు.
మూడు సముద్రాల తీర రేఖ కలిగిన ప్రదేశం–కన్యాకుమారి (తమిళనాడు)

2. ఆంధ్రా మైదానం
దీన్ని కోస్తా తీరం లేదా సర్కార్‌ తీరం అని పిలుస్తారు.
ఇది పులికాట్‌ సరస్సు నుంచి బరంపురం (ఒడిశా) వరకు విస్తరించి ఉంది.
ఈ మైదానంలో గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలు విస్తరించి ఉన్నాయి.
కృష్ణా–గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు ఉంది. ఇందులో కలిసే నదులు – బుడమేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు.
కొల్లేరు సరస్సులోని నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే నది – ఉప్పుటేరు.

3. ఉత్కళ మైదానం
దీన్ని ఒడిశా తీరం/కళింగ తీరం/ఒడియాతీరం అని కూడా పిలుస్తారు.
ఈ మైదానం బరంపురం నుంచి సుందర్‌బన్స్‌ వరకు వ్యాపించి ఉంది.
ఈ మైదానంలో ఉన్న డెల్టా– మహానది. ఇక్కడ చిల్కా సరస్సు ఉంది. ఇందులో రిడ్లే తాబేళ్లను సంరక్షిస్తున్నారు.
ఈ తీరంలో సిమ్లిపాల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది.

4. వంగ తీరం
దీన్ని కాంతి తీర మైదానం అని పిలుస్తారు.
ఇది సుందర్‌బన్స్‌ నుంచి గంగానది ముఖద్వారం వరకు విస్తరించి ఉంది.
ఇక్కడ గంగానది డెల్టా ఉంది. దీన్ని బెంగాలీ తీరం అని కూడా పిలుస్తారు.
ఈ తీరంలో మడ అడవులున్నాయి.
ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన సుందర్‌బన్స్‌ డెల్టా ఈ తీర మైదానంలోనే ఉంది.

పశ్చిమ తీరాలు      –    రాష్ట్రాలు
కాండ్లా తీరం        –    గుజరాత్‌
కొంకణ్‌ తీరం    –    మహారాష్ట్ర, గోవా
కెనరా తీరం    –    కర్ణాటక
మలబార్‌ తీరం    –    కేరళ

తూర్పు తీరాలు    –    రాష్ట్రాలు
కోరమాండల్‌ తీరం    –    తమిళనాడు     
సర్కార్‌ తీరం    –    ఆంధ్రప్రదేశ్‌
ఉత్కళ/కళింగ తీరం    –    ఒడిశా
వంగ తీరం    –    పశ్చిమ బెంగాల్‌

ఎడారులు
భారత ఉప ఖండంలో అతి పెద్ద ఎడారి థార్‌. దీన్ని భారతదేశ గొప్ప ఎడారి అంటారు. ఇది ఆరావళి పర్వతాలకు వాయవ్యంగా, సుమారు 2 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ ఎడారి భారతదేశంలో అత్యధికంగా, పాకిస్థాన్‌లో కొద్ది భాగం విస్తరించి ఉంది. ఈ ఎడారి రాజస్థాన్‌లో అధిక భాగం,

పంజాబ్, హరియాణాల్లో కొంత భాగం విస్తరించి ఉంది.

ఈ ఎడారిలో వార్షిక వర్షపాతం అతి తక్కువగా (10 సెం.మీ–50 సెం.మీ) ఉండటం వల్ల ముళ్ల పొదల వంటి ఉద్భిజ్జాలు (జెరోఫైటిక్‌ వృక్షాలు) అక్కడక్కడా ఉన్నాయి.

ఈ ఎడారి ప్రాంతంలో జోధ్‌పూర్, బికనీర్, జైసల్మీర్‌ మొదలైన పట్టణాలున్నాయి.

పోఖ్రాన్‌ అణుపరిశోధన ఇక్కడే జరిపారు.

నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో జన్మించి ఎడారుల మీదుగా ప్రవహించే నదులను ఎడారి జీవనదులు లేదా ఎక్సోటిక్‌ రివర్స్‌ అని పిలుస్తారు.
ఈ ఎడారిలో సింధూ నది ప్రవహిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement