ముఖ్యమంత్రి రేసులో లేను:డీఎస్
- హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సే
- బలహీనవర్గాలకే సీఎం పదవి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేసులో తాను లేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వస్తాయని జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని, కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈసారి మాత్రం బలహీనవర్గాల వ్యక్తికే సీఎం పదవి దక్కుతుందన్నారు.
ఆదివారం సాయంత్రం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే. అలాంటప్పుడు టీఆర్‌ఎస్ గాలి ఎట్లా వీస్తుంది? టీఆర్‌ఎస్‌కు ఓటేశారన డానికి కచ్చితమైన కారణాలేమున్నాయి? మేం మాత్రం తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని భావిస్తున్నాం’’అని చెప్పారు. ఎన్నికల్లో కొంత క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
- సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఓడిపోవాలనేది టీఆర్‌ఎస్ కోరిక. కేసీఆర్ ఓడిపోతారని మేమంటే ఏమైనా అర్థముంటుందా? ఆయన కచ్చితంగా గెలుస్తారు. రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి.
- లగడపాటి ఒకప్పుడు చేసే సర్వేలు వేరు. ఇప్పుడు వేరు. ఎందుకంటే కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆయన సర్వే చేస్తున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.
- జానారెడ్డి అనుభవం ఉన్న నేత. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కాంగ్రెస్ శాసనసభాపక్షం, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఈసారి సీఎం ఎంపిక విషయంలో మాత్రం సామాజిక న్యాయం ఉంటుంది. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులకే సీఎం పదవిస్తామని హైకమాండ్ చెప్పింది. మా దృష్టిలో బలహీనవర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలే.
- నేను సీఎం పదవికి సమర్ధుడినో కాదో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడే తేలిపోయింది. అయినా దేనికైనా అదృష్టం ఉండాలి. నుదుటిన రాసి ఉంటే సీఎం అవుతారు.
- ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం. టీఆర్‌ఎస్ మా సిద్ధాంతానికి దగ్గరగా ఉందా? లేదా? అనేది సందర్భం వచ్చినప్పుడు చెబుతా.
- సోనియా, రాహుల్‌గాంధీ తెలంగాణలో ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు ఊపు వచ్చింది. నేను కూడా మంచి మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉంది.
- దేశంలోనూ కాంగ్రెస్సే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ప్రాంతీయ పార్టీలతో కలిసి యూపీఏ-3 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మోడీ ప్రధాని కావడం జరగని పని. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొద్దోగొప్పో అవకాశమున్నా ఆ పార్టీవాళ్లే మోడీని ప్రధాని కానివ్వరు.