కామారెడ్డి, న్యూస్‌లైన్ : ప్రపంచ కార్మిక దినోత్సవం రోజునే ఓ కార్మికుడిపై అధికారి చేయిచేసుకున్న సంఘటన గురువారం ఉదయం కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో అద్దె బస్సును తనిఖీ చేస్తున్న సమయంలో డిపో మేనేజర్ జగదీశ్వర్ బస్సు అపరిశుభ్రంగా ఉందంటూ డ్రైవర్ ఎండీ మజీద్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో విస్తుపోయిన డ్రైవర్ ఎందుకుసార్ ఇలా కొడతారని ప్రశ్నించగానే మరోసారి చెయ్యి చేసుకున్నారు. దీంతో డ్రైవర్ బస్సును డిపోలోనే నిలిపివేసి తోటి అద్దె బస్సు డ్రైవర్లు, యూనియన్ల నేతలకు సమాచారం అందించారు. అద్దె బస్సు డ్రైవర్లు వచ్చి కొంతసేపు ఆందోళన చేశారు. బాధితుడు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా ఈ సంఘటనపై కార్మికులు, డీఎం మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరిగాయని సమాచారం. డిపో మేనేజర్ కార్మిక దినోత్సవం రోజునే కార్మికుడిపై దౌర్జన్యం చేసిన సంఘటన కార్మికుల్లో ఆగ్రహం తెప్పించింది. అద్దె బస్సు తనిఖీ సమయంలో బస్సులో లోపాలుంటే సంబంధిత వాహనం యాజమానికి నోటీసు ఇవ్వడమో, ఇంకా ఏదైనా ఫైన్ వేయడమో చేయాలని, ఇలా డ్రైవర్‌పై చేయి చేసుకోవడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
డీఎంను సస్పెండ్ చేయాలి
మేడే రోజున కార్మికుడిపై అకారణంగా దాడి చేసిన డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్‌ఎన్ ఆజాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన డీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు.
డ్రైవర్‌ను కొట్టాననేది అవాస్తవం
-డీఎం జగదీశ్వర్, కామారెడ్డి
బస్సు ఫిట్‌నెస్‌ను పరిశీలించగా ఎన్నో లోపాలు కనిపించాయి. లోపాలను ఎత్తిచూపి సదరు వాహనం డ్రైవర్‌ను మందలించాను. అయితే ఆ డ్రైవర్ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ఆరోపణ చేశారు. మందలించిన పాపానికి చేయిచేసుకున్నానని దుష్ర్పచారం చేస్తున్నారు.
మేడే రోజే కార్మికుడిపై దౌర్జన్యం
Published Fri, May 2 2014 1:42 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement