కేంద్రప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర వైఎస్సార్‌సీపీదే
- ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
కలిగిరి, న్యూస్‌లైన్ : రానున్న కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్‌సీపీ నిర్ణయాత్మక ప్రాత పోషించనుందని వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కలిగిరిలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 7వ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలతో పాటు తెలంగాణలోనూ కొన్ని ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటారన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా వైఎస్సార్‌సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుని జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. వైఎస్సార్‌పై అభిమానంతో కష్టకాలంలో జగన్‌కు బాసటగా నిలిచామన్నారు. జగన్‌ను ఇబ్బందులు పాల్జేయడానికి వైఎస్సార్ మరణించిన తరువాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో కూడా చేర్చారన్నారు. ఆ చర్యను నిరసిస్తూ తాను ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నారు. ఉప ఎన్నికల్లో తనను ఎంపీగా సుమారు 3 లక్షల మెజారిటీతో గెలిపించి ఢిల్లీ పెద్దలకు దిమ్మతిరిగే తీర్పును జిల్లా ప్రజలు ఇచ్చారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ధీరోదత్తుడైన యువకుడిగా జగన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. వైఎస్సార్ లేని లోటు జగన్ తీర్చగలడని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారన్నారు. నరేంద్రమోడీని నరహంతకుడని తిట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఆయన్ను పొగడటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం రానున్న రోజుల్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే మోడీ జపం చంద్రబాబు చేస్తున్నారన్నారు.
స్వయం కృతాపరాధంతోనే కాంగ్రెస్ పతనం: మేకపాటి
కాంగ్రెస్ పార్టీ పాలకులు, నాయకుల స్వయంకృతాపరాధాలతోనే పతనమైందని ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కుతో రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని ప్రతిపాదనలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. ఎక్కడికెళ్లినా ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందన్నారు.
వెన్ను పోటుదారుడు చంద్రబాబు : వంటేరు
నమ్మినవారిని నట్టేట ముంచే వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించిన కిరాతకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి జరగదన్నారు. జిల్లాకు ఒక హోటల్, హెరిటేజ్ డెయిరీని ఏర్పాటు చేసి తాను అభివృద్ధి చెందుతాడన్నారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యేలుగా మేకపాటి సోదరులను అత్యధిక మెజారిటీతో గెలించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలూరు మాల్యాద్రిరెడ్డి, మండల కన్వీనర్ నోతి శ్రీనివాసులరెడ్డి, వంటేరు వంశీ కృష్ణారెడ్డి, మెట్టుకూరు భాస్కర్‌రెడ్డి, విల్సన్, నరసింహారెడ్డి, దశయ్య, బొల్లినే ని వెంకట సత్యనారాయణ, నోటి జనార్దన్ పాల్గొన్నారు.