విదేశీ విద్య/స్టడీ అబ్రాడ్ అనగానే సాధారణంగా ఎంఎస్, ఎంటెక్, ఎంబీఏ వంటి పీజీ స్థాయి కోర్సులే గుర్తుకొస్తాయి.
విదేశీ విద్య/స్టడీ అబ్రాడ్ అనగానే సాధారణంగా ఎంఎస్, ఎంటెక్, ఎంబీఏ వంటి పీజీ స్థాయి కోర్సులే గుర్తుకొస్తాయి. ఏటా దాదాపు 2 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు విదేశీ విద్య కోసం పయనమవుతున్నారు. చాలామంది మన దేశంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే విదేశీ విద్య దిశగా ఆలోచిస్తారు. కాని ఇప్పుడు స్వదేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో తీవ్ర పోటీ.. విదేశాల్లో ఓ మాదిరి
ఫీజులు, స్కాలర్‌షిప్‌లతో తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్య లభిస్తుండటంతో బ్యాచిలర్ స్థాయిలోనే ఫారిన్ ఎడ్యుకేషన్ వైపు అడుగులేస్తున్నారు. +2/ఇంటర్మీడియెట్ తర్వాత విదేశీ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఇప్పుడు భారతీయ విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రత్యామ్నాయంగా మారుతోంది. అండర్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులకు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, జర్మనీ బెస్ట్ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి. ఫాల్ సెషన్ (ఆగస్టు/సెప్టెంబర్) అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో.. ఇంటర్ అర్హతతో స్టడీ అబ్రాడ్ బీటెక్‌పై ఆయా దేశాల వారీగా విశ్లేషణ...
అమెరికా.. అందరి చూపు అటే!
విదేశీ విద్య, విదేశీ అవకాశాల కోసం ప్రతి ఒక్కరూ చూసేది అమెరికావైపే! అందుకే విదేశీ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం అమెరికా. అమెరికాలోని పబ్లిక్, ప్రైవేట్ యూనివ ర్సిటీల సంఖ్య అక్షరాల నాలుగు వేలు. దాదాపు ప్రతి అమెరికన్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ప్రోగ్రామ్ అందిస్తోంది. మన దేశంలో బీటెక్‌గా పిలిచే కోర్సులను అక్కడ బీఎస్‌గా పేర్కొంటారు. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. 10+2తోపాటు స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(శ్యాట్), ఐఈఎల్‌టీఎస్/టోఫెల్‌లో మంచి స్కోర్లు ఉండాలి. ఇక కోర్సు ఫీజులు పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎనిమిది వేల నుంచి 15 వేల డాలర్ల మధ్యలో; ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో 10 వేల డాలర్ల నుంచి 20 వేల డాలర్ల మధ్యలో ఉంటాయి.
అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు, ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయి ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్), స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఎంజెల్స్ (యూసీఎల్‌ఏ), కార్నెగి మెలాన్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తదితర వర్సిటీలకు మంచి పేరుంది.
కొన్ని ముఖ్య స్కాలర్‌షిప్స్:
ఫుల్‌బ్రైట్ ఫారెన్ స్టూడెంట్ ప్రోగ్రామ్
రోటరీ ఇంటర్నేషనల్ అంబాసిడరియల్ స్కాలర్‌షిప్స్
జేఎన్ టాటా ఎండోమెంట్
యూకే... మరో మంచి గమ్యం
విదేశాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు ఔత్సాహికులకు మరో మంచి గమ్యం.. యూకే. ప్రతి ఏటా సెప్టెంబర్/అక్టోబర్‌లలో అకడమిక్ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇందుకోసం కనీసం ఆరు నెలల ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. సెప్టెంబర్ అడ్మిషన్‌లకు దరఖాస్తు గడువు జూన్‌లో ముగుస్తుంది. ఇక్కడి ఇన్‌స్టిట్యూట్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లకు సంబంధించి మరో ప్రత్యేక అంశం ఉమ్మడి ప్రవేశ విధానం. ఇందుకోసం యూనివర్సిటీస్ కాలేజెస్ అడ్మిషన్ సిస్టమ్(యూసీఏఎస్) అనే ప్రత్యేక సంస్థ ఉంది. అండర్‌గ్రాడ్యుయేట్ ఔత్సాహికులు యూసీఏఎస్ ద్వారానే తమ దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. అకడమిక్ అర్హతలతోపాటు శాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు తప్పనిసరి.
ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వ్యయం ఇన్‌స్టిట్యూట్‌ల విధానాల మేరకు 7,500 పౌండ్ల నుంచి 22 వేల పౌండ్ల మధ్యలో ఉంటుంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. యూకేలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్(యూసీఎల్), యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్‌బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హమ్, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ తదితర విశ్వవిద్యాలయాలకు మంచి పేరుంది. యూకేలోని విదేశీ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అవి..
కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్ అండ్ ఫెలోషిప్ ప్లాన్
చార్లెస్ వాలేస్ ఇండియా ట్రస్ట్ అవార్డ్స్ అండ్ ఫెలోషిప్స్
ఫెలిక్స్ స్కాలర్‌షిప్స్
బ్రెండిష్ ఫ్యామిలీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్
వెబ్‌సైట్: www.educationuk.org
ఆస్ట్రేలియా.. పెరుగుతున్న అవగాహన
విదేశాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సును అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా పట్ల ఆసక్తి చూపుతున్నారు. కోర్సుల ఎంపికలో విద్యార్థికి ఇక్కడ ఎంతో వెసులుబాటు ఉంటుంది. మేజర్స్, డబుల్ మేజర్స్, మైనర్స్ ఇలా విస్తృత స్థాయిలో ఆఫ్షన్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు నాలుగే ళ్లలో పూర్తవుతుంది. ఇన్‌స్టిట్యూట్‌ల నిబంధనల మేరకు ట్యూషన్ ఫీజు 9 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 14 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల మధ్య ఉంటోంది. +2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఐఈఎల్‌టీఎస్/టోఫెల్ స్కోర్ తప్పనిసరి. ఐఈఎల్‌టీఎస్‌లో 6 పాయింట్లకుపైగా స్కోరు సాధించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడి కోర్సులకు ప్రతి ఏటా రెండుసార్లు (ఫిబ్రవరి/జూలై) అడ్మిషన్లు జరుగుతాయి. కనీసం ఆరు నెలల ముందుగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకుంటే.. ప్రవేశాల పరంగా ముందంజలో ఉండొచ్చు. ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అందించడంలో యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్‌వేల్స్ తదితర వర్సిటీలకు మంచి పేరుంది.
వెబ్‌సైట్: www.studyinaustralia.gov.au
న్యూజీలాండ్
తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్న దేశం.. న్యూజిలాండ్. దాదాపు 25పైగా పబ్లిక్, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్న న్యూజీలాండ్‌లో.. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును మన కరెన్సీలో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలోపే పూర్తి చేయొచ్చు. ఇటీవల కాలంలో మన దేశం నుంచి విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2012-13 విద్యా సంవత్సరంలో దాదాపు పది వేల మంది భారతీయ విద్యార్థులు న్యూజీలాండ్‌లోని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్‌డీ వరకు పలు కోర్సులు అభ్యసించారు.
వెబ్‌సైట్: www.enz.gov.nz
సింగపూర్
విదేశీ విద్యార్థులకు బెస్ట్ డెస్టినేషన్‌గా మారుతున్న ఆసియా ఖండంలోని దేశం.. సింగపూర్. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ఇక్కడి ఇన్‌స్టిట్యూట్‌లు ప్రామాణికంగా మారుతున్నాయి. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. 10+2తోపాటు శాట్ స్కోర్ తప్పనిసరి. ఏడాదికి 24 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్లలోపు ఫీజులు ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడి పబ్లిక్ యూనివర్సిటీలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలకు.. ప్రతిష్టాత్మక డ్యూక్ యూనివర్సిటీ, జార్జియా టెక్ యూనివర్సిటీ, ఎంఐటీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లతో అకడమిక్ ఒప్పందాలు ఉన్నాయి. ఫలితంగా ఈ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులకు ఒకే సమయంలో రెండు అంతర్జాతీయ సర్టిఫికెట్లు పొందే అవకాశం లభిస్తుంది.
కెనడా
అమెరికా, యూకే లాంటి దేశాలతో పోల్చుకుంటే కెనడా ఇమ్మిగ్రేషన్‌కు అనుకూలం. అందుకే ఈ దేశం అంతర్జాతీయ విద్యార్థులకు అధికంగా ఆకట్టుకుంటోంది. గతేడాదితో పోలిస్తే ఈ దేశ యూనివర్సిటీల్లో చేరే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా 50 శాతం పెరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సులకు అంతర్జాతీయంగా క్రేజ్ పెరుగుతున్న దేశం కెనడా. ఇంటర్మీడియెట్‌తోపాటు ఐఈఎల్‌టీఎస్/టోఫెల్ స్కోర్‌తో ఇక్కడి నాలుగేళ్ల ఇంజనీరింగ్ బ్యాచిలర్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ట్యూషన్ ఫీజుల భారం తక్కువే. మరోవైపు అకడమిక్‌గా ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి స్కాలర్‌షిప్ సదుపాయాలు కూడా లభిస్తాయి. వీటితోపాటు మన దేశంలోని ప్రముఖ సంస్థలు కూడా స్కాలర్‌షిప్స్ పేరిట ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. కెనడాలో ఇంజనీరింగ్ అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అందించడంలో వాటర్లూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టొరెంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, మెక్‌గిల్ యూనివర్సిటీ, మెక్ మాస్టర్ యూనివర్సిటీలకు మంచి పేరుంది.
Ððl»Œæ-OòÜsŒæ: www.educationauincanada.ca,
www.studycanada.ca
జర్మనీ.. పరిశోధనల దిశగా పునాది
భవిష్యత్తులో పరిశోధనలు చేయాలనుకునే విద్యార్థులకు బీటెక్ స్థాయి నుంచే బలమైన పునాదులు వేసుకునే అవకాశం కల్పిస్తున్న దేశం.. జర్మనీ. మూడు వందలకుపైగా యూనివర్సిటీలు ఉన్న ఈ దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫీజుల పరంగానూ విద్యార్థులకు ఎంతో వెసులుబాటు లభిస్తోంది. అన్ని యూనివర్సిటీలకు ప్రభుత్వ నిధులు సమకూరుతున్నాయి. దీంతో ఫీజు వ్యయం చాలా తక్కువ. వెబ్‌సైట్: www.daad.de
బెస్ట్ కోర్సు.. బెటర్ ఇన్‌స్టిట్యూట్
ప్రస్తుతం భారతీయ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే పలు దేశాల్లో ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసించే అవకాశం లభిస్తోంది. అయితే విద్యార్థులు బెస్ట్ ఇన్‌స్టిట్యూట్, బెస్ట్ కోర్సు పరంగా పరిశోధన చేయాలి. తాము చేరాలనుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌కు సదరు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో ఆయా దేశాల అధికారిక వెబ్‌సైట్స్ ద్వారా తెలుసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 10+2 ఉత్తీర్ణతతోపాటు శాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి పరీక్షల స్కోర్లు కూడా దరఖాస్తు చేసుకునే సమయానికి ఉండాలి. సదరు టెస్ట్‌లకు పదో తరగతి పూర్తయినప్పటి నుంచే సిద్ధం కావడం వల్ల సరైన సమయంలో ఆశించిన గమ్యం దిశగా అడుగులు వేయడానికి వీలవుతుంది.
- తేజస్వి, డెరైక్టర్, ఫస్ట్ అకాడమీ
ఆర్థిక చేయూత..: విదేశాల్లో బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించాలనుకునే విద్యార్థులకు.. తాము ప్రవేశం పొందిన ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్కాలర్‌షిప్స్..
కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్స్; ఫుల్‌బ్రైట్ నెహ్రూ స్కాలర్‌షిప్; ఇన్‌సీడ్ స్కాలర్‌షిప్స్; అ ఖీఅఖ ఇండియా యూత్ స్కాలర్‌షిప్; టోఫెల్ స్కాలర్‌షిప్స్; ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్స్; బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్; డాక్టర్ మన్మోహన్ సింగ్ స్కాలర్‌షిప్స్; జేఎన్ టాటా స్కాలర్‌షిప్ స్కీం
టెస్ట్ స్కోర్స్ ముఖ్యం
విదేశాల్లో బీటెక్ ఔత్సాహికులకు అకడమిక్ అర్హతలతోపాటు స్టాండర్ట్ టెస్ట్ స్కోర్స్ కూడా ఎంతో ముఖ్యం. అమెరికాలోని కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు శాట్ సబ్జెక్ట్ పేపర్ స్కోర్‌ను కూడా తప్పనిసరి ప్రామాణికంగా పేర్కొంటున్నాయి. ఔత్సాహికులు +1/11వ తరగతిలో చేరిన రోజు నుంచే ప్రిపరేషన్ సాగించాలి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే శాట్‌లో కనీసం 1500 ఉంటేనే ఫలితం ఆశాజనకం.
- డి.రవి, మేనేజర్,
ప్రిన్స్‌టన్ రివ్యూ, హైదరాబాద్ బ్రాంచ్