కాంగ్రెస్ నేతలతో టీడీపీ బలోపేతం
ప్రజాగర్జనలో చంద్రబాబు
కూరగాయల బేరంలాగే.. నేతల చేరికలు కూడా
శ్రీకాకుళం, ‘రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసింది. దాంతో ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ బలాన్ని పెంచుకునేందుకే కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నాం. లేదంటే వారు మరో పార్టీలోకి వెళ్తారు’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. బుధవారం రాత్రి శ్రీకాకుళంలో జరిగిన ప్రజాగర్జన ర్యాలీ, సభలో ఆయన మాట్లాడుతూ.. కూరగాయలు కొనాలన్నా బేరమాడి కొంటాం కదా.. ఇదీ అంతేనని చెప్పుకొచ్చారు.
తనను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినందునే రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు విభజనకు నిర్ణయించాయని, తాను కూడా అనుకూలంగా లేఖ ఇచ్చానని, అందువల్లే విభజన జరిగిందని తెలిపారు. సీమాంధ్రను సింగపూర్‌లా అభివృద్ధి చేసేందుకు తనకు అధికారమివ్వాలని కోరారు. తెలంగాణలో బీసీ నేతను సీఎం చేస్తానని చెప్పానని, సీమాంధ్రలో మాత్రం తననే సీఎంను చేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. 2జీ, కామన్‌వెల్త్, బొగ్గు తదితర కుంభకోణాలతో దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
ఒకటి, రెండు శాతం ఓట్ల కోసం కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కావ లి ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ, గౌతు శివాజీ, కింజరాపు అచ్చెన్నాయుడు, శత్రుచర్ల విజయరామరాజు, కింజరాపు రామ్మోహన్నాయుడు, గుండ లక్ష్మీదేవి, చౌదరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.