అనాదిగా పౌరుడికి, రాజ్యానికి మధ్య ఘర్షణ
కొనసాగుతోంది. వీరి మధ్య సామరస్యం
సాధించేందుకు కృషి జరుగుతూనే ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మరింత
ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యక్తిగత
స్వేచ్ఛ ఎంత అవసరమో, రాజ్య సమగ్రత
కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య
సమతుల్యం సాధించేందుకు ఉపయోగపడే
సాధనాలు ప్రాథమిక హక్కులు.
సామాజిక ఆమోదం పొంది, సమాజంలో చట్టబద్ధత కలిగిన వ్యక్తులందరూ అనుభవించే సదుపాయాలను హక్కులుగా చెప్పొచ్చు. ఇవి మనిషి మనుగడకు ఎంతో అవసరం. అందుకే వీటిని ప్రాథమిక హక్కులుగా పిలుస్తున్నారు. దాదాపు ఆధునిక రాజ్యాంగాలన్నీ వీటిని ప్రస్తావించాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చలేదు. అంతమాత్రాన ఆయా దేశాల్లో ప్రజలు హక్కులు అనుభవించటం లేదని కాదు.. సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు, న్యాయస్థానాల తీర్పులు అక్కడి ప్రజలను పరిరక్షిస్తున్నాయి.
అమెరికా, ఐరిష్ రాజ్యాంగాలు స్ఫూర్తిగా
మన రాజ్యాంగ కర్తలు అమెరికా, ఐరిష్ రాజ్యాంగాల్లో పొందుపర్చిన హక్కులను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రస్తావించారు. ఫ్రెంచ్ విప్లవకాలంలో చేసిన మానవహక్కుల ప్రకటన, ఐక్యరాజ్యసమితి ఆమోదించిన మానవ హక్కుల చార్టర్.. రాజ్యాంగ కర్తలను ప్రభావితం చేశాయి. రాజ్య నిరపేక్షాధికారం నుంచి వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తూ, సమాజంలోని వివిధ వర్గాలు సగటు పౌరుడి స్వేచ్ఛను హరించకుండా నిరోధించే చట్టబద్ధ హామీలు (అవసరమై నప్పుడు) న్యాయస్థానాలు జారీచేసే రిట్ల ద్వారా అమలవుతాయి. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పొందుపర్చిన ఆదేశ సూత్రాలు కూడా హక్కులే. అయితే ప్రాథమిక హక్కులు వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తే, ఆదేశ సూత్రాలు సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తాయి. ఆదేశ సూత్రాలను ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగంలోని 12 నుంచి 35 ప్రకరణలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. 12వ ప్రకరణ ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వినియోగించే అధికారాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదు. 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను తొలగించటం, పరిమితం చేసే చట్టాలను పార్లమెంటు చేయకూడదు. కానీ, 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 368వ ప్రకరణ కింద తనకు సంక్రమించిన అధికారం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, తొలగించవచ్చు. ఈ అధికారాన్ని 13(4) రాజ్యాంగ ప్రకరణ పార్లమెంటుకు కట్టబెట్టింది.
ప్రాథమిక హక్కులు – రకాలు
రాజ్యాంగంలో ఏడు రకాల ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978).. ఆస్తి హక్కు (31వ ప్రకరణ)ను ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది. దానికి చట్టబద్ధ, రాజ్యాంగ హక్కు హోదాను (300ఎ ప్రకరణ) కల్పించింది. ప్రస్తుతం ఆరు రకాల ప్రాథమిక హక్కులు అమల్లో ఉన్నాయి. అవి..
సమానత్వ హక్కు (14–18 ప్రకరణ వరకు):
దీని ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. లింగ, కుల, మత, ప్రాంత, పుట్టుక ప్రాతిపదికన వివక్షత నిషేధం. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అంటరానితనం పాటించడం నేరం. బిరుదులు పొందడం నిషిద్ధం.
స్వాతంత్య్ర హక్కు (19–22 ప్రకరణలు):
పౌరులకు వాక్, భావ ప్రకటనా స్వాతంత్య్రం; సంఘాలుగా ఏర్పడేందుకు; శాంతియుతంగా సమావేశం కావడానికి; భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించడానికి; ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి; ఏ వృత్తినైనా స్వీకరించడానికి, వ్యాపారం చేసుకోవడానికి స్వాతంత్య్రం ఉంది. నేరస్థాపన విషయంలో రక్షణ, విద్యాహక్కు, ప్రాణ హక్కు, వ్యక్తిగత స్వాతంత్య్ర రక్షణ. కొన్ని సందర్భాల్లో నిర్బంధం నుంచి రక్షణ.
దోపిడీlనిరోధన హక్కు (23–24 ప్రకరణలు):
మానవుల క్రయవిక్రయాలు, బలవంతపు చాకిరీ నిషేధం; ఫ్యాక్టరీలు లాంటి వాటిలో పిల్లలతో పని చేయించడం నిషేధం.
మత స్వాతంత్య్రం హక్కు (25–28 ప్రకరణలు):
అంతరాత్మానుసారం వ్యవహరించడానికి స్వాతంత్య్రం; స్వేచ్ఛగా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు; మత వ్యవహారాలను నిర్వహించడానికి స్వాతంత్య్రం ఉంది. అయితే మతం పేరిట పన్నులు చెల్లించాలని కోరడం; విద్యాసంస్థల్లో (అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే) మత బోధన జరిగేటప్పుడు వాటికి హాజరుకావాలని నిర్దేశించడం నిషేధం.
సాంస్కృతిక విద్యా విషయాల హక్కు (29–30 ప్రకరణలు): అల్పసంఖ్యాక వర్గాలకు తమ భాషను, లిపిని సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంది. ఈ సంస్థలకు విద్యాసంస్థల స్థాపన, నిర్వహణ హక్కు ఉంది.
రాజ్యాంగ పరిరక్షణ హక్కు (32వ ప్రకరణ):
పైన ప్రస్తావించిన 5 రకాల హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంట్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్ల జారీ ద్వారా వాటి అమలును నిర్దేశిస్తాయి. సుప్రీంకోర్టు 32వ ప్రకరణ కింద.. హైకోర్టులు 226వ ప్రకరణ కింద రిట్లను జారీచేస్తాయి. రాజ్యాంగ పరిరక్షణ హక్కును డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగానికి ‘ఆత్మ, గుండె’గా
అభివర్ణించారు.
ఈ హక్కులు నిరపేక్షం కాదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వీటికి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు 19వ ప్రకరణలో ఉన్న ఆరు ప్రాథమిక స్వాతంత్య్రాలను తాత్కాలికంగా రద్దు చేయొచ్చు. అలాగే 20, 21 రాజ్యాంగ ప్రకరణల్లో ప్రస్తావించిన హక్కులు మినహా మిగిలిన వాటి అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కును రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు నిలిపేయొచ్చు. సాధారణ పరిస్థితుల్లో కూడా బలహీన వర్గాల ప్రయోజనాలను ఉద్దేశించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఈ కోవకే చెందుతాయి. 14, 20, 21, 23, 25, 27, 28 రాజ్యాంగ ప్రకరణల కింద సక్రమించే హక్కులు భారతదేశంలో నివసించే వారందరికీ (విదేశీయులతో సహా) లభిస్తాయి. కానీ, 15, 16, 19, 21ఎ, 30 రాజ్యాంగ ప్రకరణల కింద లభించే హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
ఆదేశ సూత్రాలు
36 నుంచి 51 వ రాజ్యాంగ ప్రకరణ వరకు పొందుపర్చిన ఆదేశాలను ప్రభుత్వం తన విధాన రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి. వీటి అమలు కోసం న్యాయస్థానాలు రిట్లను జారీచేసే అవకాశం లేదు. అయితే సామాజిక ప్రయోజనాల దృష్ట్యా సందర్భానికి తగిన ఉత్తర్వులను న్యాయస్థానాలు జారీ చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ఆదేశ సూత్రాలను విస్మరించలేదు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయంలో ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలకు మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఆదేశ సూత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. గత 60 ఏళ్లలో ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు, సాధారణ చట్టాల ద్వారా ఆదేశ సూత్రాల అమలుకు చొరవ తీసుకుంది. ఆదేశ సూత్రాలకు ఆటంకమన్న కారణంతో ఆస్తి హక్కు లాంటి ప్రాథమిక హక్కును తొలుత సవరించి, ఆ తర్వాత తొలగించారు. ఆదేశ సూత్రాలు కొన్ని సామ్యవాద స్వభావాన్ని, మరికొన్ని గాంధీజీ ఆశయాలను ప్రతిబింబిస్తే.. మరికొన్ని ఉదారవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం, సంపద కేంద్రీకృతం కాకుండా నిరోధించడం, తద్వారా పంపిణీ; ప్రజలకు జీవనోపాధి కల్పించడం; కార్మికులు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి కృషి చేయడం లాంటివి సామ్యవాద స్వభావం ఉన్నవి.
పంచాయతీరాజ్ వ్యవస్థల ఏర్పాటు; షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం; కుటీర పరిశ్రమల ప్రోత్సాహం; గోవధ నిషేధం; మద్యపాన నిషేధం లాంటివి గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి. ఉమ్మడి పౌరశిక్ష స్మృతి అమలు; శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయ నిర్వహణ; పౌష్టికాహారం అందించడం; అంతర్జా తీయ శాంతికి కృషి చేయడం; కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడం వంటివి ఉదారవాద స్వభావం కలిగి ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉచిత న్యాయసహాయం కల్పించడం; కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం; పర్యావరణ, వన్య జీవుల, అడవుల సంరక్షణ; పిల్లల ప్రగతికి తగిన అవకాశాలు కల్పించడం అనే అంశాలు చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాల విషయంలో అసమానతలు తగ్గించడం అనే అంశాన్ని రాజ్యాంగంలో పొందుపర్చారు.
ఆదేశ సూత్రాల అమలు.. ప్రభుత్వ చొరవ
ఆదేశ సూత్రాల అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చొరవలో కొన్ని ముఖ్యమైనవి... భూసంస్కరణల అమలు ద్వారా సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నిరోధించడం. పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ పరమైన హోదా కల్పించడంతో గాంధీజీ ఆశయాలు నేరవేర్చినట్లయింది. కుటీర పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి సమాజ వికాస అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దీనికి మంచి ఉదాహరణ.
ఆదేశ సూత్రాల అమలుకు తీసుకున్న కొన్ని చర్యలు చట్టపరమైన వివాదాలకు దారితీశాయి. ప్రధానంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయనే కారణంతో న్యాయస్థానంలో ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేశారు. దీనికి గోలక్‌నాథ్ కేసు (1967), కేశవానంద భారతి కేసు (1973), మినర్వామిల్స్ కేసు (1980) ఉదాహరణలు. 25, 42 రాజ్యాంగ సవరణ చట్టాలు ఆదేశ సూత్రాల పరిధిని విస్తృతం చేస్తూ ప్రాథమిక హక్కుల పరిధిని పరిమితం చేశాయి. 25వ రాజ్యాంగ సవరణ చట్టం 39(బీ, సీ) ప్రకరణల్లో ప్రస్తావించిన ఆదేశ సూత్రాలకు 14, 19 ప్రకరణల్లో పొందుపర్చిన ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యం కల్పించింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఆదేశ సూత్రాల ఆధిక్యతను మరింత విస్తరిస్తూ ఆదేశ సూత్రాల అమలుకు చేసిన ఏ చట్టాలకైనా 14, 19 ప్రకరణల కంటే ఆధిక్యతను కల్పించింది. అయితే సుప్రీంకోర్టు ఈ సవరణను మినర్వామిల్స్ (1980) కేసులో కొట్టేసింది. ఈ తీర్పు ప్రకారం 39 బీ, సీ ప్రకరణల్లో పేర్కొన్న ఆదేశ సూత్రాల అమలుకు చేసిన చట్టాలు మాత్రమే 14, 19 ప్రకరణల కంటే ఆధిక్యతను కలిగి ఉంటాయి. మిగిలిన విషయాల్లో ప్రాథమిక హక్కులదే పైచేయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
డా‘‘ బి.జె.బి. కృపాదానం
సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ,
ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్
మనిషి మనుగడకు ప్రాథమిక హక్కులు!
Published Mon, Jan 23 2017 12:09 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM