గుండెల్లో రెబెల్స్
* కాంగ్రెస్‌కు అసంతృప్తుల బెడద
* పార్టీ పెద్దలపై ఒత్తిళ్లు, రాజీనామా బెదిరింపులు.. తిరుగుబాట్లు, పోటీ నామినేషన్లకు నిర్ణయం
* గాంధీభవన్, పొన్నాల నివాసం వద్ద ధర్నాలు.. జిల్లాల్లోనూ నిరసనల సెగ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అభ్య ర్థుల ప్రకటన ప్రకంపనలకు దారితీసింది. అనేక చోట్ల అసమ్మతి సెగలు రేగాయి. పార్టీ టికెట్లను అమ్ముకున్నారంటూ ఆగ్రహించిన నేతలు, కార్యకర్తలు ధర్నాలకు దిగారు. అభ్యర్థుల ఎంపికను నిరసిస్తూ అనుచరులతో కలిసి కొందరు మూకుమ్మడి రాజీనామా చేశారు. పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. దీంతో తెలంగాణలోని దాదాపు సగం స్థానాల్లో కాంగ్రెస్‌కు రెబెల్స్ బెడద పట్టుకుంది. స్వతంత్రంగా నామినేషన్ వేయడానికి పలువురు నేతలు సిద్ధమయ్యారు. ఈ నిరసనల సెగ ధాటికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ కార్యాలయమైన గాంధీభవన్‌కే రాలేకపోయారు. పార్టీ అభ్యర్థులందరికీ ఫోన్లుచేసి తన నివాసానికి పిలిపించుకుని బీ ఫారాలు ఇచ్చి పంపారు.
అట్టుడికిన గాంధీభవన్
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు మంగళవారం గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పెద్దలు డబ్బులకు అమ్ముడుపోయారని మండిపడ్డారు. వారికి డబ్బులే కావాలంటే తామంతా విరాళాలు సేకరించి ఇస్తామన్నారు. జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మల్లురవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక వికారాబాద్ టికెట్‌ను మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు ఇవ్వాలని ఆయన మద్దతుదారులు, చంద్రాయణగుట్ట సీటు తనకే ఇవ్వాలని పర్వతాల రాజేందర్ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు.
గ్రేటర్ కాంగ్రెస్ మహిళా నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాంధీభవన్ మెట్లపై రోజంతా బైఠాయించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత ఆధ్వర్యంలో మహిళా నేతలు పొన్నాలను ఆయన నివాసంలో కలిసి.. టికెట్ల కేటాయింపులో మహిళలకు తగిన ప్రాధాన్యమివ్వలేదని నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని తనకే ఇచ్చామని దిగ్విజయ్ చెప్పడంతో జిల్లాకు వెళ్లిపోయానని, తీరా మహేష్‌కుమార్ గౌడ్‌కు టికెట్ ఇచ్చారని లలిత కంటతడిపెట్టారు.
కరీంనగర్‌లో గీట్ల, జువ్వాది...
కోరుట్లలో జువ్వాది నర్సింగరావు, పెద్దపల్లిలో గీట్ల ముకుందరెడ్డి రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో చేరిన కేకే మహేందర్‌రెడ్డి సిరిసిల్లలో బీజేపీ తరఫున నామినేషన్ వేయాలని యోచిస్తున్నారు. ఈ దిశగా కమలనాథులతో చర్చలు జరుపుతున్నారు. గోదావరిఖని స్థానిక కాంగ్రెస్ నేత కోరుకంటి చందర్ కూడా స్వతంత్రంగా పోటీ చేసే యోచనలో ఉన్నారు.
నిజామాబాద్‌లో అరుణతార, శ్రీనివాస్‌గౌడ్
జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే అరుణతార, బాన్సువాడలో శ్రీనివాస్‌గౌడ్ తిరుగుబాటు అభ్యర్థులుగా బుధవారం నామినేషన్ వేయనున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని తనకు కేటాయించకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత అల్టిమేటం జారీ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ దిష్టిబొమ్మలను జిల్లా కాంగ్రెస్ నేతలు తగులబెట్టారు.
వరంగల్‌లో పొన్నాలపై ఆగ్రహం
టీ-పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా వరంగల్‌లో టికెట్లు దక్కని అభ్యర్థులు భగ్గుమన్నారు. పొన్నాల లక్ష్మయ్య దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వరంగల్(పశ్చిమ) నియోజకవర్గంలో నామినేషన్ వేస్తామని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, స్థానిక నేత బండ ప్రకాష్ ప్రకటించారు. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ దక్కనందుకు నిరసనగా గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రాజారావుప్రతాప్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, పరకాల టికెట్ ఆశించి భంగపడిన సాంబారి సమ్మారావు తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు.
మెదక్ రెబెల్‌గా శశిధర్‌రెడ్డి
మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు శశిధర్‌రెడ్డి ప్రకటించారు. కాగా, మెదక్ పార్లమెంట్ పరిధిలోనూ పలువురు నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో ఎవరికి వారే సిద్ధమవుతున్నారు.
పాలమూరులోనూ లొల్లే
టికెట్ దక్కనందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. కొడంగల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన్ని బరిలో దింపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నారాయణపేట టికెట్ ఆశించి భంగపడ్డ టీజేఏసీ నేత రాజేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. టికెట్ వస్తుందనే ఆశతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలని యోచిస్తున్నారు. వీరితోపాటు కొల్లాపూర్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, జడ్చర్లలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దేవరకద్ర టికెట్ ఆశించిన స్వర్ణ సుధాకర్, శ్రీరాంభూపాల్ కూడా స్వతంత్రులుగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైనా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
నల్లగొండలోనూ నారాజ్....
భువనగిరి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న స్థానిక కాంగ్రెస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి రెబెల్‌గా మారారు. మిర్యాలగూడ టికెట్ దక్కనందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పొత్తులో సీపీఐ ఖాతాలోకి వెళుతున్న మునుగోడు నుంచి పోటీకి ఆశలు పెంచుకున్న రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. కోదాడ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తే తాను ఇండిపెండెంట్‌గా దిగుతానని గతంలో ఇక్కడ పోటీ చేసిన మహ్మద్ జానీ స్పష్టం చేశారు.
ఖమ్మంలో కాంగ్రెస్‌కు గుడ్‌బై
కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం అసెంబ్లీ సీటును పువ్వాడ అజయ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ పార్టీ నుంచీ టికెట్ దక్కనిపక్షంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
హైదరా‘బాధ’
ముషీరాబాద్ టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే టి.మణెమ్మ కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి రెబెల్‌గా మారారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌రావుకు కంటోన్మెంట్ టికెట్ దక్కకపోవడంతో ఆయన కూడా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. గ్రేటర్ మహిళా కాంగ్రెస్ నేత ఐత రజనీదేవి కూడా ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చాంద్రాయణగుట్ట టికెట్ దక్కనందుకు స్థానిక కాంగ్రెస్ నేత పర్వతాల రాజేందర్ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు.
బీఎస్పీ తరఫున ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప
కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి, కోనేరు కోనప్ప సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) తరఫున నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్, ముథోల్ అసెంబ్లీ టిక్కెట్లు దక్కని డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తమ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు.
రంగారెడ్డి నిండా తిరుగుబాట్లే!
కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల జాబితాలో రంగారెడ్డి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు డజను మంది నాయకులు రెబెల్స్‌గా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం), వెంకటస్వామి(చేవెళ్ల), కమతం రాంరెడ్డి(పరిగి), సదాలక్ష్మి(రాజేంద్రనగర్) ఇప్పటికే స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ప్రకటించారు. వీరితోపాటు ఎ.చంద్రశేఖర్(వికారాబాద్) కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్ తర ఫున పోటీ చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు.
కాంగ్రెస్ తీరును నిరసిస్తూ హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్‌గౌడ్, కొలను హన్మంత్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిద్దరికి టీఆర్‌ఎస్ తరఫున టికెట్లు కూడా ఖరారయ్యాయి. పొత్తులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తే.. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిని రంగంలోకి దించేందుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది.