క్రీ.పూ.2500 నుంచి 1750 మధ్య వాయవ్య భారతదేశంలో సింధు, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో విలసిల్లిన నాగరికతనే సింధు నాగరికత అంటారు. క్రీ.పూ.1500 నుంచి 600 సంవత్సరాల మధ్య సప్త సింధు, గంగా-యమునా మైదాన ప్రాంతాల్లో వెలసిన నాగరికత వైదిక నాగరికత. ఈ నాగరికతలు ఒక దాని త ర్వాత ఒకటి వెలసినప్పటికీ వీటి మధ్య పలు అంశాల్లో అనేక వ్యత్యాసాలు, పోలికలు ఉన్నాయి.
వ్యత్యాసాలు
దాదాపు 250 దాకా అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మించిన పట్టణాలు, కోటలు, కాల్చిన ఇటుకలతో రూపొందించిన నిర్మాణాలు, భూగర్భ మురుగు నీటి కాలువల వ్యవస్థ వంటి పలు అంశాలతో కూడిన సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. కానీ వైదిక నాగరికత చివరి దశలో మాత్రమే ప్రాథమిక స్థాయిలో పట్టణాలు ప్రారంభమయ్యాయి.
సింధు నాగరికత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఏదీ లభించడం లేదు. కానీ వేద కాలంలో తెగ ఆధారిత రాజకీయ వ్యవస్థలు ఉండి, చివరి దశలో ప్రాదేశిక రాజ్యాలు కూడా ఏర్పడి నట్లు తెలుస్తుంది.
సింధు సమాజంలో కుల వ్యవస్థ కనిపించదు. వర్గ బేధాలు మాత్రమే ఉన్నాయి. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం ఉన్నట్లుగా అసంఖ్యాకంగా లభించిన మాతృ మూర్తి విగ్రహాల వల్ల తెలుస్తుంది. వీరిది మాతృస్వామిక వ్యవస్థ అని కొందరి అభిప్రాయం. కానీ వైదిక సమాజంలో పటిష్టమైన చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. శూద్రులతోపాటు స్త్రీలకు సామాజిక గౌరవం లేదు. మలి వేద కాలంలో అనేక దురాచారాలు వచ్చి చేరాయి. ఆర్యులది పితృస్వామిక వ్యవస్థ.
సింధు ప్రజలది స్థిర జీవనం. ప్రధాన వృత్తి వ్యవసాయం. గోధుమ, బార్లీ ప్రధాన పంటలు. కాగా వరికి అంత ప్రాధాన్యత కనిపించదు. వీరు పలు రకాల చేతి వృత్తుల పరిశ్రమలను స్థాపించుకున్నారు. ప్రామాణికమైన తూనికలు, కొలతలను వినియోగించేవారు. దేశీయ వ్యాపారంతోపాటు విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు. వైదిక ప్రజలు సంచార జీవితాన్ని గడిపేవారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. కేవలం మలి వేద కాలంలోనే వీరు వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా స్వీకరించారు. ప్రధాన పంట వరి. సింధు ప్రజలకు లేని ఇనుము లోహ పరిజ్ఞానం వీరికి ఉంది. వీరు విదేశీ వ్యాపారాన్ని నిర్వహించలేదు. వీరి ఆర్థిక వ్యవస్థలో గోవులతోపాటు గుర్రాలకు ముఖ్యస్థానం ఉంది. సింధు ప్రజల విషయంలో గుర్రానికి సంబంధించిన వివరాలు సంతృప్తికరంగా నిర్ధారణ కాలేదు. ఒకవేళ వీరికి గుర్రం తెలిసినా.. దాని వినియోగం పరిమితమే.
సింధు ప్రజల మతానికి సంబంధించిన సరైన సమాచారం లేకున్నా.. పురావస్తు ఆధారాల ద్వారా వీరు అమ్మతల్లిని ప్రధాన దేవతగా పూజించినట్లు తెలుస్తుంది. ఈ కాలంలో ఒకే ఒక పురుష దేవుడు పశుపతి మహాదేవ. ఆర్యుల దేవతల్లో స్త్రీల కంటే పురుష దేవుళ్ల ఆధిక్యం ఎక్కువ. ఇంద్ర, వరుణ, అగ్ని, త్రిమూర్తులు మొదలైన 33 మంది దేవుళ్లను వీరు పూజించేవారు.
సింధు ప్రజల పూజా విధానానికి భిన్నంగా.. యజ్ఞ యాగాలు, క్రతువులకు ఆర్యులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. లిపి విషయంలోనూ రెండు నాగరికతల మధ్య భేదాలు కనిపిస్తాయి. సింధు ప్రజలు చిత్ర లిపిని అభివృద్ధి చేసుకున్నారు. వైదిక ఆర్యులకు లిపి లేదు. కానీ వీరికి మౌఖిక సాహిత్యం ఉంది.
పోలికలు
సింధు ప్రజల మాతృదేవతను వైదిక మతంలోని దుర్గగా గుర్తించారు. సింధు కాలంలోని పశుపతి మహాదేవుడినే ఆర్యులు రుద్రుడిగా పూజించారు.
జంతువులను, వృక్షాలను ఆరాధించే సంప్రదాయం రెండు నాగరికతల్లో కనిపిస్తుంది.
భూత ప్రేత పిశాచాలు, దుష్ట శక్తులు, మంత్ర తంత్రాల పట్ల నమ్మకం రెండింటిలోనూ ఉంది.
ప్రాతిపదికలు వేరైనా రెండు సమాజాల్లోనూ సామాజిక వివక్షతలు కనిపిస్తాయి.
వైద్య విధానాల్లోనూ రెండు నాగరికతల్లో సారూప్యం ఉంది.
కుమ్మరి చక్రాన్ని రెండు నాగరికతల్లోని ప్రజలు వినియోగించారు.
స్త్రీల అలంకార ప్రియత్వం, రవాణా సాధనాలు మొదలైన అంశాల్లోనూ రెండింటికి సారూప్యం ఉంది.
పైన పేర్కొనట్లు సింధు, వేద నాగరికతల మధ్య పలు అంశాల్లో వ్యత్యాసాలు, పోలికలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు నాగరికతల్లోని పలు అంశాలు నేటి సంస్కృతిలో భాగంగా ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండటంతో ఈ నాగరికతలను భారతీయ సంస్కృతికి మూల నాగరికతలుగా భావించవచ్చు.
సింధు, వైదిక నాగరికతలు
Published Sat, Aug 20 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
Advertisement