
కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిన రఘువీరా
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి అంగీకరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి నామ మాత్రపు సీట్లు వచ్చాయని ఆయన చెప్పారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.
హంగ్ ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా తమ పార్టీకి విజయావకాశాలు లేవని రఘువీరా రెడ్డి అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించాల్సివుందని, కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని రఘువీరా రెడ్డి అన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు .. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కనమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. చాలా చోట్ల కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది.