భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక
ట్రాన్‌స హిమాలయ మండలం
హిమాద్రికి ఉత్తరంగా ట్రాన్‌స హిమాలయ మండలం ఉంది. ఈ మండలంలో కారకోరం, లడక్, జస్కర్, కైలాస్, కున్‌లున్, హిందూకుష్, పామీర్ పర్వత శ్రేణులున్నాయి. పామీర్ ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి. దీన్ని ప్రపంచపు పై కప్పు అని కూడా అంటారు. కారకోరం శ్రేణిలో ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం ఓ2 (గాడ్విన్- ఆస్టిన్). దీని ఎత్తు 8,611మీ.
గంగా - సింధు మైదానం
ఈ మైదానాలు ద్వీపకల్ప పీఠభూమికి, హిమాలయాలకు మధ్య విస్తరించి ఉన్నాయి. సింధు నది ముఖ ద్వారం నుంచి గంగానది ముఖ ద్వారం వరకు వ్యాపించి ఉన్న మైదానాన్ని బృహత్ మైదానం అంటారు. దీని పొడవు 3,200 కి.మీ. వెడల్పు అతి తక్కువగా అసోంలో ఉంది. జార్ఖండ్‌లో 160 కి.మీ., ఉత్తర ప్రదేశ్‌లో 280 కి.మీ వెడల్పు ఉంది.
గంగా - సింధు మైదానంలో నాలుగు ముఖ్యమైన భూ స్వరూపాలున్నాయి. అవి...
1. భాబర్: ఇది శివాలిక్ కొండల పాదాల వెంట హిమాలయ నదులు తెచ్చిన గులకరాళ్లు, గ్రావెల్, కంగ్లామరేట్ వంటి వాటితో ఏర్పడిన మండలం. విసనకర్ర ఆకారంలో ఉంటుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించింది.
2. టెరాయి: దట్టమైన అడవులతో కూడిన చిత్తడి ప్రాంతం.
3. భంగర్: టెరాయికి దక్షిణంగా ప్రాచీన కాలం లో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘భంగర్’ అంటారు.
4. ఖాదర్: టెరాయికి దక్షిణంగా నవీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘ఖాదర్’ అంటారు.
కల్లార్ లేదా రే
ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో శుష్క ప్రదేశంలో ఉన్న వ్యవసాయానికి పనికిరాని చవుడు, లవణం, స్ఫటిక నేలలను కల్లార్ లేదా రే అంటారు.
ప్రాంతాల వారీగా బృహత్ మైదానాలను కింది విధంగా విభజించారు.
1. పంజాబ్ - హర్యానా మైదానాలు
2. రాజస్థాన్ మైదానాలు
3. గంగా మైదానాలు
4. బ్రహ్మపుత్ర లోయ
గంగా మైదానాలు
గంగా మైదానం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీని వైశాల్యం 3.75 లక్షల చ.కి.మీ. ఈ మైదానం ఆగ్నేయంగా వాలి ఉంది. గంగ దాని ఉపనదులు యమున, గండక్, గోగ్రా, గోమతి, కోసి, సోన్ నదులు ఈ మైదానంలో ప్రవహిస్తున్నాయి.
మధ్య గంగా మైదానం. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తరించింది. ఇది భంగర్, ఖాదర్ మైదానాలతో కూడి ఉంది.
బ్రహ్మాపుత్ర లోయ: బ్రహ్మపుత్ర మైదానం ముఖ్యంగా అసోం రాష్ర్టంలో ఉంది. దీనిలో టెరాయి పరిస్థితులు ఉన్నాయి.
ద్వీపకల్ప పీఠభూమి
ఇది బృహత్ మైదానాలకు దక్షిణంగా అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడింది. దీని వైశా ల్యం 16 లక్షల చ.కి.మీ. దీని సరాసరి ఎత్తు 600మీ.నుంచి 900మీ. ఈ పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పునకు వాలి ఉంది. ద్వీపకల్ప పీఠభూమిలో అవశిష్ట పర్వతాలు ఎక్కువగా ఉన్నాయి.
ఉదా: ఆరావళి పర్వతాలు, తూర్పు, పశ్చిమ కనుమలు
ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులు: వాయువ్యం లో ఆరావళి పర్వతాలు, ఉత్తరాన బుందేల్ ఖండ్ పీఠభూమి, ఈశాన్యంలో రాజ్‌మహల్ కొండలు, దక్షిణాన పడమటి చివరన పడమటి కనుమలు, తూర్పు చివరన తూర్పు కనుమలు ఉన్నాయి.
ఈ ద్వీపకల్ప పీఠభూమిని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. ఉత్తరాన మాల్వా పీఠభూమి, దక్షిణాన దక్కన్ పీఠభూమి. ఈ రెండు పీఠభూములను నర్మదా నది వేరు చేస్తోంది.
మాల్వా పీఠభూమి: మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఆరావళి పర్వతాలు, దక్షిణాన వింధ్య పర్వతాలు, ఈశాన్యంలో బుండి కొండ లు ఉన్నాయి. దీనికి తూర్పున ఉన్న భాగాన్ని చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. ఇది జార్ఖండ్‌లో ఉంది. చోటా నాగ్‌పూర్ ప్రాంతాన్ని పశ్చిమ జర్మనీలో ‘రూర్ ప్రాంతం’తో పోలుస్తారు.
దక్కన్ పీఠభూమి
సరిహద్దులు: ఉత్తరాన సాత్పురా పర్వతశ్రేణి, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమి ఎత్తు పశ్చిమాన 900 మీ., తూర్పున 300 మీ. దక్కన్ పీఠభూమి పశ్చిమం నుంచి త్రిభుజాకారంలో తూర్పునకు వాలి ఉంది. దక్కన్ పీఠభూమిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. దక్కన్ పీఠభూమి ఉత్తర, వాయువ్య ప్రాంతాలను మహారాష్ర్ట పీఠభూమి అంటారు. ఇది బసాల్ట్ శిలలతో ఏర్పడింది.
దక్కన్ పీఠభూమి ఆగ్నేయ భాగాన్ని ఆంధ్రా పీఠభూమి అని, దక్షిణ భాగాన్ని కర్ణా టక పీఠభూమి అని పిలుస్తారు. ఇవి ఆర్కియన్, నీస్ శిలలతో ఏర్పడ్డాయి. నర్మద, తపతి నదుల మధ్య సాత్పురా పర్వత శ్రేణి ఉంది. ఈ శ్రేణి తూర్పు భాగాన్ని మైకాల పీఠభూమి అంటారు. సాత్పురా పర్వతాల్లో ఎత్తయిన ప్రాంతం మధ్యప్రదేశ్‌లోని మహదేవ్ కొండల్లో పచ్‌మరి సమీపంలో ఉంది.
పశ్చిమ కనుమలు
వీటిని సహ్యాద్రి శ్రేణి అని కూడా పిలుస్తారు. ఇవి మహారాష్ర్టలోని ఖందేష్ నుంచి ప్రారంభమై దక్షిణాన కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. గ్రానైట్, నీస్ వంటి కఠిన శిలలతో ఏర్పడ్డాయి. నీలగిరి కొండలు, సహ్యాద్రి కొండలు గడలూరు సమీపంలో కలుస్తున్నాయి. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం ఉదక మండలం సమీపంలో ఉన్న దొడబెట్ట(2637మీ.). కేరళలోని అన్నామలై కొండల్లోని అనైముడి శిఖరం(2695మీ.) ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తయినది.
తూర్పు కనుమలు
తూర్పు కనుమలు ఉత్తరాన చోటా నాగపూర్ పీఠభూమి, దక్షిణాన నీలగిరి కొండలతో కలుస్తున్నాయి. ఇవి చార్‌నకైట్, ఖొండలైట్ వంటి శిలలతో ఏర్పడ్డాయి. వీటిని ఉత్తర భాగంలో ‘ఉత్తర కొండలు’, దక్షిణ భాగంలో ‘తమిళనాడు కొండలు’, మధ్య భాగంలో ‘కడప శ్రేణులు’గా పేర్కొంటారు. తూర్పు కనుమల్లో అతి ఎత్తయిన స్థలం (1506మీ) విశాఖపట్నం జిల్లాలో, రెండో ఎత్తయిన స్థలం ఒడిశాలోని గంజాం జిల్లాలోని మహేంద్రగిరి (1501మీ)లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల కొండలు, పాల కొండలు, వెలి కొండలు, ఎర్రమల కొండలు, శేషాచలం కొండలు తూర్పు కనుమల్లో అంతర్భాగం.
తీర మైదానాలు
భారతదేశంలో తీర మైదానాలను రెండు భాగాలుగా విభజించవచ్చు.
1. పశ్చిమ తీర మైదానం
2. తూర్పు తీర మైదానం
పశ్చిమ తీర మైదానం: గుజరాత్‌లోని రాణా ఆఫ్ కచ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఈ మైదానాన్ని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
గుజరాత్ - గుజరాత్ తీరం
గోవా, మహారాష్ర్ట - కొంకణ్ తీరం
కర్ణాటక - కెనరా తీరం
కేరళ - మలబార్ తీరం
తూర్పు తీర మైదానం: పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంది.
పశ్చిమ బెంగాల్ - వంగ తీరం
ఒడిశా - ఉత్కల్ తీరం / కళింగ తీరం
ఆంధ్రప్రదేశ్ - సర్కార్ తీరం
తమిళనాడు - కోరమండల్ తీరం
నదులు
భారతదేశంలోని నదులను స్థూలంగా రెండు ప్రధాన సముదాయాలుగా విభజించవచ్చు.
1. హిమాలయ నదులు
2. ద్వీపకల్ప నదులు
హిమాలయ నదులు: గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులు మొదలైనవి.
గంగానది: జన్మస్థానం - హిమాలయాల్లోని గంగోత్రి హిమానీనదం. రెండు ప్రధాన సెలయేర్లు అలకానంద, భగీరథ - దేవ ప్రయాగ వద్ద కలిసి గంగానది ఏర్పడింది. నదుల్లో అతి పొడవైంది గంగానది. ఉత్తరప్రదేశ్ 1450కి.మీ, బీహార్‌లో 445 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లో 520 కి.మీలు పొడవున ఈ నది ప్రవహిస్తోంది.
బంగ్లాదేశ్‌లో గంగానదిని పద్మానదిగా పిలుస్తారు. బ్రహ్మపుత్రానది బంగాళాఖాతంలో కలవడానికి ముందు పద్మానదిలో కలుస్తుంది. యమున, గండక్, గోగ్రా, గోమతి, కోసి, శారద, రామగంగ, చంబల్, సోన్, దామోదర్ వంటివి గంగా ఉపనదులు.
గంగానది ఉపనదుల్లో పెద్దది - యమున. గంగా, యుమున, సరస్వతి నదుల సంగమం ‘త్రివేణి సంగమం.
సింధు నది: దీని జన్మస్థలం టిబెట్‌లోని మానససరోవరం. సింధునది పొడవు 2,880 కి.మీ. భారతదేశంలో దీని పొడవు 709 కి.మీ. ఈ నది చీనాబ్, రావి, జీలం, బియాస్, సట్లెజ్ అనే ఐదు ఉపనదులను కలిగి ఉంది. భారత్‌లో జమ్మూ - కాశ్మీర్ ద్వారా మాత్రమే సింధునది ప్రవహిస్తోంది. సింధునది పాకిస్థాన్‌లోని కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉన్న భారతదేశ దీవి?
1) గ్రేట్ నికోబార్ 2) అండమాన్
3) మినికాయ్ 4) లక్షదీవులు
2. బంగాళాఖాతంలో ఉన్న దీవుల సంఖ్య?
1) 247 2) 223
3) 32 4) 36
3. హిమాద్రికి దక్షిణంగా ఉన్న హిమాలయ పర్వతశ్రేణి?
1) శివాలిక్
2) అత్యున్నత హిమాలయాలు
3) సహ్యాద్రి 4) హిమాచల్
4. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాష్ట్రాల్లో శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు లవణం, స్ఫటిక భూభాగాలను ఏమంటారు?
1) టెరాయి 2) భంగర్
3) కల్లార్ లేదా రే 4) ఖాదర్
5. అబు కొండల్లోని గురుశిఖర్ ఏ పర్వతశ్రేణిలో ఉంది?
1) వింధ్య 2) ఆరావళి
3) సాత్పురా 4) తూర్పు కనుమలు
6. ఓ2శిఖరం ఏ హిమాలయ శ్రేణిలో ఉంది?
1) హిమాచల్ 2) హిమాద్రి
3) ట్రాన్‌స హిమాలయాలు
4) శివాలిక్
7. గంగా సింధు మైదానాల విస్తీర్ణం?
1) 5,000 చ.కి.మీ.
2) 7,00,000 చ.కి.మీ.
3) 16,00,000 చ.కి.మీ.
4) 10,000 చ.కి.మీ.
8. పామీర్ పీఠభూమి ఏ హిమాలయాల శ్రేణిలో ఉంది?
1) బాహ్య 2) మధ్య
3) అంతర 4) ట్రాన్‌స
9. రాజస్థాన్‌లోని ఖేత్రి గనులు దేనికి ప్రసిద్ధి?
1) ఇనుము 2) వెండి
3) బంగారం 4) రాగి
10. భారతదేశంలో కర్కటరేఖ ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతోంది?
1) 7 2) 8
3) 6 4) 9
11. భారతదేశంలో ముందుగా సూర్యోదయం అయ్యే రాష్ర్టం?
1) మేఘాలయ 2) అరుణాచల్ ప్రదేశ్
3) త్రిపుర 4) హిమాచల్ ప్రదేశ్
12. హిమాలయ పర్వత రాజ్యంగా ప్రసిద్ధి చెందింది?
1) టిబెట్ 2) భూటాన్
3) చైనా 4) నేపాల్
13. లక్షదీవుల రాజధాని?
1) పుదుచ్ఛేరి 2) కవరత్తి
3) పోర్‌టబ్లెయర్ 4) సిల్వసా
14. భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న దీవి?
1) పాంబన్ 2) మినికాయ్
3) టెరెస్సా 4) ట్రింకట్
15. కిందివాటిలో కేంద్రపాలిత ప్రాంతం కానిది?
1) పాండిచ్చేరి 2) త్రిపుర
3) లక్షదీవులు 4)దాద్రానగర్ హవేలి
సమాధానాలు
1) 1; 2) 2; 3) 4; 4) 3; 5) 2;
6) 3; 7) 2; 8) 4; 9) 4; 10) 2;
11) 2; 12) 4; 13) 2; 14) 1; 15) 2.
రాజస్థాన్‌లోని ఖేత్రి గనులు దేనికి ప్రసిద్ధి?
Published Thu, Sep 18 2014 10:57 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement