mrcc
-
మునిగిపోయిన వాణిజ్య నౌక..
పోర్బందర్: అరేబియా సముద్ర జలాల్లో పయనిస్తున్న ఓ వాణిజ్య నౌక మునిగిపోవడంతో అందులో ఉన్న మొత్తం 12 మంది భారతీయ సిబ్బందిని మన తీర రక్షక దళం(ఐసీజీ) కాపాడింది. మన ప్రాదేశిక జలాల ఆవల చోటుచేసుకున్న ఈ ఘటనలో పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ)సత్వరమే స్పందించి, సహకారం అందించినట్లు ఐసీజీ వెల్లడించింది. ఎంఎస్వీ ఏఐ పిరన్పిర్ అనే వాణిజ్య నౌక సరుకుతో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి ఈనెల 2న గుజరాత్‌లోని పోర్బందర్కు బయలుదేరింది. అయితే, బుధవారం ఉదయం సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితులతో లోపలికి భారీగా నీరు చేరి పాక్ ఆర్థిక జోన్ పరిధిలో ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది. ఓడలోని సిబ్బంది ముంబైలోని ఐసీజీ విభాగం మారిటైం రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)కు రక్షించాలంటూ సందేశం పంపారు. దీనిని ఎంఆర్సీసీ గాందీనగర్‌లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి చేరవేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ విభాగం ఘటన జరిగిన పీఎంఎస్ఏ విభాగానికి అత్యవసర మెయిల్ పంపించింది. పిరన్పిర్ ఓడలోని సిబ్బంది చిన్న లైఫ్ బోట్లో తప్పించుకున్నారని, దాని జాడ కనిపెట్టాలని కోరింది. తక్షణమే స్పందించిన పీఎంఎస్ఏ ఆ సమీపంలోని మరో వాణిజ్య నౌకకు, నేవీకి సమాచారం అందించింది. ఐసీజీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పీఎంఎస్ఏ సిబ్బంది విమానం ద్వారా గాలించి చివరికి లైఫ్ బోట్ జాడ కనిపెట్టారు. ఆ మేరకు ఐసీజీ సార్థక్ ఓడలో మొత్తం 12 మందినీ తీసుకుని, పోర్బందర్కు తరలించింది. పాక్ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఐసీజీ పేర్కొంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో పీఎంఎస్ఏ చూపిన నిబద్ధతను కొనియాడింది. -
చిన్న సంకేతం.. పెద్ద ఫలితం
సాక్షి, విశాఖపట్నం : పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లారు.. అనుకోని ఆపద ఎదురైంది. ఇక ప్రాణాలతో బయటపడలేమనుకున్నారు. అయినా ఆశగా చివరి క్షణం వరకూ పోరాడారు. ఫలితం దక్కింది. వారు పంపిన చిన్న సంకేతం చెన్నై అధికారులకు చేరింది. అక్కడి నుంచి సమాచారం అందుకున్న విశాఖ కోస్ట్‌గార్డ్ దళాలు రంగంలోకి దిగి మత్స్యకారులను కాపాడి తీరానికి చేర్చారు. నేవల్ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. కమాడి శ్రీకాంత్‌కు చెందిన ఫిషింగ్ బోటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి ఈ నెల 10వ తేదీన ఎనిమిది మంది మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లింది. 15వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో విశాఖకు ఆగ్నేయంగా సుమారు 104 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసరికి బోటులో సాంకేతిక సమస్య తలెత్తింది. గేర్‌బాక్స్ చెడిపోవడంతో బోటు అక్కడే నిలిచిపోయింది. దాన్ని బాగు చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరి ప్రయత్నంగా ప్రమాద సంకేతాలు పంపే డిస్ట్రెస్ అలెర్ట్‌ను వినియోగించారు. ఆ ప్రయత్నం ఫలించింది. అది పంపిన సంకేతాలను చెన్నైలోని కోస్ట్‌గార్డ్ మారిటైమ్ రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ) అందుకుంది. వెంటనే విశాఖ కోస్ట్‌గార్డ్ అధికారులకు సమాచారం అందించింది. ఎంఆర్సీసీ నుంచి సమాచారం రాగానే విశాఖలోని కోస్ట్‌గార్డ్ ఆపరేషన్ సెంటర్ (డిస్ట్రిక్ హెడ్‌క్వార్టర్ నెం.6) నుంచి రక్షణ చర్యలకు కమాండెంట్ హెచ్ఎస్ షెరావత్ నేతృత్వంలో కోస్ట్‌గార్డ్ నౌక రాజ్వీర్ బయలుదేరింది. నడి సముద్రంలో నిలిచిపోయిన ఫిషింగ్ బోటును అన్వేషిస్తూ ముందుకుసాగింది. ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి 12.35 గంటల సమయంలో దాని ఆచూకీని కనుగొంది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే ఫిషింగ్ బోటులోని మత్స్యకారులను కాపాడి వారికి ఆహారం, ప్రాథమిక వైద్యం అందించారు. అక్కడి నుంచి వారిని, ఫిషింగ్ బోటును తీసుకుని బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ తీరానికి చేరుకున్నారు. మత్స్యకారుల వివరాలు తెలుసుకుని వారిని స్వస్థలాలకు పంపించారు.