
మళ్లీ వాళ్లే
* సీనియర్ల ఒత్తిడితో ‘జాక్’కు షాక్..
* 111 మందితో టీ కాంగ్రెస్ జాబితా.. పాతవారికే ప్రాధాన్యం..
* పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి
* మైనారిటీలకు 4, బీసీలకు 32, ఓసీలకు 43
* జేఏసీ నేతల పేర్లు మాయం.. వారసులకూ నో..
* శంకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మణెమ్మలకు మొండిచేయి
* 8 మందే మహిళా అభ్యర్థులు.. మెదక్ అసెంబ్లీకి విజయశాంతి
* ఎమ్మెల్సీలు డీఎస్, షబ్బీర్, భానుప్రసాద్, ప్రేమ్‌సాగర్, నంది ఎల్లయ్య, ఎంపీ వీహెచ్‌లకు టికెట్లు
* జైపాల్‌రెడ్డి అనుచరుడికేనారాయణపేట సీటు.. డీకే అరుణ చెప్పిన వ్యక్తికే పాలమూరు టికెట్
* మిగిలిన 8 స్థానాల్లో సీపీఐ పోటీ, అడగకున్నా కోదాడ కేటాయింపు!
సాక్షి, న్యూఢిల్లీ / హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల ఒత్తిడికి కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గింది. రాత్రికి రాత్రే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేసింది. వివాదాల జోలికి పోకుండా ప్రయోగాలను పక్కనబెట్టి పాతవారికే పట్టం కట్టింది. జేఏసీ నేతలకు పెద్ద పీట వేస్తామని చెప్పినా.. చివరకు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనిచ్చింది. కొత్తగా వచ్చిన వారిని, రాజకీయ వారసులనూ హైకమాండ్ దూరంగా ఉంచింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో భాగంగా సీపీఐకి 8 స్థానాలు వదిలేసి.. మిగిలిన 111 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది.
సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ జాబితాను విడుదల చేశారు. శనివారం రాత్రి అర్ధంతరంగా నిలిపేసిన విలేకరుల సమావేశంలో.. టికెట్ ఖరారైనట్లు వెల్లడించిన జేఏసీ నేతల పేర్లు తాజా జాబితాలో గల్లంతయ్యాయి. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా.. నలుగురు మినహా దాదాపుగా సిట్టింగులందరికీ సీట్లు కేటాయించింది. పలువురు ఎమ్మెల్సీలు, ఓ రాజ్యసభ సభ్యుడికీ అవకాశమిచ్చి విధేయతకు ప్రాధాన్యముంటుందన్న సంకేతాలనూ పంపింది.
సీపీఐతో పొత్తులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), రేగా కాంతారావు(పినపాక), బాలూ నాయక్(దేవరకొండ)లకు ఈసారి టికెట్లు దక్కలేదు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ పి.శంకర్‌రావుకు సైతం ఈసారి హైకమాండ్ మొండిచేయి చూపడం విశేషం. కాగా, ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మకూ ఈసారి అవకాశమివ్వలేదు. ఆమె కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ ఆయనకూ దక్కలేదు. ఇక ఉప్పల్ సిట్టింగ్ అభ్యర్థి రాజిరెడ్డికి బదులు ఆయన తమ్ముడికి టికెట్ ఇచ్చారు.
బీసీలకు గతంలోకన్నా రెండెక్కువే
తెలంగాణలో టీడీపీ అధికారంలోకొస్తే బీసీ నేతను సీఎంను చేస్తానంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీనిచ్చిన నేపథ్యంలో తామేం తక్కువ కాదంటూ ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రాధాన్యతనిచ్చింది. గత ఎన్నికల్లో తెలంగాణలో 30 మంది బీసీలకు టిక్కెట్లు కేటాయించగా, ఈసారి 32 మంది బీసీలకు టికెట్లు(28.8 శాతం సీట్లు) కేటాయించడం ద్వారా వారిని ఆకర్షించే యత్నం చేసింది.
అలాగే ఈసారి ఎన్నికల్లో 12 శాతం సీట్లు మైనారిటీలకు ఇవ్వాలన్న డిమాండ్లు వచ్చినప్పటికీ నలుగురికి మాత్రమే చోటు దక్కింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన సీట్లుపోగా మిగిలిన 57 స్థానాల్లో 37 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారున్నారు. తెలంగాణలో అధిక ప్రాబల్యమున్న వెలమ సామాజికవర్గానికి 4 సీట్లు దక్కాయి. ఇక కమ్మ వర్గానికి మిర్యాలగూడ, ఖమ్మం సీట్లను కేటాయించారు.
డజనుకుపైగా కొత్త ముఖాలు
డజనుకుపైగా స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం దక్కింది. వీరిలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డికి కల్వకుర్తి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ దేశ్‌పాండేకు ఆదిలాబాద్, ఉస్మానియా జేఏసీ నేత క్రిశాంక్‌కు కంటోన్మెంట్ సీటిచ్చారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో తన కుమారుడు సంజయ్‌ను లేదా ఆకుల లలితను బరిలో దించేందుకు డీఎస్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ హైకమాండ్ మాత్రం యూత్ కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ పేరును ఖరారు చే సింది. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు తనయుడు పువ్వాడ అజయ్‌కుమార్(ఖమ్మం), కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ తనయుడు డాక్టర్ పి.వినయ్‌కుమార్(ముషీరాబాద్) కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా, మహిళా కాంగ్రెస్ నేతలకు పెద్దగా చోటు దక్కలేదు. మొత్తం జాబితాలో మహిళా నేతలు 8 మంది మాత్రమే ఉండటం విశేషం. అంటే కేవలం 7 % మహిళలకే అవకాశమిచ్చారు.
ఎమ్మెల్సీలకూ టికెట్లు
కాంగ్రెస్ జాబితాలో పలువురు ఎమ్మెల్సీలకూ సీట్లు దక్కాయి. డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, భానుప్రసాద్, ప్రేమ్‌సాగర్ రావు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. డీఎస్‌కు వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కానుంది. మిగతావారికి ఇంకా సమయమున్నప్పటికీ అవకాశమివ్వడం విశేషం. అలాగే ఇటీవలే ఎమ్మెల్సీగా నామినేట్ అయిన నంది ఎల్లయ్యకు నాగర్‌కర్నూలు ఎంపీ సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం నలుగురు ఎమ్మెల్సీలకు ఎన్నికల్లో టికెట్లు దక్కినట్లయింది. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన్ను అంబర్‌పేట అభ్యర్థిగా ప్రకటించారు.
కుటుంబ సభ్యులకు నో
ఈసారి ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు టీ-కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైకమాండ్ పెద్దలు సిట్టింగ్‌లకే ప్రాధాన్యమివ్వడంతో వారసులకు సీట్లు నిరాకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన కోడలు వైశాలికి టికెట్ ఇప్పించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన భార్య పద్మావతికి కోదాడ టికెట్ ఖాయమని భావించారు. అయితే కోదాడను సీపీఐకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తన సతీమణి పద్మిణికి సంగారెడ్డి టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికే మళ్లీ టికెట్ వరించింది. అలాగే మాజీ మంత్రులు కె.జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ముఖేష్‌గౌడ్, ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి కూడా తమ వారసులను బరిలోకి దింపాలని టికెట్ ఆశించి భంగపడ్డారు.
కుటుంబ సభ్యులకు హైకమాండ్ నో చెప్పడంతో విధిలేక ఆయా నియోజకవర్గాల్లో తమ అనుచరుల పేర్లను ప్రతిపాదించి కొంత వరకు సంతృప్తి చెందారు. మిర్యాలగూడ సీటును తన కుమారుడు రఘువీర్‌కు ఇచ్చేందుకు నిరాకరించడంతో జానారెడ్డి.. తన సని్నిహ తుడు, స్థానికేతరుడైన ఎన్.భాస్కర్‌రావుకు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో అక్కడ సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నెత్తిన పాలుపోసినట్లయింది. ఇక తన కొడుకు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ, తనకు మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కావాలని పట్టుబట్టిన సబితకూ అధిష్టానం మొండిచేయి చూపింది. కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినందున సబితకు ఈసారి అవకాశమివ్వలేదు. ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. రాజేంద్రనగర్‌ను జ్ఞానేశ్వర్‌కు కట్టబెట్టారు.
కొందరికి మాత్రం ఒకే..
టికెట్లు దక్కిన బంధువుల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కకు మధిర స్థానం దక్కగా.. ఆయన సోదరుడు మల్లు రవికి జడ్చర్ల స్థానం దక్కింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి భువనగిరి ఎంపీ స్థానం.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ అసెంబ్లీ టికెట్ దక్కింది. వీరిద్దరూ సిట్టింగులే. ఇక రాంరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సోదరులిద్దరికీ టికెట్లు దక్కాయి. వీరూ సిట్టింగులే. మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు, ఆయన కూతురు, మహబూబాబాద్ సిట్టింగ్ కవిత కూ అవకాశమిచ్చారు.
సీనియర్లకు వెయిటేజీ..
టికెట్ల ఎంపిక విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల మాట కొంత మేరకు చెల్లుబాటైంది. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు జిల్లాలో తాను సూచించిన నేతల కే అసెంబ్లీ టికెట్లు వచ్చేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట విషయానికొస్తే సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు ఇవ్వాలని హైకమాండ్ తొలుత భావించినప్పటికీ.. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి డీకే అరుణ పట్టుబట్టారు. జైపాల్‌రెడ్డి మాత్రం స్థానిక బీసీ నేత వేమనగిరి కృష్ణకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించి పంతం నెగ్గించుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌కు మహబూబ్‌నగర్ టౌన్ సీటు దక్కడంలో డీకే అరుణ ప్రయత్నం ఫలించినట్లు సమాచారం.
అలాగే కరీంనగర్ జిల్లాలో శ్రీధర్‌బాబు, నల్గొండ జిల్లాలో జానారెడ్డి తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. మెదక్ సిట్టింగ్ ఎంపీ విజయశాంతి ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. ఆమె కోరిక మేరకు మెదక్ అసెంబ్లీ సీటును కేటాయించారు. దీంతో అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ పి.శశిధర్‌రెడ్డికి నిరాశే మిగిలింది. వీరుగాకుండా టికెట్ ఆశించి ఇటీవల పార్టీలో చేరిన పలువురికి భంగపాటు తప్పలేదు. మాజీ ఎమ్మెల్యే ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఇబ్రహీంకు మొండిచేయి చూపారు.
మల్కాజ్‌గిరి టికెట్ ఆశించిన టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం దిగ్విజయ్‌ను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరి క్షణంలో భువనగిరి స్థానం కోసం ప్రయత్నించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతివిద్యాసాగర్‌కు మొండిచేయే ఎదురైంది. హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి మహిళా కోటాలో తనకు అవకాశం వస్తుం దని బలంగా నమ్మినప్పటికీ నిరాశే మిగిలింది. ఇక ఓబీసీ సెల్ నేత చిత్తరంజన్‌దాస్, మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా భంగపడ్డారు.
జేఏసీ నేతలకు మొండి చేయి
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి జేఏసీ నేతలకు సీట్లు ఇస్తామని ప్రకటించిన హైకమాండ్ చివరకు ఆ విషయాన్నే మరిచినట్లుంది. దాదాపు 8 మంది జేఏసీ నేతలకు జాబితాలో చోటు దక్కుతుందని భావించినప్పటికీ ఓయూ జేఏసీ నేత క్రిశాంక్(కంటోన్మెంట్) మినహా మరెవరికీ అవకాశమివ్వలేదు. గజ్జెల కాంతం, మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్న వంటి నేతలకు టికెట్లు ఖరారైనట్లు ఇప్పటికే సమాచారమిచ్చారు.
శనివారం రాత్రి ఏఐసీసీ అధికార ప్రతినిధి సూర్జేవాలా మీడియా సమావేశంలో వారి పేర్లను కూడా చదివి విన్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాసూచన మేరకే సీట్లు ఖాయమయ్యాయని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలి కాంగ్రెస్‌ను తిట్టిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ తెలంగాణ సీనియర్లు ఒత్తిడి తేవడంతో హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీంతో రాత్రికి రాత్రే జాబితా మారిపోయింది. దీంతో జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తికిలోనయ్యారు. టికెట్లు ఇస్తామని హామీనిస్తేనే కాంగ్రెస్‌లో చేరామని, ఇప్పుడు అధిష్టానం పెద్దలు తమకు అన్యాయం చేశారని వాపోయారు.
తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలి: కొప్పుల ఆవేదన
జేఏసీ నేతలకు టికెట్లు ఇస్తున్నట్లు ఏఐసీసీ వేదిక మీదుగా పార్టీ అధికార ప్రతినిధి స్వయంగా ప్రకటించి ఇప్పుడు జాబితాలో వారికి చోటివ్వకపోవడంతో ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాాజు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఇది దళితులను అవమానించడమేనని, తెలంగాణ సాధనలో క్రియాశీలంగా వ్యవహరించిన ఉద్యమ శక్తులకు ఏం సమాధానం చెబుదామని, వారికి టికెట్లు నిరాకరించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అభ్యర్థులను ప్రకటించని స్థానాలివే..(సీపీఐకి ఇచ్చినట్లుగా భావిస్తున్నవి):
1. కొత్తగూడెం 2. వైరా 3. పినపాక 4. దేవరకొండ 5. మునుగోడు 6. కోదాడ 7. బెల్లంపల్లి 8. మహేశ్వరం.
కాంగ్రెస్ తెలంగాణ శాసనసభ అభ్యర్థుల జాబితా ఇదీ..
క్రమ సం. నియోజకవర్గం అభ్యర్థి
1. సిర్పూర్- ప్రేమ్‌సాగర్‌రావు
2. చెన్నూరు(ఎస్సీ)- జి.వినోద్
3. మంచిర్యాల- అరవింద్‌రెడ్డి గడ్డం
4. ఆసిఫాబాద్(ఎస్టీ)- ఆత్రం సక్కు
5. ఖానాపూర్(ఎస్టీ) - అజ్మీరా హరినాయక్
6. ఆదిలాబాద్- భార్గవ్ దేశ్‌పాండే
7. బోథ్(ఎస్టీ)- జాదవ్ అనిల్
8. నిర్మల్- ఎ.మహేశ్వర్‌రెడ్డి
9. ముధోల్- జి.విఠల్‌రెడ్డి
10. ఆర్మూర్ - కె.ఆర్.సురేశ్‌రెడ్డి
11. బోధన్- పి.సుదర్శన్‌రెడ్డి
12. జుక్కల్(ఎస్సీ) - ఎస్.గంగారాం
13. బాన్స్‌వాడ - కాసుల బాలరాజు
14. ఎల్లారెడ్డి - జాజుల సురేంద్ర
15. కామారెడ్డి - షబ్బీర్ అలీ
16. నిజామాబాద్(అర్బన్)- బి.మహేష్‌కుమార్‌గౌడ్
17. నిజామాబాద్(రూరల్) - డి.శ్రీనివాస్
18. బాల్కొండ - ఇ.అనిల్
19. కోరుట్ల - కొమిరెడ్డి రాములు
20. జగిత్యాల- టి.జీవన్‌రెడ్డి
21. ధర్మపురి(ఎస్సీ)- ఎ.లక్ష్మణ్‌కుమార్
22. రామగుండం- బాబర్ సలీం పాషా
23. మంథని - డి.శ్రీధర్‌బాబు
24. పెద్దపల్లి- భానుప్రసాద్‌రావు
25. కరీంనగర్ - సి.లక్ష్మీనర్సింహారావు
26. చొప్పదండి- సుద్దాల దేవయ్య
27. వేములవాడ - బొమ్మ వెంకటేశ్వర్లు
28. సిరిసిల్ల- కె.రవీందర్‌రావు
29. మానకొండూరు- ఆరేపల్లి మోహన్
30. హుజురాబాద్ - కె.సుదర్శన్‌రెడ్డి
31. హుస్నాబాద్ - అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
32. సిద్దిపేట - టి.శ్రీనివాస్‌గౌడ్
33. మెదక్ - విజయశాంతి
34. నారాయణ్‌ఖేడ్- పట్లోళ్ల కిష్టారెడ్డి
35. ఆందోల్(ఎస్సీ) - సి.దామోదర రాజనర్సింహ
36. నర్సాపూర్ - వి.సునీతాలక్ష్మారెడ్డి
37. జహీరాబాద్(ఎస్సీ) - జె.గీతారెడ్డి
38. సంగారెడ్డి - తూర్పు జయప్రకాశ్‌రెడ్డి
39. పటాన్‌చెరు- టి.నందీశ్వర్‌గౌడ్
40. దుబ్బాక్ - సి.హెచ్.ముత్యంరెడ్డి
41. గజ్వేల్- టి.నర్సారెడ్డి
42. మేడ్చల్ - కె.లక్ష్మారెడ్డి
43. మల్కాజ్‌గిరి - నందికంటి శ్రీధర్
44. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
45. కూకట్‌పల్లి - నర్సింహయాదవ్
46. ఉప్పల్ - బి.లక్ష్మారె డ్డి
47. ఇబ్రహీంపట్నం- క్యామ మల్లేష్
48. ఎల్.బి.నగర్ - డి.సుధీర్‌రెడ్డి
49. రాజేంద్రనగర్ - జ్ఞానేశ్వర్ ముదిరాజ్
50. శేరిలింగంపల్లి - భిక్షపతియాదవ్
51. చేవెళ్ల(ఎస్సీ)- కె.యాదయ్య
52. పరిగి - టి.రామ్మోహన్‌రెడ్డి
53. వికారాబాద్(ఎస్సీ) - గడ్డం ప్రసాద్
54. తాండూరు - నారాయణరావు
55. ముషీరాబాద్ - డాక్టర్ వినయ్‌కుమార్
56. మలక్‌పేట వి.ఎన్.రెడ్డి
57. అంబర్‌పేట వి.హనుమంతరావు
58. ఖైరతాబాద్ - దానం నాగేందర్
59. జూబ్లీహిల్స్ - పి.విష్ణువర్ధన్‌రెడ్డి
60. సనత్‌నగర్ - మర్రి శశిధర్‌రెడ్డి
61. నాంపల్లి - ఇ.వినోద్‌కుమార్
62. కార్వాన్ - రూప్‌సింగ్
63. గోషామహల్ - ముఖేష్‌గౌడ్
64. చార్మినార్ - కె.వెంకటేశ్
65. చాంద్రాయణగుట్ట - మైనంపాటి అశ్విన్‌రెడ్డి
66. యాఖుత్‌పుర - బి.ఆర్.సదానంద్ ముదిరాజ్
67. బహదూర్‌పుర - సయ్యద్ అబ్దుల్ సమీ
68. సికింద్రాబాద్ - జయసుధ
69. సికింద్రాబాద్ - కంటోన్మెంట్ (ఎస్సీ) క్రిషాంక్
70. కొడంగల్- విఠల్‌రావు
71. నారాయణ్‌పేట్ - వామన్‌గిరి కృష్ణ
72. మహబూబ్‌నగర్ - ఎం.డి.ఒబేదుల్లా కొత్వాల్
73. జడ్చర్ల- డాక్టర్ మల్లు రవి
74. దేవరకొండ - బి.పవన్‌కుమార్
75. మక్తల్ - చింతం రామ్మోహన్‌రెడ్డి
76. వనపర్తి - డాక్టర్ జి.చిన్నారెడ్డి
77. గద్వాల్- డి.కె.అరుణ
78. అలంపూర్(ఎస్సీ) - సంపత్‌కుమార్
79. నాగర్ కర్నూల్ - కె.దామోదర్‌రెడ్డి
80. అచ్చంపేట(ఎస్సీ)- డాక్టర్ వంశీకృష్ణ
81. కల్వకుర్తి - చల్లా వంశీచందర్ రెడ్డి
82. షాద్‌నగర్ - సి.హెచ్.ప్రతాప్‌రెడ్డి
83. కొల్లాపూర్ - హర్షవర్ధన్‌రెడ్డి
84. నాగార్జునసాగర్- కుందూరు జానారెడ్డి
85. మిర్యాలగూడ- ఎన్.భాస్కర్‌రావు
86. హుజూర్‌నగర్ - ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
87. సూర్యాపేట - రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
88. నల్లగొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
89. భువనగిరి - పోతంశెట్టి వెంకటేశ్వర్లు
90. నకిరేకల్(ఎస్సీ) - చిరుమర్తి లింగయ్య
91. తుంగతుర్తి(ఎస్సీ) - గుడిపాటి నర్సయ్య
92. ఆలేరు- బూడిద భిక్షమయ్యగౌడ్
93. జనగాం - పొన్నాల లక్ష్మయ్య
94. ఘన్‌పూర్ (స్టేషన్)(ఎస్సీ) - విజయరామారావు
95. పాలకుర్తి - డి.శ్రీనివాసరావు
96. డోర్నకల్(ఎస్టీ) - డి.ఎస్.రెడ్యానాయక్
97. మహబూబాబాద్(ఎస్టీ)- ఎం.కవిత
98. నర్సంపేట- డి.మాధవరెడ్డి
99. పరకాల - ఇ.వెంకటరామిరెడ్డి
100. వరంగల్ వెస్ట్ - స్వర్ణ
101. వరంగల్ ఈస్ట్ - బసవరాజు సారయ్య
102. వర్ధన్నపేట(ఎస్సీ)- కొండేటి శ్రీధర్
103. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి
104. ములుగు(ఎస్టీ) - పి.వీరయ్య
105. ఇల్లెందు - కొర్రం కనకయ్య
106. ఖమ్మం- పువ్వాడ అజయ్
107. పాలేరు - రాంరెడ్డి వెంకటరెడ్డి
108. మధిర(ఎస్సీ)- మల్లు భట్టివిక్రమార్క
109. సత్తుపల్లి(ఎస్సీ) - సంభాని చంద్రశేఖర్
110. అశ్వారావుపేట(ఎస్టీ)- వగ్గెల మిత్రసేన
111. భద్రాచలం(ఎస్టీ) - కుంజా సత్యవతి