సాంఘిక శాస్త్రం
సంపన్నమైన భారత భౌగోళిక నైసర్గిక వ్యవస్థకు మూలం, బలం ఇక్కడి శీతోష్ణస్థితి పరిస్థితులు. మానవ మనుగడకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించే వాతావరణ స్థితిగతులపై శీతోష్ణస్థితి ప్రభావం అధికంగా ఉంటుంది. విశాల భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల ఉష్ణోగ్రతలు, వర్షపాత విస్తరణలు నెలకొని ఉన్నాయి. అవి కూడా స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతున్నాయి.
భారతదేశ శీతోష్ణస్థితి
మన దేశ శీతోష్ణస్థితిని ‘ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి’గా పిలుస్తారు. ‘రుతువు’ను ఆంగ్లంలో ‘మాన్‌సూన్’ అంటారు. ఇది ‘మౌసమ్’ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దేశం మొత్తం మీద ఒకే రకమైన రుతుపవన శీతోష్ణస్థితి ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనాలు, ఆర్ధ్రత, పీడన మేఖలలు విభిన్నంగా ఉన్నాయి.
రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత అత్యధికంగా 50C (జూన్‌లో), కార్గిల్ సమీపంలోని డ్రాస్ వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత-40C (డిసెంబర్‌లో) నమోదైంది. మాసిన్‌రామ్ (మేఘాలయ)లో అత్యధిక వర్షపాతం 1141 సెం.మీ. అయితే జైసల్మీర్ (రాజస్థాన్)లో అత్యల్ప వర్షపాతం 12 సెం.మీ. నమోదవుతుంది. మన దేశ వాతావరణాన్ని నాలుగు రుతువులుగా (కాలాలుగా) విభజించారు. అవి..
1. శీతాకాలం 2. వేసవికాలం 3. నైరుతి రుతుపవన కాలం
4. ఈశాన్య రుతుపవన కాలం
రుతుపవనాలు
ఉష్ణోగ్రతల్లోని వైవిధ్యం, అంతర ఆయనరేఖా అభిసరణ స్థానం, ట్రోపో ఆవరణం పైభాగంలో వాయుప్రసరణం లాంటి అనేక కారణాల వల్ల ‘రుతుపవనాలు’ ఏర్పడుతున్నాయి.
భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య రుతువులను (కాలం) అనుసరించి పవనాలు వీయడాన్ని, వెనుకకు మరలడాన్ని ‘రుతుపవనాలు’ అంటారు. ఈ పవనాల దిశను బట్టి రెండు రకాల రుతుపవన కాలాలుగా గుర్తించారు. అవి...
నైరుతి రుతుపవనాలు: (జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు వీస్తాయి)
వేసవిలో భారత భూభాగంపై తీవ్రమైన అల్ప పీడన వ్యవస్థ ఏర్పడుతుంది. అదే సమయంలో సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీచే గాలులను నైరుతి రుతుపవనాలుగా పిలుస్తారు. ఇవి భారతదేశ నైరుతి దిశగా మొదట కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. మలబార్ తీరంలో (కేరళ) అధిక వర్షాలకు ఇవే కారణం.
ఈశాన్య రుతుపవనాలు: (సెప్టెంబరు మధ్య నుంచి డిసెంబరు మధ్య వరకు వీస్తాయి)
శీతాకాలంలో సముద్ర భాగంపై అల్పపీడనం ఏర్పడటం వల్ల ఈ పవనాలు భూభాగం నుంచి సముద్రాల వైపు ఈశాన్య దిశ నుంచి వీస్తాయి. నైరుతి రుతుపవనాలే ఉత్తర భారతదేశంలో తిరోగమనం చెంది ఈశాన్య రుతుపవనాలుగా మారుతాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొదట పంజాబ్‌లో ప్రవేశిస్తాయి. ఈ కాలంలో తుఫాన్లు అధికంగా వస్తాయి.
రుతుపవనారంభం
వేసవికాలంలో భారత భూభాగంపై ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ, భూమధ్యరేఖా ప్రాంతపు తేమతో కూడిన పవనాలను హిందూ మహాసముద్రం ఆకర్షిస్తుంది. ఈ సముద్ర ప్రభావిత గాలుల వల్ల ఉరుములు, మెరుపులు సంభవించిన తర్వాత అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది. దీన్నే ‘రుతుపవనారంభం’ అంటారు. ఇది మొదటగా కేరళ తీరంలో ప్రారంభ మవుతుంది.
వర్షపాత విస్తరణ- సమస్యలు
దేశమంతా (తమిళనాడు తీరం మినహా) నైరుతి రుతుపవనాల వల్లే అధిక వర్షం కురుస్తుంది. తమిళనాడు తీరంలో మాత్రం ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షం పడుతుంది. దేశంలోని వర్షపాత విస్తరణను గమనిస్తే పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల నుంచి పశ్చిమంగా, వాయవ్యంగా పోయేకొద్దీ వర్షపాతం తగ్గుతుంది. దక్షిణాన పశ్చిమ, తూర్పు తీరాల నుంచి దక్కన్ పీఠభూమి అంతర్భాగాల వైపు వెళ్తూ ఉంటే వర్షపాతం తగ్గుతుంది.
వర్షపాత విస్తరణలో ఈ విధమైన అనిశ్చితి, క్రమరహిత, అధిక వైవిధ్యత, అసమానతల వల్ల వ్యవసాయాభివృద్ధి కుంటుపడుతోంది. వర్షపాతంలోని తీవ్రతల వల్ల అతివృష్టి (వరదలు), అనావృష్టి (కరువులు) ఏర్పడుతున్నాయి. ఈ కారణాల వల్లే ‘భారతీయ వ్యవసాయం అంటే రుతుపవనాలతో జూదం’ అనే నానుడి వచ్చింది.
కరువు - తీవ్రమైన కరువు
భారత వాతావరణ విభాగం ప్రకారం సామాన్య వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువ కురిసిన స్థితిని ‘కరువు’ అనీ, 50 శాతం కంటే తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరువు’ అని పిలుస్తారు. కరువు నష్టాల నియంత్రణకు ప్రభుత్వం ‘కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక’ (drought prone area plan) ను 1973లో రూపొందించింది.