సాక్షి, హైదరాబాద్: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం రాత్రి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌లతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో బసచేసిన పార్టీ పెద్దలతో రఘువీరా సమావేశమై సీమాంధ్రలో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల ప్రచార సభల గురించి చర్చించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వివరించారు. చిరంజీవి, తాను కలిపి ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకదఫా ప్రచారాన్ని పూర్తిచేశామని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియవస్తున్నందున ఇక సీమాంధ్రపై దృష్టిసారిస్తామని దిగ్విజయ్, ఆజాద్‌లు రఘువీరాకు చెప్పారు. సోనియా, రాహుల్ సభలను వేర్వేరుగా కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించడంపై భేటీలో చర్చించారు. సీమాంధ్రలో వచ్చే నెల 4తో ప్రచారం ముగియనున్నందున ఆ లోగా వారు మూడు నాలుగు చోట్ల ప్రచారం చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పీసీసీ వర్గాలు తెలిపాయి.