విద్య, ఉద్యోగ లక్ష్యాన్ని ఛేదించే.. ఎస్‌సీఆర్‌ఏ
భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న మూడో అతిపెద్ద వ్యవస్థ.. ఇటువంటి రైల్వే శాఖలో ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించే అవకాశం ముంగిట నిలిచింది.. ఇంటర్మీడియెట్ అర్హతతో నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్(ఎస్‌సీఆర్‌ఏ) ఎగ్జామినేషన్‌లో విజయం సాధిస్తే ఒక చేత్తో బీటెక్ పట్టా, మరో చేత్తో మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.. ఇలా ఒకే పరీక్ష ద్వారా విద్య, ఉద్యోగ లక్ష్యాన్ని ఛేదించేందుకు మార్గం సుగమం చేస్తున్న ఎస్‌సీఆర్‌ఏ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ పరీక్షను నిర్వహిస్తుంది. ఎస్‌సీఆర్‌ఏ ఎంపిక క్రమంలో రెండు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్. ఈ రెండు దశలకు కలిపి మొత్తం 800 మార్కులు ఉంటాయి.
రాత పరీక్ష
మొదటి దశలోని రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 600 మార్కులు కేటాయించారు. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. అవి..
విభాగం సమయం మార్కులు
జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2 గంటలు 200
ఫిజికల్ సెన్సైస్ 2 గంటలు 200
మ్యాథమెటిక్స్ 2 గంటలు 200
మొత్తం 600
ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమల్లో ఉంది.
పర్సనాలిటీ టెస్ట్
రెండో దశలో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. మొదటి దశలో అర్హత సాధించిన వారిని మాత్రమే పర్సనాలిటీ టెస్ట్‌కు అనుమతిస్తారు. ఇందులో అభ్యర్థి వ్యక్తిత్వం, గుణగణాలు, మేధో సామర్థ్యం, సామాజిక అవగాహన, ఉద్యోగానికి సరిపోతాడా లేదా? తదితర అంశాలను నిశితంగా పరీక్షిస్తారు.
శిక్షణ ఇలా
ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి రైల్వే మెకానికల్ విభాగంలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కాల వ్యవధి నాలుగేళ్లు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్)-మెర్సా నుంచి బీటెక్ డిగ్రీని అందజేస్తారు.
బీటెక్ ఇలా
బీటెక్ మెకానికల్ డిగ్రీ కాల వ్యవధి: నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థి ప్రతి సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టుల్లో సగటున 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు నిర్దేశిత రైల్వే వర్క్‌షాప్‌లో నిర్వహించే అప్రెంటీస్ ట్రైనింగ్‌లో 60 శాతం మార్కులు సాధిస్తేనే తుది ఎంపికకు అర్హత లభిస్తుంది.
స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల శిక్షణలో మొదటి రెండేళ్లు రూ. 9,100; మూడో ఏడాది రూ. 9,400; నాలుగో ఏడాది రూ. 9,700 చొప్పున నెలవారీ స్టైపెండ్ అందజేస్తారు. అంతేకాకుండా నిర్దేశించిన మేరకు సర్వీస్ అగ్రిమెంట్ రాయడం కూడా తప్పనిసరి.
ప్రొబేషన్
అప్రెంటీస్ శిక్షణతోపాటు బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు భారతీయ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో 18 నెలల ప్రొబేషన్‌కు ఎంపికవుతారు. అభ్యర్థులెవరైనా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించకపోయినా.. సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. అయితే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ప్రొబేషనరీ మెకానికల్ ఇంజనీర్‌గా నియామకాన్ని ఖరారు చేస్తారు.
కీలకమైనవి
ఎస్‌సీఆర్‌ఏ పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ విభాగంలోని ప్రశ్నలు జేఈఈ, బిట్‌శాట్ వంటి పరీక్షల స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ పరీక్షలో విజయం సాధించడానికి దోహదం చేసే కీలక అంశాలు.. ప్రాథమిక భావనలపై పట్టు, భావనలను అన్వయించే సామర్థ్యం. ఉదాహరణకు ఒక సమస్యను తీసుకుంటే.. భావనలు/సూత్రాలను అన్వయించి ఏ విధంగా దాన్ని సాధించవచ్చో విశ్లేషించుకోవాలి. సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దాన్ని ఇంటర్మీడియెట్ సిలబస్‌తో బేరీజు వేసుకోవాలి. ఈ సందర్భంలో ఎస్‌సీఆర్‌ఏ సిలబస్‌లో ఉన్న ఇంటర్మీడియెట్‌లో లేని అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి
జనవరిలో పరీక్షను నిర్వహిస్తారు. దీని దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుతం 94 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని అంశాల వారీగా విభజించుకోవాలి. ప్రిపరేషన్‌కు కనీసం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం తప్పకుండా కేటాయించాలి. సాధారణంగా ఈ సమయంలో విద్యార్థులందరూ ఇంజనీరింగ్ పోటీ పరీక్షల లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. సిలబస్‌లో పెద్దగా తేడా ఉండదు కాబట్టి ఈ పరీక్షలతో సమాంతరంగా ఎస్‌సీఆర్‌ఏ కోసం సిద్ధం కావచ్చు. జీకే, ఇంగ్లిష్ కోసం అదనంగా గంట కేటాయిస్తే చాలు.మెరుగైన స్కోర్‌కు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి. గత ప్రశ్నపత్రాలను సమయ పరిమితి నిర్దేశించుకుని సాధించాలి.
నోటిఫికేషన్ సమాచారం
ఖాళీలు: 42
అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్/కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో ప్రథమ/ద్వితీయ శ్రేణిలో ఇంటర్మీడియెట్/తత్సమానం లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్/కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో గ్రాడ్యుయేషన్ లేదా నిర్దేశించిన ఇతర అర్హతలు. శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 17- 21 ఏళ్లు (జనవరి 1, 2015 నాటికి, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 7, 2014
రాత పరీక్ష తేదీ: జనవరి 18, 2015
వివరాలకు: www.upsc.gov.in
విభాగాల వారీగా ప్రిపరేషన్
జనరల్ ఎబిలిటీ:
జనరల్ ఎబిలిటీ విభాగంలో జనరల్ నాల్జెడ్, ఇంగ్లిష్, సైకలాజికల్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్:
ఇందులో ఇంగ్లిష్ భాషపై విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా గ్రామర్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు బేసిక్ గ్రామర్, వొకాబ్యులరీ, యాంటానిమ్స్, సినానిమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ తదితర ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. ఈ విభాగం కోసం యూపీఎస్సీ గతంలో నిర్వహించిన సివిల్స్, ఎన్‌డీఏ తదితర పరీక్షల్లోని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం.
జనరల్ నాలెడ్జ్:
ఇందులో సైన్స్ నుంచి సోషల్ స్టడీస్ వరకు ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో పర్యావరణం, సమకాలీన అంశాలు, జీవులు- జాతులు, భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, రాజ్యాంగం, పార్లమెంట్, భౌగోళిక అంశాలు, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అంతే కాకుండా ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందుకోసం పరీక్ష తేదీకి ముందు ఎనిమిది నెలల నుంచి ఏడాది కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలు, రికార్డుల గురించి తెలుసుకోవాలి. ఇక ఈ పేపర్‌లోనే పార్ట్-బిగా నిర్వహించే సైకాలజీ టెస్ట్‌లో బేసిక్ ఇంటెలిజెన్స్, మెకానికల్ అప్టిట్యూడ్‌ను తెలుసుకునే రీతిలో ప్రశ్నలుంటాయి.ఏదో ఒక పుస్తకం చదవడం ద్వారా జనరల్‌నాలెడ్జ్‌లో మెరుగైన స్కోర్ సాధించడమనేది సాధ్యం కాదు. కాబట్టి టీవీ వార్తలు చూడడం, వివిధ దినపత్రికలు, బిజినెస్-కెరీర్ మ్యాగజైను వంటి పత్రికలు చదవడం ఉపయుక్తం.
మ్యాథమెటిక్స్:
మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ముందుగా బేసిక్ కాన్సెప్టులపై పట్టు సాధించాలి. మొత్తం సిలబస్‌ను కాలిక్యులస్, జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్టార్స్, 3-డి జామెట్రీ భాగాలుగా విభజించుకోవాలి. కాలిక్యులస్, ఆల్జీబ్రాపై ఎక్కువ శ్రద్ధపెట్టి, వాటి అనువర్తనాలను గమనించాలి. ఇంటెగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్స్, 3-డి ప్లేన్స్, లైన్స్, ప్రస్తారాలు- సంయోగాలు, సంభావ్యత, మాత్రికలు చాప్టర్లకు అధిక సమయం కేటాయించాలి. ఒక సమస్యను సాధించే సవుయుంలో కొన్ని సార్లు ఆబ్జెక్టివ్ ట్రిక్స్ తెలుస్తారుు. అలాంటి వాటిని వెంటనే నోట్ చేసుకోవాలి. షార్ట్‌కట్స్, టిప్స్‌ను అనువర్తిస్తూ ప్రాక్టీస్ చేయుడం వల్ల వేగం పెరుగుతుంది. సీబీఎస్‌ఈ మ్యాథ్‌స పుస్తకాలను చదవాలి. అందులోని ప్రతి ప్రశ్నను సూత్రం ద్వారా సాధించడానికి ప్రయత్నించాలి.
ఫిజికల్ సైన్స్:
ఫిజికల్ సెన్సైస్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఫిజిక్స్: ఇందులోని ప్రశ్నలన్నీ అప్లికేషన్స్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్, సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో ఇచ్చిన సమస్యను జాగ్రత్తగా చదివి ఆ సమస్యలో ఏ సూత్రం, సిద్ధాంతం ఇమిడి ఉందో తెలుసుకోవాలి. అదేవిధంగా ప్లుయిడ్ డైనమిక్స్‌లో ఎక్కువ శాతం సమస్యలన్నీ బెర్నౌలీ సిద్ధాంతం ఆధారంగా వచ్చే అవకాశం ఉంది. రే ఆప్టిక్స్‌లో సమస్యలు రే డయాగ్రమ్స్‌తో కూడి ఉంటాయి. వేవ్ ఆప్టిక్స్‌లో ఇచ్చే ప్రశ్నలన్నీ వైడీఎస్‌ఈ ఎక్స్‌పరిమెంట్ అండ్ సూపర్ పొజిషన్ రిలేటెడ్‌గా ఉండొచ్చు కాబట్టి వాటిపై మరింత దృష్టి సారించాలి. అదేవిధంగా అటామిక్ ఫిజిక్స్‌లో బోర్స్ థియరీ, ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ ఎక్స్‌రేస్ ముఖ్యమైన టాపిక్స్. థర్మోడైనమిక్స్‌లో సాధారణంగా గ్రాఫ్స్ సంబంధిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎల్‌సీఆర్ సర్క్యూట్స్‌లో ఇండక్టర్ ఎల్, కెపాసిటర్ ‘సీ’లకు సంబంధించిన ప్రాథమిక విధి ఏమిటో తెలుసుకోవడంతోపాటు డీసీ ఓల్టేజ్, ఏసీ ఓల్టేజ్‌ల గురించి కూడా అధ్యయనం చేయాలి.
కెమిస్ట్రీ: దీని సిలబస్‌ను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సిలబస్‌ను మూడు విభాగాలకు పేర్కొన్నా.. ఆ మూడు విభాగాలకు అంతర్గత సంబంధం (ఇంటర్ కనెక్టెడ్) ఉంటుంది. ఉదాహరణకు రిడాక్స్ రియాక్షన్స్ మీద పట్టు.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రిపరేషన్, ప్రాపర్టీస్‌లో ఉపయోగపడుతుంది. ఇందులో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, మోల్ కాన్సెప్ట్ (కాన్సన్‌ట్రేషన్స్ కలిపి), రిడాక్స్ రియాక్షన్స్, క్వాలిటేటివ్ అనాలిసిస్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్లు కీలకమైనవి. ఈ చాపర్ట్‌లపై పట్టు..మిగతా చాప్టర్లను వివరంగా ప్రిపేరయ్యేందుకు దోహదపడుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే అధిక శాతం అంతర్గత సంబంధం గల అంశాలుంటాయి.
ఉదాహరణకు గ్రూప్‌లలోని మూలకాల ధర్మాలు దాదాపుగా ఒకే మాదిరిగా ఉంటాయి. ఇలాంటి అంశాల విషయంలో కాంపౌండ్ తయారీ ధర్మాలు, రసాయనిక చర్యల(ఫ్లోరిన్, క్లోరిన్, ఓజోన్ తదితర)ను టేబుల్ విధానంలో రూపొందించుకోవాలి. ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం ఫార్ములాల ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫార్ములాల ధర్మాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సులభంగా ఉంటుంది. ప్రతి ఫార్ములాకు సంబంధించి ప్రొఫైల్ తయూరు చేసుకుని వాటిని పరిశీలించాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మూలకాల ధర్మాలను ఒకదానితో మరొకటి బేరీజు వేస్తూ చదవాలి. అన్ని గ్రూపుల్లోని వుూలకాల ధర్మాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటారుు. దీనివల్ల క్లిష్టమైన ఫార్ములాలను కూడా సులువుగా గుర్తుంచుకోవచ్చు.
చదవాల్సిన పుస్తకాలు
జేఈఈ-మెటీరియల్
ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి 11వ తరగతి పుస్తకాలు
పియర్సన్ గైడ్ ఫర్ ఎస్‌సీఆర్‌ఏ ఎగ్జామ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-ఆర్‌ఎస్ అగర్వాల్
అర్హింత్ ఎస్‌సీఆర్‌ఏ ఎగ్జామ్
కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్, వ్యాల్యూమ్స్ 1, 2- హెచ్‌సీ వర్మ.