మణిపూర్ మహిళపై ముంబైలో దారుణం
ముంబై: ముంబై నడివీధుల్లో మణిపూర్కు చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అకారణంగా ఆమెపై ఉమ్మివేయడంతో పాటు.. గొడవకు దిగి అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జరిగి అయిదురోజులు కావస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఆందోళనకు దారితీసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మీడియాలో విమర్శలు చెలరేగాయి.
సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే ముంబైలో బిజీగా ఉండే శాంటాక్రూజ్ ప్రాంతంలో గత శనివారం సాయంత్రం మహిళపై ఉమ్మివేశాడో వ్యక్తి. దీన్ని ప్రశ్నించిన ఆమెపై విరుచుకుపడ్డాడు. నిరర్దాక్షిణ్యంగా కొట్టడం మొదలుపెట్టాడు. దీన్ని ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయాడు. మహిళ పొట్టమీద తన్ని, జుట్టు పట్టి కిందపడేసి విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించాడు. చివరికి ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను కూడా చించేసి ఉన్మాదిలా ప్రవర్తించాడు. అలా కొట్టుకుంటూ జుట్ టుపట్టుకొని కొంతదూరం ఈడ్చి పారేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన తర్వాత ఆమె స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా ఎన్సీ(నాన్ కాగ్నిజబుల్) కింద వదిలేశారు. తన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆఫీసర్ ఇన్ ఛార్జ్ తిరస్కరించడంతో పాటు తనను అవమానించారని బాధితురాలు వాపోయింది. తనకు మరాఠీ తెలియదనీ, ఫిర్యాదు కాపీపై సంతకం మాత్రం చేశానని తెలిపింది.
అటు దాడి గురించి చెప్పినప్పటికీ వినకుండా.. కనీస విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలు సోదరి తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం ఎన్సీగా పేర్కొనడం దారుణమన్నారు. ముంబైలాంటి నగరాల్లో తమ ముఖ కవళికలు చూసి తాము చైనా, నేపాల్ కు చెందినవాళ్లమని అపోహపడుతూ.. వ్యాఖ్యలు చేస్తూ వివక్షకు గురిచేయడం జరుగుతుందన్నారు. అందుకే తన సోదరిని రక్షించేందుకు ఎవరు ముందుకు రాలేదని వాపోయింది. ప్రస్తుతం తన సోదరి షాక్ లో ఉందని ఆమె తెలిపింది. కాగా ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.