ఛత్తీస్గఢ్లోని రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు రెచ్చిపోవడంతో 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల సామగ్రితో తిరిగి వస్తున్న సిబ్బంది మీద మావోయిస్టులు దాడులు చేశారు. బీజాపూర్ జిల్లా కుంతల్నార్ సమీపంలో ఎన్నికల సామగ్రితో వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. దీనికి 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు రక్షణగా వస్తుండగా.. వారిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన జవాన్లతో పాటు పోలింగ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
జగదల్పూర్ జిల్లా జి.రామ్ఘాట్ వద్ద మరో సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందునుంచే హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యంత జాగ్రత్తలు తీసుకుని, 108 వాహనంలో పోలింగు సామగ్రిని తరలించారు. అయినా కూడా దాని గురించి పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు.. ఆ వాహనాన్ని కూడా మందుపాతరతో పేల్చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను బీజాపూర్, జగదల్పూర్ ఆస్పత్రులకు తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. దీంతో పోలీసులు పలు రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఈ దారుణం తప్పలేదు. అబూజ్మడ్ కేంద్రంగా జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న మావోయిస్టులు.. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో దాదాపు 600 గ్రామాల్లో నాయకులు కనీసం ప్రచారం కూడా చేయలేకపోయారు.
మావోయిస్టుల దాడి.. 12 మంది జవాన్ల మృతి
Published Sat, Apr 12 2014 2:17 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement