విదేశీ విద్యార్థులకు ఐఐటీల కానుక!
► నేరుగా అడ్వాన్స్‌డ్ రాసేందుకు తొమ్మిది దేశాలకు అనుమతి
► జేఈఈ-2017 ప్రవేశాల నుంచి అమల్లోకి!
ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అడ్వాన్స్‌డ్‌కు హాజరవ్వాలంటే.. జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించడమే కాకుండా.. +2, లేదా తత్సమాన కోర్సుల్లో టాప్ 20 పర్సంటైల్‌లో నిలవాలి! భారత విద్యార్థులైనా, ప్రవాస భారతీయుల పిల్లలైనా, భారత సంతతికి చెందిన వారైనా.. ఇతర దేశాల విద్యార్థులైనా.. ఇప్పటివరకు ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ + ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అనుసరిస్తున్న విధానమిది.
ఐఐటీలు ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థులకు నిబంధనలను సడలిస్తున్నాయి. ముఖ్యంగా తొమ్మిది దేశాల విద్యార్థులకు నేరుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నాయి. దీనిపై గతవారం ఐఐటీ ప్రవేశాలకు సంబంధించిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ సమావేశంలో ఐఐటీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ ప్రతిపాదనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభిస్తే.. తొమ్మిది దేశాలకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించకుండానే నేరుగా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆ తొమ్మిది దేశాలు
అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, సింగపూర్, యూఏఈ, ఇథియోపియా. వీటిలో ఇథియోపియా మినహా మిగిలినవన్నీ ఆసియా ఖండంలోనివే. ఈ తొమ్మిది దేశాల విద్యార్థులు నేరుగా అడ్వాన్స్‌డ్ రాసేలా అనుమతిచ్చే చర్యలకు ఐఐటీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఈ దేశాల్లో అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించనుంది. ఈ దేశాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే కొత్త విధానం అమలు, కార్యాచరణ బాధ్యతలను ఐఐటీ - బాంబే చేపట్టనున్నట్లు తెలిసింది.
వాస్తవానికి విదేశీ విద్యార్థులకు ఐఐటీల గురించి అవగాహన, ఆసక్తి ఉన్నప్పటికీ రెండంచెల పరీక్ష విధానం, పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో నిరాసక్తత చూపుతున్నారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను కొలంబో, ఖాట్మండు, సింగపూర్, బహ్రెయిన్, దుబాయ్, మస్కట్, రియాద్, షార్జాలలో నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలు దుబాయ్, యూఏఈలో మాత్రమే ఉన్నాయి. ఈ కారణాలతో విదేశీ విద్యార్థులు ఐఐటీలపై దృష్టిసారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తొమ్మిది దేశాల్లోనూ నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేలా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ దేశాలకే ఎందుకు?
అమెరికా, యూకే వంటి దేశాల్లో సైతం ప్రత్యేక బ్రాండ్‌ను సొంతం చేసుకున్న ఐఐటీలు.. అటువైపు చూడకుండా ఈ తొమ్మిది దేశాలనే లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముందుగా సార్క్ కూటమిలోని పొరుగు దేశాల విద్యార్థులు మొబిలిటీ, కల్చరల్ డైవర్సిటీ వంటి విషయాల్లో భారత పరిస్థితుల్లో ఇమడగలిగే అవకాశం ఉంటుంది. సార్క్ కూటమిలో ఉండటంతోపాటు భారత్‌లో చదవాలని ఈ దేశాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నందున వీటిని ఎంపిక చేశారు.
అలాగే ఆసియా ఖండంలో లేనప్పటికీ.. ఇథియోపియా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు భారత్‌పై ఆసక్తి చూపుతుండటంతో ఆ దేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. జేఈఈ మెయిన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా పేర్కొన్న నిబంధనలను యథాతథంగా అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఈ దేశాల విద్యార్థులకు జనరల్ కేటగిరీ విద్యార్థుల నిబంధనలు వర్తిస్తాయి. కామన్ మెరిట్ లిస్ట్‌లో నిలవాలి. +2, తత్సమాన బోర్డ్ పరీక్షలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి.
అంతర్జాతీయ విద్యార్థులు..గ్లోబల్ ర్యాంకులు
అంతర్జాతీయంగా ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో ఒక ఇన్‌స్టిట్యూట్‌లోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య కూడా ఒక పరామితిగా ఉంటోంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ అనగానే గుర్తొచ్చే క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ ర్యాంకింగ్స్, అకడమిక్ ర్యాంకింగ్స్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీస్ నిర్వాహకులు ర్యాంకులు కేటాయించేటప్పుడు పరిగణనలోకి తీసుకొనే అయిదారు పరామితుల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంశం కూడా ఉంటోంది. రీసెర్చ్, ఫ్యాకల్టీ సైటేషన్స్, ఔట్‌కమ్ వంటి విషయాల్లో మన ఇన్‌స్టిట్యూట్స్ మెరుగైన పాయింట్లు సాధిస్తున్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పారామీటర్ విషయంలో వెనుకంజలో ఉంటున్నాయి.
ఉదాహరణకు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2015-16ను పరిగణనలోకి తీసుకుంటే.. 179వ ర్యాంకులో నిలిచిన ఐఐటీ ఢిల్లీ మిగిలిన పారామీటర్స్‌లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రాతిపదిక పరంగా చూస్తే అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఐఐటీ-బాంబేలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థులు 50. కాగా, 18 శాతం మందే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు. ఇలా.. ఇంటర్నేషనల్ స్టూడెంట్ పారామీటర్‌లో తక్కువ స్కోరింగ్ లేదా నిల్ స్కోరింగ్ అనేది మొత్తం ర్యాంకులపై ప్రభావం చూపుతోందన్న ఉద్దేశంతో ఐఐటీలు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది నుంచే అమల్లోకి!
తాజా ప్రతిపాదనను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఐఐటీ కౌన్సిల్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు మరికొద్ది రోజుల్లో పంపనుంది. ఎంహెచ్‌ఆర్‌డీ ఆమోదం లభించాక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటుంది. ఈ రెండు ప్రక్రియలు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని ఐఐటీ కౌన్సిల్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది జరిగితే జేఈఈ అడ్వాన్స్‌డ్-2017 నోటిఫికేషన్‌లోనే సంబంధిత మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు చేపట్టిన తాజా ప్రతిపాదనను ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, ఐఐటీలకే పరిమితం చేయనున్నారు.
రెండు, మూడేళ్ల తర్వాత స్పందన ఆధారంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా వర్తింపజేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఐఐటీలు అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు యోచిస్తున్న తరుణంలో భారత విద్యార్థులు తమ అవకాశాలు చేజారుతాయని ఆందోళన చెందనవసరం లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం ప్రత్యేకంగా పది శాతం సూపర్ న్యూమరరీ సీట్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే.. ప్రస్తుతం దేశంలోని ఐఐటీల్లో బీటెక్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో దాదాపు 11 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి పది శాతం అంటే దాదాపు 1100 సీట్లను అదనంగా పెంచి, అంతర్జాతీయ విద్యార్థులకు కేటాయిస్తారు.
తాజా ప్రతిపాదన వల్ల ఐఐటీలు.. గ్లోబల్ ర్యాంకులకు సంబంధించి ఒక్క అంతర్జాతీయ విద్యార్థుల విభాగంలోనే ముందంజలో ఉంటాయనుకోవడం సరికాదు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల తొలుత ‘మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య’ అనేదే ప్రధానంగా నిలిచినప్పటికీ.. తొలి బ్యాచ్ పూర్తయ్యేసరికి నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ఔట్‌కమ్ వంటి ఇతర పారామీటర్స్‌లోనూ మెరుగైన పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ఫ్యాకల్టీ సైతం ఐఐటీలపై ఆసక్తి చూపే పరిస్థితి వస్తుంది. ఇది జరిగితే గ్లోబల్ ర్యాంకుల్లో ఇతర ప్రామాణికాలైన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ వంటి వాటిలో మెరుగుదల సాధ్యమవుతుంది. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్‌కుమార్, డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్.
ఐఐటీ మద్రాస్...
ఐఐటీ మద్రాస్.. క్రిష్ గోపాల క్రిష్ణన్, రోహిణి చక్రవర్తి, జీకే అనంత సురేశ్, ఆనంద్ రాజారామన్, అనంత్ అగర్వాల్ వంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన అత్యున్నత విద్యా సంస్థ. అంతటి ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థలో చదువుకునే అవకాశం రావడం తనకు దక్కిన అరుదైన అవకాశం అంటున్నాడు అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోహిత్. అంతేకాదు చదువుతోపాటు సినిమాలు, షికార్లు, కబుర్లు, స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు వంటివాటికి కొదవలేదంటున్న రోహిత్ చెబుతున్న క్యాంపస్ కబుర్లు..
ఐఐటీలో సీటే లక్ష్యంగా..
మాది వైజాగ్. ఇంటర్ వరకు నా విద్యాభ్యాసం అక్కడే సాగింది. 96 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించాను. నాన్న బీకే నాయుడు.. ఏపీసీపీడీసీఎల్ ఉద్యోగి. అమ్మ కల్పన గృహిణి. అమ్మానాన్న చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా పెంచారు. నన్ను అత్యున్నత స్థాయిలో చూడాలని నిత్యం కలలు కనేవారు. నేను కూడా అందుకు తగ్గట్లుగానే చదివేవాడిని. ఇంటర్‌లో ఉండగానే ఐఐటీలో సీటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కష్టపడి చదివితే జేఈఈ అడ్వాన్‌సడ్‌లో మంచి ర్యాంకు వచ్చింది. నా కెరీర్‌కు అన్ని విధాలా సరైందని భావించి ఐఐటీ-మద్రాసులో చేరాను.
అందరిలానే నాక్కూడా...
ఇక్కడ చేరిన కొత్తలో నాకు అన్నీ కొత్తగా కనిపించేవి. కొత్త ప్రాంతం, కొత్త కల్చర్, రకరకాల వ్యక్తులు ఇలా అంతా గజిబిజిగా ఉండేది. ఈ పరిస్థితులకు అలవాటుపడేందుకు కొంత సమయం పట్టింది. జీవితంలో అత్యంత కీలకమైన దశను వృథా కానీయకుండా బంగారు భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఐఐటీ కల్పించింది. అంతేకాకుండా భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న మనస్తత్వాలు కలిగిన వారిని ఒకచోటకు చేర్చి సువిశాల ప్రపంచాన్ని కళ్లముందుంచింది. కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే దృఢమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరుచుకునే విధంగా ప్రోత్సహించింది. ఉన్నత ఆలోచనలు, అలవాట్లు, జీవన విధానాలను నేర్పించి ఒక మనిషి ఎదుగుదలకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించింది.
చదువుతోపాటు అన్నీ...
ఇక చదువు విషయానికొస్తే... ఇక్కడ క్లాసులు రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. కొన్ని బ్రాంచ్‌లకు ఉదయం 8 నుంచి 12 వరకు..మరి కొన్ని బ్యాచ్‌లకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. క్లాసులు అయిపోగానే కొంత మంది స్పోర్ట్స్, కొంత మంది కల్చరల్ యాక్టివిటీస్, మరి కొంత మంది రీసెర్చ్ ఇలా ఎవరి వ్యాపకాల్లో వాళ్లు నిమగ్నమవుతారు. వాటితో పాటు కాలేజీలో అప్పుడప్పుడు ఇంటర్ కాలేజీ వ్యాసరచన పోటీలు, సెమినార్లు, గెస్ట్ లెక్చర్లు ఉంటాయి. వీటితో పాటు కల్చరల్ ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ జరుగుతుంటాయి. సీఎఫ్‌ఐ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్) ద్వారా స్టార్టప్స్‌పై ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తారు. హాస్టల్ లైఫ్‌ని జీవితంలో మరిచిపోలేం. కామన్‌రూంలలో చెప్పుకున్న కబుర్లు, షేర్ చేసుకున్న నాలెడ్జ్, రూమ్స్‌లో ఆడిన ఇండోర్ గేమ్‌లు ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతులు.
ఎన్నో ప్రత్యేకతలు
ఐఐటీ-మద్రాస్ 620 ఎకరాల సువిశాల ప్రాంగణం. చెట్లుచేమలతో చూడ్డానికి అడవిని తలపిస్తుంది. అనేక అడవి జంతువులు, పక్షులు సైతం కళ్ల ముందే తిరుగుతుంటాయి. ఇవన్నీ చూస్తే కాలేజీలో ఉన్న ఫీలింగ్ పోయి విహారయాత్రకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. అంతేకాక ఏ ఐఐటీలో లేని అత్యాధునిక టెక్నాలజీ, ల్యాబ్‌లు, మన సంప్రదాయాలను గుర్తుకుతెచ్చే హెరిటేజ్ సెంటర్ ఇక్కడ ఉన్నాయి. ఏ పని చేసినా దాని నుంచి కొంత అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని గ్రహించాలన్నదే నా సిద్ధాంతం. అందుకు తగిన విధంగా ముందుకెళ్తున్నాను.
ఆకట్టుకునే వీడియో రెజ్యుమె ఇలా..
నిన్నమొన్నటి వరకు ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే బయోడేటా/ రెజ్యుమె ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు సాధారణ పేపర్ రెజ్యుమెల స్థానంలో వీడియో రెజ్యుమెలు ప్రవేశిస్తున్నాయి. ఇవి మనకు కొత్త కావచ్చు. కానీ విదేశాల్లో ఎప్పటి నుంచో వీడియో రె జ్యుమెల ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. రిక్రూటర్లు కూడా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్న వీడియో రెజ్యుమెల గురించి తెలుసుకుందాం..
వీడియో రెజ్యుమె అంటే..
ఇంతకుముందు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తన వివరాలను, అకడమిక్ అర్హతలను, పూర్వానుభవాన్ని ఒక పేపర్‌పైన రాసేవాళ్లు. దీన్నే బయోడేటా/రెజ్యుమె అనేవారు. వీడియో రెజ్యుమె.. సాధారణ రెజ్యుమెకు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థి తన వివరాలను, అర్హతలను, అనుభవాలను స్వయంగా వివరిస్తూ వీడియోను చిత్రీకరించుకోవడాన్నే వీడియో రెజ్యుమె అంటారు. దీన్నే సంబంధిత కంపెనీలకు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్లు వీటిని పరిశీలించి, తగిన అర్హతలున్నవారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీడియో రెజ్యుమె ఆకర్షణీయంగా ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పొరపాట్లు చేస్తే అవకాశాలు చేజారతాయి. వీడియో రెజ్యుమె రూపకల్పనలో ఏ మాత్రం నిరక్ష్యంగా ఉన్న ఇంటర్వ్యూకి పిలుపు రాదు. ఈ విషయంలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రిక్రూటర్లను మెప్పించొచ్చు.
వీడియో రెజ్యుమె ఎందుకు?
సాధారణ రెజ్యుమె/సీవీలతో పోలిస్తే వీడియో రెజ్యుమెలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పేపర్ రెజ్యుమెతో రిక్రూటర్ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేరు. అంతేకాకుండా మీరు సాధించిన విజయాలను కూడా రిక్రూటర్‌ను ఆకట్టుకునేలా రాయడం కష్టం. వీడియో రెజ్యుమెతో ఇలాంటి సమస్యలు ఉండవు. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు సాధించిన విజయాలను, ఆయా సమస్యల సాధనలో మీ నైపుణ్యాలను ప్రభావవంతంగా రిక్రూటర్‌ను ఆకట్టుకునేలా చెప్పొచ్చు.
మరీ ఎక్కువ సమయం ఉండొద్దు..
వీడియో రెజ్యుమె ఎక్కువ సమయం లేకుండా చూసుకోండి. 3 నిమిషాలు మించకుండా ఉండాలి. మీ గురించిన వివరాలను స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూడండి. నిజానికి 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉన్న వీడియో రెజ్యుమెలను చూసేంత తీరిక, సమయం హెచ్‌ఆర్/మేనేజ్‌మెంట్‌కు ఉండదని తెలుసుకోండి. అందుకే ముందు మీ గురించి అంటే మీ పేరు, స్వస్థలం వంటి వివరాలు చెప్పిన తర్వాత పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్, పీజీలో సాధించిన మార్కులు తెలపండి. మీరు కళాశాలలో ఉండగా సాధించిన ఘనతలను క్లుప్తంగా వివరించండి. ఇంతకు ముందే ఉద్యోగ అనుభవం ఉంటే అక్కడ సాధించిన విజయాలను చెప్పండి.
వీడియో రెజ్యుమె ఇలా..
ఇంటర్నెట్‌లో అందుబాటులోని వీడియో రెజ్యుమె నమూనాలను పరిశీలించాలి.
వీడియో చిత్రీకరణ కంటే ముందే స్క్రిప్ట్‌ను బిగ్గరగా చదువుతూ సాధన చేయాలి.
వస్త్రధారణ ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి.
వీడియో చిత్రీకరణకు అనుకూలంగా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డెస్క్ వెనుక పద్ధతిగా కూర్చోవాలి. అక్కడ వెలుతురు సక్రమంగా వచ్చేలా జాగ్రత్తపడాలి. రణగొణ ధ్వనులు వినిపించకూడదు.
నేరుగా కెమెరావైపే చూడాలి. మాట్లాడేటప్పుడు పక్కకు, పైకి, కిందికి చూడొద్దు.
వీడియో క్లుప్తంగా ఉండాలి. వ్యవధి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది.
మాటలు స్పష్టంగా ఉండాలి. ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి.
మొదట అభ్యర్థి తన పేరు చెప్పాలి. తర్వాత మిగిలిన వివరాలు వెల్లడించాలి.
అర్హతలు, అనుభవాలను తెలియజేయాలి. కంపెనీ అవసరాలకు తాను సరిగ్గా సరిపోతాననే భావం వ్యక్తమవ్వాలి.
చివరగా ఈ అవకాశం కల్పించినందుకు రిక్రూటర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో చిత్రీకరణను ముగించాలి.