సిట్టింగ్ లకే టికెట్
ఎంపీ అభ్యర్థులపై టీపీసీసీ జాబితా
ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేత
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్లుగానే.. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రూపొందించి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి సమర్పించిన జాబితాలో సిట్టింగ్ ఎంపీల పేర్లున్నారుు. ఆ జాబితాలో ఒక్కో నియోజకవర్గం నుంచి పలువురి పేర్లను సిఫారసు చేశారు. అందులో ఏఐసీసీ, పీసీసీ (ఉమ్మడి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ), టీపీసీసీ, డీసీసీలు సిఫారసు చేసిన వారి పేర్లనూ ఆ వివరాలతో సహా పొందుపరిచారు. అలాగే.. ఆయా స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తూ దరఖాస్తులు సమర్పించిన వారి పేర్లను ‘గాంధీభవన్’ పేరుతో జాబితాలో చేర్చారు. రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు తెలంగాణలో పార్టీ అభ్యర్థుల జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తును వేగవంతం చేసింది. తొలుత లోక్‌సభ అభ్యర్థులపై ప్రధాన దృష్టిని సారించింది. రెండు రోజుల్లో కసరత్తును పూర్తి చేసి తుది జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఆ వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదానికి పంపి 28వ తేదీకల్లా ఎంపీల జాబితాను ప్రకటించాలని యోచిస్తోంది. జాబితాలోని ముఖ్యాంశాలివీ...
కోమటిరెడ్డి సీటు పొన్నాలకు..!
కాంగ్రెస్ నేతలు ఊహించినట్లుగానే భువనగిరి సిట్టింగ్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మాత్రం మొండిచేయి చూపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరును భువనగిరి అభ్యర్థిగా మొదటగా సిఫారసు చేశారు. ఇటీవల నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో పొన్నాలతో పాటు నలుగురు పేర్లను రూపొందించగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. టీపీసీసీ జాబితా విషయానికొస్తే మాత్రం కోమటిరెడ్డి పేరును తొలగించేశారు. ఆయన స్థానంలో పొన్నాల కోడలు వైశాలి పేరును చేర్చారు. రాజగోపాల్‌రెడ్డి పేరు జాబితాలో లేకపోవటంపై పార్టీ నేతల్లో పెద్ద చర్చనీయాంశమైంది. టీపీసీసీ వర్గాలు మాత్రం హైకమాండ్ పెద్దల ఆదేశాల మేరకే ఆయన పేరును జాబితాలోంచి తప్పించినట్లు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హైకమాండ్‌కు ప్రత్యేకించి సోనియాగాంధీకి వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లు నివేదికలు అందాయని పేర్కొన్నాయి. దీనికితోడు ఇతర పార్టీలతో వారు సన్నిహితంగా ఉన్నారనే సమచారం కూడా రావడంతో ఆయన పేరును జాబితా నుంచి తొలగించారని వెల్లడించాయి. సోనియాగాంధీ జోక్యం చేసుకుంటే తప్ప రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టంచేశాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన తమకు టిక్కెట్లు రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీనివెనుక టీపీసీసీ పొన్నాల లక్ష్మయ్య ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు.
సిట్టింగ్‌లందరి పేర్లూ సిఫారసు...
రాజగోపాల్‌రెడ్డి మినహా తెలంగాణ కాంగ్రెస్ సిట్టింగులందరి పేర్లను సిఫారసు చేయడం విశేషం. తెలంగాణ ఉద్యమంలో దూకుడుగా వెళ్లిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, సిరిసిల్ల రాజయ్య పేర్లను కూడా జాబితాలో మొదటి వరుసలోనే చేర్చారు. పొన్నం ప్రభాకర్‌తోపాటు గతంలో పెద్దపల్లి (ఎస్సీ) ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన గోమాస శ్రీనివాస్, తెలంగాణ రాజకీయ జేఏసీ కో-కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, కె.రామకృష్ణల పేర్లను చేర్చడం గమనార్హం. అయితే వారి పేర్లను పెద్దపల్లి నియోజకవర్గ జాబితాలో చేర్చాల్సి ఉండగా.. పొరపాటు కరీంనగర్ జాబితాలోకి వెళ్లినట్లు పీసీసీ వర్గాలు వివరణ ఇచ్చాయి. దీంతో పొన్నం ప్రభాకర్ పేరును మాత్రమే కరీంనగర్ అభ్యర్థిగా టీపీసీసీ ప్రతిపాదించినట్లయింది. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి కోరుకున్నట్లుగానే ఆయన మహబూబ్‌నగర్ బరిలో దిగడానికి హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎంపీగా చేవెళ్ల అభ్యర్థిగా జైపాల్ పేరును చేర్చిన టీపీసీసీ మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా మొదటి వరుసలో పొందుపరచడం విశేషం.
టీడీపీ ఎమ్మెల్యే రాములుకు కాంగ్రెస్ టికెట్..!
జైపాల్‌రెడ్డి సూచన మేరకు తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీమంత్రి పి.రాములును నాగర్‌కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్న రాములు పేరును కాంగ్రెస్ జాబితాలో చేర్చడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఆయన జైపాల్‌రెడ్డి ద్వారా ఏఐసీసీ పెద్దలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో ఎస్సీ సామాజికవర్గ టిక్కెట్ల కేటాయింపు బాధ్యతను చూస్తున్న ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజుతోనూ ఆయన చర్చలు జరిపినట్లు తెలిసింది. నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీచేయాలని ఏఐసీసీ పెద్దలు ప్రతిపాదించడం, అందుకు రాములు అంగీకరించడంతో టీపీసీసీ జాబితాలో మొదట ఆయన పేరును చేర్చారు. మెదక్ ఎంపీ సీటుకు టీఆర్‌ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి పేరును సిఫారసు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఈసారి ఆదిలాబాద్ పార్లమెంటుబరిలోకి దింపాలని ప్రతిపాదించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతంకు తొలుత చొప్పదండి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పంపాలని భావించారు. తాజాగా ఆయన పేరును పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి సిఫారసు చేయడం విశేషం.