జాతీయం: సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధా | National news | Sakshi
Sakshi News home page

జాతీయం: సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధా

Published Wed, Apr 30 2014 10:09 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

జాతీయం:  సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధా - Sakshi

జాతీయం: సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధా

 రోడ్డు ప్రమాదాలపై కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
 రోడ్డు ప్రమాదాల నివారణపై సుప్రీం కోర్టు సత్వర చర్యలు అత్యవసరమని ఏప్రిల్ 22న వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదాల నివారణ చర్యలను సూచించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు.  రోడ్ల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల నివేదికలను అధ్యయనం చేసి కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది.
 
 గోవాలో మైనింగ్‌పై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు
 గోవాలోని అన్ని ఖనిజాల తవ్వకంపై 19 నెలలుగా ఉన్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఏప్రిల్ 21న ఎత్తేసింది. ఏటా 20 మిలియన్ టన్నుల పరిమితితో కూడిన ఇనుప ఖనిజాన్ని తవ్వుకోడానికి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ అనుమతించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలోని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ సిఫార్సుల ఆధారంగా అత్యున్నత న్యాయస్థానం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో గోవాలోని అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయనే అంశంపై 2012 సెప్టెంబరులో నిషేధం విధించింది.
 
 రాజీవ్‌గాంధీ హంతకుల విడుదలపై స్టే పొడిగించిన సుప్రీంకోర్టు
 మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఏప్రిల్ 25న పొడిగించింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితులకు శిక్ష తగ్గించే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. నిందితులకు శిక్ష తగ్గింపు తమిళనాడు ప్రభుత్వం పరిధిలోకి రాదని, అది చట్ట వ్యతిరేకమన్న కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుని పై నిర్ణయానికి వచ్చింది.

 నింగికెగిసిన ఆకాశ్
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్ క్షిపణిని భారత్ ఏప్రిల్ 26న ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించింది. ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించడానికి అనుగుణంగా రూపొందించిన ఈ క్షిపణి 25 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. 60 కిలోల వార్ హెడ్‌ను మోసుకెళుతుంది. మధ్య శ్రేణికి చెందిన  క్షిపణి యుద్ధవిమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గగనతలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను నాశనం చేస్తుంది. ఒక ఆకాశ్ వ్యవస్థ ఏకకాలంలో పలు లక్ష్యాలపై దాడి చేస్తుంది.
 
 సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధా
 భారత సుప్రీంకోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మల్ లోధాతో ఏప్రిల్ 27న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 26న పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం స్థానంలో జస్టిస్ లోధా నియమితులయ్యారు. జస్టిస్ లోధా ఐదు నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి 2014 సెప్టెంబరు 27న పదవీ విరమణ చేస్తారు.

 రాజస్థాన్‌కు చెందిన జస్టిస్ లోధా 1994 జనవరిలో రాజస్థాన్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008 మే 13న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. 2008 డిసెంబరు 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

విజయవంతమైన బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్‌‌స వ్యవస్థ
శత్రు క్షిపణులను అడ్డుకునే బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్‌‌స (బీఎండీ) వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఏప్రిల్ 27న జరిపిన దీర్ఘ శ్రేణి క్షిపణులను  ముందుగా, ఆకాశంలోనే పేల్చివేసే పృథ్వీ డిఫెన్‌‌స వెహికల్ (పీడీవీ) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి రక్షణ శాఖ ఈ ప్రయోగం నిర్వహించింది.

 పీడీవీ ఇంటర్‌సెప్టర్ క్షిపణితో పాటు బాలిస్టిక్ క్షిపణి తరహాలో రూపొందించిన లక్ష్యాన్ని కూడా ప్రయోగంలో వినియోగించారు. బంగాళాఖాతంలో నిలిపిన నౌకల నుంచి ముందుగా లక్ష్యాన్ని ప్రయోగించారు. తర్వాత ప్రయోగించిన పీడీవీ లక్ష్యాన్ని ఛేదించింది. 2000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను పీడీవీ 120 కి.మీ. కంటే ఎత్తులో ఉండగానే గుర్తించి ధ్వంసం చేస్తుంది.
 
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు, రాష్ర్టపతి పాలన పొడిగింపునకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు, రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30 తర్వాత పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 25న నిర్ణయించింది. రాష్ర్టంలో మార్చి 1 నుంచి అమల్లో ఉన్న రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30న ముగుస్తుంది. ప్రకరణ 356 సెక్షన్-3 ప్రకారం రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనను పార్లమెంట్ 60 రోజుల లోపు ఆమోదించాల్సి ఉంటుంది.

 శాసనసభ రద్దు వల్ల పార్లమెంట్ రాష్ర్టపతి పాలన మరో రెండు నెలలు పొడిగించేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం 16వ పార్లమెంటుకు సాధారణ ఎన్నికలు జరగుతుండటంతో పార్లమెంటుకు సభ్యులు హాజరు కావడం వీలుకాని పరిస్థితి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement