‘హస్తం’లో అంతర్మథనం
- నేడు హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ సమీక్ష
- గాంధీభవన్‌కు రావాలని ఎమ్మెల్యే,
- ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలకు ఆహ్వానం
వరంగల్, న్యూస్‌లైన్,సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఐదు రోజులైనా... హస్తం నేతల్లో అంతర్మథనం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇచ్చినప్పటికీ... స్థానిక నాయకత్వం సమష్టిగా పనిచేయకపోవడం వల్ల నష్టం వాటిల్లిందని మాజీ చీఫ్ విప్ గండ్ర తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడిప్పుడు నాయకులు నోర్లు తెరుస్తుండడం గమనార్హం. ఎన్నికలంటె మరీ గిట్లుంటాయనుకోలేదని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం విశేషం. అరుుతే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములపై కాంగ్రెస్ నేతలు నోరు విప్పనప్పటికీ వారు ఇంకా ఆశలపల్లకిలోనే ఊగుతున్నారు. నిశ్శబ్ద ఓటింగ్ తమ పార్టీకే సహకరించిందనే లెక్కల్లో ఉన్నారు.
ముఖ్యంగా మహిళలు, మైనార్టీలు, దళిత వర్గాలు కాంగ్రెస్‌కే ఓటు వేశాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అనుకూల పవనాలు వీచాయనే వాస్తవాన్ని అంగీకరిస్తూనే... తమకు అనుకూలంగానే పోలింగ్ సాగిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం వరంగల్ జిల్లా నేతలతో గెలుపోటములపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సమావేశంలో ఇటీవల జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు మునిసిపల్, జెడ్పీ ఎన్నికలపై వారు నియోజకవర్గాల వారీగా పరిస్థితులను బేరీజు వేయనున్నారు. మునిసిపల్, జెడ్పీ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే అంశం ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఈ సమావేశానికి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్యనాయకులకు గాంధీభవన్ నుంచి సమాచారం అందింది. ఏమైనా ఈ నెల 16వ తేదీన ఫలితాల తర్వాతనే కాంగ్రెస్‌లో చలనం కనిపించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అన్నీ కలగలిపి..
ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యమంలో భాగస్వామ్యం లేకపోవ డం, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వంటి అం శాలన్నీ కలగలిపి కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రత్యర్థి పార్టీని తక్కువ అంచనా వేసి... చతికిలబడ్డామనే వాదన ఇప్పుడు విన్పిస్తోంది. కనీసం కాంగ్రెస్ పార్టీ మెని ఫెస్టో విషయాలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను, వరంగల్ వేదికగా రాహుల్ ప్రకటించిన రూ. 2 లక్షల రుణమాఫీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామంటున్నారు.
ఇక నియోజకవర్గాల వారీగా చేపట్టే అభివృద్ధి వ్యూహం లేకపోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ చేసిన విమర్శలను సైతం తిప్పికొట్టకలేకపోయామని, తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వలే మి స్పష్టమైందని పలువురు నేతలు ఇప్పటికే అంగీకరించా రు. ఈ అంశాలన్నీ నేటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.
నేతల ఎదురీత
టీ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల ఢిల్లీ, హైదరాబాద్, సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఒక్క రోజు నాలుగు సెగ్మెంట్లలో సుడిగాలి పర్యటన చేశారు. పొన్నాలను అతడి నియోజకవర్గంలోనే టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ముత్తిరెడ్డి, కొమ్మూరి మొసమర్లనీయ్యలేదు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ లో మాజీ మంత్రి సారయ్యకు టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా సురేఖ కంటిమీద కునుకులేకుండా చేసింది.
సిట్టింగ్ స్థానాలైన భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్‌లో మాలోతు కవిత, వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్ గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొవాల్సి వచ్చింది. పాలకుర్తిలో దుగ్యాల ఈ దఫా టీఆర్‌ఎస్,టీడీపీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ములుగులో పొదెం వీరయ్య, పరకాలలో ఇనుగాల వెంకట్రాంరెడ్డిదీ ఇదే పరిస్థితి. ఇక నర్సంపేటలో జేఏసీ నాయకుడు కత్తివెంకటస్వామికి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చి చేసిన ప్రయోగం ఫలిస్తుందా... డోర్నకల్‌లో మాజీ మంత్రి రెడ్యానాయక్ సర్వశక్తులొడ్డినా స్వల్ప మెజార్టీతోనైనా బయటపడుతారా... అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన కేంద్ర మంత్రి బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య పరిస్థితి కూడా ఇదే తీరుగా ఉంది. టీఆర్‌ఎస్ గాలివీచిందనే ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థులకు కంటినిండా నిద్రలేకుండా చేస్తోంది.