గొడవకు దిగితే గుద్దుడే..!
గాంధీభవన్‌లో బౌన్సర్లు
తొలిసారిగా నియామకం
నేత ల విస్మయం
గొడవలు జరగకుండా ఉండటానికేనన్న టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: బౌన్సర్లను రక్షణగా పెట్టుకుని.. ఆవిర్భవించిన జనసేన నుంచి స్ఫూర్తి పొందారో ఏమో తెలియదుగానీ.. గాంధీభవన్‌లోనూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలిసారిగా బౌన్సర్ల(ప్రైవేటు సెక్యూరిటీ) వ్యవస్థను ప్రవేశపెట్టింది. అంటే.. గతంలోలాగా టికెట్లు రాకపోతే గొడవలు చేయడాలు వంటివి ఉండవు. తేడా వస్తే.. కుమ్మేస్తార న్నమాట. ‘ఎక్సెల్ సెక్యూరిటీ సర్వీసెస్’ అనే ప్రైవేటు సంస్థకు బౌన్సర్లను నియమించే బాధ్యతను టీపీసీసీ అప్పగించింది. గాంధీభవన్‌లో గొడవలను నియంత్రించడం, ఎవరైనా కొట్లాటకు దిగితే ఎత్తి బయట పారేయడం, గాంధీభవన్‌కు వచ్చే పార్టీ ముఖ్య నేతలకు భద్రత కల్పించడం ఇకపై బౌన్సర్ల బాధ్యత. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బౌన్సర్లు గాంధీభవన్‌లో రాత్రింబవళ్లు పహారా కాస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బుధవారం గాంధీభవన్‌కు వచ్చిన సమయానికి 10 మంది బౌన్సర్లు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత కొద్దిసేపటికి మరో 10 మంది వచ్చారు. గాంధీభవన్‌కు వచ్చే కార్యకర్తలందరినీ తనిఖీ చే శారు. అనుమతి లేనివారు, అనుమానితులను ఎవరినీ లోపలికి పంపడం లేదు. ఎవరైనా గేటు దగ్గర గొడవ చేస్తే నిర్మొహమాటంగా బయటకు పంపేస్తున్నారు. మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే.. కాంగ్రెస్‌లోనే ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే నాయకులు.. ఇప్పుడిలా పబ్బుల్లో, బార్లలో ఉండే బౌన్సర్లను గాంధీభవన్‌లో నియమించడాన్ని చూసి నివ్వెరపోతున్నారు. ఏ పార్టీలో లేని కొత్త సాంప్రదాయాన్ని టీపీసీసీ ప్రవేశపెట్టిందంటూ విమర్శిస్తున్నారు. టీపీసీసీ మాత్రం ఇదంతా మామూలేనని.. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవ జరగకుండా ఉండేందుకే బౌన్సర్లను నియమించామని వివరణ ఇచ్చింది.