పొసగని పొత్తు!
టీడీపీ- బీజేపీ శ్రేణుల మధ్య సఖ్యత శూన్యం
- ప్రచారంలో ఎవరికే వారే
- ఇరుపార్టీల అభ్యర్థుల్లో ఆందోళన
- విఫలమవుతున్న సయోధ్య యత్నాలు
- రోజురోజుకూ నీరుగారిపోతున్న
- ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు
- దూసుకుపోతున్న ప్రత్యర్థులు
సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మనుషులు కలిసినా.. మనసులు కలవలేదు. పొత్తు అంటూ చేతులు కలిపారు.. చేతల్లో విబేధిస్తున్నారు. ప్రాథమిక చర్చలు మొదలు.. సీట్ల ఖరారు వరకు అద్యంతరం గందరగోళంగా సాగిన టీడీపీ- బీజేపీ పొత్తు వ్యవహారం ప్రచారపర్వంపైనా తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఒప్పందంలో భాగంగా జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించారు. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కమలంతో దోస్తీని వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు ప్రచారపర్వంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
తామేమీ తక్కువ తినలేదన్నట్లు బీజేపీ శ్రేణులు కూడా సైకిల్‌పై సవారీకి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తల మధ్య నెలకొన్న అగాధాన్ని తొలగించేందుకు అగ్రనాయకత్వాలు రంగంలోకి దిగినా ఫలితం లేదు. దీంతో ఇరుపక్షాలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. నాలుగు సెగ్మెంట్లను బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పారు.
‘గిరి’లోనూ కిరికిరే..
పొత్తులో భాగంగా బీజేపీకి మల్కాజిగిరి సీటును కేటాయించడంతో స్థానిక తెలుగు తమ్ముళ్లు పార్టీని వీడారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా పలువురు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేసి కారెక్కారు. మిగిలిన ఒకరిద్దరు నేతలు కూడా మిత్రపక్షంతో దూరం పాటిస్తున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీతో స్నేహం కలిసివ స్తుందని అంచనా వేసిన ఆయనకు ఆ పార్టీ స్థానిక నాయకత్వం రిక్తహస్తం చూపడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుపై పొడచూపిన అభిప్రాయబేధాలు.. టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఓటేసే విషయంలో బీజేపీ వ్యక్తపరుస్తోంది. ఈ కిందిస్థాయి నాయకుల వ్యూహా ప్రతివ్యూహాలు ఇరుపార్టీల హైకమాండ్‌లకు తలనొప్పిగా మారింది.
‘వికార’ంగా ప్రచారం!
బీజేపీకి కేటాయించిన వికారాబాద్‌లోనూ ఇరుపార్టీల శ్రేణుల మధ్య సఖ్యత కుదరడంలేదు. ‘ప్రత్యేక’వాదం నేపథ్యంలో ముఖ్యనేతలు పార్టీని వీడడంతో కుదేలైన టీడీపీ.. ఈ సీటును బీజేపీకి వ దలడానికి తనంతట తానుగా ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి బరిలో దిగిన మాజీ మంత్రి కొండ్రు పుష్పలీలకు తొలిరోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. గతంలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమెకు ఆ పార్టీ సీనియర్ల నుంచి సహకారం కొరవడడం, ప్రచారపర్వంలో తమ్ముళ్లు కలిసిరాకపోవడం ఇబ్బందిగా మారింది.
ఈ నేపథ్యంలో ఏదో మొక్కుబడిగా ఆమె ప్రచారాన్ని సాగిస్తున్నారు. స్థానికంగా టీడీపీ బలహీనం కావడం, బలమైన ప్రత్యర్థులను తట్టుకోవడం ఆమెకు కష్టతరంగా మారింది. ఇక అధినాయకత్వం మద్దతు కూడా ఆశించినస్థాయిలో దక్కడంలేదనే అసంతృప్తి పార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సీట్ల సంఖ్యకు పట్టుబట్టిన రాష్ట్ర కమిటీ, అభ్యర్థుల విజయావకాశాలపై దృష్టి సారించకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉప్పల్.. తిప్పల్!
ఉప్పల్ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు స్థానిక తమ్ముళ్లు ముఖం చాటేశారు. ప్రభాకర్ అభ్యర్థిత్వంపై మొదట్నుంచి అభ్యంతరం వ్యక్తంచేస్తున్న టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఇతర పార్టీలోకి జంప్ చేయగా, మిగిలిన మరికొంత మంది నేతలు తటస్థంగా వ్యవహరిస్తున్నారు. పొత్తుతో సీటు కోల్పోయామనే నిరాశలో ఉన్న ‘దేశం’ నేతలను తమవైపు తిప్పుకోవడంలో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సఫలమయ్యారు.
మరోవైపు టీడీపీతో జతకట్టడాన్ని వ్యతిరేకించిన ప్రభాకర్.. ఇటీవల ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి ప్రచార రథాన్ని కూడా ఎక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీ- టీడీపీల మధ్య అంతరం బాగా పెరిగింది. ఓట్ల విషయంలోనూ పరస్పరం వెన్నుపోటు పొడుచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. క్రాస్ ఓటింగ్‌కు తెరలేపడం ద్వారా మిత్రపక్షానికి షాక్ ఇవ్వాలని ఇరుపార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.
పరిగిలోనూ పొసగడం లేదు
ఎన్నికల వేళ బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కమతం రాంరెడ్డి చమటోడ్చుతున్నారు. స్థానిక కమలనాథుల మద్దతు కూడగట్టుకున్న కమతంకు.. ‘దేశం’ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడంలేదు. మరీ ముఖ్యంగా చేవెళ్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్ ఇటీవల జరిపిన ఎన్నికల ప్రచారం బీజేపీ నేతల్లో మరింత అసంతృప్తి రాజేసింది.
తమ పార్టీ అభ్యర్థిని కలుపుకుపోకుండా స్థానిక ‘దేశం’ నాయకుడి ఇంట్లో గంట సేపు వీరేందర్ గడపడం ఈ వివాదానికి దారితీసింది. యువకుడైన వీరేందర్.. రాజకీయ కురువృద్ధుడు కమతంను దూరంగా పెట్టడం ఎంతవరకు సబబని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అంతేగాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలోనూ వివక్ష పాటిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.