ప‘వన’విజయం.. | interview with | Sakshi
Sakshi News home page

ప‘వన’విజయం..

Published Thu, Feb 20 2014 3:28 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

గడికోట పవన్‌కుమార్‌రెడ్డి - Sakshi

గడికోట పవన్‌కుమార్‌రెడ్డి

 ‘‘జీవితమంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు.. చుట్టూ ఉన్న నిస్సహాయుల్లో కొందరికైనా సాయపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది..’’ అంటూ తరచూ నాన్న చెప్పే మాటలే అతడి ఆచరణకు మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఆ ఆశయ సాధనకు మార్గం సుగమం చేసే ఆలిండియా సర్వీసుకు ఎంపికయ్యాడు వైఎస్సార్ కడప జిల్లా యువకుడు గడికోట పవన్‌కుమార్‌రెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షలో 26వ ర్యాంకు సాధించిన పవన్ సక్సెస్ స్పీక్స్ ఆయన మాటల్లోనే..
 
 
 మాది వైఎస్సార్ కడప జిల్లాలోని సుద్దమల్ల గ్రామం. నాన్న బాలకృష్ణారెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ రాజేశ్వరి గృహిణి. తమ్ముడు యోగానందరెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నాన్నకు ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉండేదట. కానీ, ఆర్థిక పరిస్థితులు ఆ ఆశకు అడ్డుతగిలాయి. అలాంటి పరిస్థితి మాకు రాకూడదనే ఉద్దేశం తో కష్టపడి చదివించారు.ఉన్నదాంట్లో తోటివారికి సాయపడాలని ఎప్పుడూ చెబుతుండేవారు. చెప్పడమే కాదు తాను స్వయంగా ఆచరించేవారు. ఇలా నాన్న  నింపిన స్ఫూర్తి.. ఐఎఫ్‌ఎస్ దిశగా అడుగులు వేయించింది.
 
 సివిల్స్ దిశగా:
 పాఠశాల స్థాయి నుంచి బాగానే చదివేవాణ్ని. తిరుపతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఇందులో 84 శాతం మార్కులు సాధించా. గేట్‌లో 38వ ర్యాంకు వచ్చింది. ముంబై ఐఐటీ నుంచి 9.1 పర్సంటైల్‌తో ఎంటెక్ పూర్తిచేశా. 2008లో క్యాంపస్‌లో ఉన్నప్పుడే టాటా టెక్నాలజీస్‌లో సీఏఈ అనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా.
 
 అపజయమే తొలిమెట్టు:
 ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో అపజయం ఎదురైంది. రెండోసారి మెయిన్స్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. సివిల్స్, ఐఎఫ్‌ఎస్‌కు ప్రిలిమ్స్ ఉమ్మడిగా ఉంటుంది. వేర్వేరు కటాఫ్ మార్కులతో వీటి మెయిన్స్ రాసేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సివిల్స్‌లో నా ఆప్షనల్ ఫిలాసఫీ. ఐఎఫ్‌ఎస్‌కు ఫారెస్ట్రీ, జియాలజీ సబ్జెక్టులు ఆప్షనల్స్. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. ఐఎఫ్‌ఎస్‌కు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాను. మార్కెట్‌లో దొరికే మెటీరియల్‌ను సేకరించి, సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. మెయిన్స్ పరీక్షలలో ప్రశ్నకు కిందే సమాధానం రాసేందుకు కొంత స్థలాన్ని కేటాయిస్తారు. దీనివల్ల క్షుణ్నంగా, క్లుప్తంగా సమాధానం రాయడంతో సమయం కలిసొచ్చింది.
 
 అటవీ రంగానికి అన్వయిస్తూ..
 చివరి ఘట్టమైన ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేయడానికి మాక్ ఇంటర్వ్యూలు ఉపయోగపడ్డాయి. స్నేహితులతో ప్రాక్టీస్ చేసిన మాక్ ఇంటర్వ్యూ భయాన్ని, ఒత్తిడిని అధిగమించేందుకు తోడ్పడింది. నలుగురు సభ్యులున్న బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ సాగింది. నా ప్రొఫైల్‌లోని అంశాలను, అటవీ రంగానికి అన్వయిస్తూ ప్రశ్నలు అడిగారు. ఆదివాసీలు-వారిలో వెనుకబాటుకు సంబంధించి ప్రశ్న లు అడిగారు. ప్రాంతాల వారీగా లభించే సహజ సంపదపై ప్రశ్నించారు. ఆప్షనల్స్ ప్రిపరేషన్.. ఇంటర్వ్యూకు కూడా బాగా ఉపయోగపడింది. చాలామంది ఇంటర్వ్యూ అనగానే భయపడతారు. రకరకాల అనుమానాలతో సతమతమవుతుంటారు. ఇలా భయంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెడితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బోర్డు సభ్యులెప్పుడూ అభ్యర్థి భయాన్ని దూరం చేసేలా వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రశ్నలడుగుతారు.
 
 లక్ష్య నిర్దేశనం అవసరం:
 ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను. తర్వాత రోజువారీ సాధనతో ఇంగ్లిష్‌పై పట్టు చిక్కింది. ఆలిండియా సర్వీసు పరీక్షల్లో విజయం సాధించాలంటే పటిష్ట ప్రణాళిక, కష్టపడే తత్వం అవసరం. వీటికంటే ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ప్రధానం. సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారిలో చాలా మంది సరైన చేతిరాత లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక అంశానికి సంబంధించి విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోదు.. ఆ పరిజ్ఞానాన్ని ఎగ్జామినర్‌కు అర్థమయ్యేలా స్పష్టంగా రాయడమూ ప్రధానం. దీనికోసం రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఎస్సే పేపర్ కోసం సొంత నోట్స్ బాగా ఉపయోగపడుతుంది. పక్కా వ్యూహంతో కష్టపడితే ఆలిండియా సర్వీస్‌ను చేజిక్కించుకోవడం కష్టమేమీ కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement