సహజ ఉద్భిజ సంపద
భారతదేశంలోని అతి ముఖ్యమైన సహజ వనరుల్లో అడవులు ఒకటి. ఇవి స్పష్టమైన ఆవరణ వ్యవస్థలుగా ఏర్పడ్డాయి. వర్షపాతం కలగడానికి, జలగ్రాహక ప్రాంతాల్లో మృత్తికల పరిరక్షణ, అభివృద్ధి, ప్రవాహాల క్రమబద్ధీకరణ, నీటిని నిల్వ చేసే శక్తి పెంపుదల, ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటంలో అటవీ వనరులు ఉపయోగపడుతున్నాయి.
భూ స్వరూపం, శీతోష్ణస్థితి, మృత్తికలు, జల పరిస్థితులు వంటివి అడవుల రకం, లక్షణాలను అధికంగా ప్రభావితం చేస్తాయి. హిమాలయాల్లోని ఆల్ఫైన్ ఉద్భిజాలు దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నంగా ఉంటాయి.
భారతదేశంలో సతతహరిత, అర్థ సతత హరిత, శుష్క ఆకురాల్చే, తృణ భూములు, పొద అడవులు, ఆల్ఫైన్ ఉద్భిజాలు వంటి అడవులున్నాయి. మృత్తికలు, పరీవాహాలు వంటి స్థానిక పరిస్థితుల వల్ల వీటి రకాల్లో కొద్దిపాటి మార్పులుండవచ్చు. కోస్తా తీరాల్లోని ఉపాంత, వరద ప్రాంతాల్లో మడ అడవుల వంటి రకాలున్నాయి.
రాష్ట్రాల్లో అటవీ విస్తరణ
2000 - 2001వ సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో 6,75,538 చ.కి.మీ. అటవీ భూమి ఉంది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 77,265 చ.కి.మీ., హర్యానాలో అత్యల్పంగా 1754 చ.కి.మీ. అటవీ భూమి ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెప్పుకోదగినంత అటవీ భూమి ఉంది. ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చినప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా (62.1%), హర్యానాలో అత్యల్పంగా (3.8%) అడవులు ఉన్నాయి. మొత్తం మీద అడవుల సాంద్రత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో అత్యధికంగా ఉంది. దీనికి భిన్నంగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలున్న వాయువ్య భారతదేశంలో చాలా తక్కువగా అడవులు ఉన్నాయి. భారతదేశ సగటు అటవీ ప్రాంత శాతం (20.55%) కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 16. అవి.. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, ఒడిశా, మధ్యప్రదేశ్, గోవా, కేరళ, మణిపూర్, అసోం, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీగఢ్, జార్ఖండ్. మిగిలిన రాష్ట్రాల్లో దేశ సగటు అటవీ విస్తీర్ణం కంటే తక్కువగా ఉంది. అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా అటవీ ప్రాంతం ఎక్కువగానే ఉంది.
1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో 20%; పర్వతాలు, కొండ ప్రాంతాల్లో 60% మొత్తం మీద సగటున భౌగోళిక విస్తీర్ణంలో 33% భూభాగంలో అడవులు ఉండాలి.
మనదేశంలో అడవుల విస్తీర్ణం చాలా తక్కువ. కాబట్టి పర్యావరణ పరిరక్షణ, అటవీ ఆధార పరిశ్రమల అభివృద్ధి కోసం అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనిలో భాగంగా పలచగా, అల్పంగా అడవులున్న అనార్ధ్ర, ఆర్ధ్ర అనార్ధ్ర ప్రాంతాలైన వాయువ్య భారతదేశం, దక్కన్ పీఠభూమిలో తుమ్మ, వేప, చింత, పండ్ల మొక్కలు వంటి శుష్కతను తట్టుకునే అడవుల అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి.
తుఫాను సమయాల్లో వచ్చే ఉప్పెనలను అడ్డుకోవడానికి కోస్తా ప్రాంతాల్లోని లోతట్టు మైదానాల్లో సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, తాటి, ఈత వంటి వనాలను అభివృద్ధి చేయాలి. పురాతన అభయారణ్యాల్లో టేకు, గుగ్గిలం, మంచిగంధం, రోజ్‌వుడ్, చిర్, దేవదారు, పైన్ మొదలైన అధిక వాణిజ్య విలువలు ఉన్న మొక్కలను నాటి ఎస్టేట్‌లను అభివృద్ధి చేయాలి. సామాజిక అడవుల పెంపకం, వ్యవసాయ ప్రాంతాల పరిసరాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలి.
ప్రజలకు పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలియజేసి, వారందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. దీనికి అవసరమైన భూమి, ధనం, నారు, రాయితీలు, రుణాలు, సాంకేతిక సహాయం అందజేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు.
అడవుల విస్తీర్ణం - రకాలు
ఉష్ణమండల తేమ సతత హరిత అడవులు: వీటినే అర్ధ సతత హరిత అడవులు అని కూడా అంటారు. 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతమున్న కొండ ప్రాంతాల్లో ఈ అరణ్యాలు ఉంటాయి. 500 - 1500 మీ.ల ఎత్తయిన కొండ ప్రాంతాల్లో 45 - 70 మీ.ఎత్తు వరకు ఈ వృక్షాలు పెరుగుతాయి. ఉదా: పశ్చిమ కనుమల్లో ఉన్న రోజ్‌వుడ్, నల్లతుమ్మ, తెల్సూర్ జాతులు; పశ్చిమ బెంగాల్, షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతాల్లో ఉండే గురుజాన్, టూన్, ఐరన్‌వుడ్, ఎబొనీ, చంపక వృక్షం, సిమార్, లారెన్ జాతులు. ఈ వృక్షజాతుల నుంచి లభించే అటవీ ఉత్పత్తులైన కలప, వెదురు, వంట చెరకును కాగితం, అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో వృక్షాలను వినియోగించుకోవడం కష్టతరమైన పని కాబట్టి వీటి వాణిజ్య విలువ తక్కువ. అర్ధ సతత హరిత అడవులు పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.
1. పశ్చిమ కనుమల దక్షిణ భాగం - కేరళ, కర్ణాటక
2. ఈశాన్య రాష్ట్రాలు - అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్
3. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్ - నికోబార్ దీవుల్లోని మైదానాల్లో ఈ అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.
ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు: 100 - 200 సెం.మీ. వర్షపాతం కురిసే కొండ, పీఠభూమి ఉపరితల ప్రాంతాల్లో ఈ ఉద్భిజాలు ఉంటాయి. ఇవి ఆర్థికంగా ముఖ్యమైన అడవులు. వీటిలో ప్రధానమైన వృక్షజాతి - టేకు, మంచిగంధం. ఈ అడవులు ఎక్కువగా పశ్చిమ కనుమలు, శివాలిక్ కొండలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఛోటానాగ్‌పూర్ పీఠభూమిలో ఉన్నాయి. కొయ్య సామగ్రి, సబ్బులు, కాగితం వంటివి వీటి ప్రధాన అటవీ ఆధార పరిశ్రమలు.
ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవులు: ఈ ఉద్భిజాలు 70 - 100 సెం.మీ. వర్షపాతం ఉండే పీఠభూమి, మైదానాల్లో, ద్వీపకల్ప పీఠభూముల్లో అధికంగా పెరుగుతాయి. గంగా మైదానం; థార్ ఎడారి, హిమాలయాలు, పశ్చిమ కనుమల మధ్య ఉన్న విశాల భాగంలో ఈ అడవులు పెరుగుతాయి. కలప, కాగితం, కొయ్య సామగ్రి వంటి పరిశ్రమల్లో ఈ అడవులు ప్రాధాన్యం కలిగి ఉంటాయి.
ఉష్ణమండల ముళ్ల జాతి అడవులు: ఈ ఉద్భిజాలు 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిల్లో మృత్తిక సంబంధ కారణాల వల్ల అకేసియా, బ్రహ్మజెముడు, నాగజెముడు, నల్లతుమ్మ వృక్షాలు వంటి రకాలు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మైదానాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, సముద్రానికి దగ్గరగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి.
మడ అడవులు: ఇవి ఎక్కువగా బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు. పోటుపాట్లకు గురయ్యే ఉప్పు, మంచినీటి ప్రాంతాల్లో పెరుగుతాయి.వీటిలో ఎక్కువగా మడచెట్లు ఉంటాయి. బెంగాల్ డెల్టాలో ఉండే మడ అడవుల్లో ఎక్కువగా సుంద్రినివా వృక్ష జాతులు పెరుగుతాయి. కాబట్టి వీటిని సుందర వనాలు అంటారు.
సమశీతోష్ణ అడవులు: వీటినే అల్ఫైన్ రకపు అడవులు అని కూడా అంటారు. ఇవి హిమాలయాల్లో 1600 - 3000 మీ.ల వరకు ఎత్తు ఉన్న ప్రాంతాల్లో, 100 - 200 సెం.మీ.ల వర్షపాతం కలిగే పర్వతాల్లో తేమతో కూడిన సమశీతోష్ణ మండల అడవులు ఉంటాయి. ఇవి మధ్య హిమాలయ శ్రేణుల్లో ఏర్పాటవుతాయి. సమశీతల సతత హరిత, శృంగాకార వృక్షాల్లో ముఖ్యమైన జాతులు.. దేవదారు, సిడార్, వెదురు, జూనిఫర్, సిల్వర్‌ఫెర్‌లు మొదలైనవి పెరుగుతాయి. ఇవి కర్రగుజ్జు, అగ్గిపెట్టెలు, హస్తకళలు, టర్పన్ టైన్, రైల్వే స్వీపర్లు వంటి పరిశ్రమలకు ఉపయోగపడుతూ ఆర్థిక, వాణిజ్య విలువలు కలిగి ఉన్నాయి.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. రూసా గడ్డి అధికంగా లభించే జిల్లా ఏది? (డీఎస్సీ 2002)
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) విశాఖపట్నం 4) మహబూబ్‌నగర్
2. మనదేశంలో అడవులు అత్యధిక శాతం ఉన్న రాష్ర్టం ఏది? (డీఎస్సీ 2008)
1) మధ్యప్రదేశ్ 2) అరుణాచల్ ప్రదేశ్
3) హర్యాన 4) హిమాచల్‌ప్రదేశ్
3. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? (డీఎస్సీ 2006)
1) 1951 2) 1952
3) 1954 4) 1958
సమాధానాలు: 1) 2; 2) 2; 3)2.
ప్రాక్టీస్ బిట్స్
1. భారతదేశంలో ప్రధానంగా ఎన్ని రకాల అడవులు ఉన్నాయి?
1) 6 2) 7 3) 8 4) 9
2. సుందర వనాలు ఉన్న రాష్ర్టం ఏది?
1) అసోం 2) బీహార్
3) పశ్చిమ బెంగాల్ 4) 1, 3
3. పొద అడవులు అధికంగా ఉన్న రాష్ర్టం?
1) మిజోరాం 2) హర్యానా 3) రాజస్థాన్ 4) ఉత్తరాంచల్
4. ఎయిర్ కూలర్‌లో ఉపయోగించే గడ్డి?
1) సైప్రస్ 2) చిర్
3) కుష్ 4) సెమూల్
5. ఆల్ఫైన్ వృక్ష జాతులను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం?
1) పవనాలు 2) ఎత్తు
3) సూర్యరశ్మి 4) తీర ప్రాంతం
6. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1973 2) 1975
3) 1976 4) 1977
7. సిమ్లిపాల్ పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) జార్ఖండ్ 2) ఛత్తీస్‌గఢ్ 3) ఒడిశా 4) అసోం
8. బీడీ పరిశ్రమల్లో ఉపయోగించే ఆకు?
1) మహల్ 2) కెందు
3) కిర్ 4) మోదుగ
9. ఘనా పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది?
1) గుజరాత్ 2) మహారాష్ర్ట
3) అసోం 4) రాజస్థాన్
10. నందాదేవి బయోస్పియర్ రిజర్‌వ ఏ రాష్ర్టంలో ఉంది?
1) సిక్కిం 2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) జమ్మూ కాశ్మీర్
సమాధానాలు:
1) 1; 2) 3; 3) 2; 4) 3; 5) 2;
6) 1; 7) 3; 8) 2; 9) 4; 10) 3.
ఎయిర్ కూలర్‌లో ఉపయోగించే గడ్డి?
Published Tue, Sep 30 2014 12:55 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement