పీజీ కోర్సులపై యూత్ క్రేజీ!
టాప్ స్టోరీ: ఏదో ఒక డిగ్రీ పూర్తిచేసి.. ఏదో ఒక ఉద్యోగంలో సర్దుకుపోవడానికి మన నగర యువత సిద్ధంగా లేరు. అందరూ వెళ్లేదారిలో వెళ్తే ‘పోటీ ఎక్కువ.. ఫలితం తక్కువ’ అని గ్రహించారు. అందుకే భవిష్యత్‌లో డిమాండ్ పెరిగే, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులేవో తెలుసుకుంటున్నారు. అలాంటివాటిలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. దీనికి నిదర్శనమే.. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కౌన్సెలింగ్. కొరగావని పలువురు భావించే ఆర్ట్స్ కోర్సులకు డిమాండ్ పెరగడం.. డిగ్రీలో సైన్స్ చదివిన విద్యార్థులు సైతం ఆర్ట్స్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపించడం ఓయూ పీజీ కౌన్సెలింగ్ తాజా విశేషం. ఈ నేపథ్యంలో ఓయూ పీజీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల మన్ననలందుకుంటున్న కోర్సులేవో తెలుసుకుందాం..
భారీ సంఖ్యలో దరఖాస్తులు
ఉస్మానియా యూనివర్సిటీ.. 52 కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఓయూపీజీసెట్‌కు ఈ ఏడాది భారీగా 66,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మహాత్మాగాంధీ యూనివర్సిటీ -నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ -మహబూబ్‌నగర్, తెలంగాణ యూనివర్సిటీ -నిజామాబాద్‌ల పరిధిలో 500కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కళాశాలల్లో పీజీ కోర్సులను భర్తీ చేస్తారు. నాలుగు యూనివర్సిటీల పరిధిలో పీజీలో సైన్స్, ఆర్ట్స్.. పీజీ డిప్లొమా కోర్సుల్లో మొత్తం 18,625 సీట్లున్నాయి. ఇందులో 4,867సీట్లు యూనివర్సిటీల కాలేజీల పరిధిలో ఉండగా.. మిగతా 13, 758 సీట్లు అనుబంధ కాలేజీల్లో ఉన్నాయి.
కోర్సులెన్నో..
ఎంఏలో.. యానిసెంట్ ఇండియన్ హిస్టరీ- కల్చర్ అండ్ ఆర్కియాలజీ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, ఇస్లామిక్ స్టడీస్, కన్నడ, లింగ్విస్టిక్స్, మరాఠీ, పర్షియన్, ఫిలాసఫీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, థియేటర్ ఆర్ట్స్ వంటి కోర్సులు ఉన్నాయి. ఎంఎస్సీలో.. ఆస్ట్రానమీ/ఆస్ట్రోఫిజిక్స్, బోటనీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ (ఆర్గానిక్/ఇనార్గానిక్/ఫిజికల్/ఫార్మాస్యూటికల్/ఎనలిటికల్), ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, జెనెటిక్స్, మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, మైక్రో బయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పీజీ డిప్లొమా కోర్సులు, ఎంకాం, ఎంకాం(ఐఎస్), ఎంసీజే, ఎంఈడీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎంఎస్‌డబ్ల్యు, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు కూడా ఉన్నాయి.
ఎంకాంకు పెరిగిన ప్రాధాన్యం
రాబోయే ఐదేళ్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఐటీ రంగాలు భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే దాదాపు 8 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. వివిధ సంస్థల సర్వేలు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. అంతేకాకుండా నగరంలో అనేక బహుళజాతి సంస్థలూ, దేశీయ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇక దుస్తులు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రిటైలింగ్ ఔట్‌లెట్లు కోకొల్లలు. వీటన్నింటిలో ఎంకాం చేసినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకాం కెరీర్ ఎవెన్యూగా నిలుస్తోంది. అందుకే చాలామంది విద్యార్థులు ఎంకాం కోర్సును ఎంచుకోవడానికి మొగ్గు చూపారు. నగరంలోని పీజీ కళాశాలల్లో ఎంకాంలో ఉన్న సీట్ల సంఖ్య కేవలం 1444 మాత్రమే. కానీ అత్యధికంగా 10,000 మంది ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ఓయూ పరిధిలో రెండేళ్ల వ్యవధి కలిగిన ఎంకాం, మాస్టర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , ఏడాది వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్ కోర్సులున్నాయి.
బీకాం కంప్యూటర్స్ పూర్తికాగానే.. మరో ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఎంకాంలో చేరతానంటున్నాడు అహ్మద్ అలీ. బీఎస్సీ మ్యాథ్స్ తర్వాత.. ఎంకాం చేస్తానంటోంది మరో విద్యార్థిని రేఖ. ‘సంప్రదాయ కోర్సులకు గతంలో ఇంత క్రేజ్ లేదు. టెక్నికల్‌తో పోల్చితే సేవా రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ కావడం వల్ల విద్యార్థులు పీజీ కోర్సులను ఎంచుకుంటున్నారు’ అని ఓయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ చంద్రిక తన అభిప్రాయం వెలిబుచ్చారు. పేద, మధ్యతరగతి గ్రామీ ణ యువత ఉన్నత చదువులకు మొగ్గుచూపడం కూడా డిమాండ్‌కు మరో కారణమంటారామె.
ఫిజిక్స్, మ్యాథ్స్‌లే హాట్ ఫేవరెట్
సైన్స్ కోర్సులకూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం జరుగుతున్న ఓయూ పీజీ కౌన్సెలింగ్‌లో ఎక్కువమంది విద్యార్థులు ఎంఎస్సీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లను ఎంచుకుంటున్నారు. రీసెర్చ్‌కు అపార అవకాశాలు, డీఆర్‌డీవో, బార్క్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వంటి విభాగాల్లో ఉన్న ఉద్యోగావకాశాలు విద్యార్థులను ఫిజిక్స్, మ్యాథ్స్‌లను ఎంచుకునేలా చేశాయి. వీటితోపాటు బోధన రంగంలో ఫిజిక్స్, మ్యాథ్స్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. వేతనాలు కూడా భారీగానే ఇస్తుండటంతో ఫిజిక్స్, మ్యాథ్స్‌లు విద్యార్థుల హాట్ ఫేవరెట్‌గా నిలిచాయి.
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో యువత ప్రాతినిధ్యం పెరగాలని, చదువు పూర్తవగానే ఉద్యోగం వెతుక్కోకుండా ఉన్నతవిద్య వైపు దృష్టి సారించాలని ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త జి.పద్మనాభం సూచిస్తున్నారు. సైన్స్‌లో ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులు సంఖ్య పెరగడం వల్ల నూతన ఆవిష్కరణలు వెలుగుచూసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోల్చితే తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు వచ్చింది. ఆడపిల్లల్నీ ఉన్నత విద్యావంతుల్ని చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని ఓయూ ప్రొఫెసర్ సెల్వరాణి బాలన్ తెలిపారు.
సామాజిక సేవ.. కేరాఫ్ సోషల్‌వర్క్
ఎంకాం తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న కోర్సు.. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్(ఎంఎస్‌డబ్ల్యూ). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు గ్రామీణాభివృద్ధికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపడు తున్నాయి. భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణ తోపాటు నిధులు దుర్వినియోగం కాకుండా చూడటం, సంబంధిత సంస్థల మధ్య వారధిగా వ్యవహరించడం సోషల్ వర్కర్లు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ వర్క్ అవకాశాల పెన్నిధిగా మారింది.
ఈ కోర్సులో ఉన్న సీట్లు కేవలం 250. పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఈ 250 సీట్లకు 7 వేల మంది విద్యార్థులు పోటీలో ఉన్నారు. బీఎస్సీ(సీబీజెడ్)లో ఫస్ట్‌క్లాస్ మార్కులు, బీఎడ్‌లో మంచి ర్యాంకు వచ్చినా తాను మాత్రం ఎంఎస్‌డబ్ల్యూలో చేరతానంటోంది నల్గొండకు చెందిన కత్తుల అమరేశ్వరి. బీఎస్సీ పూర్తిచేసి ఓయూ పీజీసెట్‌లో ఓపెన్ కేటగిరీలో ర్యాంకు సాధించిన ఎ.యాదగిరి కూడా తన ఓటు ఎంఎస్‌డబ్ల్యూకేనని తెలిపాడు. ఉద్యోగ అవకాశాలకు లోటులేకపోవడం.. అవసరమైతే సొంతగా సంస్థను ఏర్పాటుచేసుకుని సమాజానికి సేవ చేసే వెసులుబాటు ఉండటం కూడా ఈ కోర్సును ఎంచుకునేందుకు కారణమంటున్నాడు.
రీసెర్‌చపై విద్యార్థుల దృష్టి
సైన్‌సలో నాలెడ్జ్‌ను పెంచుకుని రీసెర్చ్ వైపు వెళ్లాలనుకొనే విద్యార్థులు సంఖ్య పెరగడం శుభసూచకం. ప్రస్తుతం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌కు మంచి డిమాండ్ ఉంది.
- ప్రొ. గోపాల్‌రెడ్డి,
జేడీ, ఓయూ అడ్మిషన్స్
టెక్నాలజీని నడిపించేది సైన్సే
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మిషనరీ ఎంత ఆధునికమైనా.. వాటిని నడిపించేది సైన్సే. ఆ నాలెడ్‌జ అకడమిక్స్ ద్వారానే సాధ్యం.
- ప్రొఫెసర్ శివరాజ్, ఓయూ డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్