సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పుర ఫలితాల తరహాలోనే.. జిల్లాలో అత్యధిక ఎంపీపీ స్థానాలకు హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని 57 ఎంపీపీ స్థానాల్లో.. 31 చోట్ల ప్రధాన పార్టీలకు స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. టీఆర్‌ఎస్ 18 చోట్ల, కాంగ్రెస్ ఎనిమిది మండలాల్లో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించాయి. దీంతో హంగ్ ఫలితాలు వెలువడ్డ చోట ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుంది.. ఇతరుల మద్దతుతో టీఆర్‌ఎస్ కైవశం చేసుకుంటుందా..? రాయబారాలు.. బేరసారాలతో కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందా..? అనేది ఉత్కంఠ రేపుతోంది. పరోక్ష పద్ధతిన మెజారిటీ ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో జరిగే ఎన్నిక కావటంతో ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుక్షణం నుంచే... హంగ్ మండలాల్లో బేరసారాలు, క్యాంపు రాజకీయాలకు తెర లేచింది.
జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ 18 మండలాల్లో స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆయా మండలాల్లోని మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో సగానికి పైగా సీట్లను గెలుచుకొని ముందంజ వేసింది. మంథని, మహదేవ్‌పూర్, కోరుట్ల, మల్లాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, కరీంనగర్, హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక, హుస్నాబాద్, బెజ్జంకి, తిమ్మాపూర్, రామడుగు, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అవలీలగా తమ పార్టీ సభ్యుల మద్దతుతో అక్కడి ఎంపీపీ పీఠాలను కైవశం చేసుకోనుంది.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఎనిమిది మండలాల్లో ఆధిక్యత ప్రదర్శించింది. మంథని ముత్తారం, కమాన్‌పూర్, సారంగపూర్, మల్యాల, మేడిపల్లి, రాయికల్, భీమదేవరపల్లి, ఎలిగేడు మండలాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అక్కడి ఎంపీపీ పదవులను హస్తగతం చేసుకునేంత మెజారిటీని సాధించింది.
మహాముత్తారం, కాటారం, మల్హర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కొడిమ్యాల, కథలాపూర్, జమ్మికుంట, ఎల్కతుర్తి, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, రామగుండం, ఓదెల, జూలపల్లి, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్, ధర్మారం, వెల్గటూరు, ముస్తాబాద్, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో అక్కడ ఎంపీటీసీలు గెలుపొందిన స్వతంత్రులు, ఇతర పార్టీల విజేతలు కీలకమవనున్నారు.
చాలాచోట్ల ఒకరిద్దరు సభ్యుల మద్దతుతో బలబలాలు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. అందుకే క్యాంపు రాజకీయాలు, ఒప్పందాలకు తెరలేచింది. వచ్చే నెలలో ఎంపీపీ ఎన్నిక జరగనుంది. సుమారు నెల రోజుల వ్యవధి మిగిలి ఉందనే ధీమా ఉన్నప్పటికీ స్థానిక నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతుండటంతో మండలాల్లో వాతావరణం వేడెక్కింది. తుదికంటా ఎంపీపీ పీఠాలే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పోటాపోటీ పడటం ఖాయమైంది.
31 మండలాల్లో హంగ్
Published Wed, May 14 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement