గాంధీభవన్ గల్లా ఖాళీ
ఎన్నికల వేళ నిధుల కరువు
చాయ్‌బిస్కెట్లకూ కటకట
తలపట్టుకున్న టీపీసీసీ
పసునూరు మధు: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా డబ్బు కొరత వచ్చి పడింది. ఎన్నికల జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను తయారు చేసుకునేందుకు పైసల్లేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ గాంధీభవన్ బొక్కసం మాత్రం ఖాళీగా దర్శనమిస్తోంది. పార్టీకి నిధులు ఇచ్చేందుకు నేతలెవరూ ముందుకు రావడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా తన చేతి చమురు ఎందుకు వదలించుకోవాలనే ఉద్దేశంతో ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ ప్రచార సామగ్రి ఇంతవరకు సిద్ధం కాలేదు. చివరకు గాంధీభవన్‌కు వచ్చే నాయకులు, మీడియాకు టీ, బిస్కెట్లు ఇచ్చేం దుకు కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది.
- ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం కోసం కార్యకర్తలు చెల్లించిన రూ.3 కోట్లను డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీని గాంధీభవన్ నిర్వహణకు వినియోగించేవారు. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వాధినేత నుంచి ప్రతినెలా రూ.10 లక్షల మేరకు అనధికారికంగా సర్దుబాటు చేసేవారు.
- డీఎస్ నుంచి బొత్స సత్యనారాయణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత గాంధీభవన్‌ను ఆధునీకరించేందుకు బ్యాంకులో ఉన్న సొమ్మంతా ఖర్చు చేశారు. కానీ కిరణ్ వచ్చాక రూ.10 లక్షలకు బదులు రూ.5 లక్షలు ఇస్తానని ప్రతిపాదించారు. దానితో విభేదించిన బొత్స ఆ సొమ్మును కూడా తీసుకునేందుకు నిరాకరించారు. మంత్రిగా తనకున్న పలుకుబడి, ఇతర నాయకుల సహకారంతో గాంధీభవన్ ఆధునీకరణ, ఇందిరా భవన్ నిర్మాణం పూర్తి చేశారు.
- టీపీసీసీ, ఏపీసీసీలుగా ఏర్పడే నాటికి గాంధీభవన్ ఖాతాలో సొమ్ము రూ.2 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వమే రద్దయినందున అక్కడి నుంచీ చెల్లింపులు ఆగిపోయాయి. ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో, జిల్లాల్లో కొత్తగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని పొన్నాల లక్ష్మయ్య ఆదేశించారు. కానీ అందుకు అవసరమైన కంప్యూటర్, ఫోన్, టేబుల్, ఇతరత్రా సదుపాయాలకు డబ్బు లేక కంట్రోల్‌రూం నిర్వాహకులు తలపట్టుకున్నారు.
- టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాలను, మాట తప్పిన నైజాన్ని ఎండగడుతూ ‘కేసీఆర్....వంద అబద్ధాలు’ పేరుతో బుక్‌లెట్ రూపొందించాలని పొన్నాల ఆదేశించారు. అందుకయ్యే ఖర్చులను ఎలా భరించాలో తెలియక గాంధీభవన్ సిబ్బంది బిక్కమొహం వేసుకున్నారు.
- నియోజకవర్గాల వారీగా ఎన్నికలకు సంబంధించిన ప్రచార సామగ్రి, ఫ్లెక్సీలు, కరపత్రాలు ఎంత అవసరమో అంచనావేసి ఆ మేరకు సామగ్రిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలకు పంపాలి. అందుకోసం కోట్లలో డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బును ఎలా సర్దుబాటు చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.
- ఒక్క పీసీసీ నిర్వహణకే డబ్బుల్లేక చస్తుంటే కొత్తగా రెండు పీసీసీలు ఏర్పాటు కావడంతో వాటి నిర్వహణ ఎలా అనేది సమస్యగా మారింది. ఏపీసీసీ పేరిట ప్రస్తుతమున్న బ్యాంకు ఖాతాను సీమాంధ్ర పీసీసీకే బదలాయించి, టీపీసీసీ తరపున కొత్త ఖాతాను తెరవాలని భావిస్తున్నారు. దీనిపై పొన్నాల నుంచి ఎలాంటి స్పందన లేదు.
- టీపీసీసీ అధ్యక్షుడిని నియమించకముందు వరకు తెలంగాణలో పార్టీ కార్యక్రమాల బాధ్యత మాజీమంత్రి కె.జానారెడ్డి చూసేవారు. పొన్నాల టీపీసీసీ బాధ్యతలు చేపట్టాక జానారెడ్డి ఈ వ్యవహారాలను పట్టించుకోవడం మానేసారు. ఎన్నికల సమయంలో పార్టీకి భారీగా నిధులు అవసరమైనందున తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరితో చర్చిద్దామని పొన్నాల భావిస్తున్నా...వారెవరూ సహకరించడం లేదు.
- ఆర్దికంగా పరిపుష్టంగా ఉన్న పొన్నాల సైతం ఖర్చంతా తానే ఎందుకు భరించాలనే భావనలో ఉన్నారు. .పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను, అభ్యర్థులకు అవసరమైన సాయాన్ని అందిస్తాననే హామీతోనే టీపీసీసీ పగ్గాలు తనకు ఇచ్చినందున హైకమాండ్ పెద్దల వద్ద నోరు మెదపలేని పరిస్థితి. మొన్నటి వరకు నేతలకు మినరల్ వాటర్ బాటిల్లు, శీతల పానీయాలు అందించిన సిబ్బంది.....డబ్బులు ఖాళీ కావడంతో మామూలు నీళ్లను బాటిళ్లలో నింపి అందిస్తున్నారు.
జన తెలంగాణ
వృద్ధులకు ప్రాధాన్యం కల్పించాలి..
చట్టసభల్లో వృద్ధుల ప్రాతినిధ్యం పెంచాలి. పాలనావ్యవహారాల్లో అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్ల సలహాలకు, సూచనలకు స్వీకరించాలి. చట్టసభలలో వృద్ధులున్నప్పటికీ వారికి తగిన గౌరవం లభించడం లేదు. సభా సాంప్రదాయాలను, మర్యాదలను పట్టించుకోకపోవడం వల్ల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. వృద్దుల సమస్యలను పరిష్కరించడానికి ఒక శాఖను ఏర్పాటు చేయాలి.
- సముద్రాల మల్లికార్జున్,
హౌజింగ్‌బోర్డు కాలనీ, నల్లగొండ
వ్యవసాయానికి రాయితీలు..
ప్రజల ఆకాంక్ష నెరవేరిందని మురిసిపోతే కుదరదు. నవ నిర్మాణం జరగాలి. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పత్తి పండే జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి రాయితీలు పెంచాలి. పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వలస వెళ్తున్న వారిని ఆదుకోవాలి. అమరులైన వారి కుటుంబాలకు అసరా కల్పించాలి.
- గుత్ప ప్రసాద్, ప్రధాన కార్యదర్శి,
నిజామాబాద్ జిల్లా వికలాంగుల ఉద్యోగుల సంఘం