12 మంది సిబ్బందిని కాపాడిన కోస్ట్‌గార్డ్
పాక్ అధికారుల సహకారంతో ఆపరేషన్ విజయవంతం
పోర్బందర్: అరేబియా సముద్ర జలాల్లో పయనిస్తున్న ఓ వాణిజ్య నౌక మునిగిపోవడంతో అందులో ఉన్న మొత్తం 12 మంది భారతీయ సిబ్బందిని మన తీర రక్షక దళం(ఐసీజీ) కాపాడింది. మన ప్రాదేశిక జలాల ఆవల చోటుచేసుకున్న ఈ ఘటనలో పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్‌ఏ)సత్వరమే స్పందించి, సహకారం అందించినట్లు ఐసీజీ వెల్లడించింది.
ఎంఎస్‌వీ ఏఐ పిరన్‌పిర్ అనే వాణిజ్య నౌక సరుకుతో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి ఈనెల 2న గుజరాత్‌లోని పోర్బందర్‌కు బయలుదేరింది. అయితే, బుధవారం ఉదయం సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితులతో లోపలికి భారీగా నీరు చేరి పాక్ ఆర్థిక జోన్ పరిధిలో ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది.
ఓడలోని సిబ్బంది ముంబైలోని ఐసీజీ విభాగం మారిటైం రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్‌సీసీ)కు రక్షించాలంటూ సందేశం పంపారు. దీనిని ఎంఆర్‌సీసీ గాందీనగర్‌లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి చేరవేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ విభాగం ఘటన జరిగిన పీఎంఎస్‌ఏ విభాగానికి అత్యవసర మెయిల్ పంపించింది. పిరన్‌పిర్ ఓడలోని సిబ్బంది చిన్న లైఫ్ బోట్‌లో తప్పించుకున్నారని, దాని జాడ కనిపెట్టాలని కోరింది.
తక్షణమే స్పందించిన పీఎంఎస్‌ఏ ఆ సమీపంలోని మరో వాణిజ్య నౌకకు, నేవీకి సమాచారం అందించింది. ఐసీజీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పీఎంఎస్‌ఏ సిబ్బంది విమానం ద్వారా గాలించి చివరికి లైఫ్ బోట్ జాడ కనిపెట్టారు. ఆ మేరకు ఐసీజీ సార్థక్ ఓడలో మొత్తం 12 మందినీ తీసుకుని, పోర్బందర్‌కు తరలించింది.
పాక్ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఐసీజీ పేర్కొంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో పీఎంఎస్‌ఏ చూపిన నిబద్ధతను కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment