తివిధ దళాలకు దరిచేర్చే..‘సీడీఎస్‌ఈ’.. | Union Public Service Commission CDSE Notification released | Sakshi
Sakshi News home page

తివిధ దళాలకు దరిచేర్చే..‘సీడీఎస్‌ఈ’..

Published Thu, Jul 31 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

తివిధ దళాలకు దరిచేర్చే..‘సీడీఎస్‌ఈ’..

తివిధ దళాలకు దరిచేర్చే..‘సీడీఎస్‌ఈ’..

 నేటి యువత ఉద్యోగం ఎంపికలో బరువైన వేతన ప్యాకేజీల కంటే ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. పింక్ స్లిప్పుల ఊసే లేకుండా, పే స్లిప్పులకే నెలవైన కొలువునే కోరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత ఉద్యోగం, ఆకర్షణీయ వేతనం, ఉద్యోగ భద్రత.. అన్నింటికీ మించి ధైర్యసాహసాలను ప్రదర్శించి,  దేశానికి సేవ చేసే అవకాశం అందుకోవాలన్న యువతకు త్రివిధ దళాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలకు బాటలు వేసే యూపీఎస్సీ.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ)కు నోటిఫికేషన్ విడుదలైంది..
 
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) ప్రకటనను  విడుదల చేసింది. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. సీడీఎస్‌ఈ ద్వారా డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీ, హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో ప్రవేశాలు కల్పిస్తారు. అకాడమీలలోని కోర్సుల్లో ప్రవేశం లభించిన వారికి, శిక్షణ అనంతరం ఉన్నత హోదాతో ఉద్యోగం లభిస్తుంది.
 
 ఖాళీల వివరాలు:
 అకాడమీ    ఖాళీలు
 ఇండియన్ మిలిటరీ అకాడమీ    200
 ఇండియన్ నావల్ అకాడమీ    45
 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ    32
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు)    175
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు)    12
 మొత్తం    464
 
 విద్యార్హతలు:
 ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలకు డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ఇండియన్ నావల్ అకాడమీకి ఇంజనీరింగ్ డిగ్రీ. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి సంవత్సరంలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ధ్రువీకరణపత్రాలను తర్వాత సమర్పించాల్సి ఉంటుంది.
 
 వయసు:
 ఇండియన్ మిలిటరీ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. 1991, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.  ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు 1992, జూలై 2-1996, జూలై1 మధ్య జన్మించి ఉండాలి.ఇండియన్ నావల్ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు 1991, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
 
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు)కి వివాహ/
 అవివాహ అభ్యర్థులు 1990, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు)కి అవివాహ మహిళలు 1990, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.శారీరక ప్రమాణాలు: ఎత్తు, బరువు తదితరాలకు సంబంధించి నోటిఫికేషన్‌లో నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
 
 రాత పరీక్ష విధానం:
 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ
 
 సబ్జెక్టు    మార్కులు
 ఇంగ్లిష్    100
 జనరల్ నాలెడ్జ్    100
 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్    100
 మొత్తం    300
 
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ
 సబ్జెక్టు    మార్కులు
 ఇంగ్లిష్    100
 జనరల్ నాలెడ్జ్    100
 మొత్తం    200
 
 శిక్షణ తీరుతెన్నులు:
 రాత పరీక్ష; ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ (స్టేజ్ 1, స్టేజ్ 2); దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత అభ్యర్థుల ప్రాధమ్యాలు, చూపిన ప్రతిభను బట్టి సర్వీసుకు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో శిక్షణ ఇస్తారు. శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టడం, లక్ష్యసాధన, ఆత్మ విశ్వాసం పెరిగేలా చేయడం శిక్షణ లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ నిర్వహిస్తారు. మొత్తంమీద దేశ రక్షణకు అవసరమైన అంశాల్లో రాణించేలా తర్ఫీదునిస్తారు. శిక్షణలో నివాస సౌకర్యం, పుస్తకాలు, యూనిఫామ్, వైద్య సౌకర్యాలు అందిస్తారు. అంతేకాకుండా నెలకు దాదాపు రూ.21 వేలు స్టైఫండ్‌గా లభిస్తుంది.
 
 కెరీర్:
 శిక్షణ పూర్తయిన తర్వాత ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్, నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా ఉద్యోగాలే. ఏ సర్వీసులో చేరినప్పటికీ కెరీర్ ప్రారంభంలో అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు రూ.45 వేల వరకు వేతనం లభిస్తుంది.
 
 ఇతర ప్రయోజనాలు:
 ఉన్నత స్థాయి వసతులు, అన్నిటిలోనూ రాయితీలు, సివిల్స్ లాంటి పరీక్షలకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల వరకు సడలింపు, జీవితాంతం కుటుంబమంతటికీ ఉచితంగా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు, బీమా రక్షణ, సబ్సిడీ ధరలకు ఆహార సామగ్రి, విమాన, రైలు ప్రయాణాల్లో తగ్గింపులు, బంజరు భూముల కేటాయింపు, తక్కువ వడ్డీకి రుణాలు, ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన సెలవు వంటి సదుపాయాలుంటాయి. పిల్లలకు ఉచిత చదువులు, ఉపకారవేతనాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది.
 
 పదోన్నతులు:
 స్వల్ప వ్యవధిలోనే పదోన్నతులు లభిస్తాయి. ఆర్మీలో రెండేళ్ల సర్వీసు తర్వాత కెప్టెన్, తర్వాత మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ ఇలా పదోన్నతులు లభిస్తాయి. ఎయిర్ ఫోర్స్‌లో అయితే ఫ్లెయిట్ లెఫ్టినెంట్, స్క్యాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్ వరుసలో పదోన్నతులు ఉంటాయి.
 
 ప్రతికూలతలు:
 ఇతర ఉద్యోగాల్లా నచ్చిన చోట పనిచేసే అవకాశం అన్ని వేళలా లభించదు. దేశంలో ఏ మూలనైనా పనిచేయాల్సి రావడం... కొండలు, లోయలు, గుట్టలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించాలి. అనుకున్న వెంటనే సెలవు దొరకకపోవడం, కొన్నిచోట్ల క్వార్టర్స్ సదుపాయం లేకపోవడంతో కుటుంబానికి దూరంగా గడపడం లాంటివి ఉద్యోగంలో ఎదురవుతాయి.
 
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 19, 2014.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18, 2014.
 పరీక్ష తేదీ: అక్టోబర్ 26, 2014.
 పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
 
 దరఖాస్తు విధానం:
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. లేదంటే ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
  వెబ్‌సైట్: www.upsconline.nic.in
 
 ఇంగ్లిష్
 అభ్యర్థులు ఇంగ్లిష్ భాషను ఏమాత్రం అర్థం చేసుకుంటున్నారో పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. ఇందులో బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, సరైన వాక్యాలను గుర్తించడం, యాంటోనిమ్స్, సినోనిమ్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ పత్రికలను చదువుతూ వొకాబ్యులరీపై పట్టు సాధించవచ్చు. కొత్త పదాలను నేర్చుకోవడం, వాటిని వాక్యాల్లో ప్రయోగిస్తున్న సందర్భాలను గుర్తించడం చేయాలి. ఒక కొత్త పదాన్ని తెలుసుకుంటే వాటి యాంటోనిమ్స్, సినోనిమ్స్‌ను గుర్తించాలి. ప్రిపరేషన్‌కు రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి.
  The dacoit /many heinous crimes(P)/ had committed(Q)/who carried a reward of fifty thousand rupees (R)/ on his head(S)
     The correct sequence should be..
     a) PQRS     b) QPSR
     c) RQPS     d) RSQP
 
 జనరల్ నాలెడ్జ్
 కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చదవాలి. న్యూస్ బులెటెన్లను చూడాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా ప్రామాణిక జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం మనోరమ ఇయర్‌బుక్‌ను ఉపయోగించుకోవాలి.
 
 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
 ఇందులో పదో తరగతి లేదా తత్సమాన స్థాయిలోని అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు నంబర్ సిస్టమ్; ఫండమెంటల్ ఆపరేషన్స్; టైమ్ అండ్ వర్క్; సింపుల్, కాంపౌండ్ ఇంట్రస్ట్; రేషియో అండ్ ప్రొపోర్షన్, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం వంటి అంశాలపై పట్టుసాధించాలి. వీటికి ఆర్‌ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ పుస్తకం ఉపయోగపడుతుంది. ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్‌లకు సంబంధించిన అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. సీబీఎస్‌ఈ లేదా స్టేట్ సిలబస్‌లోని 9, 10 తరగతుల పుస్తకాల్లోని వివిధ అంశాల సమస్యలను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి.
  An aeroplane covers a certain distance at a speed of 240km-ph in 5 hours. To cover the same distance in 12/3hours, it must travel at a speed of:
     a) 300 km-ph     b) 360 km-ph
     c) 600 km-ph     d) 720 km-ph
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement