స్వాట్ ది వే టు సక్సెస్
మనిషి తన జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలని కోరుకోడు.వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ విజయం సాధించాలని.. అత్యున్నత స్థాయికి ఎదగాలని నిరంతరంఆలోచిస్తుంటాడు. ఆలోచనలు బాగానే ఉన్నా.. తన శక్తిసామర్థ్యాలు, బలాలు, బలహీనతలను, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోలేక ఆచరణలో విఫలమవుతుంటాడు. అలాంటిపరిస్థితుల్లో స్వీయ విశ్లేషణ ద్వారా సరైన నిర్ణయంతీసుకోవడానికి స్వాట్ (SWOT= Strengths, Weaknesses, Opportunities, Threats)అనాలసిస్ ఉపయోగపడుతుంది.
స్వాట్ అనాలసిస్ సాయంతో వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఉన్నతీకరించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి స్వీయ విశ్లేషణ చేసుకోవడం ఎలాగో చూద్దాం..
బలాలు (Strengths)
ఒక పనిని సమర్థంగా పూర్తిచేసి విజయం సాధించాలంటే మొదట చేయాల్సింది స్వీయ శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకోవడం.. అదెలా అంటే..
నేను ఏం చేయగలను?
నాకున్న ఆసక్తులు ఏంటి?
ఇతరుల కంటే నాకున్న అదనపు అర్హతలేంటి?
ఒక పనిని ఇతరుల కంటే నేనెంత బాగా చేయగలను?
గొప్పగా చెప్పుకునే పనులేమైనా చేశానా?
నాకున్న ఆర్థిక, ఇతర వనరులేంటి?
నాకున్న అనుకూలతలు, పరిచయాలేంటి?
నాకు సపోర్టివ్‌గా ఎవరైనా ఉన్నారా?
నా నడవడిక ఎలా ఉంది?..
బలహీనతలు (Weaknesses)
బలాలను ఎంత నిజాయతీగా గుర్తిస్తారో బలహీనతలను కూడా అంతే నిజాయతీగా గుర్తించి, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తే ఎంపిక చేసుకున్న పనిలో విజయం సాధించడం చాలా తేలిక. బలహీనతలను గుర్తించేందుకు ఉపయోగపడే ప్రశ్నలు..
నాలో ఉన్న చెడు లక్షణాలు, లోపాలు ఏమిటి?
ఏ పనిని నేను సరిగా చేయలేకపోతున్నాను?
నేను ఏ పని అంటే భయపడుతున్నాను?
సీనియర్లు ఏ విషయంలో నన్ను తప్పుబడుతున్నారు?
పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలి?
నన్ను నేను ఏ అంశంలో మెరుగుపరచుకోవాలి?..
అవకాశాలు (Opportunities)
వెయ్యి అవకాశాలున్నా వాటిని ఉపయోగించుకోవడం తెలియకుంటే వ్యర్థమే..! ఏ పనిలో విజయం సాధించాలన్నా అవకాశాలు చాలా ముఖ్యం. ఇవి వ్యక్తి బలాలు, బలహీనతలపై ఆధారపడి ఉంటాయి. ఎలాగంటే బలాలతో అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక మార్గం. బలహీనతలను అధిగమించి, కొత్త అవకాశాలను సృష్టించుకోవడం రెండో మార్గం. అయితే అవకాశాలను ఎలా విశ్లేషించుకోవాలో చూద్దాం...
నేను చేస్తున్న పనికి మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉంది?
నేను పనిచేస్తున్న రంగం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది?
నేను పనిచేస్తున్న కంపెనీ పరిస్థితి ఎలా ఉంది?
నేను పనిచేస్తున్న సంస్థలో కొత్తగా అవకాశాలు రాబోతున్నాయా? వాటిని నేనెలా అందుకోవాలి?
నేను పనిచేస్తున్న సంస్థ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది?
గతంలో నేను చేయలేని పనిని ఇప్పుడు చేయడానికి నాకున్న అవకాశాలేంటి? చేయగలనా?
కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందా?
ఏ రంగం వైపు అడుగులు వేస్తే భవిష్యత్తు బాగుంటుంది?
దేనిపై పట్టుసాధిస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి?..
ప్రమాదాలు (Threats)
మనం విజయం సాధించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ప్రమాదాలుగా అభివర్ణించవచ్చు. మనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా లక్ష్య సాధనలో ఓ భాగమే. అడ్డంకులను ముందుగా పసిగట్టలేక పోయినా, వీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రమాదాలను గుర్తించడం ఎలాగో చూద్దాం...
నా బలహీనతలు భవిష్యత్తులో అడ్డంకిగా మారతాయా? ఎలాంటి సమస్యలైనా తెచ్చిపెడతాయా?
నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటి? వాటిని అధిగమించడం ఎలా?
కొత్తగా వచ్చే టెక్నాలజీ లేదా మరే ఇతర పరిస్థితుల వల్ల కానీ నా ఉనికికి ఏమైనా ప్రమాదం ఉందా?
సంస్థ తీసుకునే నిర్ణయాల వల్ల నా భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం కలుగుతోందా?
సమీప భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఏవైనా జరగనున్నాయా?
ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సమధానాలు లభిస్తే మీలో ఉన్న
శక్తి సామర్థ్యాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలు
తెలిసిపోతాయి. దీనివల్ల మీరు స్వీయ విశ్లేషణ
చేసుకుని, సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం స్వాట్ అస్త్రాన్ని ప్రయోగించండి.. మిమల్ని మీరు విజేతలుగా మలచుకోండి..!