పూర్తిగా సౌరశక్తితో విద్యుదీకరించిన గ్రామం?
సోషల్ - కంటెంట్ (ఎస్‌ఏ)
నీటి సమస్యను తగ్గించి, నీటిపారుదల వ్యవస్థను పటిష్ట పరచడాన్ని ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా చేర్చారు. ఈ ప్రణాళిక ప్రారంభం నాటికే దేశంలో ఉన్న 158 భారీ; 226 మధ్య తరహా; 95 పొడిగించే, పునరుద్ధరించే, ఆధునికీకరించే పథకాలను ఈ ప్రణాళికా కాలంలో కొనసాగించారు. ఉత్తర భారత దేశంలో అత్యంత వాలు ఉన్న పర్వతీయ స్థలాకృతి కృత్రిమ నీటిపారుదలకు అనుకూలంగా లేదు.
నీటిపారుదల, విద్యుచ్ఛక్తి
భారతదేశంలో ప్రణాళికా కాలానికి ముందు 22.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణానికి నీటిపారుదల సామర్థ్యం ఉంది. ఇది 1993-94 సంవత్సరాంతానికి 85 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. దీంట్లో 31.8 మిలియన్ హెక్టార్లు భారీ, మధ్యతరహా; 53.2 మిలియన్ హెక్టార్లు చిన్నతరహా పథకాల కింద ఉంది. దీంట్లో 76.3 మిలియన్ హెక్టార్ల భూమి మాత్రమే నీటిపారుదలను వినియోగించుకుంటోంది. 1974-75 నుంచి ఆయకట్టు ప్రాంత అభివృద్ధిని చేపట్టారు. నీటిపారుదల ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూరించడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రాలు
బీహార్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం నీటిపారుదల కింద సాగయ్యేవిధంగా మార్పు దశలో ఉంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో అతి స్వల్ప (్ఱ20%) నీటి పారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల లాంటి ఉపరితల జల పథకాలున్నాయి.
నీటిపారుదల వసతుల ప్రగతి
భారతదేశం వ్యవసాయిక దేశమైనందువల్ల సమర్థమైన నీటిపారుదలతో కూడిన పంటల వ్యవస్థ ఉన్నప్పుడే దేశంలోని అధిక జనాభా, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చగలుగుతాం. పంచవర్ష ప్రణాళికల ప్రధాన ఉద్దేశం ఇదే. దేశంలోని నీటిపారుదల అభివృద్ధికి అనేక భారీ, మధ్యతరహా, చిన్ననీటి పారుదల పథకాలను చేపట్టారు.
10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్నవి భారీ నీటి పారుదల పథకాలు. వీటిని నదులపై నిర్మిస్తారు.
2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ఉండేవి మధ్యతరహా నీటి పారుదల పథకాలు. వీటిని నదులు, ఉపనదులపై నిర్మిస్తారు.
2,000 హెక్టార్లలోపు ఆయకట్టు ఉండేవి చిన్న తరహా పథకాలు. భూగర్భజల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ కోవలోకి వస్తాయి. సాధారణ బావులు, ఎక్కువ లోతులేని గొట్టపు బావులు, పంపుసెట్ల సాయంతో నీటిని పైకి తోడే లోతైన గొట్టపుబావులు భూగర్భ జల పథకాల్లోకి వస్తాయి.
జల విద్యుచ్ఛక్తి పథకాలు
జలవిద్యుత్ శక్తి ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. స్వాతంత్య్రానంతరం దీని అభివృద్ధికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. దీన్నే తెల్లబొగ్గు అని కూడా అంటారు. ఇది ఎంతగా ఉపయో గించినా తరగని శక్తి. ఆనకట్టలపై నుంచి వేగంగా జాలువారే నీటి శక్తిని టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిగా మారుస్తారు. దీన్ని ఒకసారి అభివృద్ధి పరిస్తే శతాబ్దాలపాటు జలవిద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
జలవిద్యుచ్ఛక్తిని కొన్ని అనుకూల పరి స్థితుల్లోనే ఉత్పత్తి చేయగలుగుతాం. అవి:
వేసవిలో కూడా నిరాటంకంగా నీటిని సరఫరా చేయగలిగే నది లేదా పెద్ద జలాశయం ఉండాలి.
ఎత్తు నుంచి నీరు జాలువారడానికి వీలైన నిమ్నోన్నతం ఉండాలి.
నదీజలం ఘనీభవించడానికి వీలులేని కనిష్ఠ శీతోష్ణస్థితి అవసరం.
జీవనదులు లేని చోట జలాశయాల్లో ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి వీలుగా అధిక వర్షపాతం ఉండాలి.
భారతదేశంలోని ముఖ్య బహుళార్థ సాధక పథకాలు
భాక్రానంగల్ పథకం: హిమాచల్ ప్రదేశ్‌లో సట్లేజ్ నదిపై భాక్రా, నంగల్ అనే ప్రదేశాల్లో రెండు ఆనకట్టలు నిర్మించారు. ఇది 1204 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దేశంలోనే అతి పెద్ద పథకం. ఈ పథకం ద్వారా 11,000 కి.మీ పొడవైన ప్రధాన కాలువలు, 3,400 కి.మీ ఉపకాలువలతో 14.6 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతిని కల్పిస్తున్నారు.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారు దల, జలవిద్యుచ్ఛక్తి. దీని ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి.
బియాస్ పథకం: ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది. ఇది రెండు భాగాలుగా ఉంది.
ఎ) బియాస్- సట్లేజ్‌ల కలయిక
బి) బియాస్ నదిపై పాంగ్ వద్ద నిర్మించిన ఆనకట్ట.
ఇది 1020 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పథకం ద్వారా 17 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తి. ఈ పథకం ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి.
దామోదర లోయ పథకం: జార్ఖండ్‌లోని దామోదర్ నది ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. వీటి ద్వారా 1181 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 4.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, వరదల నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి, నౌకాయానం. దీని ద్వారా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లబ్ధి పొందుతున్నాయి.
హీరాకుడ్ పథకం: ఒడిశాలో సంబల్‌పూర్ సమీపంలో మహానదిపై నిర్మించారు. ప్రపంచంలో పొడవైన ఆనకట్టల్లో ఇది ఒకటి.
దీని ద్వారా 280 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.5 లక్షల హెక్టార్లు భూమికి నీటిపారుదల సౌకర్యం అందిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి, వరదల నియంత్రణ. ఒడిశా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతోంది.నాగార్జున సాగర్ పథకం: దీన్ని కృష్ణానదిపై నిర్మించారు. భారీ నీటిపారుదల పథకాల్లో ఇది ఒకటి. దీని ద్వారా 110 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. 8.3 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
తుంగభద్రా పథకం: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మల్లాపూర్ వద్ద తుంగభద్రా నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 126 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 3.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. దీని ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి.
కోసీ పథకం: బీహార్- నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో కోసీ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 386 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. ఈ పథకం ద్వారా బీహార్, నేపాల్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.
చంబల్ పథకం: ఇది చంబల్ నదిపై నిర్మించిన ఆనకట్ట. దీంట్లో మూడు ఆనకట్టలున్నాయి. దీనివల్ల 386 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కలుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.
గండక్ పథకం: బీహార్‌లోని వాల్మీకి నగర్ వద్ద గండక్ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 14.88 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రయోజనం పొందుతున్నాయి.
రామ్ గంగా పథకం: ఉత్తరప్రదేశ్‌లో రామ్ గంగా నదిపై నిర్మించారు. దీని ద్వారా 198 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.75 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల వసతి కల్పిస్తున్నారు. దీని ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పాదన, వరదల నియంత్రణ. ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.