bahvitha
-
నాకు నప్పే గ్రూప్ ఏది?
పదో తరగతి పరీక్షలు ముగిశాయి.. త్వరలోనే ఫలితాలు కూడా విడుదలవుతాయి. తర్వాత భవిష్యత్‌కు బాటవేసే ఇంటర్ దిశగా అడుగులు.. మరి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది? ఏ గ్రూప్ ఎవరికి నప్పుతుంది? అనుకూలమైన గ్రూప్ ఏది? ఇలా అనేక సందేహాలు. కారణం.. ఇంటర్లో తీసుకున్న గ్రూప్‌పైనే భవిష్యత్తు అవకాశాలు ఆధారపడి ఉంటాయనేది నిస్సందేహం. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై విశ్లేషణ.. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల్లో అధిక శాతం మంది నుంచి వచ్చే సమాధానమిదే. కారణం.. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల గురించి చిన్నప్పటి నుంచే ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు. మరోవైపు ఈ రెండు కోర్సులకు కెరీర్ పరంగా సమాజంలో క్రేజ్ ఉండటం. అయితే గ్రూప్ ఎంపికలో మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనేది నిపుణుల సూచన. కీలకమైన పదో తరగతి తర్వాత గ్రూప్ ఎంపికలో తప్పటడుగు వేస్తే అది దీర్ఘకాలంలో భవిష్యత్ కెరీర్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం. ఆçసక్తికే పెద్దపీట ఇంటర్మీడియెట్‌లో గ్రూప్ ఎంపికలో విద్యార్థులు ప్రధానంగా ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలనేది నిపుణుల అభిప్రాయం. నైపుణ్యాలుంటే ఇంజనీరింగ్, మెడికల్‌తోపాటు అనేక రంగాల్లో ఇప్పుడు అవకాశాలు పుష్కలం. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌లో చేరుతున్న విద్యార్థులు తాము బ్యాచిలర్ స్థాయి కోర్సులు పూర్తి చేసుకునే నాటికి విభిన్న రంగాల్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. కాబట్టి కెరీర్ అంటే ఇంజనీరింగ్, మెడికల్ మాత్రమే అనే ఆలోచన నుంచి బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లే ఏకైక మార్గమని భావించకుండా స్వీయ ఆసక్తి మేరకు గ్రూప్ ఎంపిక చేసుకోవాలంటున్నారు. ఎంపీసీ.. ప్రత్యేక నైపుణ్యాలు ఇంటర్మీడియెట్‌లో క్రేజీ గ్రూప్ ఎంపీసీ. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు ఉండే ఈ గ్రూప్‌లో రాణించాలంటే విద్యార్థులకు కొన్ని సహజమైన లక్షణాలు అవసరం. అవి.. న్యూమరికల్ స్కిల్స్, కంప్యూటేషన్ స్కిల్స్. అంతేకాకుండా ఏదైనా ఒక అంశాన్ని నిశితంగా పరిశీలించి, దాని వెనుక కారణాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నవారికి ఎంపీసీ గ్రూప్ సరితూగుతుంది. గణితంపై ఇష్టం.. సైన్స్ అంటే భయం కొందరు విద్యార్థులకు గణితమంటే ఇష్టం. అదే సమయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే భయం. అలాంటి వారు గ్రూప్ ఎంపికలో ఆందోళనకు గురవుతారు. ఇలాంటి వారికి చక్కటి మార్గం ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల కలయికగా ఉండే ఈ గ్రూప్‌లో మ్యాథమెటిక్స్, కామర్స్ రెండు సబ్జెక్ట్లూ అంకెలు, గణాంకాల ఆధారంగా ఉంటాయి. అంతేకాకుండా భవిష్యత్తు అవకాశాల కోణంలోనూ ఎంఈసీ విద్యార్థులకు చక్కటి మార్గాలున్నాయి. ఎంఈసీ విద్యార్థులు చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సుల్లో అడుగుపెట్టి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. లైఫ్ సైన్సెస్‌పై ఆసక్తి.. బైపీసీ బైపీసీ పూర్తిచేసి, ఎంట్రెన్స్‌లో ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్, బీడీఎస్‌లో చేరొచ్చు. బైపీసీ గ్రూప్‌లో చేరే అభ్యర్థులకు ప్రధానంగా లైఫ్‌సైన్సెస్‌పై ఆసక్తి ఉండాలి. మన పరిసరాల్లోని పర్యావరణంపై అవగాహన ఉండాలి. వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత అవసరం. అప్పుడే ఈ గ్రూప్‌లో రాణించగలరు. బైపీసీలోని ప్రధానమైన రెండు సబ్జెక్ట్‌లు బోటనీ, జువాలజీల్లో మొక్కలు, వృక్షాలు, జంతువులు– వాటి వ్యవస్థలకు సంబంధించిన అంశాలుంటాయి. ఈ గ్రూప్‌లో చేరితే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ అనే కాకుండా.. వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, హోమియోపతి, నేచురోపతి వంటి మరెన్నో ఇతర కోర్సుల్లో చేరే అవకాశం లభిస్తుంది. సీఈసీ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌లు కలయికగా ఉండే ఈ గ్రూప్ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తిచేసుకొని కార్పొరేట్ సంస్థల్లో వైట్ కాలర్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ గ్రూప్‌లో చేరే అభ్యర్థులకు న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ స్కిల్స్ ఉండాలి. అంతేకాకుండా విస్తృతంగా చదవడాన్ని, తాజా మార్పులపై అవగాహన పెంచకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్లలోని ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి? - ఎన్.మధులత, హైదరాబాద్. పదాల పరిమితిపై ఆందోళన చెందకుండా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ బాగా రాస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ప్రశ్నను బట్టి సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయాలా? లేదంటే విశ్లేషణాత్మకత విధానంలోనూ రాయాలా? అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు పాయింట్ల రూపంలో సమాధానం రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరికొన్నింటికి రెండు విధానాలనూ జోడిస్తూ రాసినప్పుడే మంచి మార్కులు సాధించొచ్చు. l Comment, Elaborate, Illustrate, Analyse, Be Critica.. తదితర పదాలు ప్రశ్నల్లో కనిపిస్తాయి. ఓ ప్రశ్నను రూపొందించే వ్యక్తి మీ నుంచి దేన్ని ఆశిస్తున్నాడనేది ఈ పదాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దానికి తగినట్లు సమాధానం రాయాలి. వ్యాఖ్యానించమన్నారా.. విశ్లేషించమన్నారా? లేదంటే విమర్శనాత్మకంగా విశ్లేషించమన్నారా? ఇలా సమాధానాన్ని ఏ కోణంలో రాయాలన్నది గుర్తించాలి. మరో ముఖ్య విషయం కచ్చితమైన సమాధానమంటే కేవలం ఫ్యాక్ట్స్‌ను మాత్రమే రాయడం కాదు. విశ్లేషణాత్మకంగా సమాధానం రాయడం ప్రధానం. ఫ్యాక్ట్స్ అనేవి ఓ అంశంపై అభ్యర్థి శ్రద్ధను మాత్రమే తెలియజేస్తాయి. కారణం ఏదైనా సరే ఒక పేపర్‌ను సరిగా రాయలేదని అనిపిస్తే అతిగా ఆలోచించకుండా అంతటితో దాన్ని మరిచిపోయాలి. లేదంటే దీని ప్రభావం మరో పేపర్‌పై పడుతుంది. -
బులెటిన్ బోర్డు
బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియాలో 15 పోస్టులు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: యూఐ డిజైనర్, డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, టెస్టర్., ఖాళీలు: 15. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంసీఏ/బీసీఏ/ బీఎఫ్ఏ/ ఎంఎఫ్ఏ/ బీ.ఆర్క్/బీ.డిజైన్/ఎం.డిజైన్/ పీజీ డిప్లొమా ఇన్ వెబ్ డిజైన్/ తత్సమాన విద్యార్హత ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 17. వివరాలకు: www.becil.com ఐఐటీ బాంబేలో 12 పోస్టులు బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ కన్సల్టెంట్ సెంటర్లో.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: సీనియర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ - ఫీల్డ్ ఇంజనీర్., ఖాళీలు: 12. అర్హత: సీనియర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు డెమోగ్రఫీ/స్టాటిస్టిక్స్‌లో పీహెచ్‌డీతో పాటు కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ ఎంటెక్/ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఐటీఐ డిప్లొమా/తత్సమాన అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 14. వివరాలకు: www.ircc.iitb.ac.in నిఫ్ట్‌లో గ్రూప్ - సీ పోస్టులు భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ (అకౌంట్స్), మెషిన్ మెకానిక్, అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్ (గర్ల్స్), ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, జూనియర్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్. ఖాళీలు: 23 దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును నిర్దేశిత నమూనాలో పూర్తిచేసి - ది డెరైక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, ఐడీసీవో ప్లాట్ నెం.24, కేఐఐటీ ఆఫ్ మేనేజ్మెంట్స్కూల్ ఎదురుగా, పాటియా, భువనేశ్వర్-751024కి గడువులోగా పంపాలి. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 24 (సెప్టెంబర్ 21గా ఉన్న చివరి తేదీని పొడిగించారు). వివరాలకు: www.nift.ac.in -
పీపుల్ స్కిల్స్‌తో పదిలమైన అవకాశాలు..
‘ఈ రోజుల్లో ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగంలో చేరితే అందులోని అన్ని విభాగాలపై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరిగా మారుతోంది. పీపుల్ స్కిల్స్ ఉన్న వారేఈ మేరకు రాణించగలరు’ అని ఐఐఎం-లక్నో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ దేబాశిశ్ ఛటర్జీ అంటున్నారు. కెరీర్ సక్సెస్‌కు అవసరమైన నైపుణ్యాలపై ఆయనతో గెస్ట్‌కాలం.. నేడు స్కిల్స్ పరిధి విస్తృతమవుతోంది. సాఫ్ట్వేర్ విప్లవంతో సాఫ్ట్ స్కిల్స్ ప్రాధాన్యం పెరిగింది. తర్వాత గ్లోబలైజేషన్ యుగంలో బిజినెస్ స్కిల్స్ ఉన్నవారికే కార్పొరేట్ అవకాశాలు దక్కేవి. ఇప్పుడు ఉద్యోగార్థిలో పీపుల్ స్కిల్స్ కీలకంగా మారాయి. పీపుల్ స్కిల్స్ అంటే ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం, నలుగురిలో బెరుకు లేకుండా మాట్లాడటం, బృంద వాతావరణంలో పనిచేయడం, క్లయింట్లను మెప్పించడం, నెగోషియేషన్ స్కిల్స్‌ను ప్రదర్శించడాన్ని పీపుల్ స్కిల్స్గా పేర్కొంటారు. ఉద్యోగి తన విభాగానికే పరిమితం కాకుండా అన్ని విభాగాల వారితో మాట్లాడుతూ ఆయా నైపుణ్యాలను సముపార్జించుకోవడం, పనిలో నైపుణ్యం చూపడాన్ని కూడా పీపుల్ స్కిల్స్గా పరిగణించొచ్చు. పోటీ ప్రపంచంలో మనమెక్కడ? ఇరవై ఒకటో శతాబ్దం.. ఇంటర్నెట్ విప్లవం.. గ్లోబలైజేషన్.. అన్నీ అరచేతిలో.. ఒక్క క్లిక్ దూరంలోనే! నిత్యం అప్డేట్ కావాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో నెగ్గుకురావాలంటే బహుముఖ నైపుణ్యాలు ఉండాలి. అందుకే యువత ముందుగా స్వీయ పరిశీలన చేసుకోవాలి. ‘పోటీ ప్రపంచంలో మనం ఎక్కడున్నాం? అందరికన్నా ముందుండాలంటే ఏం చేయాలి?’ అని ప్రశ్నించుకోవాలి. పరిశ్రమ వర్గాలు ముందుకు రావాలి అభ్యర్థుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండటం లేదని చెబుతున్న పరిశ్రమ వర్గాలు వాటిని మెరుగుపరిచేందుకు చొరవ చూపాలి. విద్యాసంస్థలను విస్తృతంగా సంప్రదించాలి. పాఠ్య ప్రణాళికను, బోధనను పరిశ్రమ అవసరాలకు తగ్గట్లు రూపొందించేందుకు సహకరించాలి. చాలా కంపెనీలు పేరొందిన విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో సాధారణ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉద్యోగ వేటలో వెనకబడుతున్నారు. మెంటారింగ్‌తో ముందడుగు మట్టిలో మాణిక్యాలున్నట్లు మామూలు కాలేజీల్లోనూ మెరికల్లాంటి విద్యార్థులుంటారు. వారిలోని బలహీనతలను, ఆత్మన్యూనతను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలి. విద్యార్థి విజయ పథంలో సాగడానికి సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరం. ఉద్యోగ సంస్థలు ఒక వ్యక్తి పనితీరునే ప్రామాణికంగా తీసుకునే విధానానికి స్వస్తి పలకాలి. మిగతా ఉద్యోగుల్లోని సామర్థ్యాలనూ గుర్తించే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న ‘ఆట్రిషన్’ సమస్యకు ప్రధాన కారణం ఉద్యోగికి పనిచేసే చోట సరైన గుర్తింపులేక పోవడమే. కొత్త నైపుణ్యాలు అవసరం.. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఔత్సాహికులు గ్రోత్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి. కాలేజీ/వర్సిటీలో చేరి క్యాంపస్ కొలువు పొందితే చాలు కెరీర్లో స్థిరపడినట్లే అనే భావన వీడాలి. ఉద్యోగ జీవితంలో ముందుకు సాగేందుకు నిరంతరం కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అకడమిక్ స్థాయి నుంచే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే కెరీర్‌కు, జీవిత లక్ష్యానికి సార్థకత, పరిపూర్ణత లభిస్తుంది. సక్సెస్ బదులు పర్ఫెక్షన్ అనే సూత్రాన్ని పాటించాలి. సమస్యకు పరిష్కారం లభించినంత మాత్రాన దాన్నే సక్సెస్‌గా భావించకూడదు. కచ్చితత్వం దిశగా సాగాలి. అప్పుడే అసలైన విజయం సొంతమవుతుంది. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం నలుగురిలో బెరుకు లేకుండా మాట్లాడటం బృంద స్ఫూర్తి క్లయింట్లను మెప్పించడం.. ప్రొ॥దేబాశిశ్ ఛటర్జీ, లక్నో ఐఐఎం -
ఉజ్వల భవితకు..భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు..
మానవ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధించేందుకు భావ ప్రకటనా నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్) ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా ఉద్యోగావకాశాలు పొందడానికి ఇవి తప్పనిసరిగా మారాయి. దీర్ఘకాలం కొలువులోకొనసాగాలంటే ఈ స్కిల్స్‌ను సమర్థంగా ప్రదర్శించాల్సి ఉంది.అయితే ఈ నైపుణ్యాలు అందరిలోనూ సమాన స్థాయిలో ఉండవు.అందువల్ల వాటిని పెంపొందించుకునేందుకు నిరంతరం సాధన చేయాలి. భావ వ్యక్తీకరణలో విచక్షణను ప్రదర్శించడం, భావావేశాలపై నియంత్రణ సాధించడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఉద్యోగ జీవితంలోని దశలు: ప్రతి వ్యక్తి ఉద్యోగ జీవితంలో మూడు దశలు ఉంటాయి. ఒకటి.. ప్రవేశం. రెండు.. స్థిరపడటం. మూడు.. అంచెలంచెలుగా ఎదగడం. ఈ మూడు దశల్లో సఫలీకృతమవడానికి దృఢమైన వ్యక్తిత్వం ఎంత అవసరమో ఆ వ్యక్తిత్వ వికాసాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగం సాధించాలంటే దానికి కావాల్సిన అర్హతలు, నైపుణ్యాలు, సంబంధిత సంస్థ వివరాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా లక్షణాలు పెంపొందించుకొని వాటిని వ్యక్తం చేసే నైపుణ్యాలు సాధించాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే అందరి కంటే మనలో ఉత్తమ వ్యక్తిత్వం, మెరుగైన నైపుణ్యాలు ఉన్నట్లు ఒప్పించగల నేర్పు అవసరం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు-ముఖ్యాంశాలు: భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో ముఖ్యంగా నాలుగు అంశాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చదువుకు తగ్గ ఉద్యోగం సాధించడానికి, ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందడానికి ఈ నాలుగు నైపుణ్యాలు అవసరం. 1. శ్రవణ నైపుణ్యం: మనకు ఇష్టమున్నా, లేకున్నా మన చుట్టూ ఏర్పడే ప్రతి శబ్దాన్ని మనం వినగలం. అయితే గ్రహించడం అనేది సంకల్పిత చర్య. అంటే మన ప్రమేయంతో జరిగే చర్య. మెదడు, కళ్లు, చెవులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రహించగలం. అందువల్ల ఉద్యోగ విజయానికి, ఉత్తమ మానవ సంబంధాలకు శ్రవణ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? అనే అవగాహన అవసరం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన చదువుకు, చేసే పనికి సంబంధం ఉండదు. కాబట్టి పై అధికారులు, సీనియర్ల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు శ్రవణ నైపుణ్యాలు తప్పనిసరి. సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉంటేనే ఉద్యోగంలో రాణించగలం. అయితే శ్రవణ నైపుణ్యాలు లేకుండా సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన రావడం అసాధ్యం. సందర్భోచిత హావభావాలు కూడా ఉత్తమ శ్రవణ నైపుణ్యాల్లో ముఖ్యాంశమే. 2. వాక్పటిమ: భావాలను ఇతరులకు చెప్పడానికి, ప్రతిభను నిరూపించుకునేందుకు, మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి వాక్పటిమ ఎంతో అవసరం. పదాల వాడకం, ఉచ్చారణ, వాక్య నిర్మాణం, శైలి, వేగం, హావభావాలు భావ వ్యక్తీకరణను ప్రభావితం చేస్తాయి. ఇతరుల భావాలకు అనుగుణంగానే కాకుండా వారి ఉద్దేశాన్ని బట్టి కూడా మాట్లాడటమే నిజమైన నైపుణ్యం. 3. పఠనా నైపుణ్యం: చదవడం ఒక కళ. దీని ద్వారా విషయ పరిజ్ఞానం పెరగడమే కాక విశ్లేషణాశక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల ప్రతిఒక్కరూ చదవడాన్ని శాస్త్రీయంగా సాధన చేసి పఠనా నైపుణ్యాన్ని పొందాలి. వాక్పటిమను పెంచుకోవడానికి పఠనా నైపుణ్యం ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ చదవడానికి, సారాంశాన్ని గ్రహించడానికి పఠనా నైపుణ్యం అవసరం. దీంతో ఉద్యోగంలో విజయంతోపాటు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. 4. రచనా నైపుణ్యం: రచన అనేది రాస్తూ ఉంటేనే రాటుదేలుతుంది. ఇది పఠనాసక్తిపై ఆధారపడి ఉంటుంది. స్పష్టత, సమగ్రత, సృజనాత్మకత రచనా నైపుణ్యానికి కొలమానాలు. నిర్దిష్ట పద ప్రయోగం, సహజ శైలి, సరళమైన భావ వ్యక్తీకరణ... రచనా నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడతాయి. ఎన్.వి.పార్థసారధి డిగ్రీ కాలేజీ లెక్చరర్ (రిటైర్డ్), హైదరాబాద్. -
స్వాట్ ది వే టు సక్సెస్
మనిషి తన జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలని కోరుకోడు.వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ విజయం సాధించాలని.. అత్యున్నత స్థాయికి ఎదగాలని నిరంతరంఆలోచిస్తుంటాడు. ఆలోచనలు బాగానే ఉన్నా.. తన శక్తిసామర్థ్యాలు, బలాలు, బలహీనతలను, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోలేక ఆచరణలో విఫలమవుతుంటాడు. అలాంటిపరిస్థితుల్లో స్వీయ విశ్లేషణ ద్వారా సరైన నిర్ణయంతీసుకోవడానికి స్వాట్ (SWOT= Strengths, Weaknesses, Opportunities, Threats)అనాలసిస్ ఉపయోగపడుతుంది. స్వాట్ అనాలసిస్ సాయంతో వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఉన్నతీకరించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి స్వీయ విశ్లేషణ చేసుకోవడం ఎలాగో చూద్దాం.. బలాలు (Strengths) ఒక పనిని సమర్థంగా పూర్తిచేసి విజయం సాధించాలంటే మొదట చేయాల్సింది స్వీయ శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకోవడం.. అదెలా అంటే.. నేను ఏం చేయగలను? నాకున్న ఆసక్తులు ఏంటి? ఇతరుల కంటే నాకున్న అదనపు అర్హతలేంటి? ఒక పనిని ఇతరుల కంటే నేనెంత బాగా చేయగలను? గొప్పగా చెప్పుకునే పనులేమైనా చేశానా? నాకున్న ఆర్థిక, ఇతర వనరులేంటి? నాకున్న అనుకూలతలు, పరిచయాలేంటి? నాకు సపోర్టివ్‌గా ఎవరైనా ఉన్నారా? నా నడవడిక ఎలా ఉంది?.. బలహీనతలు (Weaknesses) బలాలను ఎంత నిజాయతీగా గుర్తిస్తారో బలహీనతలను కూడా అంతే నిజాయతీగా గుర్తించి, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తే ఎంపిక చేసుకున్న పనిలో విజయం సాధించడం చాలా తేలిక. బలహీనతలను గుర్తించేందుకు ఉపయోగపడే ప్రశ్నలు.. నాలో ఉన్న చెడు లక్షణాలు, లోపాలు ఏమిటి? ఏ పనిని నేను సరిగా చేయలేకపోతున్నాను? నేను ఏ పని అంటే భయపడుతున్నాను? సీనియర్లు ఏ విషయంలో నన్ను తప్పుబడుతున్నారు? పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలి? నన్ను నేను ఏ అంశంలో మెరుగుపరచుకోవాలి?.. అవకాశాలు (Opportunities) వెయ్యి అవకాశాలున్నా వాటిని ఉపయోగించుకోవడం తెలియకుంటే వ్యర్థమే..! ఏ పనిలో విజయం సాధించాలన్నా అవకాశాలు చాలా ముఖ్యం. ఇవి వ్యక్తి బలాలు, బలహీనతలపై ఆధారపడి ఉంటాయి. ఎలాగంటే బలాలతో అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక మార్గం. బలహీనతలను అధిగమించి, కొత్త అవకాశాలను సృష్టించుకోవడం రెండో మార్గం. అయితే అవకాశాలను ఎలా విశ్లేషించుకోవాలో చూద్దాం... నేను చేస్తున్న పనికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది? నేను పనిచేస్తున్న రంగం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? నేను పనిచేస్తున్న కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? నేను పనిచేస్తున్న సంస్థలో కొత్తగా అవకాశాలు రాబోతున్నాయా? వాటిని నేనెలా అందుకోవాలి? నేను పనిచేస్తున్న సంస్థ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? గతంలో నేను చేయలేని పనిని ఇప్పుడు చేయడానికి నాకున్న అవకాశాలేంటి? చేయగలనా? కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? ఏ రంగం వైపు అడుగులు వేస్తే భవిష్యత్తు బాగుంటుంది? దేనిపై పట్టుసాధిస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి?.. ప్రమాదాలు (Threats) మనం విజయం సాధించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ప్రమాదాలుగా అభివర్ణించవచ్చు. మనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా లక్ష్య సాధనలో ఓ భాగమే. అడ్డంకులను ముందుగా పసిగట్టలేక పోయినా, వీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రమాదాలను గుర్తించడం ఎలాగో చూద్దాం... నా బలహీనతలు భవిష్యత్తులో అడ్డంకిగా మారతాయా? ఎలాంటి సమస్యలైనా తెచ్చిపెడతాయా? నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటి? వాటిని అధిగమించడం ఎలా? కొత్తగా వచ్చే టెక్నాలజీ లేదా మరే ఇతర పరిస్థితుల వల్ల కానీ నా ఉనికికి ఏమైనా ప్రమాదం ఉందా? సంస్థ తీసుకునే నిర్ణయాల వల్ల నా భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం కలుగుతోందా? సమీప భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఏవైనా జరగనున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సమధానాలు లభిస్తే మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలు తెలిసిపోతాయి. దీనివల్ల మీరు స్వీయ విశ్లేషణ చేసుకుని, సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం స్వాట్ అస్త్రాన్ని ప్రయోగించండి.. మిమల్ని మీరు విజేతలుగా మలచుకోండి..! -
భవితకు పునాది.. ప్రాజెక్ట్ వర్క్
అకడమిక్ దశలోనే క్షేత్రస్థాయి నైపుణ్యాలు, ప్రాక్టికల్ఓరియంటేషన్కు పునాదులు వేస్తుంది ప్రాజెక్ట్ వర్క్.ప్లేస్‌మెంట్స్‌లో రాణించాలంటే ప్రాజెక్ట్ వర్క్తోస్కిల్స్ పెంపొందించుకోవాలి. మొత్తం మీద ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవితకుప్రాజెక్ట్ వర్క్ బాట వేస్తుంది. ప్రస్తుతంవిద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్కుసిద్ధమవుతున్న క్రమంలోనిపుణుల సలహాలు.. ఇంజనీరింగ్ విద్యార్థులు మూడేళ్లపాటు తరగతి గదిలో నేర్చుకున్న సబ్జెక్టును ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు సరైన మార్గం ప్రాజెక్ట్ వర్క్. ఆయా ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు, సమస్యలపై ప్రాజెక్టు వర్క్‌తో అవగాహన పెంపొందించుకోవచ్చు. కొత్త సమస్యలు, వాటికి సరైన పరిష్కారాలు, నూతన ఆవిష్కరణల గురించి తెలుసుకోవచ్చు. లెర్నింగ్ బై డూయింగ్‌కు కూడా అవకాశం కల్పిస్తుంది. ఇంతటి కీలకమైన ప్రాజెక్ట్ వర్క్‌కు విద్యార్థులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అలా కాకుండా డమ్మీ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెడితే అది విద్యార్థుల కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మూడో ఏడాది నుంచే అన్వేషణ బీటెక్ నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు మూడో సంవత్సరం నుంచే దానిపై కసరత్తు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిమాండ్ ఉన్న అంశాలు, కంపెనీల్లో ప్రాజెక్ట్ చేయడానికి అవకాశాలు, లేదా వ్యక్తిగతంగా చేయడం ఎలా? సీనియర్లు ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నారు? ఇలా వివిధ అంశాలను పరిశీలించాలి. దీంతో ప్రాజెక్టు ప్రారంభించేనాటికి కొంత అవగాహన వస్తుంది. అంశం ఎంపిక ప్రస్తుతం సంబంధిత రంగంలో ఎదురవుతున్న వాస్తవ సమస్యలను పరిష్కరించేలా ప్రాజెక్ట్ వర్క్ అంశాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. సమస్య పరిష్కార మార్గం ఆధారంగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తే మెరుగ్గా ఉంటుందనే ఆలోచనతో ఆసక్తి లేని అంశాన్ని ఎంపిక చేసుకోవడం సరికాదు. ఆసక్తితోపాటు భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. కంపెనీలు అభ్యర్థిని రిక్రూట్ చేసుకునేటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేయడంలో చూపిన నిబద్ధతను, సృజనాత్మక ఆలోచన విధానాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వ్యక్తిగత ప్రాజెక్టులు కంపెనీల్లో లైవ్ ప్రాజెక్ట్‌లకు వీలుకాకుంటే.. స్వయంగా తామే ఏదైనా ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. దీన్నే individual project work అంటారు. ఇందులో ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు కలిసి బృందంగా ఏర్పడి, ఎంచుకున్న అంశంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సమన్వయం ఉన్న అభ్యర్థులు జట్టుగా ఏర్పడితే మంచిది. ప్రాజెక్టు అంశంపై వీరు అధ్యాపకుల సలహాలు తీసుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్ కార్యాచరణ అంశానికి సంబంధించి సమస్యను రాసుకోవడం సమస్య పరిష్కారానికి ఉపయోగపడే మార్గాలను గుర్తుంచుకోవడం ఠి పరిష్కార మార్గాలను కార్యాచరణలో పెట్టేందుకు అనుసరించాల్సిన విధానాలు ఠి కార్యాచరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం ప్రాజెక్ట్ వర్క్- అనుసరించాల్సిన అంశాలు ఏదైనా అంశాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులు.. అప్పటికే దానిపై నిపుణులు ప్రచురించిన రీసెర్చ్ పేపర్లు, జర్నల్స్ చదవాలి. దీంతో ఆ అంశానికి సంబంధించిన తాజా పరిణామాలు, సమస్యలు, కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలపై అవగాహన వస్తుంది. దీంతో తమ ప్రాజెక్ట్ వర్క్ మరింత వినూత్నంగా ఉండేలా చూసుకోవచ్చు. ఉదాహరణకు సీఎస్ఈ బ్రాంచ్ విద్యార్థులకు డేటా అనలిటిక్స్.. ఇండస్ట్రీ కోణంలో హాట్ టాపిక్‌గా మారింది.రిపోర్ట్ రూపకల్పన: ప్రాజెక్ట్ వర్క్ అంశం ఎంపికలో ఎంత అప్రమత్తంగా ఉన్నారో.. రిపోర్ట్ రూపకల్పన, థీసిస్ ప్రజెంటేషన్‌లోనూ అంతే శ్రద్ధ వహించాలి. ఒక క్రమ పద్ధతిలో ప్రాజెక్ట్ వర్క్ రిపోర్ట్ (థీసిస్) ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్ట్ టైటిల్ నుంచి రిఫరెన్సెస్ వరకు అన్నీ ఒక క్రమ పద్ధతిలో నివేదించాలి. టైటిల్ పేజ్ ఠి సర్టిఫికెట్ (ప్రాజెక్ట్ గైడ్ ఇచ్చేది) సినాప్సిస్ ఎకనాలెడ్జ్మెంట్స్ ఇండెక్స్ (కంటెంట్స్ టేబుల్) ఇంట్రడక్షన్ (చాప్టర్-1) ఠి లిటరేచర్ - (చాప్టర్-2) డిజైన్ మెథడాలజీ (చాప్టర్ -3) ఠి ఫలితాల విశ్లేషణ (చాప్టర్ -4) రిఫరెన్సెస్ ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి డిమాండింగ్ లేదా హాట్ టాపిక్స్ కోణంలో ఆలోచించడం మంచిది. వ్యక్తిగత సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుంటే, కొన్ని సందర్భాల్లో వాటిని ఎంపిక చేసుకున్న విద్యార్థులకు సరైన గైడ్ లేక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందువల్ల విద్యార్థులు ముందుగా తమ ఆసక్తిని, ఆ తర్వాత గైడ్ సదుపాయాన్ని తెలుసుకోవాలి. ఈ రెండింటి విషయంలో సానుకూలత లేకపోతే అకడమిక్‌గా ఆసక్తి ఉన్న కోర్ అంశాల్లో ప్రాజెక్ట్ వర్క్‌కు సిద్ధం కావాలి. ఎలాంటి అంశమైనా కచ్చితమైన పరిష్కారం ఉండేలా చూసు కోవాలి. - ప్రొ॥ఇ.శ్రీనివాస్‌రెడ్డి, డీన్, సీఎస్ఈ, ఏఎన్యూసీఈ. కంపెనీల్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న విద్యార్థులకు సంస్థ నిపుణులతో కలసి పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మంచి పనితీరు కనబరచడం ద్వారా సంస్థను ఆకట్టుకొని, అందులోనే జాబ్ ఆఫర్ సైతం అందుకోవచ్చు. కంపెనీల్లో లైవ్ ప్రాజెక్ట్‌కు అవకాశం లభించిన విద్యార్థులు ఉత్సాహంగా పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డమ్మీ లేదా ఫేక్ ప్రాజెక్టుల వైపు వెళ్లొద్దు. క్యాంపస్ ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్‌పైనే ఉంటాయనే విషయం గుర్తించాలి. - ప్రొ॥వి.ఉమామహేశ్వర రావు, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఓయూసీఈ. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఆవరణ శాస్త్రంలో అభ్యర్థులు ప్రాథమిక భావనలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా జాతి (species),జాతి ఉత్పత్తి (speciation),ఆవరణ వ్యవస్థ (ecosystems), వాటి రకాలు, ఆహార శృంఖలాలు, బయో జియో కెమికల్ సైకిల్స్, ఆహార వల (food chain)ఎకోటోన్, జీవుల అనుకూలతలపై అవగాహన పెంచుకోవాలి. జీవశాస్త్రంలోని జంతువృక్ష విజ్ఞానాన్ని ఆవరణ శాస్త్రానికి అన్వయించుకొని చదవడం ద్వారా జీవుల అనుకూలతలపై పట్టు లభిస్తుంది. జీవ వైవిధ్యం జీవ వైవిధ్యం(Biodiversity).. మరో ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై సమాచారం అవసరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (Red list)క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్టమేక పక్షి(Great Indian Bustard).అతి త్వరలో అంతరించే జాతిగా దీన్ని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతులపై సమాచారం సేకరించాలి. దీని ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు. బట్టమేక పక్షి - Great Indian Bustard శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్ (Ardeotis nigriceps) దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి. ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత దీనికి సంబంధించిన జాతులు: Lesser florican; Bengal florican; Houbara bustard (ఇది వలస జాతి) ఈ విధంగా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఎర్ర చందనం, నక్షత్ర తాబేలు, మానిస్/పంగోలియన్ అనే పిపీలికాహారి తదితర ముఖ్య జంతువులపై అవగాహన అవసరం. -
విదేశీ విద్యార్థులకు ఐఐటీల కానుక!
► నేరుగా అడ్వాన్స్డ్ రాసేందుకు తొమ్మిది దేశాలకు అనుమతి ► జేఈఈ-2017 ప్రవేశాల నుంచి అమల్లోకి! ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అడ్వాన్స్‌డ్‌కు హాజరవ్వాలంటే.. జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించడమే కాకుండా.. +2, లేదా తత్సమాన కోర్సుల్లో టాప్ 20 పర్సంటైల్‌లో నిలవాలి! భారత విద్యార్థులైనా, ప్రవాస భారతీయుల పిల్లలైనా, భారత సంతతికి చెందిన వారైనా.. ఇతర దేశాల విద్యార్థులైనా.. ఇప్పటివరకు ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ + ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అనుసరిస్తున్న విధానమిది. ఐఐటీలు ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థులకు నిబంధనలను సడలిస్తున్నాయి. ముఖ్యంగా తొమ్మిది దేశాల విద్యార్థులకు నేరుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నాయి. దీనిపై గతవారం ఐఐటీ ప్రవేశాలకు సంబంధించిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ సమావేశంలో ఐఐటీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ ప్రతిపాదనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభిస్తే.. తొమ్మిది దేశాలకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించకుండానే నేరుగా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తొమ్మిది దేశాలు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, సింగపూర్, యూఏఈ, ఇథియోపియా. వీటిలో ఇథియోపియా మినహా మిగిలినవన్నీ ఆసియా ఖండంలోనివే. ఈ తొమ్మిది దేశాల విద్యార్థులు నేరుగా అడ్వాన్స్డ్ రాసేలా అనుమతిచ్చే చర్యలకు ఐఐటీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఈ దేశాల్లో అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించనుంది. ఈ దేశాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే కొత్త విధానం అమలు, కార్యాచరణ బాధ్యతలను ఐఐటీ - బాంబే చేపట్టనున్నట్లు తెలిసింది. వాస్తవానికి విదేశీ విద్యార్థులకు ఐఐటీల గురించి అవగాహన, ఆసక్తి ఉన్నప్పటికీ రెండంచెల పరీక్ష విధానం, పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో నిరాసక్తత చూపుతున్నారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను కొలంబో, ఖాట్మండు, సింగపూర్, బహ్రెయిన్, దుబాయ్, మస్కట్, రియాద్, షార్జాలలో నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాలు దుబాయ్, యూఏఈలో మాత్రమే ఉన్నాయి. ఈ కారణాలతో విదేశీ విద్యార్థులు ఐఐటీలపై దృష్టిసారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తొమ్మిది దేశాల్లోనూ నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేలా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ దేశాలకే ఎందుకు? అమెరికా, యూకే వంటి దేశాల్లో సైతం ప్రత్యేక బ్రాండ్‌ను సొంతం చేసుకున్న ఐఐటీలు.. అటువైపు చూడకుండా ఈ తొమ్మిది దేశాలనే లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముందుగా సార్క్ కూటమిలోని పొరుగు దేశాల విద్యార్థులు మొబిలిటీ, కల్చరల్ డైవర్సిటీ వంటి విషయాల్లో భారత పరిస్థితుల్లో ఇమడగలిగే అవకాశం ఉంటుంది. సార్క్ కూటమిలో ఉండటంతోపాటు భారత్‌లో చదవాలని ఈ దేశాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నందున వీటిని ఎంపిక చేశారు. అలాగే ఆసియా ఖండంలో లేనప్పటికీ.. ఇథియోపియా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు భారత్‌పై ఆసక్తి చూపుతుండటంతో ఆ దేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. జేఈఈ మెయిన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా పేర్కొన్న నిబంధనలను యథాతథంగా అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఈ దేశాల విద్యార్థులకు జనరల్ కేటగిరీ విద్యార్థుల నిబంధనలు వర్తిస్తాయి. కామన్ మెరిట్ లిస్ట్‌లో నిలవాలి. +2, తత్సమాన బోర్డ్ పరీక్షలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి. అంతర్జాతీయ విద్యార్థులు..గ్లోబల్ ర్యాంకులు అంతర్జాతీయంగా ఇన్స్టిట్యూట్లకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో ఒక ఇన్స్టిట్యూట్లోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య కూడా ఒక పరామితిగా ఉంటోంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ అనగానే గుర్తొచ్చే క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ ర్యాంకింగ్స్, అకడమిక్ ర్యాంకింగ్స్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీస్ నిర్వాహకులు ర్యాంకులు కేటాయించేటప్పుడు పరిగణనలోకి తీసుకొనే అయిదారు పరామితుల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంశం కూడా ఉంటోంది. రీసెర్చ్, ఫ్యాకల్టీ సైటేషన్స్, ఔట్‌కమ్ వంటి విషయాల్లో మన ఇన్స్టిట్యూట్స్ మెరుగైన పాయింట్లు సాధిస్తున్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పారామీటర్ విషయంలో వెనుకంజలో ఉంటున్నాయి. ఉదాహరణకు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2015-16ను పరిగణనలోకి తీసుకుంటే.. 179వ ర్యాంకులో నిలిచిన ఐఐటీ ఢిల్లీ మిగిలిన పారామీటర్స్‌లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రాతిపదిక పరంగా చూస్తే అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఐఐటీ-బాంబేలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థులు 50. కాగా, 18 శాతం మందే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు. ఇలా.. ఇంటర్నేషనల్ స్టూడెంట్ పారామీటర్‌లో తక్కువ స్కోరింగ్ లేదా నిల్ స్కోరింగ్ అనేది మొత్తం ర్యాంకులపై ప్రభావం చూపుతోందన్న ఉద్దేశంతో ఐఐటీలు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచే అమల్లోకి! తాజా ప్రతిపాదనను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఐఐటీ కౌన్సిల్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు మరికొద్ది రోజుల్లో పంపనుంది. ఎంహెచ్ఆర్డీ ఆమోదం లభించాక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటుంది. ఈ రెండు ప్రక్రియలు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని ఐఐటీ కౌన్సిల్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది జరిగితే జేఈఈ అడ్వాన్స్డ్-2017 నోటిఫికేషన్లోనే సంబంధిత మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు చేపట్టిన తాజా ప్రతిపాదనను ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, ఐఐటీలకే పరిమితం చేయనున్నారు. రెండు, మూడేళ్ల తర్వాత స్పందన ఆధారంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇతర ఇన్స్టిట్యూట్లకు కూడా వర్తింపజేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఐఐటీలు అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు యోచిస్తున్న తరుణంలో భారత విద్యార్థులు తమ అవకాశాలు చేజారుతాయని ఆందోళన చెందనవసరం లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం ప్రత్యేకంగా పది శాతం సూపర్ న్యూమరరీ సీట్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే.. ప్రస్తుతం దేశంలోని ఐఐటీల్లో బీటెక్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో దాదాపు 11 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి పది శాతం అంటే దాదాపు 1100 సీట్లను అదనంగా పెంచి, అంతర్జాతీయ విద్యార్థులకు కేటాయిస్తారు. తాజా ప్రతిపాదన వల్ల ఐఐటీలు.. గ్లోబల్ ర్యాంకులకు సంబంధించి ఒక్క అంతర్జాతీయ విద్యార్థుల విభాగంలోనే ముందంజలో ఉంటాయనుకోవడం సరికాదు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల తొలుత ‘మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య’ అనేదే ప్రధానంగా నిలిచినప్పటికీ.. తొలి బ్యాచ్ పూర్తయ్యేసరికి నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ఔట్‌కమ్ వంటి ఇతర పారామీటర్స్‌లోనూ మెరుగైన పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ఫ్యాకల్టీ సైతం ఐఐటీలపై ఆసక్తి చూపే పరిస్థితి వస్తుంది. ఇది జరిగితే గ్లోబల్ ర్యాంకుల్లో ఇతర ప్రామాణికాలైన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ వంటి వాటిలో మెరుగుదల సాధ్యమవుతుంది. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్‌కుమార్, డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్. ఐఐటీ మద్రాస్... ఐఐటీ మద్రాస్.. క్రిష్ గోపాల క్రిష్ణన్, రోహిణి చక్రవర్తి, జీకే అనంత సురేశ్, ఆనంద్ రాజారామన్, అనంత్ అగర్వాల్ వంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన అత్యున్నత విద్యా సంస్థ. అంతటి ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థలో చదువుకునే అవకాశం రావడం తనకు దక్కిన అరుదైన అవకాశం అంటున్నాడు అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోహిత్. అంతేకాదు చదువుతోపాటు సినిమాలు, షికార్లు, కబుర్లు, స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు వంటివాటికి కొదవలేదంటున్న రోహిత్ చెబుతున్న క్యాంపస్ కబుర్లు.. ఐఐటీలో సీటే లక్ష్యంగా.. మాది వైజాగ్. ఇంటర్ వరకు నా విద్యాభ్యాసం అక్కడే సాగింది. 96 శాతం మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించాను. నాన్న బీకే నాయుడు.. ఏపీసీపీడీసీఎల్ ఉద్యోగి. అమ్మ కల్పన గృహిణి. అమ్మానాన్న చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా పెంచారు. నన్ను అత్యున్నత స్థాయిలో చూడాలని నిత్యం కలలు కనేవారు. నేను కూడా అందుకు తగ్గట్లుగానే చదివేవాడిని. ఇంటర్లో ఉండగానే ఐఐటీలో సీటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కష్టపడి చదివితే జేఈఈ అడ్వాన్సడ్లో మంచి ర్యాంకు వచ్చింది. నా కెరీర్‌కు అన్ని విధాలా సరైందని భావించి ఐఐటీ-మద్రాసులో చేరాను. అందరిలానే నాక్కూడా... ఇక్కడ చేరిన కొత్తలో నాకు అన్నీ కొత్తగా కనిపించేవి. కొత్త ప్రాంతం, కొత్త కల్చర్, రకరకాల వ్యక్తులు ఇలా అంతా గజిబిజిగా ఉండేది. ఈ పరిస్థితులకు అలవాటుపడేందుకు కొంత సమయం పట్టింది. జీవితంలో అత్యంత కీలకమైన దశను వృథా కానీయకుండా బంగారు భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఐఐటీ కల్పించింది. అంతేకాకుండా భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న మనస్తత్వాలు కలిగిన వారిని ఒకచోటకు చేర్చి సువిశాల ప్రపంచాన్ని కళ్లముందుంచింది. కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే దృఢమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరుచుకునే విధంగా ప్రోత్సహించింది. ఉన్నత ఆలోచనలు, అలవాట్లు, జీవన విధానాలను నేర్పించి ఒక మనిషి ఎదుగుదలకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించింది. చదువుతోపాటు అన్నీ... ఇక చదువు విషయానికొస్తే... ఇక్కడ క్లాసులు రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. కొన్ని బ్రాంచ్‌లకు ఉదయం 8 నుంచి 12 వరకు..మరి కొన్ని బ్యాచ్‌లకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. క్లాసులు అయిపోగానే కొంత మంది స్పోర్ట్స్, కొంత మంది కల్చరల్ యాక్టివిటీస్, మరి కొంత మంది రీసెర్చ్ ఇలా ఎవరి వ్యాపకాల్లో వాళ్లు నిమగ్నమవుతారు. వాటితో పాటు కాలేజీలో అప్పుడప్పుడు ఇంటర్ కాలేజీ వ్యాసరచన పోటీలు, సెమినార్లు, గెస్ట్ లెక్చర్లు ఉంటాయి. వీటితో పాటు కల్చరల్ ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ జరుగుతుంటాయి. సీఎఫ్ఐ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్) ద్వారా స్టార్టప్స్‌పై ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తారు. హాస్టల్ లైఫ్‌ని జీవితంలో మరిచిపోలేం. కామన్రూంలలో చెప్పుకున్న కబుర్లు, షేర్ చేసుకున్న నాలెడ్జ్, రూమ్స్‌లో ఆడిన ఇండోర్ గేమ్‌లు ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతులు. ఎన్నో ప్రత్యేకతలు ఐఐటీ-మద్రాస్ 620 ఎకరాల సువిశాల ప్రాంగణం. చెట్లుచేమలతో చూడ్డానికి అడవిని తలపిస్తుంది. అనేక అడవి జంతువులు, పక్షులు సైతం కళ్ల ముందే తిరుగుతుంటాయి. ఇవన్నీ చూస్తే కాలేజీలో ఉన్న ఫీలింగ్ పోయి విహారయాత్రకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. అంతేకాక ఏ ఐఐటీలో లేని అత్యాధునిక టెక్నాలజీ, ల్యాబ్‌లు, మన సంప్రదాయాలను గుర్తుకుతెచ్చే హెరిటేజ్ సెంటర్ ఇక్కడ ఉన్నాయి. ఏ పని చేసినా దాని నుంచి కొంత అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని గ్రహించాలన్నదే నా సిద్ధాంతం. అందుకు తగిన విధంగా ముందుకెళ్తున్నాను. ఆకట్టుకునే వీడియో రెజ్యుమె ఇలా.. నిన్నమొన్నటి వరకు ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే బయోడేటా/ రెజ్యుమె ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు సాధారణ పేపర్ రెజ్యుమెల స్థానంలో వీడియో రెజ్యుమెలు ప్రవేశిస్తున్నాయి. ఇవి మనకు కొత్త కావచ్చు. కానీ విదేశాల్లో ఎప్పటి నుంచో వీడియో రె జ్యుమెల ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. రిక్రూటర్లు కూడా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్న వీడియో రెజ్యుమెల గురించి తెలుసుకుందాం.. వీడియో రెజ్యుమె అంటే.. ఇంతకుముందు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తన వివరాలను, అకడమిక్ అర్హతలను, పూర్వానుభవాన్ని ఒక పేపర్‌పైన రాసేవాళ్లు. దీన్నే బయోడేటా/రెజ్యుమె అనేవారు. వీడియో రెజ్యుమె.. సాధారణ రెజ్యుమెకు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థి తన వివరాలను, అర్హతలను, అనుభవాలను స్వయంగా వివరిస్తూ వీడియోను చిత్రీకరించుకోవడాన్నే వీడియో రెజ్యుమె అంటారు. దీన్నే సంబంధిత కంపెనీలకు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్లు వీటిని పరిశీలించి, తగిన అర్హతలున్నవారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీడియో రెజ్యుమె ఆకర్షణీయంగా ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పొరపాట్లు చేస్తే అవకాశాలు చేజారతాయి. వీడియో రెజ్యుమె రూపకల్పనలో ఏ మాత్రం నిరక్ష్యంగా ఉన్న ఇంటర్వ్యూకి పిలుపు రాదు. ఈ విషయంలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రిక్రూటర్లను మెప్పించొచ్చు. వీడియో రెజ్యుమె ఎందుకు? సాధారణ రెజ్యుమె/సీవీలతో పోలిస్తే వీడియో రెజ్యుమెలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పేపర్ రెజ్యుమెతో రిక్రూటర్ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేరు. అంతేకాకుండా మీరు సాధించిన విజయాలను కూడా రిక్రూటర్‌ను ఆకట్టుకునేలా రాయడం కష్టం. వీడియో రెజ్యుమెతో ఇలాంటి సమస్యలు ఉండవు. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు సాధించిన విజయాలను, ఆయా సమస్యల సాధనలో మీ నైపుణ్యాలను ప్రభావవంతంగా రిక్రూటర్‌ను ఆకట్టుకునేలా చెప్పొచ్చు. మరీ ఎక్కువ సమయం ఉండొద్దు.. వీడియో రెజ్యుమె ఎక్కువ సమయం లేకుండా చూసుకోండి. 3 నిమిషాలు మించకుండా ఉండాలి. మీ గురించిన వివరాలను స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూడండి. నిజానికి 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉన్న వీడియో రెజ్యుమెలను చూసేంత తీరిక, సమయం హెచ్ఆర్/మేనేజ్మెంట్కు ఉండదని తెలుసుకోండి. అందుకే ముందు మీ గురించి అంటే మీ పేరు, స్వస్థలం వంటి వివరాలు చెప్పిన తర్వాత పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్, పీజీలో సాధించిన మార్కులు తెలపండి. మీరు కళాశాలలో ఉండగా సాధించిన ఘనతలను క్లుప్తంగా వివరించండి. ఇంతకు ముందే ఉద్యోగ అనుభవం ఉంటే అక్కడ సాధించిన విజయాలను చెప్పండి. వీడియో రెజ్యుమె ఇలా.. ఇంటర్నెట్లో అందుబాటులోని వీడియో రెజ్యుమె నమూనాలను పరిశీలించాలి. వీడియో చిత్రీకరణ కంటే ముందే స్క్రిప్ట్‌ను బిగ్గరగా చదువుతూ సాధన చేయాలి. వస్త్రధారణ ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి. వీడియో చిత్రీకరణకు అనుకూలంగా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డెస్క్ వెనుక పద్ధతిగా కూర్చోవాలి. అక్కడ వెలుతురు సక్రమంగా వచ్చేలా జాగ్రత్తపడాలి. రణగొణ ధ్వనులు వినిపించకూడదు. నేరుగా కెమెరావైపే చూడాలి. మాట్లాడేటప్పుడు పక్కకు, పైకి, కిందికి చూడొద్దు. వీడియో క్లుప్తంగా ఉండాలి. వ్యవధి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది. మాటలు స్పష్టంగా ఉండాలి. ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. మొదట అభ్యర్థి తన పేరు చెప్పాలి. తర్వాత మిగిలిన వివరాలు వెల్లడించాలి. అర్హతలు, అనుభవాలను తెలియజేయాలి. కంపెనీ అవసరాలకు తాను సరిగ్గా సరిపోతాననే భావం వ్యక్తమవ్వాలి. చివరగా ఈ అవకాశం కల్పించినందుకు రిక్రూటర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో చిత్రీకరణను ముగించాలి. -
first day ఇన్ కాలేజ్
క్యాంపస్ లైఫ్ క్యాంపస్ గురించి.. కాలేజ్ అంటేనే క్యాంపస్, అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, లైబ్రరీ, ఆడిటోరియం, ల్యాబ్స్, క్యాంటీన్, క్లాస్ రూమ్‌లు ఇలా ఎన్నో ఉంటాయి. మొదటి రోజు కాలేజీకి కాస్త ముందుగానే చేరుకొని, క్యాంపస్ అంతా కలియతిరగాలి. ఏవి ఎక్కడెక్కడున్నాయో ముందే తెలుసుకుంటే సగం కంగారు తగ్గుతుంది. నోట్‌బుక్స్ తప్పనిసరి.. ఫస్ట్ డే కాలేజీకి వెళ్లేటప్పుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. నోట్ బుక్స్ తీసుకెళ్లడం. కాలేజీ మొదటి రోజు ఏముంటుంది.. ఇంట్రడక్షనే కదా! బుక్స్ ఎందుకు? అని చాలామంది వట్టి చేతుల్తో వెళ్తారు. అలాకాకుండా కనీసం ఒకటి రెండు నోట్‌బుక్స్, పెన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మరీ ఖాళీగా వెళితే ప్రొఫెసర్లకు మీపై నెగటివ్ ఇంప్రెషన్ కలిగే ప్రమాదం ఉంది. ప్రొఫెసర్స్‌తో మాటామంతీ.. క్యాంపస్‌లో వేల మంది.. క్లాస్‌రూంలో పదుల మంది.. అందరిలో మీరూ ఒకరిలా కాకుండా కాస్త ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా మీ ప్రొఫెసర్స్ దృష్టిలో పడాల్సిందే. ప్రొఫెసర్స్‌కు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. అర్థవంతమైన ప్రశ్నలు వేసి మీపై మంచి ఇంప్రెషన్ కలిగేలా ప్రవర్తించండి. భవిష్యత్తులో పాఠాల విషయంలో బెరుకు లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. సిలబస్ నోట్ చేసుకోండి... సాధారణంగా చాలా కాలేజీల్లో ఫస్ట్ డేని సిలబస్ డేగా పరిగణిస్తారు. సిలబస్ గురించి ప్రొఫెసర్ చెప్పే అన్ని అంశాల్ని తప్పనిసరిగా నోట్ చేసుకోండి. అందులో పేర్కొన్న అంశాల వారీగానే సెమిస్టర్ అంతా తరగతులు నిర్వహిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. డ్రెస్సింగ్ సెన్స్.. ఫస్ట్ డే కాలేజీకి వెళ్లేటప్పడు తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. డ్రెస్సింగ్ సెన్స్. మరీ స్టైలిష్‌గా ఉండాలని మీకు నప్పని దుస్తులు వేసుకొని అపహాస్యం కావద్దు. మీ బాడీ లాంగ్వేజ్‌కు తగిన వాటిని ఎంపిక చేసుకొని హుందాగా కనిపించేలా చూసుకోవాలి. అలాగని సింపుల్‌గా ఉండాలనే ఉద్దేశంతో మరీ రొటీన్‌గా కూడా వెళ్లొద్దు. కాలేజీకి అవసరమయ్యే డ్రెసెస్తోపాటు స్టేషనరీ, బుక్స్‌కు సంబంధించి ముందుగానే షాపింగ్ చేయడం మంచిది. -
సింధు, వైదిక నాగరికతలు
క్రీ.పూ.2500 నుంచి 1750 మధ్య వాయవ్య భారతదేశంలో సింధు, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో విలసిల్లిన నాగరికతనే సింధు నాగరికత అంటారు. క్రీ.పూ.1500 నుంచి 600 సంవత్సరాల మధ్య సప్త సింధు, గంగా-యమునా మైదాన ప్రాంతాల్లో వెలసిన నాగరికత వైదిక నాగరికత. ఈ నాగరికతలు ఒక దాని త ర్వాత ఒకటి వెలసినప్పటికీ వీటి మధ్య పలు అంశాల్లో అనేక వ్యత్యాసాలు, పోలికలు ఉన్నాయి. వ్యత్యాసాలు దాదాపు 250 దాకా అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మించిన పట్టణాలు, కోటలు, కాల్చిన ఇటుకలతో రూపొందించిన నిర్మాణాలు, భూగర్భ మురుగు నీటి కాలువల వ్యవస్థ వంటి పలు అంశాలతో కూడిన సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. కానీ వైదిక నాగరికత చివరి దశలో మాత్రమే ప్రాథమిక స్థాయిలో పట్టణాలు ప్రారంభమయ్యాయి. సింధు నాగరికత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఏదీ లభించడం లేదు. కానీ వేద కాలంలో తెగ ఆధారిత రాజకీయ వ్యవస్థలు ఉండి, చివరి దశలో ప్రాదేశిక రాజ్యాలు కూడా ఏర్పడి నట్లు తెలుస్తుంది. సింధు సమాజంలో కుల వ్యవస్థ కనిపించదు. వర్గ బేధాలు మాత్రమే ఉన్నాయి. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం ఉన్నట్లుగా అసంఖ్యాకంగా లభించిన మాతృ మూర్తి విగ్రహాల వల్ల తెలుస్తుంది. వీరిది మాతృస్వామిక వ్యవస్థ అని కొందరి అభిప్రాయం. కానీ వైదిక సమాజంలో పటిష్టమైన చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. శూద్రులతోపాటు స్త్రీలకు సామాజిక గౌరవం లేదు. మలి వేద కాలంలో అనేక దురాచారాలు వచ్చి చేరాయి. ఆర్యులది పితృస్వామిక వ్యవస్థ. సింధు ప్రజలది స్థిర జీవనం. ప్రధాన వృత్తి వ్యవసాయం. గోధుమ, బార్లీ ప్రధాన పంటలు. కాగా వరికి అంత ప్రాధాన్యత కనిపించదు. వీరు పలు రకాల చేతి వృత్తుల పరిశ్రమలను స్థాపించుకున్నారు. ప్రామాణికమైన తూనికలు, కొలతలను వినియోగించేవారు. దేశీయ వ్యాపారంతోపాటు విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు. వైదిక ప్రజలు సంచార జీవితాన్ని గడిపేవారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. కేవలం మలి వేద కాలంలోనే వీరు వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా స్వీకరించారు. ప్రధాన పంట వరి. సింధు ప్రజలకు లేని ఇనుము లోహ పరిజ్ఞానం వీరికి ఉంది. వీరు విదేశీ వ్యాపారాన్ని నిర్వహించలేదు. వీరి ఆర్థిక వ్యవస్థలో గోవులతోపాటు గుర్రాలకు ముఖ్యస్థానం ఉంది. సింధు ప్రజల విషయంలో గుర్రానికి సంబంధించిన వివరాలు సంతృప్తికరంగా నిర్ధారణ కాలేదు. ఒకవేళ వీరికి గుర్రం తెలిసినా.. దాని వినియోగం పరిమితమే. సింధు ప్రజల మతానికి సంబంధించిన సరైన సమాచారం లేకున్నా.. పురావస్తు ఆధారాల ద్వారా వీరు అమ్మతల్లిని ప్రధాన దేవతగా పూజించినట్లు తెలుస్తుంది. ఈ కాలంలో ఒకే ఒక పురుష దేవుడు పశుపతి మహాదేవ. ఆర్యుల దేవతల్లో స్త్రీల కంటే పురుష దేవుళ్ల ఆధిక్యం ఎక్కువ. ఇంద్ర, వరుణ, అగ్ని, త్రిమూర్తులు మొదలైన 33 మంది దేవుళ్లను వీరు పూజించేవారు. సింధు ప్రజల పూజా విధానానికి భిన్నంగా.. యజ్ఞ యాగాలు, క్రతువులకు ఆర్యులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. లిపి విషయంలోనూ రెండు నాగరికతల మధ్య భేదాలు కనిపిస్తాయి. సింధు ప్రజలు చిత్ర లిపిని అభివృద్ధి చేసుకున్నారు. వైదిక ఆర్యులకు లిపి లేదు. కానీ వీరికి మౌఖిక సాహిత్యం ఉంది. పోలికలు సింధు ప్రజల మాతృదేవతను వైదిక మతంలోని దుర్గగా గుర్తించారు. సింధు కాలంలోని పశుపతి మహాదేవుడినే ఆర్యులు రుద్రుడిగా పూజించారు. జంతువులను, వృక్షాలను ఆరాధించే సంప్రదాయం రెండు నాగరికతల్లో కనిపిస్తుంది. భూత ప్రేత పిశాచాలు, దుష్ట శక్తులు, మంత్ర తంత్రాల పట్ల నమ్మకం రెండింటిలోనూ ఉంది. ప్రాతిపదికలు వేరైనా రెండు సమాజాల్లోనూ సామాజిక వివక్షతలు కనిపిస్తాయి. వైద్య విధానాల్లోనూ రెండు నాగరికతల్లో సారూప్యం ఉంది. కుమ్మరి చక్రాన్ని రెండు నాగరికతల్లోని ప్రజలు వినియోగించారు. స్త్రీల అలంకార ప్రియత్వం, రవాణా సాధనాలు మొదలైన అంశాల్లోనూ రెండింటికి సారూప్యం ఉంది. పైన పేర్కొనట్లు సింధు, వేద నాగరికతల మధ్య పలు అంశాల్లో వ్యత్యాసాలు, పోలికలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు నాగరికతల్లోని పలు అంశాలు నేటి సంస్కృతిలో భాగంగా ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండటంతో ఈ నాగరికతలను భారతీయ సంస్కృతికి మూల నాగరికతలుగా భావించవచ్చు. -
స్టడీ అబ్రాడ్.. యూకే! వీసా పైలట్ స్కీం
విదేశీ విద్య ఔత్సాహికులకు రెండో గమ్యంగా నిలుస్తున్న దేశం యునెటైడ్ కింగ్డమ్! కానీ, వీసా నిబంధనలు, పోస్ట్ స్టడీ వర్క్ నిషేధంతో యూకేకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు యూకే ప్రభుత్వం సరికొత్త వీసా పథకాన్ని ప్రవేశ పెట్టింది. అదే యూకే వీసా పైలట్ స్కీం. నిర్దేశిత వర్సిటీల్లో కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఆర్నెల్లు అక్కడే ఉండే అవకాశం కల్పించే ఈ కొత్త వీసా స్కీంపై విశ్లేషణ... 2012లో ప్రవేశపెట్టిన పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిషేధం నిబంధనతో యూకేకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మరోవైపు యూకేలోనే వివిధ యూనివర్సిటీల నుంచి సైతం పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో యూకే ప్రభుత్వం తాజాగా టైర్-4 వీసా పైలట్ స్కీం అనే కొత్త పథకానికి రూపకల్పన చేసింది. సాధారణంగా యూకేలోని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో గ్రాడ్యుయేట్, ఆపై స్థాయి కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు జారీ చేసే వీసాను టైర్-4 జనరల్ వీసాగా పేర్కొంటారు. దీని ప్రకారం విద్యార్థులు గ్రాడ్యుయేట్, మాస్టర్ స్థాయిలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుంది. అయితే.. ఈ కోర్సులు పూర్తి చేసుకోగానే విద్యార్థులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లేలా పోస్ట్ స్టడీ వర్క్ వీసా జారీలను నిషేధించింది. దీంతో అప్పటి నుంచి యూకేకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. పైలట్ స్కీం యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు తగ్గుతుండటం, ప్రతిభావంతులైన అభ్యర్థుల అవసరం ఏర్పడటంతో టైర్-4 జనరల్ వీసా పైలట్ స్కీం పథకాన్ని యూకే ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన నాలుగు యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్ల (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, బాత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్)లో 13 నెలలు, అంతకంటే తక్కువ వ్యవధి గల మాస్టర్స డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు వీసా పైలట్ స్కీం సదుపాయం వర్తిస్తుంది. నాలుగు ఉన్నత విద్యా సంస్థల్లో 13 నెలలు, అంతకంటే తక్కువ వ్యవధిలో ఉండే మాస్టర్స కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు కోర్సు ముగిసిన తర్వాత అదనంగా ఆర్నెల్లు అక్కడే ఉండొచ్చు. ఆ సమయంలో వారు ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఉద్యోగం సొంతమైతే సదరు ఎంప్లాయర్ ఇచ్చే స్పాన్సర్షిప్ లెటర్ ఆధారంగా టైర్-2 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. తొలుత రెండేళ్లు వీసా పైలట్ స్కీంను తొలుత రెండేళ్లు అమలు చేయనున్నారు. 2016-17, 2017-18 విద్యా సంవత్సరాల్లో ప్రవేశాలు పొందే వారందరికీ టైర్-4 జనరల్ వీసా పైలట్ స్కీం పరిధిలో కోర్సు పూర్తయ్యాక అదనంగా ఆర్నెల్లు ఉండేందుకు అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో ఉద్యోగం సొంతమైతే టైర్-2 వీసా మంజూరవుతుంది. దీని ప్రకారం అభ్యర్థులు కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా అయిదు సంవత్సరాల 14 రోజులపాటు ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. అయితే ఆ ఉద్యోగ కాలపరిమితి మేరకు దీన్ని నిర్ణయిస్తారు. టైర్- 2 వీసాకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తాము ఉద్యోగంలో చేరే తేదీకి మూడు నెలలు ముందుగానే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. పొడిగించే అవకాశం రెండేళ్ల పాటు అమలు చేయనున్న ఈ విధానం విజయవంతమైతే దీన్ని శాశ్వత ప్రాతిపదికన రూపొందించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ అండ్ డీ, మేనేజ్మెంట్ విభాగాల్లో నిపుణుల కొరత, మరోవైపు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గి, అది ఆర్థికంగానూ ప్రభావం చూపిస్తున్న పరిస్థితుల్లో దీన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం నాలుగు యూనివర్సిటీలకు పరిమితమైన విధానాన్ని అన్ని ఇన్స్టిట్యూట్లకు విస్తరించే అవకాశం కూడా ఉంది. భారత్ నుంచి ఏటా దాదాపు 20 వేల మంది పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సైతం భారత విద్యార్థులకు యూకే రెండో గమ్యంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఏటా దాదాపు 20 వేల మంది విద్యార్థులు యూకే వైపు దృష్టిసారిస్తున్నారు. పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిషేధం అమలైన సంవత్సరం (2012) నుంచి యూకేకు వెళ్తున్న భారత విద్యార్థులను పరిశీలిస్తే.. 2012-13లో 22,385 మంది; 2013-14లో 19,750 మంది; 2014-15లో 18,320 మంది. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం అమల్లో ఉన్నప్పుడు ఏటా దాదాపు 50 వేల మంది యూకే వెళ్లేవారు. ఉదాహరణకు 2010-11 సంవత్సరం నాటికి యూకేలో భారత విద్యార్థుల సంఖ్య 68,238. అది తర్వాత గణనీయంగా తగ్గింది. పైలట్ వీసా స్కీం ప్రకారం ఎంపిక చేసిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, బాత్ యూనివర్సిటీల్లో దాదాపు 13 వేల మందికి పైగా విదేశీ విద్యార్థులు.. తాజాగా నిర్దేశించిన 13 నెలల గడువున్న కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరిలో 10 నుంచి 12 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉంటారని అంచనా. సాధారణ ప్రవేశ నిబంధనలు యథాతథం వీసా పైలట్ స్కీంను అమల్లోకి తెచ్చినప్పటికీ, ఆ నాలుగు యూనివర్సిటీలు, ఇతర వర్సిటీల్లో ప్రవేశాలు, నిబంధనల విషయంలో ప్రస్తుత నిబంధనలనే యూకే ప్రభుత్వం అమలు చేయనుంది. దీని ప్రకారం అభ్యర్థులు ముందుగా అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని సీఏఎస్ ఆధారంగా టైర్-4 జనరల్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రస్తుతం అవసరమవుతున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అకడమిక్ ప్రొఫైల్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రిఫరెన్స్ లెటర్స్ వీటన్నింటినీ యథాతథంగా అందించాలి. వారానికి 20 గంటలు యూకేలో ప్రస్తుతం అమల్లో ఉన్న ‘చదువుకుంటూ పని చేసే విధానాలను పరిశీలిస్తే గ్రాడ్యుయేట్, ఆపై స్థాయి కోర్సుల అభ్యర్థులు వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్‌గా, సెలవు రోజుల్లో పూర్తి సమయం పనిచేసే అవకాశం ఉంది. అయితే ఇవి తాము చదువుతున్న సబ్జెక్ట్‌కు సంబంధించిన విభాగాలైతే సదరు ఇన్స్టిట్యూట్ నుంచి స్థానిక ఇమిగ్రేషన్ అధికారుల నుంచి సులభంగా అనుమతి లభిస్తుంది. అదే విధంగా నెలకు 20 వేల పౌండ్ల పైచిలుకు ఆదాయంతో ఉద్యోగం సొంతమైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అక్కడే కొనసాగొచ్చు. అకడమిక్ కోర్సు పూర్తయ్యాక అక్కడే అదనంగా ఆర్నెల్లు ఉండేలా వీలుకల్పించే వీసా పైలట్ స్కీం.. విద్యార్థులకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పైలట్ స్కీంగా ఎంపిక చేసిన నాలుగు ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందాలంటే అభ్యర్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ ఉన్నతంగా ఉండాలి. ఈ మేరకు ఇప్పటి నుంచే కృషి చేస్తే వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశాలు మెరుగవుతాయి. -గీతా అరోరా, హెడ్, హెచ్ఆర్, బ్రిటిష్ కౌన్సిల్.