కాంగ్రెస్‌ను టీడీపీలో విలీనం చేయడమే మేలు
సాలూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీని టీడీపీలో విలీనం చేయడమే ఉత్తమమని, అలా చేస్తే కనీసం ఆ పార్టీ కార్యకర్తలకైనా మేలు జరుగుతుం దని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఎద్దేవాచేసారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు కాకుండా టీడీపీ అభ్యర్థికి ఓటు వేయూలని ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఓటర్లను కోరడం నీతిమాలిన రాజకీయమన్నారు.
కేవలం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో వారు నిస్సిగ్గుగా వ్యవహరించారన్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా కేవలం వైఎస్సార్ సీపీకి ఓట్లు దక్కకుండా చేయడానికే పోటీ చేయించారన్నారు. కాంగ్రెస్‌లో ఉండి టీడీపీని గెలిపించాలని కోరడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచారన్నారు. దాని కన్నా టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థు ల గెలుపు కోసం పని చేసి ఉంటే బాగుండేదన్నారు. నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు చెరో 5 వేలు కూడా లేవంటే వారు ఎంతగా కుమ్మక్కు రాజకీయాలు జరిపారో అర్థమవుతుందన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ జరజాపు ఈశ్వరరావు కూడా ఉన్నారు.