భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం | PM Manmohan Singh inaugurates India's first all-women bank at mumbai | Sakshi
Sakshi News home page

భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం

Published Thu, Nov 28 2013 2:21 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

PM Manmohan Singh inaugurates India's first all-women bank at mumbai

 జాతీయం

 భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం

భారతీయ మహిళా బ్యాంకు తొలి శాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నవంబర్ 19న నారీమన్ పాయింట్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున ప్రారంభించారు. మహిళ సాధికారికతలో ఈ బ్యాంకు ఏర్పాటు చిన్న అడుగు మాత్రమేనని, ఇది మహిళల అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను చూపుతుందని ప్రధానమంత్రి అన్నారు.

 

 క్యాటరింగ్, శిశు సంరక్షణ వంటి మహిళా ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలు చేపట్టేవారికి రుణాలు ఇవ్వనున్నట్లు మహిళా బ్యాంకు చైర్‌పర్సన్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా చెన్నై, బెంగళూరు, గువహటి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్  శాఖలను కూడా ప్రధాని ప్రారంభించారు. 2013-14 బడ్జెట్‌లో రూ.1000 కోట్ల మూలధనంతో పూర్తి మహిళా బ్యాంకును ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలో భాగంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు.

 

 రోహిణి (ఆర్‌హెచ్) 200 రాకెట్ ప్రయోగం

 తిరువనంతపురంలోని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి నవంబర్ 21న రోహిణి (ఆర్‌హెచ్) 200 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దీని బరువు 114 కిలోలు. ఇటువంటి రాకెట్లను ప్రత్యేకంగా మెటియోరాలజీ అధ్యయనానికి ఉపయోగిస్తారు. తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రం స్వర్ణోత్సవాల సంద్భరంగా ఈ ప్రయోగం చేపట్టారు. 1963, నవంబర్ 21న అమెరికా నిర్మించిన ‘నైకి అపాచీ’ అనే చిన్న రాకెట్‌ను తుంబా నుంచి ప్రయోగించారు. భారత భూభాగం నుంచి రాకెట్ ప్రయోగానికి అనువైన ప్రాంతంగా విక్రమ్ సారాబాయ్, ఆయన శాస్త్రవేత్తల బృందం తుంబాను ఎంపిక చేసింది.

 

 న్యూఢిల్లీలో బ్రిక్స్ కాంపిటీషన్ కాన్ఫరెన్స్

 మూడో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ కాంపిటీషన్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో నవంబర్ 21, 22 తేదీల్లో జరిగింది. బ్రిక్స్‌తోపాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ పరిస్థితుల నుంచి ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత ఆర్థిక, రాజకీయ సమన్వయం బ్రిక్స్ దేశాల మధ్య అవసరమని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్, కంటెంజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్‌ల ఏర్పాటు ద్వారా నిర్మాణాత్మకమైన సహకారానికి బ్రిక్స్ దేశాలు పూనుకున్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమావేశంలో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ సహా వివిధ అంశాలు, సవాళ్లపై చర్చలు జరిగాయి. 300 కోట్ల జనాభా గల బ్రిక్స్ దేశాల కూటమి మొత్తం జీడీపీ సుమారు రూ.14 లక్షల కోట్లుగా ఉంది.

 

 ధనుష్ క్షిపణి ప్రయోగం విజయవంతం

 సైనిక దళాలకు చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) ధనుష్ క్షిపణిని నవంబర్ 23న ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఇది నావికాదళం కోసం రూపొందించిన క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ధనుష్ అణ్వాయుధాలను మోసుకుపోగలదు. 500 కిలోల ఆయుధాలతో 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

 

 చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు సీఎన్‌ఆర్ రావు ఎన్నిక

 చైనాకు చెందిన ప్రతిష్టాత్మక చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (సీఏఎస్)లో గౌరవ విదేశీ సభ్యుడిగా ఇటీవల భారతరత్న పురస్కారం పొందిన సీఎన్‌ఆర్ రావు ఎంపికయ్యారు. సీఏఎస్‌లో సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు సీఎన్‌ఆర్ రావు. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి విజేతలు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే రావుకు లండన్‌లోని రాయల్ సొసైటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ (అమెరికా)లతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక అకాడమీల్లో సభ్యత్వం ఉంది.

 

 సంగీత నాటక అకాడమీ అవార్డులు

 ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి.రాఘవాచారి, టి.శేషాచారి ఈ ఏడాది సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికయ్యారు. హైదరాబాద్ బ్రదర్స్‌గా వీరు సుపరిచితులు. వీరు గత 45 ఏళ్లుగా కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తున్నారు. 2013 సంవత్సరానికి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (అకాడమీ రత్న), అకాడమీ అవార్డు (అకాడమీ పురస్కార్)లను నవంబర్ 25న ప్రకటించింది. ఇదే సంవత్సరానికి సంగీతం, నృత్యం, రంగ స్థలం, తోలు బొమ్మలాట విభాగాల్లో 38 మందిని అకాడమీ అవార్డు (పురస్కార్)కు సంగీత నాటక అకాడమీ ఎంపిక చేసింది.

 

 రంగ స్థల కళాకారులు కనక్ రేలె, ఆర్.సత్యనారాయణ, మహేశ్ ఎల్.కుంచార్‌లను అకాడమీ రత్న (ఫెలోషిప్)కు ఎంపిక చేశారు. ఫెలోషిప్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా, అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటివరకు 40 మంది మాత్రమే ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద తామ్ర పత్రం, అంగ వస్త్రంతోపాటు అకాడమీ ఫెలోషిప్‌నకు రూ.3,00,000, అకాడమీ అవార్డుకు రూ.లక్ష బహూకరిస్తారు.

 

 భారత్‌లో 50 శాతానికి పైగా అందుబాటులో లేని మరుగుదొడ్లు

 భారత్‌లో 50 శాతానికిపైగా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. నవంబర్ 16న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో 60 కోట్ల మందికి పైగా మరుగుదొడ్లు అందుబాటులో లేవని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవని నివేదిక తెలిపింది. 100 కోట్ల మంది బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటారని చెప్పింది. 2017 నాటికి బహిర్భూమిలో మల విసర్జన లేకుండా చేసి మరుగుదొడ్ల సమస్యను భారత్ పరిష్కరిస్తుందని నిర్మల్ భారత్ అభియాన్ అనే ప్రభుత్వ కార్యక్రమం పేర్కొంది.

 

 అంజోలీ మీనన్‌కు దయావతి మోడీ అవార్డు

 ప్రముఖ కళాకారిణి అంజోలీ ఏలా మీనన్ (73)కు దయావతి మోడీ అవార్డు లభించింది. భారత కళలు, సంస్కృతికి ఆమె చేసిన సేవకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును నవంబర్ 18న ఆమెకు ప్రదానం చేశారు. ప్రతి ఏటా దయావతి మోడీ ఫౌండేషన్ కళలు, సంస్కృతి, విద్యా రంగాల్లో కృషిచేసినవారికి ఈ అవార్డును అందిస్తోంది. ఈ అవార్డు కింద రూ.2.51 లక్షలు బహూకరిస్తారు.

 

 కోస్తాంధ్రలో హెలెన్ తుపాను విధ్వంసం

 హెలెన్ తుపాను ధాటికి కోస్తా జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. నవంబర్ 22న వచ్చిన వర్షాలు, గాలులకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, విశాఖపట్నం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. 11 మంది మరణించారు. 600 గ్రామాలపై ఈ తుపాను ప్రభావం చూపింది. 40,000ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూడు లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో కొబ్బరి, పది వేల ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది.

 

 

 అంతర్జాతీయం

 మావెన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాసా

 అంగారక గ్రహంపై వాతావరణ పరిశోధన చేపట్టేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. మార్స్ అట్మాస్పియర్ అండ్ ఓలటైల్ ఎవల్యూషన్ (మావెన్) అనే ఉపగ్రహాన్ని నవంబర్ 18న ప్రయోగించింది. అట్లాస్ - 5 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఇది పది నెలలపాటు రోదసీలో ప్రయాణించి 2014, సెప్టెంబర్ 22న అంగారకుడి కక్ష్యలో చేరుతుంది. నాసా 2.5 మీటర్ల పొడవు, 2453 కిలోల బరువు గల మావెన్ కోసం 67.1 కోట్ల డాలర్ల వ్యయం చేసింది. 2030 నాటికి అంగారక గ్రహంపైకి మానవ సహిత యాత్ర చేపట్టేందుకు మావెన్ తోడ్పడుతుంది.

 

 నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడెరిక్ సాంజెర్ మృతి

 రసాయన శాస్త్రవేత్త, రెండుసార్లు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడెరిక్ సాంజెర్ (95) లండన్‌లో నవంబర్ 19న మరణించారు. జీనోమిక్స్ పితామహుడిగా పిలిచే ఫ్రెడెరిక్ సాంజెర్‌కు రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ బహుమతి లభించింది. 1958లో ప్రొటీన్ నిర్మాణ క్రమం, 1980లో న్యూక్లియిక్ యాసిడ్‌లపై చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి దక్కింది. రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన ఒకే ఒక శాస్త్రవేత్త సాంజెర్.

 

 2013 వర్డ్ ఆఫ్ ది ఇయర్ ‘సెల్ ఫీ’

 2013 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘సెల్ ఫీ (్ఛజజ్ఛీ)’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ నవంబర్ 19న ప్రకటించింది. సెల్‌ఫీకి ట్వెర్క్ (ఖీఠ్ఛీటజు) మంచి పోటీ ఇచ్చింది. గత 12 నెలల్లో సెల్‌ఫీ వాడకం 17000 శాతం పెరిగినట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తెలిపింది. తనంత తానుగా తీసుకునే ఫొటోను సెల్‌ఫీగా నిర్వచించారు.

 

 ఇరాన్ అణు కార్యక్రమం నియంత్రణపై ఒప్పందం

 అణు కార్యక్రమం నియంత్రణకు ఇరాన్ అంగీకరిస్తూ అమెరికాతో సహా ఐదు అగ్ర దేశాలతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి జెనీవాలో నవంబర్ 24న ఇరాన్.. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్+జర్మనీ (పీ5+1) దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది ఆరు నెలలు అమల్లో ఉంటుంది. దీని ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమ పరిశీలకులకు సహకరిస్తుంది. యురేనియాన్ని ఐదు శాతానికి మించి శుద్ధి చేయదు.

 

 ఇంతకుమించి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గిస్తుంది. 20 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలను నిర్వీర్యం చేస్తుంది. అరక్ అణు రియాక్టర్ ద్వారా ప్లుటోనియం ఉత్పత్తిని చేపట్టదు. ఇరాన్‌పై విధించిన ఆంక్షలు ఆరునెలలపాటు సడలిస్తారు. ఇరాన్ చమురు అమ్మకాల వల్ల వచ్చిన నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నిలిచిపోయిన అకౌంట్ల నుంచి పొందొచ్చు. బంగారం, పెట్రోకెమికల్స్, కారు, విమాన విడిభాగాల వాణిజ్యంపై ఉన్న నియంత్రణలను తొలగిస్తారు.

 

 కొలంబోలో కామన్‌వెల్త్ సదస్సు

 కామన్‌వెల్త్ దేశాధినేతల సదస్సు (చోగమ్) నవంబర్ 15 నుంచి 17 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది. న్యాయమైన వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి అనే అంశం ఇతివృత్తంగా సదస్సును నిర్వహించారు. ఇందులో 50 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా అందులో 27 దేశాల అధిపతులు ఉన్నారు. 2011 పెర్త్‌లో జరిగిన చివరి సమావేశం తర్వాత సాధించిన ప్రగతిని సదస్సులో సమీక్షించారు. కామన్‌వెల్త్ చార్టర్ ఆమోదం, కామన్‌వెల్త్ సెక్రటేరియట్ కోసం కొత్త వ్యూహాత్మక ప్రణాళికలపై ఒప్పందం వంటి అంశాలతోపాటు ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్ చేసిన ప్రతిపాదనల అమలుపై సదస్సులో నేతలు హర్షం వ్యక్తం చేశారు.

 

 ప్రజాస్వామ్య ప్రాముఖ్యత, మానవ హక్కులు, అంతర్జాతీయ శాంతి భద్రతలు, సహనం, భావ ప్రకటన స్వేచ్ఛ, సమన్యాయపాలన, ఉత్తమ పాలన, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆరోగ్యం, విద్య, ఆహారం, వసతి అందుబాటు, లింగ సమాన్వతం, చిన్న, దుర్భల స్థితిలో ఉన్న దేశాల అవసరాలు, పౌర సమాజం పాత్ర వంటి చార్టర్‌లోని అంశాల ప్రాధాన్యతను వారు గుర్తించారు. కామన్‌వెల్త్ బిజినెస్ ఫోరం, యూత్ ఫోరం, పీపుల్స్ ఫోరం ఫలితాలను సదస్సు నాయకులు స్వాగతించారు. 2015 సదస్సు మాల్టా, 2017 సదస్సు వనౌతు, 2019 సదస్సు మలేసియా నిర్వహించేందుకు ముందుకు రావడాన్ని ఆమోదించారు.

 

 ఏంజెలా మెర్కల్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

 జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్ 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికయ్యారు. ఐరోపాలో, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ జర్మనీని అభివృద్ధి వైపు నడిపించినందుకు మెర్కల్‌ను ఎంపిక చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నవంబర్ 19న ప్రకటించింది.

 

 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఎంపిక కమిటీ మెర్కల్‌కు బహుమతి అందించాలని నిర్ణయించింది. 2012లో ఈ బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు జాన్సన్ సర్లీఫ్‌కు బహూకరించారు. ఈ అవార్డును 1986లో ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ 19న దీన్ని ప్రకటిస్తారు. అవార్డు కింద రూ.25 లక్షల నగదు, ప్రశంస పత్రం అందిస్తారు.

 

క్రీడలు

 బ్రెజిల్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్

 రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఫార్ములావన్ బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. బ్రెజిల్‌లో నవంబర్ 24న జరిగిన రేసులో వెటెల్ విజయం సాధించాడు. తద్వారా ఈ సీజన్‌లో వరుసగా తొమ్మిదో గెలుపు నమోదు చేశాడు. దీంతో 1952-53 సీజన్‌లో వరుసగా ఆల్బర్ట్ ఆస్కారి (ఇటలీ) నెలకొల్పిన తొమ్మిది విజయాల రికార్డును వెటెల్ సమం చేశాడు.

 

 స్కూల్ క్రికెట్‌లో పృధ్వీ పంకజ్ రికార్డు

 స్కూల్ క్రికెట్‌కు చెందిన హారిస్ షీల్డ్ టోర్నీలో పృధ్వీ పంకజ్ షా (14) 546 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ముంబైలో నవంబర్ 20న సెయింట్‌ఫ్రాన్సిస్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీస్ప్రింగ్ ఫీల్డ్ జట్టు తరపున పృధ్వీ బ్యాటింగ్ చేసి ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు స్కూల్ క్రికెట్‌లో 2010లో ముంబైలో ఆర్మాన్ చేసిన 498 పరుగులు అత్యధికం. మనదేశంలో 1933-34 సీజన్‌లో దాదాబాయ్ హలేవాలా కాలేజ్ క్రికెట్‌లో చేసిన 515 పరుగులు అన్ని రకాల క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ ఆటగాడు కొలిన్స్ పేరిట ఉంది. ఆయన 1899లో 628 పరుగులు చేశాడు. తర్వాత 1901లో సి.కె.ఈడీ పేరిట 566 పరుగుల రికార్డు ఉంది.

 

 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ విజేత మాగ్నస్ కార్ల్‌సన్

 నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ (22) కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. చెన్నైలో నవంబర్ 21న ముగిసిన పోటీలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ (43)ను ఓడించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్ ఈసారి ఒక్క గేమ్‌లో కూడా గెలవలేదు. ఆన ంద్ తొలిసారి 2000లో ఈ టైటిల్ సాధించాడు. తర్వాత 2007, 2008, 2010, 2012ల్లో చాంపియన్‌గా నిలిచాడు. మొత్తం రూ.14 కోట్ల ప్రైజ్‌మనీలో కార్ల్‌సన్‌కు రూ.8.4 కోట్లు, ఆనంద్‌కు రూ.5.6 కోట్లు లభించాయి.

 

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి

 కరెంట్ అఫైర్స్ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement