కాలేజీలో చేరితే కొలువు ఖాయమేనా? | will jobs guarantee, if students join in Top colleges ? | Sakshi
Sakshi News home page

కాలేజీలో చేరితే కొలువు ఖాయమేనా?

Published Tue, Jun 24 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

will jobs guarantee, if students join in Top colleges ?

' ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థుల టెన్షన్ అంతా ఏ కాలేజీ.. ఏ బ్రాంచ్..!
' ఏ కాలేజీలు చేరితే నాణ్యమైన చదువు అందుతుంది. ఏ కాలేజీలో కోర్సు పూర్తి చేస్తే..
' టాప్ కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువులు ఖాయం అవుతాయనే..?!

 హైదరాబాద్‌లో, హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్నన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మరే ఇతర నగరంలో లేవనడం అతిశయోక్తికాదు! మరోవైపు తమ కళాశాలలో చేరితే భవిష్యత్తుకు ఢోకా ఉండదని, కోర్సు పూర్తికాగానే ప్రముఖ సంస్థలో ఉద్యోగం దక్కడం ఖాయమంటూ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రచారంతో హోరెత్తిస్తుంటాయి.   కాలేజీలు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? నిజంగా అన్ని కళాశాలల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నాయా? ప్రఖ్యాత కంపెనీలు అన్ని కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను నిర్వహించడం లేదు. అన్ని వసతులు, ప్రమాణాలు ఉన్న అత్యుత్తమ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం టాప్ కంపెనీలు ఎలాంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయో ఒక్కసారి చూద్దాం...
 
 ఐదు పారామీటర్లు:
 రిక్రూట్‌మెంట్ల కోసం సరైన క్యాంపస్‌ను ఎంచుకొనే విషయంలో కంపెనీలు ప్రధానంగా ఐదు పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవి.. కాలేజీ వయస్సు అంటే అది ఏర్పాటైన సంవత్సరం, ఫ్యాకల్టీలో నాణ్యత, వసతుల్లో నాణ్యత, విద్యార్థుల్లోని నైపుణ్యాల స్థాయి. విద్యార్థుల పట్ల కళాశాల యాజమాన్యానికి ఉన్న అంకితభావం. ఇవన్నీ సంతృప్తికరంగా ఉన్న కాలేజీల్లోనే కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, రిక్రూట్‌మెంట్లను నిర్విహ స్తున్నాయి. సంస్థలు ప్రధానంగా కాలేజీ ఫ్యాకల్టీ నిష్ణాతులై ఉండాలని కోరుకుంటున్నాయి. కాలేజీల్లో అత్యుత్తమ వసతులు, గ్రంథాలయాలు, ల్యాబ్‌లు, యంత్ర పరికరాలు ఉండాలని ఆశిస్తున్నాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆఖరి సెమిస్టర్ పూర్తయ్యేవరకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించొద్దని కంపెనీలను ‘నాస్కామ్’ సూచించింది. సందర్శించాల్సిన కాలేజీల సంఖ్యను కంపెనీలు కుదించుకున్నాయి. అక్రిడిటేషన్ లేని కాలేజీ కంటే ఉన్నవాటికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రిక్రూట్‌మెంట్ల కోసం కళాశాలను ఎంపిక చేసుకొనే విషయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయి.
 
 టీసీఎస్..:
 నెక్స్ట్ స్టెప్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఒక నిర్మాణాత్మక విధానాన్ని అమలు చేస్తోంది. నిర్దేశిత పారామీటర్ల ప్రకారం.. కాలేజీలకు ఎ, బి, సి అనే గ్రేడ్లు, అక్రిడిటేషన్ ఇస్తారు. టీసీఎస్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 450 కాలేజీలతో అనుసంధానం ఉంది. వీటన్నింటికీ గ్రేడ్లవారీగా గుర్తింపు ఇచ్చారు. ‘ఎ’ గ్రేడ్ కాలేజీలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. రిక్రూట్‌మెంట్ల కోసం ‘నెక్స్ట్‌స్టెప్’ అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 450 కాలేజీల్లోని ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు రిఫర్ చేసిన విద్యార్థులు ఈ పోర్టల్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టచ్‌స్టోన్ అనే టెస్టింగ్ టూల్ ద్వారా ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్టు రాయాలి. ఈ పరీక్షలో విద్యార్థుల టెక్నికల్, వెర్బల్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో విజేతలైన వారికి జాబ్ ఆఫర్ లెటర్ అందజేస్తారు. ప్లేస్‌మెంట్ పొందాలనుకొనే విద్యార్థులకు సాయం చేసేందుకు టీసీఎస్ ‘క్యాంపస్ కమ్యూన్’ అనే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ కమ్యూనిటీలో ఉండే టీసీఎస్ ఉద్యోగులు, ఇతర విద్యార్థుల తో చర్చించి మెళకువలు తెలుసుకోవచ్చు. స్కిల్స్ పెంచుకోవచ్చు.   
 
టీసీఎస్‌లో జాబ్ రావాలంటే.. అన్ని అకడమిక్ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఇంప్రూవ్‌మెంట్ రాసి పెంచుకున్న మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
 
 ఇన్ఫోసిస్..
 క్యాంపస్ కనెక్ట్: ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్ కాలేజీలకు అక్రిడిటేషన్ ఇవ్వడం లేదు. కానీ, రిక్రూట్లమెంట్ల విషయంలో క్యాంపస్ కనెక్ట్ అనే ప్రక్రియను అమలు చేస్తోంది. విద్యాసంస్థల భాగస్వామ్యంతో విద్యార్థులను కొలువులో చేర్చుకుంటోంది. 474 కాలేజీలతో ఇన్ఫోసిస్‌కు అనుసంధానం ఉంది. రోడ్ షోలు, సదస్సులు, స్టూడెంట్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ విజిట్స్ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది.   ఐటీ పరిశ్రమలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాసంస్థలకు తోడ్పాటునందిస్తోంది.  
 తర్కబద్ధంగా ఆలోచించగల నేర్పు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారిని ఇన్ఫోసిస్ ఉద్యోగంలో చేర్చుకుంటోంది.
 
 విప్రో..
 మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేయడం లెక్చరర్లు, ప్రొఫెసర్ల చేతుల్లోనే ఉంటుంది. అంటే.. ఫ్యాకల్టీ నిష్ణాతులైతే విద్యార్థులు కూడా అలాగే ఉంటారు. ఉన్నత విద్యా సంస్థల్లోని ఫ్యాకల్టీని బోధన, పరిశోధనా రంగాల్లో మెరికలుగా మార్చడం కోసం విప్రో సంస్థ ‘మిషన్ 10 ఎక్స్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఫ్యాకల్టీ కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.  
 
 కాగ్నిజెంట్..:
 ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్.. ఫ్యాకల్టీ మెంబర్స్‌కు రీసెర్చ్ స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తోంది.  ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్స్‌తో కలిసి పనిచేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు మూడురోజులపాటు క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తోంది. టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులను ఒకేచోట చేర్చి, ప్రత్యేక తరగతులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement