హంగ్ రాకపోదా! | Congress seek coalition government in telangana | Sakshi
Sakshi News home page

హంగ్ రాకపోదా!

Published Sat, May 3 2014 12:49 AM | Last Updated on Thu, Sep 6 2018 2:48 PM

Congress seek coalition government in telangana

* టీ-కాంగ్రెస్ నేతల ఆశాభావం
* పోలింగ్ సరళిపై టీపీసీసీ విశ్లేషణ
* సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమే
* టీఆర్‌ఎస్‌కూ మెజారిటీ స్థానాలు రాకపోవచ్చు
* ఇతర పార్టీలకైతే రెండంకెలు దాటవు
* దిగ్విజయ్‌కు టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివేదిక
* తెలంగాణలో సంకీర్ణ సర్కారు తప్పదని అంచనా
* అధిక సీట్లు వచ్చే పార్టీకే సీఎం పదవి.. రెండో పార్టీకి కీలక శాఖలు
* ఫార్ములానూ రూపొందించిన కాంగ్రెస్ నాయకులు
* 50 సీట్లు దాటితే మజ్లిస్, లెఫ్ట్‌తో గట్టెక్కవచ్చని అభిప్రాయం
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది తామేనని ఎన్నికల క్షేత్రంలో తలపడిన అధికార కాంగ్రెస్.. ప్రస్తుతం ఈ ప్రాంత పగ్గాలు చేపట్టేదెలాగన్న ఆలోచనలో పడింది. పోలింగ్ సరళిని బట్టి తెలంగాణలో కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వచ్చే పరిస్థితి లేదన్న అంచనాకు ఆ పార్టీ నేతలు వచ్చారు. టీ-సెంటిమెంట్‌తో దూసుకెళ్లిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ తమకు గట్టి పోటీనిచ్చిందన్న భావనలో వారంతా ఉన్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు ఏ పార్టీకీ రావని టీపీసీసీ ముఖ్యులు ఓ నిర్ణయానికొచ్చారు.

కష్టనష్టాలకోర్చి పట్టుబట్టి తెలంగాణను సాధించినందున తమకూ టీఆర్‌ఎస్‌తో సమానంగా సీట్లు దక్కుతాయన్న ఆశాభావం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం హంగ్ అయినా రాకపోతుందా అన్న ఆశల్లో పార్టీ నేతలున్నారు. ఈ మేరకు నివేదికలూ రూపొందిస్తున్నారు. తెలంగాణ ఇస్తే అవలీలగా సర్కారు ఏర్పాటు చేస్తామని మేడమ్ సోనియాకు హామీనిచ్చినందున ఎలాగైనా అధికారం చేజిక్కించుకునే మార్గాలపై టీ-కాంగ్ ముఖ్యులు అప్పుడే మంతనాలు కూడా మొదలుపెట్టారు.

వారం రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్.. పోలింగ్ సరళి, పార్టీ గెలుపు అవకాశాలపై పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, స్థానిక నేతల నుంచి సమాచారం సేకరించి దిగ్విజయ్‌కి ఓ నివేదిక అందజేసినట్లు తెలిసింది. టీపీసీసీ వర్గాల సమాచారం మేరకు తెలంగాణలో కాంగ్రెస్ సహా ఏ పార్టీకీ అధికారానికి సరిపడా సీట్లు వచ్చే పరిస్థితి లేదని నేతలు అంచనాకు వచ్చారు. తెలంగాణలో ఏర్పాటయ్యేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న భావనతో ఉన్నారు.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పోటాపోటీగా సీట్లు సాధించుకునే పరిస్థితి ఉందని, కాంగ్రెస్‌కు 45 నుంచి 50 వరకు, టీఆర్‌ఎస్‌కు 50లోపు సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి రెండంకెల సీట్లు కూడా రావని అభిప్రాయపడుతున్నారు. ఆ మాటకొస్తే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మినహా మరే పార్టీకి కూడా రెండంకెల సీట్లు దక్కే అవకాశాల్లేవని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు.
 
ఎలా పంచుకుందాం?
హంగ్‌పై ఆశలు పెట్టుకున్న టీ కాంగ్ పెద్దలు ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలన్న దానిపై అప్పుడే వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అవతరించబోయేది కాంగ్రెస్సేనని కొందరు నేతలు చెబుతుంటే.. మరికొందరు మాత్రం టీఆర్‌ఎస్‌కే ఆ అవకాశముందని వాదిస్తున్నారు. ఏదేమైనా ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినా ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ దిశగా కాంగ్రెస్ నేతలు ఓ ఫార్ములాను రూపొందించినట్లు సమాచారం.

సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానికి సారథి ఎవరు? ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులివ్వాలన్న దానిపై అప్పుడే పరిష్కారాలు కనుగొన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకే సీఎం పదవి ఇవ్వాలనే ప్రతిపాదన సిద్ధం చేశారు. ఎలాగూ సీఎం పదవి ఇస్తున్నందున ఆ పార్టీకి 6 మంత్రి పదవులిస్తే సరిపోతుందని, అదే సమయంలో రెండో పార్టీకి 9 మంత్రి పదవులివ్వాలన్నది టీ-కాంగ్ పెద్దల ఆలోచన. శాఖల విషయంలోనూ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం పదవి కోల్పోయే పార్టీకి కీలకమైన ఆర్థిక, రె వెన్యూ, హోం, వ్యవసాయం వంటి శాఖలు కేటాయించాలని ప్రతిపాదించారు.
 
కాంగ్రెస్‌లో సీఎం ఎవరు?
టీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఇరు పార్టీల నేతలూ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తే ఎవరు సీఎం అవుతారనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. సీఎం పదవి ఆశిస్తున్న టీ- కాంగ్రెస్ నేతలు అసలు గెలుస్తామా.. లేదా? అనే టెన్షన్‌లోనే ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌కు 50 అసెంబ్లీ స్థానాలు దక్కితే టీఆర్‌ఎస్ మద్దతు అవసరం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మజ్లిస్, లెఫ్ట్ పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మేలని అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా టీఆర్‌ఎస్ మద్దతు తీసుకుంటే మంత్రి పదవులతో పాటు అన్ని విషయాల్లోనూ తలనొప్పులు తప్పవని, అంతిమంగా ఆధిపత్య పోరుకు దారితీసే ప్రమాదముందని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement