ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు? | who built khajuraho temple? | Sakshi
Sakshi News home page

ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు?

Published Sat, Nov 22 2014 11:15 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు? - Sakshi

ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు?

 రాజపుత్రులు యుద్ధ ప్రియులు. వీరు ధైర్య, సాహసాలకు పేరు పొందారు. శత్రువులకు వెన్ను చూపడం, ఆశ్రయం కోరి వచ్చిన శత్రువులను హింసించడం లాంటివి యుద్ధ ధర్మానికి విరుద్ధంగా భావించేవారు. హిందూ సాంస్కృతిక వికాసానికి, పటిష్టతకు ఎక్కువగా కృషి చేశారు. ఆత్మాభిమానం, దేశభక్తి, నిరాడంబరత ఎక్కువగా ఉన్న రాజపుత్రులు చాలా పురాణ గాథల్లో కథానాయకులుగా ఉన్నారు.

 రాజపుత్ర యుగం
 హర్షవర్ధనుడి మరణానంతరం క్రీ.శ. 647 నుంచి ఢిల్లీలో మహ్మదీయ సుల్తానులు అధికారంలోకి వచ్చే వరకు (క్రీ.శ. 1206) ఉన్న  కాలాన్ని భారతదేశ చరిత్రలో రసపుత్ర (రాజపుత్ర) యుగంగా వ్యవహరిస్తారు. రాజపుత్రులు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను నెలకొల్పారు. వీరిలో కొందరు విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఉన్నారు. స్వజాతి పట్ల తమ సంకుచిత దురభిమానం వల్ల ఇతర రాజపుత్ర వంశ రాజులతో శత్రుత్వం పెరిగి వీరిలో ఐకమత్యం లోపించింది. ఇదే వారి బలహీనతకు కారణమై భారతదేశంలో తురుష్కుల పాలనకు ద్వారాలు తెరిచింది.

 ముఖ్యమైన రాజపుత్ర వంశాలు
 ప్రతీహారులు: వీరు ‘ఘార్జర’ జాతికి చెందినవారు. రాజపుత్రుల్లో మొదటగా రాజకీయాధికారాన్ని పొందింది వీరే. వీరు జోధ్‌పూర్ (రాజస్థాన్)లో స్థిరపడ్డారు. వీరి రాజధాని ‘కనోజ్’. రాజ్యస్థాపకుడు నాగబట్టుడు. మిహీర భోజుడు ప్రతీహారుల్లో ముఖ్యమైన రాజు.

 గహద్వాలులు: వీరినే ‘రాథోడ్’ (రాఠోర్)లని కూడా పిలుస్తారు. ప్రతీహార రాజ్య పతనం తర్వాత క్రీ.శ. 1085లో కనోజ్ కేంద్రంగా పాలించారు. ఈ వంశ మూల స్థాపకుడు చంద్రదేవుడు. తురుష్కుల దాడులను తిప్పికొట్టడానికి కావాల్సిన సైన్య పోషణకు అయ్యే ఖర్చు కోసం ప్రజల నుంచి ‘తురకదండు’ అనే పన్నును వసూలు చేసేవారు. రాఠోరుల్లో సుప్రసిద్ధుడు జయచంద్రుడు. చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్‌తో ఈయనకు బద్ధ శత్రు త్వం ఉండేది. చందవార్ యుద్ధం (క్రీ.శ.1193) లో ఘోరీ మహ్మద్ చేతిలో జయచంద్రుడు ఓడిపోవడంతో వీరి పాలన అంతమైంది.

 చౌహాన్‌లు: క్రీ.శ. 956లో సింహారాజ చౌహాన్ స్థాపించిన చౌహాన్ రాజ్యం రాజస్థాన్‌లోని సాంబారు ప్రాంతాల్లో విస్తరించింది. ‘అజ్మీర్’ నగరాన్ని నిర్మించిన అజయ్ చౌహాన్ ఈ వంశానికి చెందినవాడే. పృథ్వీరాజ్ చౌహాన్ మొత్తం రాజపుత్ర రాజుల్లోనే అగ్రగణ్యుడిగా  గుర్తింపు పొందాడు. ఇతడు హిందూ జాతీయ వీరుడిగా గౌరవం పొందాడు. చాంద్ బర్దాయ్ రాసిన ‘పృథ్వీరాజ్ రాసో’ అనే గ్రంథం పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇతడు మొదటి తరైన్ యుద్ధంలో (క్రీ.శ. 1191) మహ్మద్ ఘోరీపై గెలిచాడు. రెండో తరైన్ యుద్ధంలో (క్రీ.శ. 1192) ఘోరీ చేతిలో ఓడిపోవడం వల్ల చౌహాన్ వంశం అంతరించింది.

 పారమారులు: ఉపేంద్రుడు క్రీ.శ. 950లో ‘ధారా’ నగరాన్ని రాజధానిగా చేసుకొని పారమార రాజ్యాన్ని నెలకొల్పాడు. వీరిలో సుప్రసిద్ధుడు ముంజరాజు. ఇతడి ఆస్థానంలో ‘పద్మగుప్తుడు’ అనే కవి ఉండేవాడు. ఈ కవి ‘నవసాహసాంక చరిత్ర’ను రాశాడు. సాంస్కృతిక సాహిత్య చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘భోజరాజు’ ఈ వంశానికి చెందినవాడే. ఇతడు భోజ్‌పూర్ సరస్సును, ‘భోజ్‌పురి’ నగరాన్ని   నిర్మించాడు.

 చందేలులు: బుందేల్‌ఖండ్ ప్రాంతంలో విలసిల్లిన చందేల రాజ్య స్థాపకుడు మనోవర్మ. వీరి రాజధాని ‘ఖజురహో’. చందేలరాజుల్లో ప్రధానమైనవాడు విద్యాధరుడు. ఇతడు గజనీ మహ్మద్‌ను రెండుసార్లు ప్రతిఘటించాడు. చివరికి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి వల్ల వీరి పాలన అంతమైంది.
 కాలచూరులు: నర్మదా, గోదావరి నదుల మధ్య భాగంలోని కొంత ప్రాంతాన్ని వీరు పాలించారు. వీరి రాజ్యాన్ని ‘చేది’ రాజ్యమని పిలిచేవారు. వీరి రాజధాని ‘త్రిపుర నగరం’.

 సోలంకీలు: అన్హిల్‌వాడ్ (గుజరాత్) రాజధానిగా క్రీ.శ. 945లో మూలరాజు సోలంకి రాజ్యాన్ని నెలకొల్పాడు. వీరి కాలంలోనే గజనీ మహ్మద్ సోమనాథ దేవాలయాన్ని (గుజరాత్) ధ్వంసం చేశాడు. సోలంకీ వంశానికి చెందిన జయసింహుడు ‘సింహశకాన్ని’ ప్రారంభించాడు.

 పాలరాజులు: బెంగాల్‌లో స్థానిక ప్రభువులైన పాలవంశీయులు ‘ఉద్ధంతపురి’ రాజధానిగా పరిపాలించారు. మూలపురుషుడు గోపాలుడు. వీరు ఎక్కువగా బౌద్ధమతాన్ని అవలంభించారు. ధర్మ పాలుడు అనే రాజు ‘విక్రమశిల విశ్వ విద్యాలయాన్ని’ స్థాపించాడు. టిబెట్‌లో బౌద్ధమత ప్రచారానికి ఆద్యుడైన ‘అతిదీ పంకరుడు’ ఈ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పని చేశాడు. పాలరాజులు వేయించిన శిల్పాలు భారతీయ శిల్పకళా సౌందర్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. సేన వంశస్థుల వల్ల వీరి పాలన కనుగమరుగైంది.

 సేన వంశరాజులు: ఈ రాజ్యస్థాపకుడు విజయసేనుడు. సేనులు కర్ణాటక ప్రాంతం నుంచి వెళ్లి బెంగాల్‌లో స్థిరపడ్డారు. సేన వంశస్థుల్లో సుప్రసిద్ధుడు లక్ష్మణసేనుడు. ఇతడు స్వయంగా కవి. ఇతడి ఆస్థానంలో ‘పంచరత్నాల’నే కవులుండేవారు. ‘గీతా గోవిందం’ రాసిన జయదేవుడు వీరిలో ఒకరు.
 
 రసపుత్ర యుగ సామాజిక పరిస్థితులు
 క్షేమేంద్రుడు రాసిన ‘బృహత్కథామంజరి’, కల్హణుడి ‘రాజతరంగిణి’ రాజపుత్రుల రాజకీయ, సాంఘిక పరిస్థితుల గురించి తెలియజే స్తున్నాయి. ‘కాయస్థ’ అనే ప్రభుత్వ అధికారులు ఉండేవారు. కాలక్రమంలో వీరు ప్రత్యేక సామాజికవర్గంగా మారారు. రాజపుత్రుల పాలనా కాలంలో ఆడశిశువుల పుట్టుకను తల్లిదండ్రులు భారంగా భావించేవారు. స్త్రీల విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలున్నట్లు తెలుస్తోంది. అంతఃపుర స్త్రీలు కనీసం సూర్యున్ని కూడా చూడకూడదనే నిబంధన ఉండేది.

‘పరదా పద్ధతి’ వాడుకలో ఉండేది. యుద్ధ సమయాల్లో మహిళలు ‘జౌహార్’ను ఆచరించేవారు.  భర్తలు యుద్ధంలో మరణించినప్పుడు అగ్నిలో దూకి పరపురుషుల నుంచి రక్షించుకునేందుకు స్త్రీలు ‘జౌహార్’ పద్ధతిని పాటించేవారు. రాజులు యుద్ధాలపై అతిగా దృష్టి పెట్టి పాలనను నిర్లక్ష్యం చేసేవారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థగా మారడానికి అంకురార్పణ వీరికాలంలోనే జరిగినట్లుగా చరిత్రకారులు చెబుతారు.

 సాహిత్యం - కళలు: ‘కల్హణుడు’ భారతదేశ మొదటి చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు రచించిన ‘రాజతరంగిణి’ భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథంగా గుర్తింపు పొందింది.
 రాజపుత్రులు కోటలను, భవనాలను శత్రుదుర్భేద్యంగా, అతి సుందరంగా నిర్మించారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో వీరు నిర్మించిన కోటలు ఇప్పటికీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీరు అనేక ఆలయాలను వినూత్న శైలిలో నిర్మించి తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు.
 
 ముఖ్యమైన ఆలయాలు:
     సోమనాథ్ ఆలయం (గుజరాత్)
     లింగరాజ్ ఆలయం (భువనేశ్వర్)
     జగన్నాథాలయం (పూరీ)
     సూర్య దేవాలయం (కోణార్‌‌క)
     ఖజురాహో ఆలయం (మధ్యప్రదేశ్)
     అబూ ఆలయం (రాజస్థాన్)
 
 రాజపుత్ర యుగానికి చెందిన ముఖ్యమైన కవులు - వారి రచనలు:
  భట్టి    - రావణవధ
  మేఘుడు    - శిశుపాలవధ
  శ్రీహర్షుడు    - నైషద చరిత్ర
  పద్మగుప్తుడు    - నవశశాంకచరిత్ర
  జయదేవుడు    - గీతా గోవిందం
  దండి    - దశకుమార చరిత్ర
  బాణుడు    - హర్షచరిత్ర
  భవభూతి    - మాలతీ మాధవం
  రాజశేఖరుడు    - కర్పూర మంజరి
  కల్హణుడు    - రాజతరంగిణి
  బిల్హణుడు    - విక్రమాంక చరిత్ర
  జయనకుడు    - పృథ్వీరాజ విజయం
  క్షేమేంద్రుడు    - బృహత్కథామంజరి
  సోమదేవుడు    - కథాసరిత్సాగరం
  సారంగదేవుడు    - సంగీత రత్నాకరం
  వాగ్భటుడు    - అష్టాంగ సంగ్రహం
  భాస్కరాచార్యుడు    - సిద్ధాంత శిరోమణి
  చాంద్ బర్దాయ్    - పృథ్వీరాజ్ రాసో
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    రాజపుత్ర రాజుల పాలన అంతమవ్వడానికి ప్రధాన కారణం?
     1) ముస్లిం దండయాత్రలు                     2) రాజపుత్రులు యుద్ధ బలహీనులు కావడం
     3) రాజపుత్రుల మధ్య ఐక్యత లేకపోవడం     4) రాజపుత్ర రాజులపై ప్రజలకున్న  వ్యతిరేకత
 2.    ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు?
     1) పాలరాజులు    2) చందేలులు     3) చౌహానులు    4) ప్రతీహారులు
 3.    ‘పృథ్వీరాజ్ రాసో’ గ్రంథకర్త?
     1) పృథ్వీరాజ్ చౌహాన్     2) చాంద్ బర్దాయ్    3) మిహీర భోజుడు     4) జయనకుడు
 4.    ‘తురకదండు’ అనే పన్నును ప్రజల నుంచి వసూలు చేసిన రాజపుత్ర రాజులు?
     1) గహాద్వాలులు    2) సోలంకీలు     3) పారమారులు    4) చౌహానులు
 5.    చందావార్ యుద్ధం (క్రీ.శ.1193)లో ఘోరీ ఎవరిని ఓడించాడు?
     1) పృథ్వీరాజ్ చౌహాన్  2) హేమచంద్రుడు     3) జయచంద్రుడు    4) భోజుడు
 6.    తరైన్ యుద్ధాలు (క్రీ.శ. 1191, 1192) ఎవరెవరికి మధ్య జరిగాయి?
     1) గజనీ మహ్మద్, జయసేనుడు     2) గజనీ మహ్మద్, ధర్మపాలుడు
     3) ఘోరీ మహ్మద్, జయచంద్రుడు     4) ఘోరీ మహ్మద్, పృథ్వీరాజ్ చౌహాన్
 7.    కావ్య మీమాంస, హర విలాసం అనే గ్రంథాల రచయిత?
     1) కాళిదాసు    2) కల్హణుడు     3) రాజశేఖరుడు    4) బిల్హణుడు
 8.    భవభూతి అనే నాటక రచయిత ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
     1) యశోవర్మ    2) మిహీర భోజుడు     3) ధర్మపాలుడు    4) జయచంద్రుడు
 9.    మౌంట్ అబూ (రాజస్థాన్)లోని దిల్వారా జైన దేవాలయాన్ని నిర్మించినవారు?
     1) సోలంకీ మొదటి భీముడు     2) ప్రతీహార ఘార్జారుడు
     3) ధర్మపాలరాజు       4) విజయసేనరాజు
 10.    అరబ్బు యాత్రికుడు సులేమాన్ ఏ రాజపుత్ర రాజు రాజ్యాన్ని సందర్శించాడు?
     1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) ధర్మపాలుడు
     3) నాగభట్టు           4) మిహీర భోజుడు
 11.    పంచరత్నాలనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
     1) పాలరాజులు    2) సేనరాజులు     3) కాలచూర రాజులు 4) సోలంకీ రాజులు
 12.    ‘కనోజ్ దర్బార్’ను ఘనంగా నిర్వహించినవారు?
     1) పృథ్వీరాజ్ చౌహాన్    2) యశోవర్మ     3) ధర్మపాలుడు    4) మిహీర భోజుడు
 13.    కాళిదాసుతో పోల్చదగిన ప్రముఖ నాటక రచయిత?
     1) కల్హణుడు    2) రాజశేఖరుడు     3) భవభూతి    4) సారంగదేవుడు
 14.    నైషధ చరిత్ర అనే గ్రంథాన్ని రాసిన శ్రీహర్షుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
     1) జయచంద్రుడు    2) విద్యాధరుడు     3) జయసేనుడు    4) విద్యాసేనుడు
 15.    కోణార్‌‌కలోని సూర్యదేవాలయాన్ని నిర్మించిన రాజవంశం?
     1) పాలరాజులు    2) రాష్ట్రకూటులు     3) గజపతులు    4) కళింగ గాంగులు
     సమాధానాలు
     1) 3;    2) 2;    3) 2;    4) 1;    5) 3;     6) 4;    7) 3;    8) 1;    9) 1;    10) 4;     11) 2;    12) 3;    13) 3;    14) 1;    15) 4.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement