ఉజ్వల భవితకు..భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు..
మానవ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధించేందుకు భావ ప్రకటనా నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్) ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా ఉద్యోగావకాశాలు పొందడానికి ఇవి తప్పనిసరిగా మారాయి. దీర్ఘకాలం కొలువులోకొనసాగాలంటే ఈ స్కిల్స్‌ను సమర్థంగా ప్రదర్శించాల్సి ఉంది.అయితే ఈ నైపుణ్యాలు అందరిలోనూ సమాన స్థాయిలో ఉండవు.అందువల్ల వాటిని పెంపొందించుకునేందుకు నిరంతరం సాధన చేయాలి. భావ వ్యక్తీకరణలో విచక్షణను ప్రదర్శించడం, భావావేశాలపై నియంత్రణ సాధించడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవచ్చు.
ఉద్యోగ జీవితంలోని దశలు: ప్రతి వ్యక్తి ఉద్యోగ జీవితంలో మూడు దశలు ఉంటాయి. ఒకటి.. ప్రవేశం. రెండు.. స్థిరపడటం. మూడు.. అంచెలంచెలుగా ఎదగడం. ఈ మూడు దశల్లో సఫలీకృతమవడానికి దృఢమైన వ్యక్తిత్వం ఎంత అవసరమో ఆ వ్యక్తిత్వ వికాసాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగం సాధించాలంటే దానికి కావాల్సిన అర్హతలు, నైపుణ్యాలు, సంబంధిత సంస్థ వివరాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా లక్షణాలు పెంపొందించుకొని వాటిని వ్యక్తం చేసే నైపుణ్యాలు సాధించాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే అందరి కంటే మనలో ఉత్తమ వ్యక్తిత్వం, మెరుగైన నైపుణ్యాలు ఉన్నట్లు ఒప్పించగల నేర్పు అవసరం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు-ముఖ్యాంశాలు: భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో ముఖ్యంగా నాలుగు అంశాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చదువుకు తగ్గ ఉద్యోగం సాధించడానికి, ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందడానికి ఈ నాలుగు నైపుణ్యాలు అవసరం.
1. శ్రవణ నైపుణ్యం: మనకు ఇష్టమున్నా, లేకున్నా మన చుట్టూ ఏర్పడే ప్రతి శబ్దాన్ని మనం వినగలం. అయితే గ్రహించడం అనేది సంకల్పిత చర్య. అంటే మన ప్రమేయంతో జరిగే చర్య. మెదడు, కళ్లు, చెవులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రహించగలం. అందువల్ల ఉద్యోగ విజయానికి, ఉత్తమ మానవ సంబంధాలకు శ్రవణ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? అనే అవగాహన అవసరం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన చదువుకు, చేసే పనికి సంబంధం ఉండదు. కాబట్టి పై అధికారులు, సీనియర్ల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు శ్రవణ నైపుణ్యాలు తప్పనిసరి. సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉంటేనే ఉద్యోగంలో రాణించగలం. అయితే శ్రవణ నైపుణ్యాలు లేకుండా సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన రావడం అసాధ్యం. సందర్భోచిత హావభావాలు కూడా ఉత్తమ శ్రవణ నైపుణ్యాల్లో ముఖ్యాంశమే.
2. వాక్పటిమ: భావాలను ఇతరులకు చెప్పడానికి, ప్రతిభను నిరూపించుకునేందుకు, మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి వాక్పటిమ ఎంతో అవసరం. పదాల వాడకం, ఉచ్చారణ, వాక్య నిర్మాణం, శైలి, వేగం, హావభావాలు భావ వ్యక్తీకరణను ప్రభావితం చేస్తాయి. ఇతరుల భావాలకు అనుగుణంగానే కాకుండా వారి ఉద్దేశాన్ని బట్టి కూడా మాట్లాడటమే నిజమైన నైపుణ్యం.
3. పఠనా నైపుణ్యం: చదవడం ఒక కళ. దీని ద్వారా విషయ పరిజ్ఞానం పెరగడమే కాక విశ్లేషణాశక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల ప్రతిఒక్కరూ చదవడాన్ని శాస్త్రీయంగా సాధన చేసి పఠనా నైపుణ్యాన్ని పొందాలి. వాక్పటిమను పెంచుకోవడానికి పఠనా నైపుణ్యం ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ చదవడానికి, సారాంశాన్ని గ్రహించడానికి పఠనా నైపుణ్యం అవసరం. దీంతో ఉద్యోగంలో విజయంతోపాటు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.
4. రచనా నైపుణ్యం: రచన అనేది రాస్తూ ఉంటేనే రాటుదేలుతుంది. ఇది పఠనాసక్తిపై ఆధారపడి ఉంటుంది. స్పష్టత, సమగ్రత, సృజనాత్మకత రచనా నైపుణ్యానికి కొలమానాలు. నిర్దిష్ట పద ప్రయోగం, సహజ శైలి, సరళమైన భావ వ్యక్తీకరణ... రచనా నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడతాయి.
ఎన్.వి.పార్థసారధి
డిగ్రీ కాలేజీ లెక్చరర్ (రిటైర్డ్),
హైదరాబాద్.