టీడీపీలో బిగ్ డీల్స్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, ఎన్నికల సందర్భంగా టీడీపీలో పెద్ద డీల్స్ జరుగుతున్నాయి. సీటు ఆశిస్తున్న జూనియర్లను సీనియర్లు బుట్టలో వేసుకుంటున్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, యువనేత నారా లోకేష్‌ల వద్ద తమకు పలుకుబడి ఉందని నమ్మబలుకుతున్నారు. పార్టీకి రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, వచ్చేది మన ప్రభుత్వమేనంటూ వారిని ఊహాలోకాల్లో తేలుస్తున్నారు.
రాజధానిలో ముఖ్యనేతలతో భేటీకి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామంటున్నారు. ఒకరిద్దరు ముఖ్యనేతలైతే నా ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తే సీటు గ్యారంటీగా ఇప్పిస్తానంటున్నారు. ముఖ్యనేతల భేటీకి, రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేయడానికి ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయని కొందరు జూనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా డబ్బు ఉండి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారవేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు వీరి మాటల గారడీలో సులభంగా పడిపోతున్నారు.
గుంటూరు తూర్పులో రెండు సామాజిక వర్గాల నేతలు సీటు మోజులో రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. సౌదీలో ఇంజినీరుగా పనిచేసిన ఒక మైనార్టీ నేత, మరో సామాజికవర్గానికి చెందిన వ్యాపారి సీటు కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. సీటు ఇస్తే పార్టీకి ఫండ్ ఇస్తామని, ఎన్నికలకు ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నారు. రాజకీయాలతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా నేతల మాయలో పడి ఎన్టీఆర్ భవన్, ఇతర ముఖ్యనేతల నివాసాల వద్ద పడిగాపులు పడుతున్నారు.
మైనార్టీనేతకు తెరవెనుక ఒక మాజీ మంత్రి ఉన్నారని, మరో సామాజికవర్గం నేతకు జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన ఒక నేతకు సత్తెనపల్లి సీటు ఇప్పిస్తానని జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత హామీ ఇచ్చారు. ఆ మేరకు అతని నుంచి సేవలు పొందారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సీటును మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా నేత మౌనందాల్చారు.
మరో సీనియర్ నేత నిన్న మొన్నటివరకు తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఇక్కడ నీకు టిక్కెట్ ఇప్పిస్తానంటూ ఓ బీసీ నాయకునికి చెబుతూ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు అతనితో ఖర్చు పెట్టించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రముఖ పారిశ్రామిక వేత్తలను పట్టుకుని వారికి టిక్కెట్ ఇప్పించేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు.
టిక్కెట్ ఇప్పిస్తే తనకు అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చును ఆయన భరించేలా మాట్లాడుకుని ఒక పారిశ్రామిక వేత్తను తెరపైకి తెచ్చారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలోని ఒక నియోజకవర్గం టిక్కెట్ ఇప్పిస్తానంటూ బీసీ వర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి వద్ద భారీ మొత్తంలో డబ్బు మాట్లాడుకుని అధినేత వద్ద పావులు కదుపుతున్నట్టు పార్టీలో వినపడుతోంది.
ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తితో జిల్లాకు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ వైద్యుని వద్ద సీనియర్లు డబ్బు గుంజినట్టు అధినేతకు ఫిర్యాదులు అందాయి. ఆ వైద్యునికి న్యాయం జరగకపోగా సీనియర్ నేతకు డబ్బు ఇచ్చిన పాపానికి టీడీపీ హైకమాండ్ ఆయనకు టిక్కెట్‌ను నిరాకరించింది. సీట్ల కేటాయింపు త్వరగా తేల్చాలని, లేకపోతే నేతల మాయలో పడి మరికొంత నష్టపోతామని కొత్తతరం నేతలంటున్నారు.