సాంఘిక శాస్త్రం
జాతీయవాద ఉద్యమాలు
ఆధునిక ప్రపంచ యుగ ప్రారంభంలో ఆర్థికంగా, సైనికంగా బలంగా మారిన యూరప్‌లోని ప్రధాన దేశాల మధ్య విద్వేషాలు పెరిగాయి. ఒక జాతి ప్రజలందరూ ఒకే దేశ భౌగోళిక ప్రాంత పాలనలోనే ఉండాలనే వాదనతో పొరుగు దేశాలతో యుద్ధానికి కాలుదువ్వాయి. ఈ జాతీయవాద ఉద్యమాలు మొదట ఫ్రాన్‌సలో ప్రారంభమయ్యాయి. వీటికి ఆద్యుడు నెపోలియన్.
నెపోలియన్ ఆగడాలను నిలువరించడానికి మిగతా యూరప్ దేశాలన్నీ ఏకమై ఆయనను ఓడించాయి. ఈ దేశాలన్నీ వియన్నా సమావేశాన్ని (క్రీ.శ. 1815) నిర్వహించాయి. ఫ్రెంచి ప్రజల జాతీయ విప్లవ భావాలను అణగదొక్కాయి. పర్యావసానంగా 1830, 1848లలో ఫ్రెంచి తిరుగుబాట్లు తలెత్తాయి. జర్మనీ, ఇటలీల్లోనూ ఏకీకరణ ఉద్యమాలు చెలరేగాయి. సామ్యవాద ఉద్యమాలు కూడా ఆరంభమై చివరికి ఫ్రాన్‌సలోనే ప్రపంచంలో మొట్టమొదటి క మ్యూనిస్టు ప్రభుత్వం (క్రీ.శ. 1871) ఏర్పడింది.
ప్రధానంగా చదవాల్సిన అంశాలు :
ఫ్రాన్‌సలో 1848 తిరుగుబాటు చెలరేగడానికి కారణాలు, సార్డీనియా నాయకత్వం కింద ఇటలీ ఏ విధంగా ఏకీకరణ సాధించింది? జర్మనీ ఏకీకరణలో బిస్మార్‌క నిర్వహించిన పాత్ర గురించి విద్యార్థులు బాగా చదవాలి. పై అంశాల నుంచి 4 మార్కుల ప్రశ్నను అడిగే వీలుంది. అలాగే రెడ్‌షర్‌ట్స, కార్బోనరి, యంగ్ ఇటలీల నేపథ్యం, వాటి లక్ష్యం, వాటి నాయకుల గురించి విపులంగా తెలుసుకోవాలి. కార్‌లమార్‌క్స, కౌంట్‌కవూర్, గారీబాల్డీ భావాలు, అవి వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా తోడ్పడ్డాయో విశ్లేషించుకోవాలి.
వీటి నుంచి 2 మార్కుల ప్రశ్న లేదా, 1 మార్కు ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది. ప్రపంచ రాజకీయ పటాన్ని ముందుంచుకొని ఆయాదేశాల భౌగోళిక చిత్రాన్ని గమనిస్తూ అధ్యయనం చేస్తే మ్యాప్ పాయింటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఈ చాప్టర్ నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న, లేదా ఒక రెండు మార్కుల ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. వాటితోపాటు ఒక 1 మార్కు ప్రశ్న, ఆబ్జెక్టివ్ ప్రశ్నలు రెండు (2ణ బీ = 1 మార్కు) రావచ్చు. అంటే పాఠ్యాంశం నుంచి విద్యార్థులు మొత్తం 4 నుంచి 6 మార్కులు పొందే అవకాశముంది.
పాఠ్యాంశంలోని ప్రధానాంశాలు
{ఫాన్‌సలోని కోర్సికా దీవిలో జన్మించిన ‘నెపోలియన్ బోనపార్టీ’ ఆధునిక ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. మంచి విద్యావంతుడైన నెపోలియన్‌పై ‘రూసో’ ప్రభావం చాలా ఉంది.
క్రీ.శ. 1785లో ఫ్రెంచి సైన్యంలో చేరిన నెపోలియన్ వివిధ హోదాల్లో అనేక యుద్ధాల్లో ముఖ్య పాత్ర పోషించి, ఫ్రాన్‌స విజయ పరంపరను కొనసాగించాడు.
క్రీ.శ. 1804లో ఫ్రాన్‌స చక్రవర్తిగా ప్రకటించుకున్న నెపోలియన్ ‘నేలపై పడి ఉన్న ఫ్రాన్‌స కిరీటాన్ని నేను నా కత్తితో పెకైత్తాను’ అని సమర్థించుకున్నాడు. అనేక దురాక్రమణపూరిత యుద్ధాల ద్వారా మిగతా యూరప్ దేశాలను వణికించాడు. ‘ఖండాంతర వ్యవస్థ’ను ప్రవేశపెట్టి ఇంగ్లండ్ వర్తక వాణిజ్యాలను ధ్వంసం చేశాడు.
నెపోలియన్ ఆగడాలను నిలువరించాలని నిశ్చయించుకున్న యూరప్ దేశాలు ‘మెటర్నిక్’ (ఆస్ట్రియా చాన్స్‌లర్) నాయకత్వం లో ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. క్రీ.శ. 1813 లీప్‌జిగ్ యుద్ధం (బ్యాటిల్ ఆఫ్ నేషన్‌స), క్రీ.శ. 1815 వాటర్‌లూ యుద్ధాల్లో నెపోలియన్‌ను ఓడించాయి.
మెటర్నిక్ కన్వీనర్‌గా యూరప్ దేశాల కూటమి క్రీ.శ. 1815లో ఆస్ట్రియా రాజధాని ‘వియన్నా’లో సమావేశమైంది. ఈ సమావేశంలో వివిధ దేశాల జాతీయ విప్లవ భావాలను విస్మరించడం వల్ల యూరప్‌లో జాతీయవాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
అందులో భాగంగానే క్రీ.శ. 1830లో ఫ్రెంచి విప్లవం వచ్చింది. ఇది ఇతర యూ రప్ దేశాలకు మార్గదర్శకమైంది. అందువల్ల ‘ఫ్రాన్‌స తుమ్మినప్పుడల్లా యూరప్‌కు జలుబు చేస్తుందని’ చెబుతారు.
ఫ్రాన్‌సలో క్రీ.శ. 1848లో జరిగిన మరో తిరుగుబాటులో ‘లూయి ఫిలిప్’ రాజరిక పాలన రద్దయి, లూయి బ్లాంక్ ఆధ్వర్య ంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిణామం ఇటలీ, జర్మనీల్లో జాతీయ చైతన్యం ఉద్భవించడానికి తోడ్పడింది.
ప్రష్యా ప్రధానమంత్రి ‘ఓట్టోవోన్ బిస్మార్‌క’ తన క్రూరమైన బలప్రయోగ విధానంతో జర్మనీ ఏకీకరణను క్రీ.శ. 1871లో సాధించాడు.
జోసెఫ్ మజ్జిని, కౌంట్‌కవూర్, గారిబాల్డీ, విక్టర్ ఎమ్మాన్యూల్-2 కృషి ఫలితంగా క్రీ.శ. 1870లో ఇటలీ ఏకీకరణ సాధ్యమైంది.
యూరప్ సమాజంలో ఆర్థికపరమైన అసమానతలను నిర్మూలించడానికి 19వ శతాబ్దంలో సామ్యవాద ఉద్యమాలు ఆవిర్భవించాయి. వీటిలో చురుకైన పాత్ర పోషించినవారు... రాబర్‌ట ఓవెన్, సెయింట్ సైమన్, లూయీ బ్లాంక్, కార్‌లమార్‌క్స.
క్రీ.శ. 1848 తిరుగుబాటు తర్వాత ఫ్రాన్‌స లో ఏర్పడిన రిపబ్లిక్ ప్రభుత్వ విధానాలను సామ్యవాదులు విభేదించారు. రిపబ్లికన్‌లు, సామ్యవాదులు ఒక అంగీకారానికి వచ్చి నెపోలియన్-3 నాయకత్వంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచారు.
తర్వాత నెపోలియన్-3 రాజరికం వైపు మరలి క్రీ.శ. 1852లో చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఈయన చేసిన అనేక యుద్ధాల వల్ల ఫ్రాన్‌స ఆర్థిక వ్యవస్థ పతనమైంది. సామ్యవాదుల నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసి క్రీ.శ. 1871లో పారిస్‌లో ‘కమ్యూన్’ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ప్రపంచంలో ఏర్పాటైన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇదే. కాని దీన్ని ఫ్రెంచ్ సైన్యం తీవ్రంగా అణచివేసింది.